అంతర్జాలంలో తెలుగు (ఆంధ్రభూమి)
ఆంధ్రభూమి దినపత్రికవారు అంతర్జాలంలో తెలుగుకు సంబంధించిన విశేషాలు ప్రచురించ తలపెట్టారు. ఈ శీర్షికలో క్రమం తప్పకుండా అంతర్జాలంలో తెలుగుకు సంబంధించిన వార్తలు, వెబ్ సైట్లు, బ్లాగులు, బ్లాగు పరిచయాలు ఉంటాయి. అసలు కంప్యూటర్లో ఖర్చులేకుండా చాలా సులువుగా తెలుగు రాయవచ్చు అని చాలా మందికి తెలియదు. ఇంట్లో ఉన్న కంప్యూటర్లో తమ మాతృభాషలో చదువుకోవచ్చు,రాయవచ్చు ఎన్నో రచనలు , విశేషాలు తెలుసుకోవచ్చు అనే అంశాన్ని తెలియచేయడమే ఈ వ్యాస పరంపర ముఖ్య ఉద్దేశ్యం.
మరో గమనిక..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిహేనుకోట్లమందికి పైగా మాట్లాడే భాష తెలుగు. కాని నేడు మాట నేర్చినది మొదలు మాతృభష కన్నా ఆంగ్లమే ముద్దుగా మారింది. సర్వం ఇంగ్లీషుమయమైన ఆధునిక కాలంలో తెలుగు మరుగునపడిపోతుంది. మీకు నచ్చిన పుస్తకం ఏదని అడిగితే ఎక్కువ శాతం ఇంగ్లీషు నవలల గురించే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషులో చదవడం, మాట్లాడడం అలవాటైన తెలుగువారు ఇది మన భాష అని గర్వంగా చెప్పుకోవడం లేదు. ఈ తరం యువతకు తెలుగులో మాట్లాడడం వచ్చినా చదవడం , రాయడం కష్టం అంటున్నారు. అది విని మనసు కలుక్కుమంటుంది. రాబోయే తరం వారు తెలుగు అంటే ఏంటి? ఎలా ఉంటుంది? జిలేబిల్లా ఉంటుంది అదేనా ? అని అడుగుతారో అని సందేహం కలగక మానదు.
కాని అంతర్జాలం (ఇంటర్నెట్) ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది.ఇంతవరకు ఆ కుగ్రామంలో ఏ పని చేయాలన్నా ఇంగ్లీషు మాత్రమే ఉపయోగింపబడేది. కాని ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇంటర్నేట్‌లో తెలుగు విస్తృతంగా వ్యాపించింది అని గర్వంగా చెప్పుకోగలం. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది అని మురిసిపోయాం, గర్వపడ్డాం. సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిని అభివృద్ధి చెందుతున్న కారణంగా తెలుగుకు ఆధునిక హోదా లభించింది అని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి ఉద్యమాలు, నినాదాలు లేకుండానే నేడు వెబ్ ప్రపంచంలో తెలుగు వెలిగిపోతుంది.
పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రమే కంప్యూటర్ అవసరం అనే రోజులు పోయాయి. స్కూలు పిల్లలకు కూడా కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి అవసరమై పోయింది. ఈ కంప్యూటర్, అంతర్జాలం కేవలం ఇంగ్లీషు వచ్చినవాళ్లకు , సాంకేతిక నిపుణులకు మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే. ఇప్పుడు కంప్యూటర్లో చాలా సులువుగా, ఎటువంటి ఖర్చు లేకుండా తెలుగు చదవవచ్చు, రాయవచ్చు. ఉత్తరాలు కూడా తెలుగులోనే రాసి పంపుకోవచ్చు. తెలుగు భాష మీద అభిమానం, నేర్చుకోవాలనే ఆసక్తి, రాయాలనే తపన ఉంటే చాలు. కొన్నేళ్లక్రితం వరకు ఇంటర్నెట్ ఇంగ్లీషులోనే ఉండేది. తెలుగు రాయాలన్నా, చదవాలన్నా కష్టంగా ఉండేది. తెలుగులో రాయడానికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కొనాల్సి వచ్చేది. ఇంటర్నెట్ లో తెలుగు వాడకం 90వ దశకం నుండి చివరినుండి మొదలై గత నాలుగేళ్లుగా అతి వేగంగా వ్యాప్తి చెందింది. మాతృభాష మీది అభిమానంతో ఎందరో సాఫ్ట్‌వేర్ నిపుణులు కృషి చేసి కంప్యూటర్లో తెలుగు చదవడం, రాయడం సులభతరం చేసారు. ఇంటర్నెట్ వాడకం ప్రతి ఇంటిలో తప్పనిసరిగా మారిన క్రమంలో తెలుగుబాషా వ్యాప్తి కూడా చాలా వేగంగా జరుగుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్న తెలుగువారు దగ్గరయ్యారు. ఎంచక్కా తమ మాతృభాషలోనే పరస్పర సంభాషణలు, ముచ్చట్లు , రచనలు చేస్తున్నారు.
ఐతే ముందుగా మనం మన కంప్యూటర్ కి తెలుగు నేర్పిద్దాం. లేకుంటే అది తెలుగును తెలుగులా చూపించదు మరి. మామూలుగా కంప్యూటర్లలో ఇంగ్లీషు వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ కంప్యూటర్లలో అంటే తెలుగు చదవాలంటే డబ్బాలుగా కనిపిస్తుంది. తెలుగు చదవాలన్నా ,రాయాలన్నా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్లో లో తెలుగు ఎనేబుల్ చేయడం తెలుసుకుందాం.
Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చేయండి.
ఇప్పుడు Control Panel లో Regional and Languages ఆప్షన్ క్లిక్ చేయండి.
తర్వాత Regional and Languages Dialogue Box లో Languages ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని
Install files complex scripts అన్న ఆప్షన్ క్లిక్ చేయండి.
అప్పుడు అది XP సిడి అడుగుతుంది. సిడిని డ్రైవర్ లో పెట్టండి. అందులోనుండి కావలసిన ఫైల్స్ దించుకున్న తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన కంప్యూటర్లో తెలుగు ఇంచక్కా కనిపిస్తుంది.
మీ దగ్గర XP సిడి లేదా. ఐనా పర్లేదు. ఈ క్రింది సైటునుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
http://www.omicronlab.com/tools/icomplex-full.html
ఇక్కడినుండి ''iComplex_2.0.0.exe''
ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. అంతే. దీనికోసం మొదటి సోపానాలు పాటించాల్సిన పనిలేదు. మీకు తెలుసా? విండోస్ XPలో కూడా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఫైర్‌ఫాక్స్ విహారిణుల్లో తెలుగు కనబడటం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నోటుపాడ్ వంటి ఇతర ఉపకరణాలలో తెలుగు కోసం మాత్రమే ఈ కాంప్లెక్స్ సెట్టింగులని చేసుకోవాలి. కాబట్టి, తెలుగుని చూడడంలో సమస్య ఉంటేనే దీన్ని స్థాపించుకోండి (install). విండోస్ విస్టా మరియు విండోస్ 7 కంప్యూటర్లలలో తెలుగు కోసం మనం ప్రత్యేకంగా ఏమీ స్థాపించికోనవసరం అవసరం లేదు.
Windows XP తర్వాతి ఆపరేటింగ్ సిస్టమ్ లలో ఈ అవసరం ఉండదు. మన కంప్యూటర్ కు తెలుగు నేర్పించాము కదా. ఇక తెలుగులో ఎలా రాయాలో తెలుసుకుందాం. ముందుగా మనం అంతర్జాలంలో ఎటువంటి డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా సులువుగా తెలుగులో రాయగలిగే పద్ధతులు ఎన్ని ఉన్నాయో చూద్ధామా??
లేఖిని ... http://lekhini.org/
గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ -- http://google.com/transliterate/indic/తెలుగు
క్విల్ పాడ్ --- http://quillpad.com/telugu/
ఈ ఉపకరణాలన్నీ కూడా అంతర్జాల సంధానం ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఇందులో ఇంగ్లీషులో రాస్తుంటే అవే తెలుగులోకి మారిపోతాయి. ఇలా రాసుకున్నదాన్ని కాపీ చేసుకుని మనకు అవసరమైన చోట పేస్ట్ చేసుకుని సేవ్ చేయాలి. కంప్యూటర్లో కొత్తగా తెలుగు రాయడం మొదలుపెట్టినవారికి ఇవి చాలా ఉపయోగకరమైనవి, సులభమైనవి కూడా. ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా తెలుగులో రాసుకోవచ్చు. దీనికోసం బరహా, అక్షరమాల లాంటి సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకుని సిస్టమ్ లో సేవ్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు తెలుగులో లేదా ఇంగ్లీషులోచాలా సులువుగా రాసుకోవచ్చు. ఇక ఎటువంటి సాఫ్ట్ వేర్ లేకుండా చిన్న మార్పులతో ఇన్ స్క్రిప్ట్ విధానంలో కూడా తెలుగులో రాయవచ్చు.
15 వ్యాఖ్యలు:
మంచి సమాచారం. ఐతే ముందుగా తెలుగు మాట్లాడే వారు పదిహేను కోట్ల మంది ఉన్నారనే ఆబధంతో మొదలుపెట్టటమే బాగాలేదు. అందులో సగమే అని నిజం చెప్పటం వల్ల వచే నష్టమేమీ లేదు. ఆది ఇటాలియన్ మాట్లాడే వాళ్ళతో సమానం. దయచేసి మార్చండి.
పావనిగారు, తెలుగు మాట్లాడేవాళ్లు అనికాకుండా తెలుగువాళ్లు అనాల్సిందేమోకదా. కాని అది ఆల్రెడీ పబ్లిష్
అయింది కదా. మార్చలేం. ఉండనివ్వండి..
ఆది కూడా తప్పే. తెలుగువారు అంటే మీ డెఫినిశన్ తెలియదుకానీ ఏ పద్దుకింద కూడా అంత మంది ఆవరు. ఆంధ్రాలో ఎనిమిదికోట్లమంది , అమెరికాలో మహా అయితే ఐదారు లక్షల మంది, మిగతా ప్రపంచంలో ఇంకో పాతిక లక్షలమంది ఎలా చూసినా ఎనిమిదిన్నర కోట్లు. అన్తే.
Madam,
I am interested in writing to AB. Please let me know your mail ID.
sitarama.prasad@gmail.com
రామారావుగారు ఆఱుకోట్లు అన్నది 1982 లో ! అది అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ! ప్రపంచంలోని మొత్తం తెలుగు జనాభా కాదు.
జ్యోతిగారూ !
నా మొదటి వ్యాఖ్యలో కోట్లకు బదులు లక్ల్షలని వ్రాశాను. అది తొలగించి ఈ వ్యాఖ్యని ప్రచురించగలరు.
అబద్ధమేమీ లేదు. తెలుగువాళ్ళంటే కేవలం ఆంధ్రప్రదేశ్ జనాభాని మాత్రమే లెక్కలోకి తీసుకోకూడదు. 2001 జనాభా లెక్కల ననుసరించి తమిళనాడు ప్రభుత్వం తమ శాసనసభలో ప్రకటించినదాన్ని బట్టి ఆ రాష్ట్రంలో తెలుగువాళ్ళ జనాభా 2 కోట్లు. ఒక్క మద్రాసు నగరంలోనే వారి సంఖ్య 30 లక్షలు. వారు కాక కర్ణాటకకు చెందిన కోలారు, తుమ్కూరు, బళ్ళారి, బెంగళూరు, రాయచూరు మొదలైన ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి మొత్తం జనాభా 70 లక్షలకు తగ్గదు. ఒరిస్సాలో ఏకంగా మూడు జిల్లాలు తెలుగు జిల్లాలు. ఒక్కొక్కదాని జనాభా 20-25 లక్షలకు తగ్గదు. 1936 లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటి పర్లాకిమిడి జమీందారు ఒరియావాడు కావడం చేత వాటిని ఒరిస్సాలో కలిపేశాడు. ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ జిల్లా దక్షిణప్రాంతమంతా తెలుగువాళ్ళే. వీరంతా కాక విదేశాలకు వెళ్ళిన తెలుగువాళ్ళ సంఖ్య 20-25 లక్షల శ్రేణిలో ఉంటుంది. ఈ లెక్కలన్నీ గమనంలో ఉంచుకున్నప్పుడు తెలుగువారి మొత్తం జనాభా 15 కోట్లు కాకపోయినా 13 కోట్లు దాటి ఖచ్చితంగా ఉంటుంది.
చర్చ జనాభా లెక్కల మీద కాదు కనక(విషయం అంతర్జాలం )ఇంక స్పందిచను.
జ్యోతీ గారూ, మీరు స్పందించనక్కర్లేదుకాని నేను స్పందిస్తే తప్పు లేదనుకోని రాస్తున్నా..
తాడేపల్లిగారు, మీరు తమిళనాడులో ఎప్పుడో వందలఏళ్ళక్రితం వెళ్ళిన వాళ్ళన్ని తెలుగు వారంటున్నారు. బహుసా DNA లెక్కలప్రకారం కావొచ్చు. అదే సమయంలో AP లో వున్నవాళ్ళంతా తెలుగువాళ్ళు కారండీ. 85 శాతం మంది మత్రమే తెలుగు వారు. 2011 లో మన projected జనాభా 8.6 కోట్లు. అంటె 7.3 కోట్లు తెలుగు వారు. బయట వుండే వారు, మహా అయితే ఇంకో కోటి మంది, who are reasonably traced back to contemporary telugu roots. అంటే కాని 6 కోట్ళో 8 కోట్లో కాదు కాక కాదు. మీరు 13 కొట్లంటున్నారు. అంటె దేశ జనాభా లో 11%. జ్యోతి గారు ఏకంగా ఒకచోట 15 కోట్లు(దేశంలో 12.5%), ఇంక్ చోట 18 కోట్లు(15%) అనేశారు!
Tadepalli gaaru-I enjoy your articles and admire your knowledge. You are a net savvy person. It is not difficult for you to figure that out.
పావనిగారు, జరిగిన చర్చ చాలు. అంతర్జాలానికి సంబంధిచని వ్యాఖ్యలు ఇక పబ్లిష్ చేయదల్చుకోలేదు..
శీర్షికలో ఆనకట్ట అనే వాడుక ఇక్కడ సరైనదేనంటారా
నాకు తెలీదండి. ఏధో ప్రాస బావుందికదా అని వాడాను. నిన్నటినుండి అది తప్పంటారేమో ఎవరైనా అని చూస్తున్నా.. మీరేమంటారు?
ఆంధ్రభూమివారు అంతర్జాల విశేషాలు వరుసగా వేస్తామన్నారు. అలాగే అంతర్జాలంలోఉన్నవారికి తమ పత్రికలో ఆహ్వానం పలుకుతున్నారుకదా అని ఆనకట్ట అన్నాను..
నిన్ననే ఈ విషయం చెబుదామని అనుకొని కూడా ఆగాను, చర్చకు సంబంధించని విషయమని. ఆనకట్ట అనేది ఇక్కడ సరైన పదం కాదు. ఉత్సాహానికి ఆనకట్ట పడింది... ఇలా ప్రవాహాన్ని అడ్డుకోవటం అనే సందర్భంగా వాడే పదం ఇది.
బహుశా వంతెన అనే పదం సరైనదౌతుందేమో కానీ, చదవటానికి కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది.
సాయికిరణ్ గారు, నేను అలాగే అనుకున్నాను. ఎందుకొచ్చిన తంటా అని శీర్షిక మొత్తం మార్చేసాను. ఆల్ హ్యాపీస్..:)
జ్యోతిగారు అన్నది "15 కోట్లమంది పైగా మాట్లాడే భాష తెలుగు" అని.అంతేకానీ తెలుగు వారు ఎంతమందని కాదు.తెలుగు వారు కాకపోతే తెలుగు మాట్లాడ కూడదా ఏమిటి.తాడేపల్లిగారి సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంది.నేను వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.అంతర్జాలంలో తెలుగు విస్తృతికి మనందరం కూడా కృషి చేద్దాం.
Post a Comment