Friday 29 April 2011

మనల్ని మనం అర్పించుకుందాం - కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ మే 2011 ఎడిటోరియల్

అణుకువగా ఒదిగి ఉండడంలో ఉన్నంత సంతృప్తి మరెక్కడా కానరాదు.. ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రేమ ముందూ, మానవత్వం నరనరానా తొణికిసలాడే మనుషుల ముందూ ప్రణమిల్లాలన్పిస్తుంది తప్ప దర్పం ఒలకబోయబుద్ధి కాదు. ప్రతిఫలాపేక్ష లేకుండా మన శ్రేయస్సుకై తపనపడే ఆత్మీయుల రుణం ఏ విధంగా తీర్చుకోగలం.. మనల్ని మనం మానసికంగా అర్పించుకోవడం తప్ప? మన మొహంలో వెలుగుని చూసి సంబరపడిపోయే ఆత్మీయమూర్తుల్ని ఏమని విశ్లేషించగలం.. విశ్లేషణని కట్టిపెట్టి మనసుతో స్పృశించకుండా! మనకు తెలియకుండానే మనం సురక్షితమైన హస్తాల్లో రక్షించబడి ఉంటున్నాం. ఎందరో బంధువులూ, స్నేహితులూ మన శ్రేయస్సుని మనసారా కాంక్షిస్తున్నారు కాబట్టే మనం దిగ్విజయంగా జీవించగలుగుతున్నాం. ఏవో ఉరుకులు పరుగుల్లో క్షణం కూడా ఆలోచించే తీరిక లేకపోవడం వల్ల మన చుట్టూ పెనవేసుకుపోయిన అద్భుతమైన అనుబంధాలను మనం గ్రహించలేకపోతున్నాం. కొండొకచో గ్రహించగలిగినా మనం ఆదరణని కోరుకునేది కొందరి వద్దయితే.. ఆ ఆదరణ లభించేది మరికొందరి వద్ద కావడం వల్ల మనసారా స్వీకరించలేక ఆదరించే వారినే చిన్నచూపు చూస్తున్నాం.

ప్రేమ, ఆదరణ విశ్వజనీయమైనవి. మనం అందమైన రూపాల్లోనో, వ్యాపారాత్మక బంధాల్లోనో వాటిని వెదుక్కునంత కాలం నిరుత్సాహమే మిగులుతుంది. బోసి నవ్వుతో మనసారా పలకరించే ముసలవ్వని అరక్షణం తీక్షణంగా గమనిస్తే ఎంతటి ఆత్మీయత ఆ నవ్వులో ఉట్టిపడుతోందో అర్థమవ్వదూ..? ఎందరో మనపై దిగుళ్లు పెట్టుకుంటూ ఉంటారు.. దిగులుపడడం వారి తప్పన్నట్లు కసురుకుని చిన్నబుచ్చుతాం గానీ మన గురించి అంతగా ఆలోచించే మనుషులు ఉన్నందుకు ఒక్క క్షణమైనా వారిని హృదయానికి హత్తుకోగలుగుతున్నామా? ప్రతీ మనిషిలోనూ భగవంతుడు సున్నితత్వాన్నీ మేళవించాడు. మనం భ్రమిస్తున్నట్లు ప్రపంచం మొత్తం అన్యాయాలూ, అక్రమాలూ, ద్వేషాలూ, పగలూ, ఈర్ష్యాసూయలు నిండిపోలేదు. మనుషులం మనమే సమాజంలోని సుగుణాల్ని చెప్పుకుంటూ సంతోషంగా బ్రతకడం మానేసి ఏ మూలనో ఇరుక్కుని బ్రతికేలా అభద్రతను మూటగట్టుకుంటున్నాం. పక్క మనిషి యొక్క స్వచ్ఛమైన నవ్వుని ఆస్వాదించలేకపోతున్నామంటే.. ఇంకా మనుషులు మన హృదయాలకు చేరువయ్యేదెప్పుడు? నిశితంగా గమనిస్తే ప్రతీ క్షణమూ మనకు అద్భుతంగా మలచబడి ఉంటుంది.. ఆ క్షణాన్ని సదా మన శ్రేయస్సుని కాంక్షించే ఆత్మీయుల మనోఃబలంతో ఆస్వాదించగలుగుతున్నామా లేక మనల్ని ఒక్కర్నే ప్రపంచంలో ఒంటరిని చేసుకుని ఏకాకిగా ఎదుర్కోవడానికి పోరాడుతున్నామా అన్న దాని మీదే మనం అనుభవాలు ఆధారపడి ఉంటాయి. ఒక్కటి మాత్రం నిజం.. తమకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా.. మనల్ని మనగా అభిమానిస్తూ తమ ఆశీర్వచనాలు నిరంతరం అందజేసే దైవస్వరూపులైన ఆత్మీయులు మనతో ఉన్నంతకాలం, వారికి మనం మనసారా అర్పించుకోగలిగినంత కాలం మనం చాలా సురక్షితంగా ఉంటాం. మనం చేయవలసిందల్లా అటువంటి ఆత్మీయుల్ని మనసుకి దగ్గరగా తీసుకోవడమే!

మీ
నల్లమోతు శ్రీధర్

1 వ్యాఖ్యలు:

vaikuntam gentyala

nijamynna nijjanii chepparu

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008