Wednesday, 27 April 2011

కంప్యూటర్లో చందమామ



కంప్యూటర్లో చందమామ


తోకచుక్క, మకర దేవత, ముగ్గురు మాంత్రికులు, విచిత్ర కవలలు, రూపధరుడి యాత్రలు, రాకాసి లోయ, పాతాళ దుర్గం, రాతి రథం, యక్ష పర్వతం .. ఈ పేర్లు చూస్తుంటే మీకేమైనా గుర్తొస్తుందా?? అందమైన చిత్రాలతో, ఆసక్తికరమైన కథనంతో, సరళమైన బాషతో చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతీ నెలా ఎదురుచూసేలా చేసే చందమామ కథలు ఇవి. మన తెలుగుబాషలోనే కాక భారతదేశంలోని పద్నాలుగు భాషలలో ప్రచురింపబడుతున్న చందమామ పత్రిక ఎంతోమంది బాల్యస్మృతులలో నేటికి సజీవంగా ఉంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆరు దశాబ్దాల క్రితం పిల్లల పత్రికగా మొదలైన చందమామను ప్రస్తుతం 70, 80 ఏళ్ల పైబడిన వారు ఇప్పటికీ కొని చదువుతూ తమ మనవళ్లు, మనవరాళ్లకు వాటిని చదివి వినిపిస్తున్నారు. ఈరోజు పిల్లలను రాముడు, శూర్పణఖ, భేతాలుడు ఎవరు అని అడిగితే తెల్లమొహం వేస్తారు. అదే స్పైడర్ మాన్, పవర్ రేంజర్స్, బ్యాట్ మాన్ , హ్యారి పోటర్ గురించి అడిగితే ఒక్క లైన్ పొల్లుపోకుండా చెప్పేస్తారు.అవే వింతలు, అద్భుతాలు, మనమూ చిన్నప్పుడే చదివేసాం అంటే నమ్ముతారా?? నమ్మరు.కాని చందమామ పత్రికలో మనం నేర్చుకున్న కథలు, పురాణాలు, జాతక కథలు మర్చిపోగలమా? పుస్తకం రాగానే ఇంట్లో ఎవరు ముందు చేజిక్కించుకుంటారా అని గొడవ జరగని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో? కాని ఇప్పటి తరానికి తమ చదువులకే సమయం సరిపోవడం లేదు. ఇక చందమామలాంటి పత్రికలు ఎప్పుడు కొని చదువుతారు? కాని కంప్యూటర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ చందమామ పత్రిక కూడా చాలా సులువుగా చదువుకోవచ్చు. అలనాటి కథలు , సీరియల్లు కూడా చదవడానికి అందుబాటులో ఉంచారు కొందరు చందమామ ప్రియులు. చంపి (ఎంపి కి పోటీగా, అంతకన్నా ఇంకా గౌరవప్రదంగా పేరు వెనుక తగిలించుకోదగిన బిరుదు) చంపి అంటే చందమామ పిచ్చోళ్లు అని తమకు తామే గర్వంగా చెప్పుకుంటున్నారు.



క్రమంలోనే చందమామ కోసం ఒక వెబ్ సైట్ (http://www.chandamama.com/) కూడా నిర్వహించబడుతుంది. అందులో చందమామ పత్రికకు సంబంధించిన వ్యక్తుల అనుభవాలు, అప్పటి రాతలు, చిత్రాలు, చందమామ పాఠకులు తమ జీవితంతో పెనవేసుకున్న పత్రిక ముచ్చట్లను కూడా పంచుకుంటున్నారు. పాత చందమామ పత్రికలు, ధారావాహికలను ఎవరైనా సులువుగా డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచారు. 1947 నుంచీ 2006 దాకా చందమామలు అన్నీ ఇంటర్నెట్ లైబ్రరీ లో ఉన్నాయి. చిన్నప్పుడు ఎన్నోసార్లు చదివిన పుస్తకాలు, బొమ్మలు, అడ్వర్టయిజ్మెంట్లతో సహా ఇప్పటికీ చాలామంది కళ్ళముందు ఉన్నాయి. అవే పుస్తకాలు మళ్ళీ ఇప్పుడు నెట్‌లో చూసుకుంటుంటే ఒక నోస్టాల్జియాతప్పకుండా ఆవహిస్తుంది. మరికొన్ని పాత చందమామ కథలు. సీరియళ్లను శివరామప్రసాద్ గారు ఇక్కడ తన బ్లాగులో కూడా అందిస్తున్నారు.. http://saahitya-abhimaani.blogspot.com/

1 వ్యాఖ్యలు:

Saahitya Abhimaani

Instead of Saahitya Abhimaani, you may give link to 'MANA TELUGU CHANDAMAMA" which is run by Chandamama fans, dedicated only to write about Telugu Chandamama Magazine. The link is as follows:

http://manateluguchandamama.blogspot.com/

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008