Wednesday, 6 April 2011

అంతర్జాలంలో సగం... మనస్వి

అంతర్జాలంలో సగం..

మనసులోని భావాలను, ఆలోచనలను పంచుకొని వాటిని చర్చించుకోవడానికి అద్భుతమైన వేదిక బ్లాగు. ఇంటికో ఇంజనీరు తయారవుతున్న ఈ రోజుల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ వాడకం నిత్యావసరమైపోయింది. తెలుగులో రాయడం సులువు కావడంతో తెలుగుబ్లాగులు కూడా విస్తృతి చెందాయి. అన్నింట్లోనూ మేమున్నాం అంటూ మహిళలు కూడా తెలుగు బ్లాగులలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకొని బ్లాగును తమ ఆలోచనలకు వేదికగా చేసుకుని ఇంటిపనులు చేసినంత సులువుగా కంప్యూటర్‌ను కూడా అలవోకగా ఉపయోగిస్తున్నారు. వైవిధ్యమైన రాతలతో పాఠకులను అలరిస్తున్నారు. కథలు, హాస్యం, కవితలు, పాటలు, వంటలు, చలొక్తులు, చర్చనీయాంశాలు.. ఇలా కాదేదీ తమ రాతలకనర్హం అని నిరూపిస్తున్నారు. అందుకేనేమో వేలల్లో ఉన్న తెలుగు బ్లాగుల్లో పదుల్లో ఉన్న మహిళాబ్లాగులు రాశికంటే వాశి మిన్న అని నిరూపించాయి. తెలుగు భాష మీది అభిమానం, రాయాలి, తమలా ఆలోచించేవారితో పంచుకోవాలి, చర్చించాలి అనే తాపత్రయంతో ఎన్నో విభిన్నమైన సంఘటనలు, సమస్యలు తమదైన సైలిలో అందిస్తున్నారు. ఉద్యోగానుభవాలు, ఉద్వేగాలను హృద్యంగా వెల్లడి చేయడంలో మహిళలను మించినవారు లేరేమో? మహిళా బ్లాగర్లలో అందరూ సాంకేతిక నిపుణులు కారు. ఇందులో గృహిణులు, ఉద్యోగినులు, పత్రికా విలేఖర్లు, ప్రవాసాంధ్రులు, విద్యార్థినులు, ప్రముఖ రచయిత్రులు కూడా ఉన్నారు. వీరికి వయసు పరిమితి కూడా లేదు. పాతిక నుండి ముప్పాతిక ఏళ్లవరకు ఉన్న మహిలా బ్లాగర్లు ఎంతో ఉత్సాహంగా, హాస్యపూరకంగా, వ్యంగ్యంగా, సూటిగా, ఘాటుగా ఔరా అనిపిస్తూ తమ రాతలకు వన్నెలద్దుతున్నారు. వీరిలో సమయం కుదిరినప్పుడు రాసేవారు కొందరు, ఏదైనా విషయం తక్షణం పంచుకోవాలి అనుకున్నవెంటనే బ్లాగులొ రాసుకునేవారు కొందరు. తమ రాతల ద్వారా తమ భావాలను, ఆలోచనలను, ప్రతిభను ప్రదర్శిస్తూ, మెరుగు పెట్టుకుంటూనే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లవేళలా ఉత్సుకత చూస్తున్నారు మహిళలు. వీరందరూ తమ వృత్తితో పాటు బ్లాగింగును కూడా ఉపయుక్తమైన ప్రవృత్తిగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.



ఊరికే తమకు తోచినప్పుడు బ్లాగు రాయడమే కాక కొందరు ఔత్సాహికులైన మహిళా బ్లాగర్లు కలిసి తమకంటూ "ప్రమదావనం" అని ఆంతరంగిక గుంపు ఏర్పాటు చేసుకున్నారు. వివిధ దేశాల్లో ఉన్న మహిళా బ్లాగర్లు ఇక్కడ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, సాంకేతిక సలహాలు, సందేహాల నివృత్తి చేసుకుంటారు. అప్పుడప్పుడు ప్రత్యేకమైన రోజులలో సభ్యులందరూ కలిసి ఒకే అంశంపై ఒకే రోజు తమ బ్లాగులో టపాలు రాసి హడావిడి చేసేస్తారు. అవి తమకు నాకు నచ్చిన పాట కాని, చేట్టు కథ కాని, కృష్ణాష్టమి కాని, వాన గురించి కాని కావొచ్చు. ప్రమదావనం సభ్యులు బ్లాగులు రాసుకోవడం, కబుర్లాడుకోవడమేగాక సమాజానికి తమ వంతుగా ఏదైనా సాయం చేయాలనే సదుద్ధేశ్యంతో స్వచ్చందంగా ధనసేకరణ చేసి వీలైనప్పుడు సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. అనాధలైన ఆడపిల్లలకు దుస్తులు, పుస్తకాలు వగైరా, మానసిక వికలాంగులైన స్కూలు పిల్లలకు అవసరమైన కుర్చీలు, ఆహార వస్తువులు, వృద్ధాశ్రమాన్ని సందర్శించి వాళ్లకు నెలసరి భోజన సామగ్రి, దుస్తులు, చెప్పులు, కొన్ని నిత్యావసరమైన వస్తువులు ఇచ్చి వారితో కొన్నిగంటలు గడిపారు. అంతే కాక నిలువనీడలేక చలికి వణుకుతూ ఫుట్‌పాత్‌ల మీద పడుకునే పేదవారికి దుప్పట్లు అర్ధరాత్రివేళ వెళ్లి దుప్పట్లు కప్పడం, వరదబాధితులకు, అనాధపిల్లలకు ధనసహాయం వంటివి చేస్తున్నారు. ఈ సేవాకార్యక్రమాలతో మిగతావారికి స్ఫూర్తినిస్తున్నారు.



అంతర్జాలంలో మహిళా బ్లాగర్లు బ్లాగింగును చక్కని అభిరుచిగా పెంపొందించుకుంటున్నారు. కాని తమ బ్లాగు నిర్వహణతోపాటు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. తమ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, చిరునామాలు బ్లాగులో, అంతర్జాలంలో ఎక్కడా కూడా ఇవ్వకూడదు. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడమే మంచిది. తమ బ్లాగులో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. సాంకేతిక పరిజ్ఞానం చాలా ప్రయోజనకరమైనది. అలాగే కొద్దిగా అజాగ్రత్తగా, ఏమరుపాటుగా ఉంటే తీరని నష్టాన్ని, బాధను కూడా కలిగిస్తుంది. అందుకే వాస్తవ ప్రపంచమైనా, మిధ్యా (అంతర్జాల) ప్రపంచమైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. మనకు ఏది అవసరమో అదే తీసుకుంటే సరి.






మనస్వి... http://manasvi-jaya.blogspot.com/

నేను ఇంక వంట చేయను గాక చేయను. రోజూ పొద్దున్నే గృహప్రవేశం లాగా టైంకి వంటింటి ప్రవేశం చేయాలి. ఇష్టం ఉన్నా లేకున్నా అలాగే వంట చేయాల్సిందే! అబ్బా, ఈ వంట ఎవరు కనిపెట్టారో కాని.... ఇళ్ళల్లో వంటిల్లు కట్టట్టం బాన్ చేస్తే బాగుండు. ఎన్నో ఆధునిక పరికరాలు కనుక్కుంటున్నారు. అన్ని పనులు చాలా సులభమయ్యేట్లుగా చూస్తున్నారు. వినాశన సాధనాలు ఎన్ని కనుక్కుంటున్నారో. ప్రపంచమే ఏ నిమిషంలో అయినా అంతమయ్యేంత పరిజ్ణానాన్ని పెంచేసుకుంటున్నారు. కాని, ఒక్కరంటే ఒక్కరన్నా...అలా సులభంగా కిచన్ లోంచి చక చకా ఫుల్ మీల్ ప్లేట్స్ బయటికి వచ్చేట్లు కనుక్కోలేదు. ఇలాంటి పనికొచ్చే విషయాలు మాత్రం కనుక్కోరు. ఎందుకో, నాకిప్పుడు బాగా అర్ధమయింది. అవన్నీ కనుక్కుంటున్నది మగబుద్ధికదా!!! అందుకే ఆడవాళ్ళు ఎక్కడ సుఖపడిపోతారో అని ఇలాంటి సౌకర్యాలు మాత్రం కనుక్కోటం లేదు. ద్రౌపదికిచ్చిన అక్షయ పాత్ర నాక్కూడా, ఏమూలో, ఓ రోడ్డు మీదో దొరకచ్చు కదా...లేపోతే కళ్ళు మూసుకుని ఏదో ఒక మంత్రం చదివితేనో, మాయాబజార్ లో లాగా పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్ష్యమైతే ఎంత బావుండో కదా.....కనీసం ఓ కామధేనువన్నా నాకు దొరికితే బావుండు.



అని తన బాధా సప్తశతిని వెల్లబోసుకున్నారు జయ. హైదరాబాదులోని ఒక మహిళాకాలేజీలో పనిచేస్తున్న జయ మనస్వి అనే బ్లాగులో తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనకు నచ్చిన, కలవరపెట్టిన, మనసును కదిలించిన సంఘటనలను చాలా హృద్యంగా బ్లాగులో రాస్తారు. అప్పుడప్పుడు తను చూసిన సినిమా అనుభవాలే కాక ఇదిగో తాను రెగ్యులర్ గా చీరలు తీసుకునే వ్యక్తి గురించి కూడా బ్లాగులో పరిచయం చేస్తారు. ఎవరికైనా వెంకటగిరి చీరలు కావాలంటే చెప్పండి. ఈ చీరలు కట్టీ కట్టీ మా కొలీగ్స్ తో బాగా తిట్లు తింటున్నాను. ఈ చీరలకు నేను బ్రాండ్ అంబాసిడర్నట. నేనే ప్రమోట్ చేస్తున్నానట. అన్నీ అవే కడ్తున్నాను కాబట్టి నా పేరు వెంకటమ్మట. అబ్బో చాలా మాటలే పడ్తున్నానులెండి. ఎవ్వరూ నామీద కొంచమైనా జాలి చూపించట్లేదు. ఇలా అసలు ఆడాళ్లకు మాట్లాడుకోవడానికి దొరకని పనికిరాని వస్తువు, విషయం కాని ఉందా అని అనిపించక మానదు జయ బ్లాగు చదువుతుంటే. మనస్వి బ్లాగులో ఆలొచన,ఆవేశం,ఆవేదన మాత్రమేకాక అందమైన కవితలు, చిత్రాలు కూడా ఎన్నొ ఉన్నాయి.

మనస్వి...వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం అంటూ ఆహ్వానిస్తున్నారు హైదరాబాదుకు చెందిన జయ..

2 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

మనస్వి జయగారికి అభినందనలు.
well deserved recognition. Hope she writes more frequently.

జయ

అయ్యబాబోయ్...అలా రాసేసారేంటండోయ్. బయట ప్రపంచంలో నా బ్లాగ్ గురించి అసలెవరికీ తెలీదు. అలా తెలియాలని నేనెప్పుడూ అనుకోలేదు. బ్లాగ్ మితృలతోటే నాకిష్టం. హైలైట్ చేసేంత గా నా బ్లాగ్ లో ఏమీలేదు. ఏదో తోచినప్పుడు పిచ్చిరాతలు రాసుకోటమే. థాంక్యూ.

కొత్తపాళీ గారూ ధన్యవాదాలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008