సాహితీ ప్రాంగణాలు
సమస్తం ఆంగ్లమయమైన ఈ రోజుల్లో తెలుగు నేర్చుకోవడానికి, చదవడానికి చాలామంది అనాసక్తిగా ఉన్నారు. అదేమంటే చదువు, ఉద్యోగాలకు సంబంధించిన సమస్త సమాచారం ఆంగ్లంలో ఉన్నప్పుడు తెలుగు మనని ఏవిధంగా ఉద్ధరిస్తుంది అంటారు. కాని సాంకేతికంగా శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో కొందరు తెలుగు భాషాభిమానులు ప్రాచీన సంస్కృతిని, విజ్ఞానాన్ని అంతర్జాలంలో పొందుపరుస్తున్నారు. కంప్యూటర్లో తెలుగు రాయడం, చదవడం చాలా సులువైన ఈ రోజుల్లో ఈ వెబ్ సైట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అందుబాటులో ఉన్నాయి. తమకు తీరిన సమయంలో వీటిని ఉపయోగించుకోవచ్చు , తమ పిల్లలకు ఎన్నో విలువైన విషయాలను నేర్పవచ్చును కూడా. శతకాలు, జానపద పాటలు, మంగళహారతులు, డిక్షనరీలు, పద్యాలు, పుస్తకాలు మొదలైన అమూల్యమైన విజ్ఞానసంపదను ఈ సైట్లు నిక్షిప్తపరుస్తున్నాయి. అటువంటి ముఖ్యమైన వెబ్ సైట్లు కొన్ని పరిచయం చేసుకుందాం..
మాగంటి - http://maganti.org
నేటి బిజీ బిజీ జీవితాలలో పుస్తకపఠనం, సాహిత్యాభిలాష వగైరా చాలా వరకు తగ్గుతున్నాయి అనవచ్చు. కాని తమ తాతలు, తండ్రులు ఎంతో ఆసక్తిగా సేకరించి, భద్రపరుచుకున్న అపురూపమైన సాహిత్య సంపదను, నేటి, రాబోయే తరాలకు అందించాలనే మహోన్నతమైన అభిలాషతో , తమకు తెలిసిన విషయాలు ఇతరులతో పంచుకోవాలి, పెద్దవాళ్లు అందచేసిన పెన్నిధి దాచుకుని, తమతోనే అంతం కాకుండా తర్వాతి తరానికి అందచేయాలనే సదుద్ధేశ్యంతో మాగంటి అనే వెబ్ సైట్ ని ప్రారంభించారు శ్రీ మాగంటి వంశీ , అతని కుటుంబ సభ్యులు. తమకు వీలైనంత రీతిలో ఒక సాహిత్య భాండాగారంగా తయారుచేయాలనే ఉద్ధేశ్యంతో ఇందులో క్రమం తప్పకుండా కొత్త సమాచారం చేరుస్తున్నారు.
ఇకపోతే ఈ వెబ్ సైటులో ఏమేమి ఉన్నాయి అంటే చిన్న పిల్లలకోసం బోలెడు కథలు, పద్యాలు , వైజ్ఞానిక వ్యాసాలు, సాహితీవేత్తల, సంగీతకారుల వివరాలు, వారితో జరిపిన చర్చగోష్టీలు, జానపద కళల వీడియోలు, అవధానంలో సమస్యాపూరణ, చాటువులు వగైరా ఎన్నో ఎన్నెన్నో.. ఇంకా ఈ సైట్లో ఉన్న కళాఖండాలు ఒక్కసారి పరికిద్దాం. సాహిత్యం విభాగంలో వేదములు, ఉపనిషత్తులు, ఋత్త్వికులు , నారద సూత్రాలు... పిల్లల కోసం కూడా అరుదైన, అద్భుతమైన సమాచారం ఉంది. చిట్టి పొట్టి పద్యాలు, దీవెన పద్యాలు, జానపద కథలు, కోలాటం పాటలు వగైరా.. ఇక పురాణాల విషయానికి వస్తే పురాణాలు, అష్ట దిక్పాలకులు, శ్లోకాలు, అశ్వినీ దేవతలు, మన చక్రవర్తులు.. పొడుపు కథలు, కాలం, యుగాలు, దశవాయువులు , మహాకవులు, కవయిత్రులు, జేజిమామయ్య పాటలు.. అలాగే మహిళలకు ఎంతొ ముఖ్యమైన శ్రావణ, మంగళవార , శుక్రవార పాటలు, లాలిపాటలు, మంగళహారతి పాటలు ఎన్నో మధురమైన లలితగీతాలు కూడా పొందుపరచబడ్డాయి.
అసలు ఈ పాటలు ఉన్నాయి అని కూడా చాలామంది ఊహకు రావేమో.... టెంకిపాట - ఎంకిపాట, తిరుపతి వేంకటేశ్వర కవుల పకోడీ పద్యం, మల్లినాధసూరిగారి ఆవకాయ పాట, దోమ పద్యాలు, దేవులపల్లివారి పేరడీ పాట, పేకాట పాట.. ఇలా ఎన్నో అపురూపమైన పాటలు మీగడతరకలుగా ఈ సైట్ లో ఉన్నాయి. అంతేకాక చమత్కార చాటువులు, మేలుకొలుపులు, గాజులయ్య పాట, పెళ్లి పాట, రోకటిపాట, దంపుళ్ల పాట, గోంగూర పాటలూ ఉన్నాయి. మరుగునపడిపోతున్న ఎన్నో జానపదకళల వీడియోలు కూడ ఈ సైట్లో మనం వీక్షించవచ్చు. చెంచు నాటకం, కీలు గుర్రం, యక్షగానం, చెక్కబజన, పగటి వేషాలు, గంగిరెద్దుల పాటలు మొదలైనవి..
ఆంధ్రభారతి – http://andhrabharati.com
ప్రస్తుతం సాహిత్యాభిమానులకు , పురాణాలు చదవాలనే అభిలాష గలవారికి అనువైన గ్రంధాలు అందరికీ అందుబాటులో లేవు. ఉన్న కొద్దిపాటి గ్రంధాలు గ్రంధాలయాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అందరూ గ్రంధాలయానికి వెళ్లి చదవడానికి సమయం, ఓపిక ఉండదు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. పురాణాలు, శతకాలు వగైరా ఉత్తమ సాహిత్యాన్ని , అందరికీ అందుబాటులొ ఉంచడానికి జరిగిన విశేష కృషిఫలితమే "ఆంధ్రభారతీ” సైటు.
ఇది ఒక సైటు అనడంకంటే ఒక విజ్ఞానపుగని అనవచ్చు. భాషకు సంబంధించి వ్యాకరణం, చందస్సు, అలంకారాలు, జాతీయములు, పొడుపుకథలు...చరిత్రకు సంబంధించి పూర్వ, మధ్య, ఉత్తర మధ్య, ఆధునిక యుగ చరిత్రలు, పుణ్యక్షేత్రాలు, ఇతిహాసాలు,శతకాలు, కవితలు ..ఇలా చెప్పుకుంటూ పోతే తరగని నిధి మన కందుబాటులో ఉంటుంది. అలాగే ప్రసిద్ధమైన నాటకాలు, అలనాటి ప్రముఖుల గురించిన విశేషాలు ఈ వెబ్ సైటులొ పొందుపరచబడ్డాయి. కన్యాశుల్కం, చింతామణి వంటి నాటకాలు కూడా ఈ సైటులో లభ్యమవుతున్నాయి. మనం ఎన్ని పుస్తకాలు కొనడానికి ప్రయత్నించినా ఇక్కడ ఉన్న నిధిలో కొంతవరకైనా సమకూర్చుకోలేమేమో ? అనిపిస్తుంది. ఆంద్రభారతిలో కొత్తగా నిఘంటువు కూడా చేర్చబడింది. మనకు తెలియని పదాలు వాటి అర్ధాలను వివిధ శబ్దరత్నాకరాల నుండి సులువుగా వెతికే వీలు కల్పిస్తున్నారు..
2 వ్యాఖ్యలు:
చాలా మంచి సమాచారం అందించారు... ధన్యవాదాలు...
eee samaachaaram chaalaa chaalaa bagundi.
Post a Comment