నేను తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు
"దేశభాషలందు తెలుగు లెస్స" ఈ మాట వినగానే ప్రతి తెలుగువాడి హృదయం ఉప్పొంగుతుంది. కాని ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేది విజయనగర సామ్రాజ్యాధీశుడు, సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. తెలుగులో రచన చేయమని కన్నడ రాజుని ఆదేశించిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు పలికినట్టు నానుడి. కాని క్రీ.శ.1430 ప్రాంతం వాడైన వినుకొండ వల్లభరాయని 'క్రీడాభిరామం' నాటికే ఈ నానుడి బహుళ ప్రచారంలో ఉందని తెలియవస్తుంది. రాజ్యవిస్తరణలో భాగంగా దక్షిణదేశ దిగ్విజయ యాత్ర చేస్తూ శ్రీకాకులంలో విడిది చేసాడు. స్వప్నంలో సాక్షాత్కరించిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు స్వయంగా సంస్కృతకవియైన రాయలును అచ్చ తెలుగుభాషలో తన భక్తురాలి కథను దివ్యప్రబంధంగా రచించుమని ఆదేశించాడు. అదే ఆముక్తమాల్యద.. ఆ సమయంలో పలికిన పలుకులివి..
చరిత్రలో మనకు ఎందరో ప్రసిద్ధిచెందిన చక్రవర్తులు, సంస్థానాధీశులు, మహా వీరులు ఉన్నారు. అందరూ రాజ్యాభిలాష కలవారే. అయినా కొందరు మాత్రం ధర్మరక్షణ, కళారాధన, సాహితీసృష్టిపై విశేష కృషి చేసారు. ఇటువంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యాధినేతగా, మహావీరుడిగా ధర్మసంస్థాపన, ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన మహామనిషిగా పేరుపొందాడు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగన సార్వభౌముడని, అనేక అద్భుత కట్టడాలను నిర్మిచాడన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ అంశాలతో పాటు అంతగా పరిచయం లేని శ్రీకృష్ణదేవరాయల ధర్మదీక్ష, ఆధ్యాత్మికత మొదలైన అంశాలను సవివరంగా అందించారు కస్తూరి మురళీకృష్ణ తన శ్రీకృష్ణదేవరాయలు నవలలో . ఇందులో రాయల వ్యక్తిత్వాన్ని, కార్యదీక్షను, కళారాధనను నూతన కోణంలో ఆవిష్కరించిన రచన ఇది.
కృష్ణదేవరాయల చరిత్రా?? ఇది స్కూలు పిల్లలకైతే పాఠ్యాంశంగా పనికొస్తుంది .మనకెందుకులే అనుకుంటే పొరపాటే. ఒక మహారాజు అనగానే వంశపారంపర్యంగా వచ్చిన అధికారం, హోదా కాదు. రాచరికం అంటేనే కుట్రలు, కుతంత్రాలమయమైన ముళ్ళ కిరీటం. కృష్ణదేవుడు తన పుత్రుని రాజ్యాభిషేకానికి అడ్డుగ ఉన్నాడనే భయంతో అతని కళ్లు పెరికించమని తిమ్మరుసుకు ఆదేశిస్తాడు అతని అన్న వీరనరసింహుడు. తిమ్మరుసు అతనిని యుక్తిగా రక్షిస్తాడు. ఒకవైపు తురుష్కుల దాడి, మరోవైపు సామంతుల ధిక్కారస్వరంతో అల్లకల్లోలంగా ఉన్న సమయంలో రాజ్యాధికారం చేపట్టిన రాయలు సైనికులను మాతృభూమి రక్షణకు ఉత్తేజపరిచి ప్రతీ చోటా విజయం సాధించాదు. అలాగే సాహిత్యం, లలితకళలు, ధర్మసంరక్షణ విషయాలలో కూడా అమితమైన శ్రద్ధ కనబరచి ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశాడు. స్వయంగా కవిపండితుడు కావడం వలన మదాలస ప్రబంధం, జ్ఞానచితామణి, రసమంజరి, ఆముక్తమాల్యద వంటి అద్భుతమైన రచనలెన్నో చేశాడు. చరిత్ర గురించిన రచనలు చేయడం అంత సులువు కాదు. ఊహాజనితమైన రాతలు కాక వాస్తవికమైన వివరాలు,విశేషాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి పాఠకులకు అందివ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రచయిత సఫలురైనారని చెప్పవచ్చు.
సామాన్యుల శవాల గుట్టలపైనుండి నడుస్తూ వారి బలిదానాల ఫలితాలను రాజులు అనుభవిస్తారు. కాని మన ధర్మాన్ని నాశనం చేసి, మనల్ని అంతం చేయడానికి చుట్టుముట్టిన తురుష్కుల్ని తరిమి కొట్టండి. నాకోసం కాదు,, మీకోసం, మీ కుటుంబం కోసం పోరాడండి. అని నీరసించిన తన సైనికులను ఉత్తేజపరచి విజయలక్ష్మిని వరించాడు. అంతే కాదు మన ప్రజలకు కలలు కనడం నేర్పించాలి. రకరకాల భయాలతో, బాధలతో వారు తమ బ్రతుకుల్లోని ఆనందాన్ని మరచిపోయారు. సాహిత్యం, సంగీతం, గానం, నృత్యం వంటి లలితకళల ద్వారా జీవితంలోని ఆనందాలను వీరికి పరిచయం చేయాలి. అద్భుతమైన శిల్పాలతో సృష్టికి అందాలు అద్దాలి అని అనడమే కాడు అక్షరాలా ఆచరణలో పెట్టి ప్రజలలో ఉత్తమ భావాలు ఉన్నత ఆలోచనలు పెంపొందేలా చేశాడు రాయలు.
ఒక వ్యక్తి జీవిత విశేషాలనే కాదు ఆతని వ్యక్తిత్వంలోని ప్రత్యేక కోణాన్ని, ఆతని పరిపాలనా సామర్ధ్యాన్ని సరళమైన పదవిన్యాసంతో అందించారు రచయిత ఈ నవలలో. ఒక నాయకుడిగా తన అనుచరులను ఏ విధంగా ఉత్తేజపరుస్తాడు, పురాతన ఆలయాలను పునరుద్ధరింపజేసి వాటి నిర్వహణకోసం ఎటువంటి లోటు జరగకుండా ఏర్పాట్లు చేసి, ఎంతో నైపుణ్యంతో యుద్ధరచన చేసి శతృవులను యుక్తిగా మట్టుపెట్టి మహావీరుడిగా మన్ననలందిన రాయలు గురించి తెలుసుకోవలసిన సమాచారం ఎంతో ఉంది. ఇందులో రాయలు పలికిన మాటలు చదువుతుంటే జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కునేటప్పుడు సార్వభౌముడైనా , సామాన్యుడైనా ఒకటే కదా అనిపిస్తుంది.
నాకు కృష్ణదేవరాయలు స్కూలులోనే పరిచయం. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కనిపించేవాడు రాయలు. కాని ఆముక్తమాల్యద ద్వారా మరింత దగ్గరయ్యాడు . అందుకేనేమో అతని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగింది. కస్తూరి మురళీకృష్ణగారి శ్రీకృష్ణదేవరాయలు నవల నాకు తెలియని ఎన్నో విషయాలను తెలిపింది. మామూలుగా చిన్నప్పటినుండి నాకు చరిత్ర అంటేనే అంతగా ఆసక్తి లేదు. కాని ఈ నవలను మాత్రం కదలకుండా, వదలకుండా రెండు గంటల్లో పూర్తి చేసా.. అంత సరళమైన , ఆసక్తికరమైన రచన ఇది. ఈ నవల పాఠ్యాంశంగా ఉండాలని ఎందరో పాఠకులు భావించారు. అది అక్షరాలా నిజం అని నేను నమ్ముతున్నాను.
ఈమధ్యే విజాగ్‌లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ద్వానాశాస్త్రిగారు అన్నారంట. రాయలవారికి ఇద్దరే భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి. మూడో భార్య కూడా ఉంది అని చెప్పడం తప్పు కదా అని. రాయలు యవ్వనంలో ఉండగా చిన్నాదేవి అనే వేశ్యను వలచాడు. ఆమె రాచకన్య కాదు కాబట్టి తిమ్మరుసు సాళువ నరసింహుని పుత్రిక తిరుమలాదేవితో వివాహం జరిపించి పిమ్మట చిన్నాదేవిని కూడా చేపట్టమన్నాడు. చాలా కాలానికి గజపతి శతృత్వాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన కూతురు అన్నపూర్ణా దేవిని రాయలుకు ఇచ్చి వివాహము చేశాడని. మహామంత్రి తిమ్మరుసు సినిమాలో కూడా ఇలాగే చూపించారు. మరి ఇది ఎంతవరకు నిజమో విజ్ఞులే తెలపాలి.
ఇది సమీక్షా? ఇంత పెద్దగా ఉంటుందా? అంటారా?? అసలు చెప్పాలంటే మొత్తం పుస్తకమే ఇక్కడ రాసి పెట్టాలనుంది.కాని పుస్తకం కొని చదివితేనే అందం.చందం.. ఆనందమూనూ..
పుస్తకం వివరాలు :
శ్రీకృష్ణదేవరాయలు
రచయిత : కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ : కస్తూరి ప్రచురణలు
ధర : Rs. 60
పంపిణీదారులు : Navodaya Book House
Opp. Arya Samaj Mandir
Kachiguda ‘X’ Roads,
Hyderabad – 27
Ph. 040 – 24652387
ఆన్లైన్ లో కొనుక్కోవాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా : Kinige
7 వ్యాఖ్యలు:
సమీక్ష బాగుంది
శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక తెలుగు రాజైనందుకే కాదు. ఆయన నమ్మిన మానవతా ఆదర్శాలకు ఆయన్ని గౌరవించాల్సి ఉంది. ఆయన రాజు కాకముందు ఆయన అన్న వీరనరసింహరాయలు పరిపాలించేవారు, ఆయన హయాములో - యుద్ధంలో పట్టుబడ్డ సంసార స్త్రీలని సైనికులు పంచుకునేవారు (తాత్కాలిక అనుభవం కోసం). రాజు స్వయంగా కొంతమందిని తన అనుభవం కోసం ఎంచుకోవడమే కాకుండా తన మెప్పుపొందిన సైనికాధికారులకు మంచిమంచి అందమైన సంసార స్త్రీలని (బందీలైనవారిని) అప్పగించేవాడు. దీన్ని ఆనాటి సమాజం తప్పుగా భావించేది కాదు.
తాను రాజైన తరువాత ఈ వ్యభిచారపు వ్యవహారాన్నంతా శ్రీకృష్ణదేవరాయలు అసహ్యించుకున్నాడు. ఆయన ఈ ఆచారాన్ని నిషేధించడమే కాకుండా, యుద్ధం అనేది ఆయుధాలు ధరించిన పురుషులతో చేయాల్సిందే గానీ నిరాయుధులతోనూ, స్త్రీలతోనూ మనకు పనిలేదనీ, శత్రురాజ్య స్త్రీలైనా స్త్రీలేననీ, ఎవఱైనా వాళ్ళ జోలికి వెళితే శిక్షిస్తాననీ కఠినంగా శాసించాడు. ఆ తరువాత ఆయన మార్గాన్నే ఇతర రాజులు కూడా అనుసరించాల్సి వచ్చింది.
ఆయన పట్టమహిషి (మహారాణి) వాస్తవానికి పూర్వాశ్రమంలో ఆయన పనిమనిషి. యౌవనంలో ఆయన ఉదయగిరి (నెల్లూరు) రాజ్యానికి గవర్నర్ గా ఉన్నరోజుల్లో ఆయన మందిరంలో పనిచేసేది. ఆయన ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.
ఆయన గుఱించి చెప్పాలంటే - ఇలాంటివి చాలా ఉన్నాయి.
Thanks a lot. I'm buying the book.
madhuri.
జ్యోతి గాగూ,
"దేశభాషలందు తెలుగు లెస్స"....'ఈ మాట తొలిసారిగా పలికింది విజయనగర సామ్రాజ్యాధీశుడు, సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు...'
ఈ అభిప్రాయం వ్యక్తపరిచే ముందు ఒకసారి check చేసుకున్నారా? ఎందుకంటే క్రీ.శ.1430 ప్రాంతం వాడైన వినుకొండ వల్లభరాయని 'క్రీడాభిరామం' నాటికే ఈ నానుడి బహుళ ప్రచారంలో ఉందనడానికి అందులో ఈ క్రింది పద్యమే సాక్ష్యం:
"జనని సంస్కృతంబు దేశభాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స,
జగతి తల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలుగాదె?"
ఈ పద్యం ప్రక్షిప్తమని ఎవరూ ఆక్షేపించగా చదివిన గుర్తు నాకు లేదు. ఈ నిదర్శనాన్ని కాదని, దానిని కృష్ణరాయనికి ఎలా ఆపాదించగలం? వల్లభరాయుడు జీవించి ఉండిన కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని ప్రౌఢదేవ రాయలు (క్రీ.శ.1423-1445)
పరిపాలిస్తూ ఉండేవాడని ఒక అభిప్రాయం ఉంది.
నమస్కారాలతో,
వెంకట్.బి.రావు.
తాడేపల్లిగారు, రాయలు గురించి మరిన్ని విశేషాలు చెప్పగలరు. నాకు తెలిసి చిన్నభార్య చిన్నాదేవి రాచకన్య కాదు అనుకున్నాను..
వెంకట్ రావు నమస్కారం. ఇక్కడ నేను ఇంకో తప్పు చేసానండి. అసలు ఈ మాటలు అన్నది శ్రీకాకుళాంద్ర మహావిష్ణువు అని చదువుకున్నాను. మీరు చెప్పిన విషయం నిజంగా తెలీదండి. తెలియజేసినందుకు ధన్యవాదాలు.
ఇక్కడొక చిన్న తిరకాసు ఉంది. పేరుకు చిన్నాదేవే గానీ ఆవిడ చిన్నభార్య కాదు. వాస్తవంగా ఆవిడే పెద్దభార్య. ఆవిడే ఉదయగిరిలో రాయలవారి దాసిగా అయన్ని సేవించింది. కానీ రాజు కాక ముందు ఆవిణ్ణి రహస్యంగా చేసుకోవడం వల్ల ఆ పెళ్ళి చెల్లక చక్రవర్తి అయ్యాక ఆమెనే మళ్లీ పెళ్ళీచేసుకోవాల్సి వచ్చింది. ఇది తిమ్మరుసు ఇచ్చిన సలహా. రెండోసారి చేసుకున్న తిరుమలదేవికి పట్టమహిషి హోదా దక్కలేదు, రాజవంశీకురాలైనా కూడా ! చిన్నాదేవే పట్టమహిషిగా ఉండేది.
kasturi murali krishna gaari pustakam nenu chadivaanu gaani poortigaa kaadu. akkadakkadaa.. konni adhyaayaalu.. very interesting.. manchi subject parichayam chesaaru..
Post a Comment