కుశలమా???
కుశలమా???
మాట చెప్పలేని విషయాన్ని ఒక పదం చెప్తుంది. ఆ పదాలను కూర్చి రాసిన ఉత్తరం ఆ వ్యక్తి మనసులోని భావనను ఉన్నదున్నట్టుగా అవతలి వ్యక్తికి మోసుకెళ్తుంది. ఉత్తరాలు అనగానే ఒక కార్డు,కవరు,, ఎన్వలప్ మాత్రమే కాదు. అందులో ఎన్నో కబుర్లు, కథలు, ఊసులు, బిల్లులు,బకాయిలు కూడా. ఈ బిల్లులు, బకాయిలైతే అందరికీ ఉండేవే. ప్రతి నెల అవి రాక తప్పదు. వాటికి మనసుండదు. మాటలుండవు. ఉత్తరమంటే అవసరమైన విషయాన్ని మూడు ముక్కల్లో రాసి పడేయడమేనా.. చాలామందికి ఉత్తరాలు అవసరమైతే తప్ప రాసుకునేవి, వచ్చేవి కావు అనుకుంటారు. కాని కొందరికి ఉత్తరం అంటే ఒక భావతరంగం. మనసును విప్పి చెప్పుకునే సాన్నిహిత్యం. పలుకలేని ఊసులెన్నో పదాలుగా మార్చి పంచుకోవడం అనుకుంటారు ఎంతో మంది. అందులో నేనూ ఒకదాన్నే.
ప్రతీ విషయం ఎప్పటికప్పుడు మాట్లాడుకోలేము, ఆ మనిషి ఎదురైనప్పుడు గుర్తుండదు లేదా అన్నీ చెప్పలేము కూడా. కాని ఉత్తరం రాయడానికి కూర్చుంటెే మాత్రం ఆ భావప్రవాహం అలా సాగిపోతూనే ఉంటుంది. గొంతుదాటి రాలేని ఎన్నో మాటలు అక్షరాలుగా ఉత్తరంలో ఒదిగికూర్చుంటాయి. మన మనసులోని సందేశాన్ని ఉన్నదున్నట్టుగా అవతలి వ్యక్తికి అందజేస్తాయి. మొత్తం రాసాక చూసుకుంటే ఇదంతా మనమే రాసామా? అనుకుంటాం.. ఉత్తరాలు రాయడం, వచ్చిన వాటిని చదువుకుని మురిసిపోవడం. ఆ ఆలోచనల్లో మునిగిపోవడం చాలామందికి పరిపాటే. మన ఆలోచనలను అందరితో పంచుకోలేము. ఎందుకంటే వాటిని అందరూ ఒక్కలా అర్ధం చేసుకోలేకపోవచ్చు. కొందరికి అది సోదిలా ఉంటే మరి కొందరికి మనం చెప్పదల్చుకున్నది అర్ధం కాదు. కాని చాలా కొద్ది మంది మన శ్రేయోభిలాషులు మాత్రం ఆ ఉత్తరంలోని అంతరార్ధాన్ని పట్టుకుంటారు. మనం చెప్పలేకపోయిన విషయాన్ని కూడా అర్ధం చేసుకుంటారు. మన మనఃస్థితి ఆ పదాల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరి. ఇంతకంటే వేరు మార్గం ఉందా మన సంతోషాన్ని, బాధను పంచుకోవడానికి.
ఉత్తరం అంటే కలం, కాగితం కాగితాలు. అసలు రాయడానికి కూర్చుంటే ఎన్ని కాగితాలైనా సరిపోవేమో. కాని అలా రాయగలగడం ఒక కళ. అది అందరికీ రాదు. కొందరి రాతలు, అందులోని మర్మం అర్ధం చేసుకున్నవారికి అవి శిలాక్షరాలై జీవితాంతం గుర్తుండిపోతాయి. అవి జీవిత పాఠాలే కావచ్చు, గుణపాటాలే కావొచ్చు. కాని ఈనాడు ఉత్తరాలు రాసే అవసరం అంతగా రావట్లేదు. సెల్ ఫోన్లు, ఈ మెయిల్ మొదలైనవి మనుష్యుల మధ్య దూరాన్ని తగ్గించాయి. ఏదైనా పని ఉంటే కాల్ చేస్తాం, మెయిల్ చేస్తాం కదా ఇంకా వేరే ఉత్తరాలు రాయడమా? అంటారు. కాని చదువు, ఉద్యోగానికి సంబంధించినవి మాత్రమే అవసరమైన విషయాలా?? అవి తప్ప మాట్లాడుకోవడానికి, మిత్రులతో పంచుకోవటానికి, చర్చించటానికి విషయలేమీ లేవా? (మనకంటే బ్లాగులున్నాయి అనుకోంఢి) ఒకరిపై ఒకరు అలిగినా, గిలి కజ్జాలు, అనుమానం, అపార్థాలు అయినా ఆ పరిస్థితిలో మాట్లాడడానికి మనస్కరించదు కాని అదే భావాలను ఉత్తరాల ద్వారా పంచుకుంటే ఆ కోపతాపాలు, అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది.
చాలా రోజులకు వేడి కాఫీ తాగుతూ ఉదయించే సూర్యుడిని చూసారు. అప్పటి భావన, అనుభూతి ఒంటరిగా అనుభవించలేక ప్రియమైన నేస్తంతో పంచుకోవాలి అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉత్తరం రాసేయండి. ఆ భావావేశం తర్వాత జీవన రంధిలో పడ్డాక ఉండదు. వినడానికి బానే ఉంది. ఇప్పుడు ఉత్తరం రాసి పోస్ట్ చేసి దాని రిప్లై కోసం ఎదురు చూసే ఓపిక ఎవరికుంది అంటారా? ఎందుకు మన ఇంట్లోనుండే కూర్చున్నచోటినుండే ఉత్తరం రాసే వీలుంది. ఈ మెయిల్ ద్వారా కూడా చక్కని భాషతో, ప్రేమాభిమానాలతో ఎదుటిమనిషి మన ముందు కూర్చున్నట్టే, మాట్లాడుతున్నట్టే ఉత్తరం రాయొచ్చు. అది ఆ వ్యక్తికి చేరడానికి కొద్ది నిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు. అర్ధం చేసుకునే మనసుంటే ఉత్తరాలలోని ప్రేమాభిమానాల జడివానలో తడిసి ముద్దై మురిసిపోతారు. కాదంటారా? కాగితం మీద రాసిన ఉత్తరాలు రాసినవి దాచుకోవచ్చు. అప్పుడప్పుడు తీసి చదువుకోవచ్చు అనుకుంటారు కాని కంప్యూటర్ పై రాసే ఇ-ఉత్తరాలు కూడా అప్పుడప్పుడు చదువుకుని ఆ పాత జ్ఞాపకాలను నెమరు వెసుకోవచ్చు. ఎన్నో తలపులు, ఊహలు, ఊసులు, అనుభూతులను, స్నేహమాధుర్యాన్ని పంచి మనసును తట్టేవి ఉత్తరాలు.
నాకైతే అస్సలు ఉత్తరాలు రాసే అలవాటు లేదు. ఎవరికని రాయను. నాకు రాసేవాళ్ళు లేరు. మంచి ఫ్రెండ్ ఉంటే ఎన్నో ఊసులు చెప్పుకోవచ్చు కదా అనుకునేదాన్ని. కాని నాకు నేను తప్ప ఎవరూ లేరు. పెళ్ళయ్యాక సంసార జంజాటం తప్పనిసరి. పిల్లలకు లీవ్ లెటర్ మాత్రం రాసే పని పాడేది అప్పుడప్పుడు. కాని అంతర్జాలానికి వచ్చిన తర్వాత నా ప్రయాణమంతా ఇ ఉత్తరాల ద్వారానే జరిగింది. నా ఉత్తరాలలో ఎన్నెన్ని ఆలోచనలో , భావనలో, బాధ, సంతోషాలో చెప్పలేను. ఎవరితో చెప్పుకోలేని, అడగలేని ఎన్నో మాటలు ఉత్తరాల ద్వారా చెప్పుకున్నాను . అలాగే వాటికి పరిష్కారం తెలుసుకుని నన్ను నేను సరిదిద్దుకున్నాను. చెప్పాలంటే నా అంతరంగాన్ని, సంఘర్షణను నా ఉత్తరాలలో దాచుకున్నానేమో. అందుకే ఎప్పుడైనా ఒంటరిగా , దిగులుగా ఉన్నప్పుడు పాత ఉత్తరాలను తీసి చదువుకుంటాను. నన్ను నేనే ఓదార్చుకుని ముందుకు సాగిపోతాను. ఎందుకంటే ఆ ఉత్తరాలలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. అవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ద్వారా నా మార్గాన్ని సవ్యంగా మార్చుకోగలుగుతున్నాను.
మరి మీకు ఉత్తరాలు రాసే అలవాటు ఉందా?? నాకైతే ఉంది. మొదలుపెట్టానంటే నేను ఎంత పెద్ద ఉత్తరం రాస్తానో నా ప్రియ నేస్తాలకు తెలుసు.
10 వ్యాఖ్యలు:
చాలా బాగ చెప్పారు ముఖాముఖీ చెప్పలేని ఎన్నో భవాలను ఉత్తరాల ద్వార చెప్పుకోవచ్చు ఒకప్పుడు పోస్ట్మేన్ కోసం ఎన్ని ఎదురు చూపులోః మన రాజకీయనాయకులు జైల్లలోఉండి రాసిన ఉత్తరాలు ఎంత ప్రసిధ్ది చెందాయి!ఉదా నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలు
మనసు భావాల మూట ఉత్తరం. ఎక్కడ రాస్తే ఏమిటి.. ఈ.. ఉత్తరం ఉత్తరమే కదా? బాగుంది ..జ్యోతి గారు. ఉభయకుశలోపరి అని వ్రాసే కంటే.. క్షేమమా నేస్తమా కుశలం అడగాలని..వ్రాయడం..మనసును తాకుతుంది కదా.. మీ టపా కి.ఈ స్పందన అంతే..
జ్యోతి గారు చాలా బాగా చెప్పారు. నా చిన్నప్పుడు నాకు ఇష్టమయిన వాళ్ళలో పోస్ట్ మెన్ ఒకరు.అతనుతెచ్చే లెటర్ కోసం ఎదురు చూడడం చాలా భాగుండేది
బాగుందండీ.. ఉత్తరాలలో ఉండే ఫీలే వేరు.. :). మంచి టపా.
జోగారావుగారు, ధన్యవాదాలు
వనజగారు,మీరు చెప్పింది నిజమేనండి..
రత్నమాలగారు, నేను ఎదురుచూసేదాన్ని కాని నాకంటూ ఉత్తరాలు రాసేవాళ్లు లేరు, నేను రాయడానికి ఎవరూ లేరు. చాలా ఎదురుచూసేదాన్ని నా పేరుతో ఒక ఉత్తరం రాకపోదా అని. ఆ కోరిక ఈనాడు తీరిందిలెండి.. :)
గిరీష్ గారు, నిజమే. ఆ ఫీలే వేరు. అది మనకు మాత్రమే సొంతమైనది. అర్ధమయ్యేది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది కూడా కాదంటారా??
ఎక్కడో చదివాను. ఉత్తరం మొగలిపొత్తి లాంటిది. పెట్టెలో బట్టల మడతల అడుగునుంచి తీసి చదువుకుంటే ఎప్పటికీ ఒకే పరిమళం వెదజల్లుతుందీ. అని.
ఇప్పుడు నేను రాసినా చదివే ఓపిక ఎవరికైనా ఉందో లేదో కానీ, ఒక స్వర్ణ యుగంలో భారత తపాలా శాఖని బాగా పోషించాను.నాకు లేఖా సాహిత్యం అంటే తగని మక్కువ. పరకాయ ప్రవేశం చేసి మరీ అనుభవించేస్తాను.
బలిపీఠంలో ఈ పాట అంటే ఎంత ఇష్టమో నాకు. "ఎన్ని కబురులంపేనో, ఎన్ని కమ్మలంపేనో.. పూల గాలి రెక్కలపైన, నీలి మబ్బు పాయలపైన.. అందేనా..!" ఇది నాకు భలే ఇష్టమైన వాక్యం. కొన్ని సున్నితమైన భావాలు మోతాదుకి మించకుండా, తగ్గకుండా పలికించడం దేవులపల్లికి మాత్రమే తెలుసు.
మంచి టపా(ట). :)
జ్యోతిగారు,
మీ పోస్ట్ చాలా బావుంది. నిజం! ఉత్తరాల అలవాటు తప్పింది.అప్పట్లో వారానికి ఒక ఉత్తరమైనా వ్రాయకపోతే నాన్నగారు మందలించేవారు...దూరంగా ఉన్నప్పుడు ఈవిడా తీయగా చీవాట్లేసేది... మా పిల్లలు కూడా నా ఉత్తరాలకోసం ఎదురు
చూసేవారు... స్పీడు యుగంలో మరుగున పడిపోయాయి ఆ ఉత్తరరచనలు..సెల్లు ఫోనులు అవీ ఉపయోగించడం ఆపి 'ఈ' మెయిల్ ఉపయోగిస్తే పాత రోజులు పునరావృతమౌతాయి.ఫోను బిల్లులు పోను పోను తగ్గుతాయి. ఆలోచిద్దామా?
కొత్తావకాయగారు, ఒకసారి ఉత్తరం రాయడానికి కూర్చుంటే మనసులో ఉన్న భావాలన్నీ అందులో ఒదిగిపోతాయండి. అదే కృష్ణశాస్త్రి చేసింది.
హనుమంత్ రావుగారు.
ఉత్తరాలు చేత్తో రాయలేక పోతే ఇ ఉత్తర సదుపాయం ఉందిగా. ఫోన్లో మాటలు ఎన్నని దాచుకుంటాం. ఎన్నని గుర్తుంటాయి చెప్పండి. అదే ఉత్తరమైతే పూసగుచ్చినట్టు అన్నీ రాయొచ్చు. తప్పులుంటే దిద్దుకోవచ్చు. మళ్లీ మళ్లీ చదువుకోవచ్చు.
మీ యావిడ మెయిల్ కి ఓ ప్రేమలేఖ రాసి పంపండి.... :))
ఆ మెయిల్-ఈ మెయిల్
ఈనాడు ఉత్తరాల పలకరింపులు లేవు !
అనుబంధాల ఆనందాలను అందించే ఉత్తరం
ఎంతెంతో దూరం !
ఏవీ గుండె చప్పుళ్ళను అక్షరాలతో నింపి
ఉత్తరకుమారుని* రాక చెప్పే గేటు చప్పుళ్ళ కోసం
చెవులు రిక్కించే ఆ మంచి రోజులు !!
*పోస్ట్మాన్
కుశలమా అంటూ ఉత్తరాల గురించి మీరు వ్రాసినది
కడు ఉత్తమం !
Fantastic Jyothi. Even I have the habit of writing a lot but gone are the days of writing inlands and post cards. I do have a lot of patience to write. Hope I am not new to you on FB and my small posts of reality. But i have preserved all the letters we used to receive once upon a time.
Post a Comment