Monday, September 12, 2011

ఇల్లలుకగానే .......................


చిత్రం : అక్బర్

అమ్మాయి పెళ్ళీడుకొచ్చింది. యోగ్యుడైన అబ్బాయిని చూసి కట్నకానుకలతో అమ్మాయిని అత్తవారింటికి పంపుతారు. అంతవరకు ఆమె తల్లితండ్రుల గుండెలమీద కుంపటిగానే ఉంటుంది. ఒక అయ్య చేతిలో పెట్టి తమ బాధ్యత వదిలించుకున్నారు. ఇక అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు ఇలా చెప్తారు ... పెద్దలకు ఎదురు మాట్లాడవద్దు. ఎవరు ఏది చెప్పినా కాదనకుండా చేయాలి. మొగుడు, పిల్లలు, అత్తగారికి కావలసినవి అమర్చడమే నీ బాధ్యత.. నీ మూలంగా మాకు ఎటువంటి మాటా రాకూడదు ఇలా ఎన్నో బుద్ధులు చెప్తారు. అన్నింటికి తల ఊపుతుంది ఆ అమ్మాయి. కొత్తగా పనికి వెళ్లే పనివాళ్లకి చెప్తారు చూడండి అలా అన్నమాట. అమ్మాయిలు కూడా అత్తగారింట్లో అదే గుడ్డిగా ఫాలో ఐపోతుంటారు. తమ ఇష్టాలేంటో గుర్తుండదు. రుచిగా వంట చెయడం, అందరి అవసరాలు తీర్చడం, ఇల్లు నీట్ గా పెట్టడం, అతిథి మర్యాదలు చేయడం, టైమ్ దొరికితే కుట్లు , అల్లికలు , ముగ్గులు ఇవే ఆమె లోకం. మగవాళ్ళతో గట్టిగా మాట్లాడొద్దు. కాస్త నవ్వుతూ మాట్లాడితే బరితెగించింది అంటారు. అన్నీ మొగుడే చూసుకోవాలి. ఆడది గడప దాటి బయటకు రాకూడదు. ఎప్పుడూ ఆడాళ్ల మధ్యే , ఆడాళ్ల తోటే ఉండాలి. ఇది అసలైన ఆడదానికి ఉండవలసిన లక్షణాలు అలియాస్ జీవితకాలపు జైలు అన్నమాట. దీనిని దాటి లోకం లేదు. ఎంతోమంది ఆడవాళ్లు ఇలాటి జీవితానికి అలవాటు పడిపోయారు కూడా. వాళ్లకు తమకంటూ ఇష్టాలు , అభిరుచులు ఉండవు. ఉన్నా పూసలు, బొమ్మలు, బట్టలు కుట్టుకోవడం తప్ప వేరే ఏముంటాయి??. డబ్బులు కావాలంటే భర్త ఇస్తాడు. వయసు మీరాక కొడుకులు చూసుకుంటారు. ఐనా ఇంట్లో ఉండే ఆడదానికి అంతకంటే కోరికలేముంటాయి. తిండి, బట్ట, నీడకు లోటు లేదు. ఇప్పుడంటే టీవీలు ఉండనే ఉన్నాయి. వాటిలో టీవీ సీరియల్లు ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటాయి. ఇంకా చేయడానికేముంది. పనిగాని, ఇంకేదైనా కాని చేసి ఎవరిని ఉద్ధరించాలంట??హాయిగా రోజులు గడిచిపొతున్నాయి చాలదూ?. ఎప్పుడైనా ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఐతే అప్పడాలు, పచ్చళ్లు పెట్టి వేన్నీళ్లకు చన్నీళ్లుగా ఇంత సంపాదిస్తే చాలు. పెళ్లయ్యాక ఆడవాళ్లు చేసే పనేముంది. మొగుడు, పిల్లలు, మళ్లీ వాళ్ల పిల్లలను చూసుకోవడం ప్రతీ ఇల్లాలి కర్తవ్యం, బాధ్యత కూడాను. అంతకంటే ఏం చెయగలం ఇంట్లో ఉండే ఆడవాళ్లు..ఇలా ఇల్లు అలుకుతూ అలుకుతూ తాము ఎవరో, తమ పేరేంటో మర్చిపోయే ఆడాళ్లు ఎంతో మంది ఉన్నారు. "సంసారం నిలబడడానికి తన స్వేచ్చ సమర్పించుకుంది స్త్రీ, తన యుగాల నిద్రనుంచి మేల్కొన్నది" అని చలం చెప్పినట్టు అందరూ కాకున్నా కొందరైనా ఎప్పుడో ఒకప్పుడు తమగురించి ఆలోచిస్తారు. ఉలిక్కిపడి కళ్లు తెరిచి తమ చుట్టూ చూసుకుని " ఈ సమాజంలో నా స్థానం ఎక్కడ?" అని అయోమయంగా తమని తాము ప్రశ్నించుకుంటారు. అసలు తమకు కావలసిందేమితో, ఇల్లలుకుతూ మర్చిపోయిన ఎన్నో అభిరుచులను, ఇష్టాయిష్టాలను తెల్సుకోవాలి. ఒక విషయం చెప్తాను.. ఎవరన్నా స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ స్నేహితుడి నాన్నో మావగారో ఉంటే వారి పేరుతో పరిచయం చేసుకుంటారు. అదే ఆ స్నేహితుని అమ్మ గానీ అత్తగారూ గానీ అయితే? వాళ్ళూ పేరుతో పరిచయం చేసుకోరు, మనమూ అడగం పేరేవిటని. అడిగినా ఏమని చెప్తారు?? ఏమోయ్, అమ్మా, బామ్మ, అమ్మమ్మ, అమ్మగారు, అత్తయ్యగారు, ఇవేనా ఆ ఇల్లాలికి ఉన్న పిలవగలిగిన పేర్లు. అందుకే ప్రతీ మహిళ తన పేరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికోసమో కాదు తనకోసమే. ఆ అలా చేయడం అందరికీ సాధ్యం కూడా కాకపోవచ్చు. భవసాగరంలో ఎంతగా మునిగిపోతారంటే బయటకు రావాలని ఎంత తపనపడినా పైకి రావడానికి బదులు లోపలికే కృంగిపోతుంటారు. కాని అవకాశం ఉన్నవారైనా బ్రతుకంటే ఇల్లలకడమే కాదు అది బ్రతుకులో ఒక భాగం మాత్రమే అని గుర్తించుకోవాలి. కుటుంబ బాధ్యతలతో పాటు తమలోని అంతర్గత శక్తిని గుర్తించి , తమని తాము మర్చిపోకుండా ఉండాలని ఈ కథ చెప్తుంది. అంత మాత్రాన తన గురించే ఆలోచించి, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని ఎవరూ చెప్పరు. ఒక్కసారి మీ గురించి ఆలోచించండి. మీకిష్టమైన పనులు ఎన్నో ఉన్నాయి. చేయగలరు కూడా..ఈ కథ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే...ఈనాటికీ మన చుట్టూ ఎంతోమంది తమ పేరు మరచిపోయిన శారదలు ఉన్నారు. భర్త , పిల్లలు , సంసారం తప్ప వేరే లోకం తెలిదు. అలాటి ఓ పేరు మరచిపోయిన శారదల్లో నేనూ ఒకదాన్నే మూడేళ్ల క్రిందవరకు.. పిల్లలకోసం నెట్ పరిచయం చేసుకుని సరదాకి బ్లాగు మొదలెట్టాను కాని కొంత కాలానికి అది కూడా బోర్ కొట్టింది. పిల్లలు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. అప్పట్లో అసలు నాకు ఏమిష్టమో నాకే తెలిదు. సంపెంగలు ఇష్టం. రఫీ, ఘంటసాల పాటలు ఇష్టం. వారపత్రికల్లో సీరియళ్లు,తెలుగు కథలు చదవడం ఇష్టం. సినిమాలు కాకున్నా టీవీ సీరీయల్లు చూస్తున్నాను. హాయిగా సమయం గడిచిపోతుంది. తిండికి, బట్టకు కొరతేమి లేదు కష్టాలు తీరిపోయాయి. పిల్లలు సెటిల్ అయ్యారు. ముందు ముందు పిల్లలు పెళ్లిళ్లు అయ్యాక వాళ్ల పిల్లలకు సేవలు చేస్తూ ఉండాల్సిందే..... మరి నా జీవితమంతా ఇంతేనా??.... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టి అల్లకల్లోలం చేసాయి. ఈ కథలోలాగే ఒక ఫ్రెండ్ మూలంగా నా గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. బాధ్యతలను మానుకోలేదు కాని తగ్గించుకున్నాను. నాకు ఇష్టమైనది, నాకు తృప్తినిచ్చేది ఏంటీ అని ఆలోచించాను. ఆ దిశలో ప్రయానించి ఇదిగో ఇపుడు ఇలా ఉన్నాను మరి మీ చుట్టూ తమ పేరు మరచిపోయిన శారదలను ఎంతోమంది కనిపిస్తారు. వాళ్ళకు కూడా గుర్తు చేయండి. ఆ శారద మీరు కాకుంటే మీ అమ్మ కావొచ్చు, పిన్ని కావొచ్చు, అక్క కావొచ్చు. అమ్మమ్మ కూడా కావొచ్చు. ...

7 వ్యాఖ్యలు:

కృష్ణప్రియ

Well said!

Anonymous

జ్యోతి గారు చక్కగా చెప్పారు . వెనక్కెళ్ళి కథకూడా చదివాను .మంచి కథ గురించి తెలిపిన మీకు ధన్యవాదాలు

విరిబోణి

baaga chepparu :) adento naa pelli avvagane nenu ventane nidra lechaanu, ekkuva time waste chesukoledu :) nannu nenu uddarinchukoivadaaniki :))

కొత్త పాళీ

చక్కటి విశ్లేషణ. సాహిత్యం జీవితంలోనించే పుడుతుంది అంటే ఇదే.

Passion

Very well said

శశి కళ

నిజం చెప్పారు అండి.వ్యక్తిత్వం తొ వికసిస్తెనె ఆడ వాళ్ళకు
గౌరవం.

Madhu

Jyothi garu, chala chakkaga, correct ga chepparu. I agree with you.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008