వనితలా? వినిమయ వస్తువులా?
వనితలా? వినిమయ వస్తువులా?
రాత్రి సమయం. కుటుంబ సభ్యులంతా హాల్లో కూర్చుని టీవీలో వస్తున్న సినిమా చూస్తున్నారు. మధ్యలో ప్రకటనలు మొదలయ్యాయి. కురచ దుస్తులు ధరించిన అమ్మాయిలు షాంపూ గురించి చెప్తున్నారు. తండ్రి, కూతురు, కోడలు, మరిది, మావగారు, పిల్లలు కూర్చుని చూస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు ఎంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఒక్కోసారి అసహ్యంగా కూడా ఉంటుంది. ఒక వస్తువు అమ్మడానికి ఆడవారిని అర్ధనగ్నంగా చూపడం అవసరమా? అలా చూపిస్తేనే ఆ వస్తువులు అమ్ముడవుతాయా? అసలు ఈ రోజు వివిధ టీవీ ఛానెళ్లలో, పత్రికలలో వచ్చే ప్రకటనలు నిజంగా వినియోగదారుడిని ఆకర్షించి ఆయా వస్తువులను వెంటనే కొనేలా చేస్తున్నాయా? లేక అమ్మాయిల అందాలు ఆరబోస్తున్నాయా? సకుటుంబంగా చూసి మళ్లీమళ్లీ గుర్తుంచుకుని బావున్నాయని మాట్లాడుకునేలా చేసే ప్రకటనలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చేమో.
ఈనాడు టీవీలేని ఇల్లుండదేమో! అది నిత్యావసరంగా మారి చాలా కాలమైంది. ప్రతీ ఇంట్లో నీళ్లు, కరెంటులా టీవీ, కేబుల్ కనెక్షన్ ఉండాల్సిందే. నెలకు 200 లోపు కడితే చాలు వందల చానెళ్లు చూడొచ్చు. అందులో న్యూస్, వినోదం, విజ్ఞానం, సంగీతం, ఆటలు, సినిమాలు మొదలైన చానల్స్ వందల్లో ఉన్నాయి. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి సీరియళ్లు, వినోద కార్యక్రమాలు తయారుచేసి సదరు చానెళ్లలో ప్రసారం చేస్తున్నారు. మనకు అంతగా భారమేమీ పడదు. మరి వాళ్లకు నష్టం కాదా అని ఆలోచిస్తే మనం నెలనెలా కట్టే డబ్బు కంటే ఈ చానెళ్లకు ఆదాయాన్నిచ్చేది ఈ ప్రకటనలే. అందుకే వాళ్లు ప్రకటనలలోని అసభ్యతను, అశ్లీలతను గురించి ఎక్కువగా పట్టించుకోరేమో?
భారతదేశంలో స్ర్తిని దేవతగా పూజించే పవిత్ర సంప్రదాయం ఉంది కాని ఈనాడు టీవీలో ప్రసారమవుతున్న 70 శాతం వ్యాపార ప్రకటనలలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. ఆ వస్తువులు మగవారు ఉపయోగించేవైనా, ప్రకటనలలో ఆడవాళ్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. నిజంగా మహిళలు ఈ ఉత్పత్తులను అమ్మడానికి ఒక వ్యక్తిగా పని చేస్తున్నారా లేక వినియోగదారులను ఆకర్షించడానికి ఆయా వస్తువులతోపాటు ఆ వనితలు కూడా ఒక వ్యాపార వస్తువుగా మారారా? ఇది సీరియస్‌గా ఆలోచించాల్సిన అంశమే.
పెద్దపెద్ద కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి ప్రకటనలు తయారుచేస్తాయి. వాటిని చూస్తుంటే ఆ వస్తువు గురించి చెప్తున్నారా లేక అమ్మాయిలను అసభ్యకరంగా చూపిస్తూ జనాలను మాయలో పడేసి మోసం చేస్తున్నారా? ఇక్కడ వినియోగదారులను ఆకర్షించేది సదరు వస్తువా లేక అమ్మాయి అందాల ఆరపోతా? ఈ మధ్య మగవాళ్లు ఉపయోగించే డియొడెరెంట్ ప్రకటన ఎలా ఉంటుంది అంటే అతను ఆ డియోను ఉపయోగించి రోడ్డు పైన వెళుతుంటే అమ్మాయిలంతా వెర్రివాళ్లలా అతన్ని అతుక్కుపోతారు. దీనివల్ల వినియోగదారులకు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు. నిజంగా అమ్మాయిలు అలా అతుక్కుపోతారనే పిచ్చి ఆశతో అబ్బాయిలు ఆ కంపెనీ డియోని కొనేస్తారా? దీనివల్ల సదరు కంపెనీ వాళ్లు చెప్పదలచుకున్నదేమిటో అర్థం కాదు. ఆడవాళ్లు అంత బలహీనులా? వాళ్లకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? మరీ ఇంత వెర్రిగా ప్రవర్తిస్తారా? అంతే కాదు పురుషులు ఉపయోగించే లోదుస్తులు, షేవింగ్ క్రీం, సూట్ బట్టలు, సిగరెట్లు, తలకు వాడే బిల్‌క్రీమ్, మోటార్ సైకిళ్లకు సంబంధించిన ప్రకటనల్లో కూడా అర్ధనగ్నంగా తయారైన అమ్మాయిలు తప్పనిసరిగా ఉండాల్సిందే.
ఇక్కడ ఆకర్షణీయంగా ప్రదర్శించేది ఆయా వస్తువులతోపాటు అమ్మాయిలను కూడా. అంటే వాళ్లు కూడా ఒక ప్రకటన వస్తువే కదా. ఇలా చూపించినప్పుడే ఆ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. అలా పెరిగాయి అని కంపెనీ వాళ్లు అన్నప్పుడు ఈ ప్రకటనలు అందమైన అమ్మాయిలను చూపించి మగవాళ్లలోని కాముకత్వాన్ని రెచ్చగొట్టాలనే దురుద్దేశంతో తయారవుతున్నాయి అని చెప్పవచ్చు. ఇలా చేయక తప్పదు అంటున్నారు కంపెనీ వాళ్లు. కాని ఇక్కడ ప్రకటనల్లో ఆకర్షణీయంగా చూపించేది అమ్మాయిలను కాదు వారి అందమైన శరీరాలను తమ ఉత్పత్తులను అమ్మడానికి ఉపయోగపడే వస్తువుగా మార్చేశారు. పురుషులను అందునా యువతను ఆకర్షించడానికి అమ్మాయిల గ్లామర్ అనే మసాలాను కలపక తప్పదంటున్నారు. పైగా పురుషులు ఈ వస్తువులన్నీ ఉపయోగించేది స్ర్తిలను ఆకర్షించడానికి కదా అంటారు.
ఆడవాళ్లు ఉపయోగించే ప్రకటనలు మరీ అర్థం పర్థం లేకుండా ఉంటున్నాయి. ఉదా.అమ్మాయిలు ఉపయోగించే క్రీం వల్ల వారంలో చర్మం రంగు మారి మరింత కాంతివంతంగా మారుతుందట. అలా మారితే మళ్లీ ఇంకో క్రీం అవసరం ఉంటుందా? జన్మతః వచ్చిన రంగు ఇలా క్రీములు, లోషన్లతో మారుతుందంటే నమ్మశక్యంగా ఉందా అసలు? ఇక జుట్టుకు ఉపయోగించే షాంపూ వల్ల జుట్టు పొడుగ్గా, మరింత దృఢంగా పెరగడం ఎంతవరకు సాధ్యం? ఇటీవల వచ్చిన ఒక షాంపూ ప్రకటన ఇలా ఉంటుంది. ఒక పది మంది మగవాళ్లు ఎంత ప్రయత్నించినా కదల్చలేని ఒక లారీని ఒక యువతి వచ్చి తన పొడుగాటి జుట్టును దానికి కట్టి సునాయాసంగా లాగుతుంది. ఆమె జుట్టు అంత అందంగా దృఢంగా ఉండటానికి గల కారణం ఫలానా షాంపూ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. చుట్టుపక్కలంతా పల్లెటూరిలా ఉంటే ఈ అమ్మాయి మాత్రం చాలా కురచ దుస్తులు ధరించి ఉంటుంది. జుట్టు గురించిన ప్రకటనలో అమ్మాయి శరీర ప్రదర్శన అవసరమా?
ఇలాంటి అర్థం పర్థం లేని, అశ్లీలకరమైన ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. అసలు ఇలాంటి ప్రకటనలు విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాల గురించి ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి. నిజంగా ఇలా అందాల ఆరపోతతో ఆయా ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతున్నాయా? లేదా ఇది కంపెనీల మాయాజాలమా? అందులో నటించే మోడల్స్‌ని విమర్శించి తప్పు పట్టలేం. డబ్బు కోసం తమ శరీరాలను, అందాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు మరి కొందరు. ఈ గ్లామర్ ప్రపంచపు మోజులో చేస్తున్నారు. అదే అవకాశంగా తీసుకుని ఈ విధమైన అభ్యంతరకరమైన ప్రకటనలు తయారు చేస్తున్నారు వివిధ ఉత్పత్తుల తయారీదారులు. ఈ ప్రకటనలు ఎంత వరకు సత్ఫలితాలనిస్తున్నాయి? చేరవలసిన వారికి ఈ ప్రకటనల సారాంశం చేరుతుందా? కుటుంబ సమేతంగా కూర్చుని చూసే విధంగా ఉన్నాయా ఈ ప్రకటనలు అంటే చాలా తక్కువే అని చెప్పొచ్చు. అసభ్యకరమైన ప్రకటనలను నియంత్రించగలిగేది ఎవరు? సదరు టీవీ చానళ్ల వారే ఈ క్రమంలో ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు, నియమాలు పాటిస్తే మంచిదేమో? కాని మాకు ఆదాయాన్నిచ్చే ప్రకటనలను మేమెందుకు వదులుకోవాలి అంటారు వాళ్లు. చివరకు ప్రేక్షకులే ముఖ్యంగా మహిళలు ఎదురుతిరిగి శరీర ప్రదర్శనకు ప్రాముఖ్యాన్ని ఇచ్చే ప్రకటనలను నిలువరించగలరు. లేదంటే ముందు ముందు ఇంకా ఎంతగా దిగజారుతాయో ఈ వ్యాపార ప్రకటనలు?
22 వ్యాఖ్యలు:
మీరన్నట్టు ఈ పరిస్థితి ఇప్పట్లో మారుతుంది అని మాత్రం నమ్మకం లేదు. ఏదో అద్భుతం జరిగితే గాని అది సంభవం కాదు.
అశ్లీల ప్రకటనలు టీవీలో రాకుండా చూడాలంటే ఇలాంటి ప్రకటనలలో నటించే మహిళలలో మార్పు రావాలి. 'అసభ్యకర దృశ్యాలలో నటించం' అంటే ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్ ఏమీచేయలేరు. అంతేకాని ప్రేక్షకులు, మహిళలు ఎదురుతిరిగితే ప్రయోజనం ఉండదు.
ఈ ప్రకటనల్లో నటించే మహిళలు "డబ్బులిస్తే ఏదయినా చేస్తాము" అంటూ డబ్బుకోసం ఎంతకయినా దిగజారిపోవడం నిజంగా బాధాకరం.
అశ్లీల మన్నది కాలగతి రీతిన మారుతూ వస్తోంది, సమాజం దానికి తగ్గట్టు మన జీవనం లో మార్పులు చేర్పులు , విభిన్న సంస్కృతుల మేళనం , globalization , వీటన్నిటి మీదా దాని ప్రభావం , వాటివల్ల దాని వికృతి జరుగుతూ వస్తోందనుకుంటాను. అవి నేటి సో కాల్డ్ సభ్య సమాజానికి ప్రతీకలు కాదంటార ?
మీరు వేసిన ప్రశ్న :ఆడవాళ్లు అంత బలహీనులా? వాళ్లకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? మరీ ఇంత వెర్రిగా ప్రవర్తిస్తారా?
జవాబు: అందులో నటించే మోడల్స్‌ని విమర్శించి తప్పు పట్టలేం.డబ్బు కోసం తమ శరీరాలను, అందాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు మరి కొందరు. ఈ గ్లామర్ ప్రపంచపు మోజులో చేస్తున్నారు. అదే అవకాశంగా తీసుకుని ఈ విధమైన అభ్యంతరకరమైన ప్రకటనలు తయారు చేస్తున్నారు. " మరి ఎవరైన వ్యక్తిత్వం ఉండేవారు గ్లామర్ ప్రపంచపు మోజులో ఇంత వెర్రిగా ప్రవర్తిస్తారా?" పై పోటో చూస్తే ఏడూగురు గొప్ప వ్యక్తిత్వంగల అమ్మాయిలు ఒక అబ్బాయి చుట్టురా ఊరకే చేరారా? మొదట తప్పంతా ఆ అమ్మాయిల తల్లులది, ఈ రంగం లోకి వీరిని ఎలా అనుమతించారు? వారికేమి కూడు,గుడ్డ లేక కొంప జరగక ఇందులోకి ప్రవేశించలేదు కదా!
మీరు వేసిన ప్రశ్న :ఆడవాళ్లు అంత బలహీనులా? వాళ్లకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? మరీ ఇంత వెర్రిగా ప్రవర్తిస్తారా?
జవాబు: అందులో నటించే మోడల్స్‌ని విమర్శించి తప్పు పట్టలేం.డబ్బు కోసం తమ శరీరాలను, అందాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు మరి కొందరు. ఈ గ్లామర్ ప్రపంచపు మోజులో చేస్తున్నారు. అదే అవకాశంగా తీసుకుని ఈ విధమైన అభ్యంతరకరమైన ప్రకటనలు తయారు చేస్తున్నారు. " మరి ఎవరైన వ్యక్తిత్వం ఉండేవారు గ్లామర్ ప్రపంచపు మోజులో ఇంత వెర్రిగా ప్రవర్తిస్తారా?" పై పోటో చూస్తే ఏడూగురు గొప్ప వ్యక్తిత్వంగల అమ్మాయిలు ఒక అబ్బాయి చుట్టురా ఊరకే చేరారా? మొదట తప్పంతా ఆ అమ్మాయిల తల్లులది, ఈ రంగం లోకి వీరిని ఎలా అనుమతించారు? వారికేమి కూడు,గుడ్డ లేక కొంప జరగక ఇందులోకి ప్రవేశించలేదు కదా!
జ్యోతి గారు మంచి వ్యాసం అండీ .
పిల్లలుండగా టి.వి చూడ్డమే భయంగా తయారయ్యింది . ప్రకటనల్లో అసభ్యత రోజురోజుకీ ఎక్కువయిపోతుంది . ఏదో ఆ వస్తువులకి సంబంధించి అయితే మరో మార్గం లేదనుకోవచ్చు కానీ , అస్సలు అవసరమేలేని ప్రకటనల్లోకూడా ఆడవారిని చూపించడం మీద నిషేదం విధించాలి .
nsku chala anandamga undi. telugu blog chaduvuthunanduku.ilane munduku sagipondi
నాగేంద్రగారు , ఈ అమ్మాయిల్లో చాలామంది పెద్ద చదువులు చదివినవారు కాదు. వాళ్లకు ఉద్యోగాలు దొరకడం కష్టం.అందుకే ఈజీగా కాకున్నా కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయని ఇలాటి ప్రకటనలు. ఫ్యాషన్ షోలు చేస్తారు. అంతా ఢబ్బు మయమే.. సినిమా తారలైనా తక్కువ తిన్నారా..డబ్బులు కావాలి కాబట్టి మేము నటిస్తున్నాం అని మోడల్స్, తీస్తున్నాం అని సదరు కంపెనీలు, వేస్తున్నాం అని టీవీ చానెళ్లు అంటున్నాయి. మరి ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి చూస్తున్నాం కాబట్టి అని అనుకోవాలా లేదా అన్నది మనచేతిలో ఉన్నది.
జీడిపప్పుగారు
చాలా రోజులకు దర్శనమిచ్చారు. ఢబ్బులిస్తే చేస్తామని ఈ మహిళలే కాదు. టీవీ నటీనటులు, సినిమా తారలు లేరా. కొందరిది అవసరం కొందరిది ఆడంబరం.. మొత్తం వెరసి అంతా డబ్బులకోసమే తమ అందాలను ప్రదర్శనకు పెడుతున్నారు.
జిలేబీగారు,
మీరు చెప్పినట్టు సో కాల్డ్ సభ్యసమాజానికి ప్రతీక కాని ఇప్పటి సమాజంలో ఎంత శాతం ఈ కేటగరీలో ఉంటారు. ఈ టీవీలు చూసేది మధ్యతరగతి వారే ఎక్కువ కదా. నటించేది కూడా మధ్యతరగతి అమ్మాయిలే..
Unknownగారు
నిజమే ఈ ప్రకటనలో ఇందరమ్మాయిలు ఒక మగాడి చుట్టు చేరింది తమ ఇష్టప్రకారం కాదుగా. అది ప్రకటన తయారుచేసే దర్శకుడి ఆలోచన. ఈ అమ్మాయిలకు తాము చేసే ప్రకటనలగురించి తెలుసుకునే అవసరం కూడా లేదు. చెప్పింది చేయడం ఇచ్చిన డబ్బులు తీసుకోవడం. వాళ్ల తల్లులది తప్పే కాదనను. కాని చాలామందిది అవసరం కూడా అయ్యుండొచ్చు. మధ్యతరగతి నుండి కాస్త పై తరగతికి వెళ్లాలనే చిన్న ఆశ. వాళ్ల చదువులు అంతంత మాత్రమే. చదివిన వారందరికి పెద్ద ఉద్యోగాలు వస్తాయనే గ్యారంటీ లేదు కదా. కనీసం ఇలా ఐనా సంపాదించొచ్చు అని సంతోషిస్తుంటారు. ఈ మోడలింగులో బాగా డబ్బున్నవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు కావలసింది గ్లామర్,గుర్తింపు. ఆడంబరం..
పరిష్కారం ఏమిటో అర్ధం కాదు.
లలిత.. ఎవరు విధించాలి. ప్రేక్షకులు ఎదురుతిరిగితే కాని ఆ ప్రకటనదారులు, టీవీ చానెళ్లవారిలో చలనం రాదేమో. ఆ పని మనం చేయం కదా..
క్రాంతి .. ధన్యవాదాలు
నిజం చెప్పారు జ్యొతి గారు...మరీ మా పిల్లలు
పెద్ద వాళ్ళు అయిన తరువాత వాళ్ళ తొ కలిసి
చూడాలంటె చాలా ఇబ్బందిగా ఉంది
ఇది ప్రకటనలకే పరిమితం కాదుగా. వ్యాపారంలో కొంతమంది డబ్బు చేసికోవడానికి ఇలా స్త్రీలను అసభ్యంగా చూపడం చాలా అసహ్యకరమైన పరిస్థితి. ఇలా బ్లాగుల్లో పత్రికల్లో కాకుండా ఇంకేమైనా చెయ్యాలేమో? నాకు చిన్నప్పట్నుంచి ఒక సందేహం అసలు 'సెన్సార్ బోర్డ్' అనేది ఉంటుందా? ఉంటే వాళ్ళు దేన్ని నియంత్రిస్తున్నారు అని.
జ్యోతిర్మయి..
సెన్సార్ బోర్డా?? అంటే.. ఈరొజు సినిమాల్లో వస్త్రధారణ, పాటలు, డాన్సులు ఎలా ఉంటున్నాయి.. సినిమా అంటే వెళ్లకుండా ఉంటాం. ఇంట్లో టీవి అంటే ప్రతీ సిరియల్ , ప్రోగ్రామ్, వార్తల మధ్యలో ఈ ప్రకటనలు తప్పనిసరి కదా..
జ్యోతి గారూ
"ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?" ముందు అక్కడినుండి సంస్కరణలు మొదలు పెట్టాలి. హీరోయిన్ నడుము మీద కాలు పెట్టి వేసిన డాన్సులు, హీరోయిన్ అందాల్ని ప్రదర్శించే సినిమాలు మనం భరిస్తున్నంత కాలం ఇలాటి ప్రకటనలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇంట్లోనా బయట అని కాదు సమస్య. ఇలాంటి వాటి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనిపిస్తుంది.
అవునండి .... చాలా embarrassing గా ఉంటున్నాయి .... చివరికి క్రికెట్ మ్యాచ్ చూస్తునప్పుడు కూడా ఓవర్ అవ్వగానే అర్జెంటు గా ఛానల్ మార్చ వలసి వస్తోంది. లక్ష్మి అంటోంది, ఇది ఒక విష వలయం గా మారింది, దీని గురుంచి ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉందని.
అవునండి. కానీ, ఇలాంటి ప్రకటనలు మీద కంప్లైంట్ చెయ్యాలి అనుకుంటే ఒక కౌన్సిల్ కూడా ఉంది అని చదివాను. అముల్ మాచో లాంటి ప్రకటనలు వస్తున్నా ఈ రోజుల్లో "టాటా స్టీల్", "హీరో మోటర్ కార్ప్" లాంటి inspiring ప్రకటనలు కూడా వస్తున్నాయి. తప్పంతా ఏ ఒక్కరి మీదో తోయాకుండా, ఎవరి పరిధులలో వాళ్ళు, ఆ వస్తువులు కొనకుండా ఉండడటం లాంటివి చెయ్యడం వల్ల, ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికయినా మారుతుంది అని నా అభిప్రాయం.
జ్యోతిర్మయి
అది చేయొచ్చు.విడుదలైన ప్రతీ చెత్త సినిమాలు చూడకుండా ఉంటే మేలు. నేనైతే ఎప్పుడో మానేసా సినిమాలకోసం ధియేటర్ కి వెళ్లడం. ఇంట్లో చూద్దామంటే పది నిమిషాలు ప్రకటనలు, ఐదు నిముషాల సినిమా.. చిరాకేస్తుంది. దానికన్నా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడ్డం మంచిది..
వెంకట్. లక్ష్మి.. నిజమే మా పిల్లలు పెద్దవాళ్లయ్యారు కాబట్టి పర్లేదు. వాళ్లు చూడరు నేను చూడను. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా కష్టం.. కంప్లెయింట్లు అవి పని చేస్తాయని అనుకోను. ఎక్కడ చూసినా అవినీతి. కనీసం టీవీ చానెళ్ల వారైనా డబ్బులమీద ఆశ వదులుకుని తమ వంతు సమాజసేవగా ఈ అసభ్యకరమైన ప్రకటనల మీద నిషేధం విధిస్తే కొంతవరకు ఫలితం ఉంటుంది. ఎందుకంటే వారు వేయరు కాబట్టి మనం చూడం. చూడట్టేదు. చానెల్ వారు వేయట్లేదని అడ్వర్టయిజింగ్ కంపెనీవాళ్లు మారతారేమో. ఇది నా ఆలోచన. లేదా ప్రభుత్వమే కఠినంగా ఇటువంటి ప్రకటనలను నిషేధించాలి..
అయినా...,జనాలకు ఈ అసభ్యం కూడా అలవాటైపోయి, ఇందులో అసభ్యం ఏముందీ అని అనేస్తున్నారు లెండి. చాలా ఇళ్ళల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే, ఇలాంటి యాడ్స్ వస్తున్నాయని పెద్దలు ఛానెల్ మారుస్తుంటే..., ఇది కూడా అసభ్యమేనా అని పిల్లలు విసుక్కుంటున్నారు. మరీ ఫారిన్ కల్చర్ అయిపోయింది... మనది కూడా. పిల్లలు కూడా స్టేజి షో లలో, రాంప్ షో లలో కురచ దుస్తులూ..., కేట్ వాక్ లూ...
మొదటి రెండు పేరాలు చదివినట్లున్నాన౦డి . అ౦టే అన్నామ౦టారు కాని, ఇప్పుడు మీరు చెప్పిన౦త మ౦ది ఎక్కడ ఉ౦టున్నారు కుటు౦బ౦ లో :) ఇక అసభ్యత అ౦టారా , ఇ౦డియన్ మినర్వా గారి మాటే నాదిను .
లెద౦టే మన బ్లాగోక్తి ఉ౦డనే ఉ౦ది. ఎవరికీ ఇబ్బ౦ది లేన౦త వరకు టి వి ల వాళ్ళు, ప్రకటనలిచ్చే క౦పెనీ లు, అ౦దులో నటి౦చే మోడల్స్ వారి ఇష్టం వచ్చినట్లు గా ఉ౦డొచ్చు హ హ ( ఇక్కడ వ్యాఖ్య వ్రాసిన వారికి ఇబ్బ౦ది లేకు౦టే , ఎవ్వరికి ఇబ్బ౦ది లేదనే అర్ధం చేసికోవాలి మరి (సరదాగా... ))
Post a Comment