పుత్తడి లాంటి ఇత్తడి!
పుత్తడి లాంటి ఇత్తడి
అనాదిగా కాంతలకూ కనకానికీ అవినాభావ సంబంధముంది. బంగారం అంటే ఇష్టపడని అతివలు ఉండరేమో. అందానికే కాకుండా బంగారం మన భారతీయ సంప్రదాయానికీ, ఆచారాలకూ ప్రతీకగా నిలుస్తుంది. ఇంట్లో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఇక ఆడపిల్లలకు పుట్టినప్పటి నుండే బంగారం కొనడం ప్రారంభిస్తారు. పెరుగుతున్న కొద్దీ ఎన్నో రకాలైన ఆభరణాలు తయారుచేయిస్తారు. బంగారం అందానికే కాకుండా అవసరానికి కూడా ఆదుకుంటుందని అందరికీ తెలిసిందే. అందుకే చేతిలో కాస్త డబ్బున్నప్పుడల్లా బంగారాన్ని ఒక ఆస్థిగా కొని పెడుతుంటారు. ఒకప్పుడు విరివిగా కొనే బంగారం నేడు అందనంత ఎత్తుకు ఎగిరిపోతోంది. ఈ రోజు మధ్యతరగతి వారికి బంగారం కొనడానికి అందుబాటులో లేదనే చెప్పవచ్చు. అలా అని నగలు లేకుండా ఉంటారా ఆడవాళ్లు. ఉండగలరా? ఇలాటి వారి కోసమే మార్కెట్లోకి బంగారపు నగలకు ధీటుగా ఏ మాత్రం తీసిపోని రోల్డ్‌గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ నగలు విరివిగా లభిస్తున్నాయి. అవి కూడా అందరికీ అందుబాటైన ధరలో ఆకర్షణీయమైన డిజైన్లలో మగువలను ఆకట్టుకుంటున్నాయి.
పాపిట బిళ్ల నుండి కాలి పట్టీల వరకు వన్ గ్రామ్ నగలు లెక్కలేనన్ని డిజైన్లలో లభిస్తున్నాయి. ఒకప్పుడు మహిళలు బంగారం నగలు మాత్రమే ధరించేవారు. గిల్టు నగలు అంటే చాలా చిన్నచూపు ఉండేది. అవసరమా అనుకునేవారు. ఎంత తక్కువలో ఐనా మెడలో ఒక సన్న చైను, చేతులకు రెండు గాజులు, చెవులకు చిన్న దిద్దులు ఉంటే చాలు అమ్మాయికి. రోజూ వేసుకుంటుంది అనేవాళ్లు. కాని ఈ రోజు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా ఈ వన్‌గ్రాం గోల్డ్ నగలు మాత్రం రోజుకో డిజైన్‌వి వేసుకునేలా విరివిగా, అందుబాటైన ధరల్లో దొరుకుతున్నాయి. ఏదైనా పార్టీకి కాని పెళ్లికి కాని వెళ్లినప్పుడు అక్కడ మహిళలు ఒంటినిండా నగలతో కనిపిస్తే ఆశ్చర్యపోకండి. అందులో సగానికి పైగా ఈ వన్‌గ్రామ్ నగలే అయ్యుండవచ్చు. ఈ నగలు మధ్యతరగతి వారేకాక సంపన్న వర్గాల వారు కూడా నిస్సంకోచంగా ధరిస్తున్నారు. బంగారం కంటే ఈ నగలలోనే ఎక్కువ డిజైన్లు ఉన్నాయేమో అని ఆశ్చర్యపోక తప్పదు. అస్సలు తేడా కనిపెట్టలేము కూడా. వీసమెత్తు బంగారం లేకున్నా ఈ వన్‌గ్రామ్ నగలు వేసుకుని దర్జాగా తిరుగుతున్నారు స్ర్తిలు. వీరి అవసరానికి తగ్గట్టుగానే ఈ నగలమ్మే దుకాణాలు కోకొల్లలుగా ఉన్నాయి. పెళ్లికి కావలసిన దుస్తులు, ఇతర వస్తువులలాగే ఈ నగలను కూడా తమకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకునే అవకాశం కూడా ఉంది.
ఈ మధ్యే ప్రాచుర్యం పొందిన ఈ వన్‌గ్రామ్ గోల్డ్ నగలు హిందీ టీవీ సీరియళ్ల ద్వారా ఉత్తరాది నుండి మనకు పరిచయమయ్యాయి. ఇందులో ఉత్తరాది డిజైనే్ల కాక టెంపుల్ జ్యుయెలరీ, దక్షిణాది సంప్రదాయ డిజైన్లు కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఏది బంగారం నగో, ఏది వన్‌గ్రామ్ నగో తెలీనంతగా ఉంటున్నాయి. అది ఆ ఆభరణం తయారుచేయడంలోని నైపుణ్యమే అని ఒప్పుకోవాల్సిందే. వన్‌గ్రామ్ నగలు రూ.200 నుండి రూ.10 వేల వరకు ధర పలుకుతున్నాయి. అందులో వాడిన రాళ్లు, ముత్యాలు, పగడాలను బట్టి ధర పలుకుతుంది. ఈ నగలను రాగి లేదా వెండితో తయారుచేసే ఒక గ్రాం బంగారు పూత పూస్తారు. ఈ పూత 0.000007 అంగుళాల కన్నా తక్కువ పల్చగా ఉంటుంది. అందుకే నాణ్యతగా మన్నికగా ఉంటాయి.
ఈ మధ్య మీరు హిందీ, తెలుగు సినిమాల్లో గమనించే ఉంటారు. ముఖ్యంగా జోదా అక్బర్, అరుంధతి, నాగవల్లి మొదలైన సినిమాల్లో నటీమణులు చాలా భారీ నగలు ధరించి ఉంటారు. ఒక్కో నగ లక్షల్లో ఉంటుందని అనుకుంటాం. అంత అందమైన డిజైన్ల నగలు మనం కూడా కొనుక్కోవచ్చు అనే ఊహ చేయడానికి భయం వేస్తుంది. కాని అదే డిజైన్ నగలు వన్‌గ్రామ్ గోల్డ్‌లో చాలా తక్కువ అందుబాటైన ధరలో మార్కెట్లో లభిస్తుంది. ఉదా.రాళ్లు పొదిగిన బంగారు జడ రెండు నుండి నాలుగు లక్షలు ఉంటే వన్‌గ్రామ్‌లో రెండు వందల నుండి మూడు వేలల్లో దొరుకుతుంది. వడ్డాణాలు బంగారంతో చేసినవి రాళ్లు పొదిగిన లక్ష్మీదేవి బొమ్మ ఉన్నవి 3 లక్షల నుండి 6 లక్షల్లో ఉంటే వన్‌గ్రామ్ గోల్డ్‌లో అదై డిజైన్‌లో 400 వందల నుండి 1500 రూపాయల్లో లభిస్తుంది. ఇంకా పెళ్లికుమార్తె ధరించే ప్రత్యేకమైన నగల సెట్టు రూ.3వేల నుండి రూ.5 వేల వరకు పలుకుతుంది. తాము ధరించిన చీర, డ్రెస్సుకు మ్యాచింగ్ నగలు ధరించాలని దాదాపు ప్రతీ అమ్మాయికి ఉంటుంది. బంగారం ఎలాగూ అందుబాటులో లేదు. కాని ఈ రోజు కొత్త డ్రెస్సు, చీర కొనగానే దానికి తగిన నగలు కూడా కొనడం సర్వసాధారణమై పోయింది అమ్మాయిలకు. ధర కూడా అందుబాటులో ఉండడంతో ఎవరికీ అభ్యంతరం ఉండటం లేదు. ఈ వన్‌గ్రామ్ గోల్డ్ నగలను జాగ్రత్తగా వాడుకుని దాచుకుంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. దానికి కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు మరి. పార్టీ, పెళ్లికి వెళ్లి వచ్చాక వాటిని తీసి జాగ్రత్తగా భద్రపరచాలి. తేమ తగలకుండా చూసుకుంటే అవి మరింత కాలం మీకు అందాన్నిస్తాయి.
-జ్యోతి వలబోజు
6 వ్యాఖ్యలు:
వన్ గ్రామ్ నగలు ???
never heard of it. what is it?
భాస్కర్. ఇప్పుడు మార్కెట్లో బంగారంలాగే కనిపించే నగలు వస్తున్నాయి. గిల్ట్ కంటే కాస్త మన్నిక ఎక్కువ. వీటికి చాలా పలుచగా బంగారం పూత పూస్తారు. బంగారపు నగలలో ఉన్న డిజైన్లు చాలా ఈ వన్ గ్రామ్ గోల్డ్ నగలలో ఉన్నాయి..
Thanks for the info Jyothy.
బాగుందండీ మీ టపా! అసలు మనకు ఈ మధ్యన ఇన్ని రకాలు వచ్చాయి కాని నాకు తెలిసి దీనిని చిలకలపూడిలో ఎక్కువ చేసేవారు కదూ ఇదివరకు!
మార్కెటింగు వాళ్ళు లేడీస్ మీద చేసినన్ని రిసెర్చ్ ఇంకా దేని మీద చేసి ఉండరానుకుంటాను. అక్షయ తృతీయ లా ఇప్పుడు ఈ వన్ గ్రాం నగలన్న మాట . బంగారం భారత స్త్రీ సంపద ! ఆ తిరువనంతపురం పద్మనాభస్వామి వారు దేవేరి కోసం ఎన్ని నగలు అట్టే పెట్టుకున్నారో అలా మనం అన్న మాట. రాబోయే కాలం లో ఈ బంగారు నగలే మన దేశాన్ని ఆర్ధిక సమస్యల నించి కాపాడ తాయనడం లో సందేహం లేదు.
ఆర్టికల్ బాగుంది జ్యోతి గారు...one gram నగల మీద మీ ఇన్ఫర్మేషన్ బాగుంది..
Post a Comment