Wednesday, November 30, 2011

‘ఆరోజుల‘పై మహిళల్లో చైతన్యం'ఆరోజుల'పై మహిళల్లో చైతన్యం..

భారతదేశం కర్మభూమి. 200 ఏళ్లు విదేశీయుల దాస్యంలో ఉండి ఎన్నో ఏళ్లు పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. క్రమక్రమంగా ఈనాడు భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించింది సామాజికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికపరంగానూ కూడా. ఒకవైపు అంబరాలను అందుకుంటున్న సాంకేతిక విజయాలు, మరోవైపు కనీసం తిండి, బట్టకు కూడా నోచుకోని దుర్భర జీవనం. పట్నాలలోని మురికివాడలు, మారుమూల పల్లెల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ దారిద్య్రంతోపాటు నీటి ఎద్దడి, అపరిశుభ్రతవల్ల ఎందరో మహిళలు తమకు నెల నెలా తప్పనిసరిగా అవసరమయ్యే బట్టముక్క కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.


మన భారతీయ సంస్కృతిలో స్ర్తి తన జీవితంలో 30-35 సంవత్సరాలలో ఎదుర్కొనే నెలసరి గురించి బహిరంగంగా మాట్లాడ్డం చాలా తప్పు, పాపం కూడా. అది ఒక నిషేధిత అంశం అని చెప్పవచ్చు. మనిషికి కావలసింది కూడు, గూడు, నీడ అని అందరూ అంటారు. ఎన్నో సంస్థలు వాటి గురించి ప్రచారం చేస్తాయి, సహాయం చేస్తాయి కాని మహిళలకు క్రమం తప్పకుండా అవసరమైన శుభ్రమైన బట్ట గురించి ఎవ్వరూ ఆలోచన కూడా చేయరు. అసలు కట్టుకోవడానికే గుడ్డలు లేవంటే ఇక దీని గురించి ఎవరు పట్టించుకుంటారు. అది అంత ముఖ్యమా? ఆడాళ్లు వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు అని వదిలేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ తప్పనిసరిగా అనుభవించే ప్రాకృతిక ధర్మం ఇది. దీని గురించి మాట్లాడటానికి నిరక్షరాస్యులైన గ్రామీణ మహిళలే కాదు చదువుకున్న పట్నంలోని స్ర్తిలు కూడా సిగ్గుపడతారు, ఇష్టపడరు. అసలు ఈ విషయం గురించి గట్టిగా అందరిలో మాట్లాడ్డం కూడా తప్పు అనేవారున్నారు. ముఖ్యంగా మగవారిముందు అస్సలు నోరు విప్పరు.


ఆకాశంలో సగం అని చెప్పుకునే మహిళలు ప్రపంచ జనాభాలో కూడా దాదాపు సగం ఉన్నారు. వ్యాపార ప్రకటనల్లో కూడా మహిళలే లక్ష్యంగా ఉన్నారు. కాని వారికి అవసరమైన సానిటరీ నాప్కిన్స్ గురించి ఆలోచించేది ఎంతమంది. ఇప్పుడిప్పుడు వీటి గురించి ప్రకటనలు విరివిగా వస్తున్నాయి. కాని అవి అందరికీ అందుబాటైన ధరలో ఉండవు. పట్టణాల సంగతి వదిలేస్తే గ్రామాల్లోకి వెళితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలామంది స్ర్తిలు, పురుషులు ఈ నెలసరి రక్తస్రావం అనేది ఒక పాపం, అపరిశుభ్రం, అంటరానితనంగా భావిస్తారు. ఈ సమయంలో నాలుగు రోజులు ఇంట్లోకి రాకుండా ఎవరినీ ముట్టుకోకుండా విడిగా ఉండే స్ర్తిలు ఇంకా ఉన్నారు. తమ అవసరానికి వారు అపరిశుభ్రమైన పాత బట్టలు ఉపయోగిస్తారు. అలా చేయటంవల్ల తెలియని వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ కలుగుతాయి అని వారికి తెలీదు. ఆ బట్టలను రోజూ ఉతుక్కుంటారు కాని వాటిని బహిరంగంగా ఆరవేయలేరు. కొన్నిచోట్ల ఉతుక్కోవడం కూడా కష్టమే. ప్రతీ ఇంటికి బావి, కుళాయి ఉండదు. వీధిలో ఉండే చేతి పంపులే వారికి దిక్కు. స్నానానికి నీళ్లు కరవైతే ఇక ఈ బట్టలుతకడానికి నీళ్లెక్కడినుండి తేగలరు? ఇక చాటు అనేది చాలా కష్టం. అందుకనే ఇంట్లో ఎవరికీ కనపడకుండా తలుపు వెనకాలో, గోడ పక్కనో ఆరేసుకుంటారు. అవి పూర్తిగా ఎండవు. తడితడిగా ఉంటాయి. అయినా వాటినే ఉపయోగించక తప్పని పరిస్థితులు. ఒకోసారి కొన్ని ఇళ్ళల్లో ఉండే ఇద్దరు ముగ్గురు స్ర్తిలు ఒకేబట్టను వాడుకుంటారు. ఇంకో దారుణమైన విషయమేమిటంటే కొందరు స్ర్తిలు ఒకే బట్టను సంవత్సరం పైగా ఉపయోగిస్తారు. అది గట్టిగా రాయిలా మారినా అదే దిక్కు. వారికి తప్పదు మరి. దారిద్య్రం మూలంగా వేరే బట్టలు లభించడానికి ఆస్కారం లేదు.


ఇంకా కొన్ని గ్రామాలలో మహిళలు బియ్యం సంచీ ముక్కలు, జనపనార గుడ్డలు, కాగితం, బియ్యం ఊక కూడా ఉపయోగించుకుంటారు. ఇలా చేయడంవల్ల వ్యాధులు సోకి ఆరోగ్యం చెడిపోయి గర్భసంచి కోల్పోయినవారు, ఒకోసారి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. అంతేకాదు మారుమూల గ్రామాలలో ఇప్పటికీ మరుగుదొడ్ల సమస్య కూడా ఉంది. ప్రతీ మనిషికి ఉదయం లేవగానే తీర్చుకోవాల్సిన కాలకృత్యాలు ఉన్నాయి. కాని స్ర్తిలకు ఉదయం వెలుగులో కాకుండా ఊరంతా సద్దుమణిగాక రాత్రివేళలో ఊరవతల తుప్పల్లో, పొదల్లో తమ కాలకృత్యాలు తీర్చుకోవాల్సివస్తుంది. అప్పుడప్పుడు ఆ చీకటిలో విషపురుగులు, పాములబారిన పడక తప్పదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక అపరిశుభ్రత, ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచిస్తారు.


కాని 2004 నుండి ఒక స్వచ్ఛందసంస్థ ‘గూంజ్’ ఈ విషయమై దేశంలోని గ్రామాలు, పట్టణాలలో పర్యటించి మహిళలను కలుసుకుని వారి అవసరాలు, సమస్యల గురించి తెలుసుకుని తమకు సాధ్యమైన సాయం చేస్తున్నారు. తమ సంస్థద్వారా నూలు బట్టలు సేకరించి వాటిని శుభ్రంగా ఉతికి సానిటరీ ప్యాడ్‌లుగా తయారుచేసి సరఫరా చేస్తున్నారు. వీరు నెలకు కనీసం 1,50,000 నుండి 2,00,000 వరకు తయారుచేస్తున్నారు. ఈ పర్యటనలో ఎంతోమంది మహిళలు ఒక పరిశుభ్రమైన బట్టకోసం వారు పడే తిప్పలు, ఈ విషయంలో సరియైన అవగాహన లేక అనారోగ్యం పాలవడం గురించి తెలుసుకుని నిర్ఘాంతపోయారు. సంస్థసభ్యులు ఊరూరా తిరిగి ఈ సానిటరీప్యాడ్స్ ఉపయోగం గురించి, వాటి తయారీ గురించి, ఆరోగ్య సమస్యలగురించి మహిళలకు వివరిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి పునాది వేసిన సంస్థ వ్యవస్థాపకుడు అంశు గుప్తా అంటారు... మహిళలకు ఒక శుభ్రమైన బట్ట అందుబాటులో వారు ఆమె నెలసరి ఒక బాధగా, పాపంగా కాకుండా తమకు మాత్రమే లభించిన ప్రత్యేకమైన ప్రాకృతిక ధర్మంగా భావిస్తారు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఈ సంస్థ వారు పట్టణాలనుండి బట్టలు, స్టేషనరీ గినె్నలు వగైరా వస్తువులను సేకరించి వాటిని గ్రామీణులకు ఉపయుక్తంగా మార్చి పంపిణీ చేస్తున్నారు. ఈనాడు గూంజ్ సంస్థ దేశంలో 21 రాష్ట్రాలలోని గ్రామాల ప్రజలకు 70 టన్నుల వస్తువులను సరఫరా చేస్తుంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను పొందింది. అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో తరచు వరదలు, ప్రకృతి బీభత్సాలు సంభవిస్తుంటాయి. ఇటువంటి సమయంలో బాధితులకు కనీస అవసర వస్తువులను అందరూ అందిస్తారు. కాని స్ర్తిలకు అవసరమైన బట్టను గురించి ఎవరూ ఆలోచించరు. ఛీ అనుకుంటారు కూడా. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎటువంటి చొరవ చూపడంలేదు అంటారు అంశుగుప్తా. ఇటీవల భారత ప్రభుత్వం సానిటరీ నాప్కిన్స్ సబ్సిడీ ధరలకు అందిస్తామని ప్రకటించింది. కాని అది ఎంతవరకు అమలవుతుందో తెలీదు. ఈ సంస్థకు సహాయం చేయదలచినవారు ఈ సైట్లో తగిన వివరాలు పరిశీలించగలరు..http://goonj.org/

4 వ్యాఖ్యలు:

sarma

నమస్కారం

వనజ తాతినేని

జ్యోతి గారు.. మంచి విషయం దృష్టికి తెచ్చారు. శానిటరీ నాప్కిన్స్..ని సబ్సిడీ ధరలకి ..ఇస్తామన్న ప్రభుత్వం మాట ఎప్పుడో మరచింది.తమిళనాడు ప్రభుత్వం స్కూల్స్,ఆఫీసులు,ఇంకా కాలేజీలకు సమీపంలో..శానిటరీ నాప్కిన్స్ ని కేవలం రెండు రెండు రూపాయలకు మాత్రేమే వెండింగ్ మిషన్స్ ద్వారా లభ్యమయ్యే చర్యలు తీసుకుంది. మన రాష్ట్రంలో ఇంకా అలాటి సదుపాయం లేదు. స్త్రీల ఆరోగ్యం గురించి వారికి లభింపజేసే వసతుల గురించి పట్టించుకునే చర్యలు కరువు. . అంత ఎందుకు చెప్పండి. తగినన్ని టాయిలెట్స్ లేకుండా ఉన్నా అవి పరిశుభ్రం గా లేకున్నా కూడా సర్దుకుపోవాల్సిన స్థితుల్లో ..అనారోగ్యం పాలు అవుతుంటారు.స్కూల్స్ లో,కాలేజెస్ లో,ఉద్యోగాలు చేసే మహిళ లకు కార్యాలయాలలో సైతం.. తగిన సౌకర్యాలు ఉండవు. పల్లెలలో సైతం శానిటరీ నాప్కిన్ల వాడకం పట్ల అవగాహన కల్గించాలి. అలాగే పేద మహిళలకి చవకగా.. శానిటరీ నాప్కిన్స్ అందించే ప్రయత్నం చేయడం కూడా..అవసరం.డ్వాక్రా గ్రూప్ ద్వారా.. ఈ నాప్కిన్స్ తయారీ,పంపిణీ.. సులువని నా ఆభిప్రాయం. ..

నైమిష్

జ్యోతి గారు మంచి సమాచారం అందిచినందుకు ధన్యవదాలు..ఆ వెబ్సైట్ అడ్రస్ పోస్టులో తప్పుగా ఇవ్వటం జరిగింది..

http://goonj.org/

Vinay Datta

చాలా సంతోషం. సేవలలో ఇన్ని రకాలున్నాయా అనిపిస్తుంది ఇలాంటివి చదువుతుంటే.

మాధురి.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008