ఆత్మవిశ్వాసంతో సాధికారత సాకారం
ఆత్మవిశ్వాసంతో సాధికారత సాకారం:
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రథమ వార్షికోత్సవం జరగబోతుంది. ఆ సంస్థ సిఇఓగా ఉన్న జ్యోతిరెడ్డి తమ క్లయింట్ల కోసం ఒక సమావేశం ఏర్పాటుచేసింది. ఉద్యోగులందరినీ సమావేశపరచి ఆ కార్యక్రమం బాధ్యతలను ప్రతి ఒక్కరికి అప్పగించింది. సరైన ప్రణాళిక లేకుంటే ఏ పని చేసినా అది విజయం సాధించడం కష్టమని ఆవిడకు బాగా తెలుసు. ఈ కార్యక్రమాన్ని అందరిలా పెద్ద హోటల్‌లో కాకుండా తమ ఆఫీసులోని లాన్‌లోనే ఏర్పాటుచేసింది. సంస్థ మొదలుపెట్టిన తర్వాత కష్టపడి దానిని ఒక స్థాయికి తెచ్చి విజయవంతంగా వార్షికోత్సవం జరుపుకునేటపుడు కూడా ఈ పిసినారితనం ఎందుకనేది అందరూ అనుకున్న మాట. ఇలా చేయడానికి కూడా కారణం ఉంది. ఆస్తులు పెంచడమే కాకుండా సంస్థ తరఫున సహాయ కార్యక్రమాలు ప్రారంభించే పవిత్రమైన ఉద్దేశంలో ఉన్నారావిడ. దానికోసం చాలా డబ్బులు కావాలి. అందుకే తన సంస్థకు సంబంధించిన అన్ని విషయాలలో అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. అన్నీ ప్రణాళికాబద్ధంగా చేయడంవల్ల ఫంక్షన్ బాగా జరిగింది. అందరూ వెళ్లిపోయాక ఆఫీసు లాన్‌లో తిరుగుతుంటే అతిథులు, ఉద్యోగులు తాగి పడేసిన ఖాళీ సీసాల గుట్ట కనిపించింది. వాటిని చూస్తూ అలా నిలబడిపోయింది ఆమె.
ఒక్కసారి గతంలోకి వెళితే....
ఉయ్యాల్లో పసిపాప గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆ తల్లికి తెలుసు ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తోందో? తమ ఆకలికే దిక్కులేదు. పసిబిడ్డకు గుక్కెడు పాలు పట్టలేని బీదరికం. పదవ తరగతి పరీక్షలు కాగానే పెళ్లి... ఏడాది కాకుండానే ఒక పిల్ల... ఆ వెంటనే రెండో సంతానం... 18 ఏళ్ళకే ఇద్దరు బిడ్డలు. వ్యవసాయం కూడా సరిగా సాగడం లేదు. భర్త ఇతర వ్యాపకాల్లో మునిగిపోవడంతో ఏం పండుతుందో, ఎంత చేతికొస్తుందో కూడా తెలియడం లేదు. వ్యవసాయం సరిగ్గా లేక రోజుకు ఐదు రూపాయల కూలికి ఆమె పనిచేసినా ఇంట్లో కష్టంగా ఉంది. పాలడబ్బా కొనాలంటే డబ్బులు తక్కువగా ఉన్నాయి. అపుడు ఇంటి వెనకాల వెళ్లి బావగారు తాగి పడేసిన ఖాళీ సీసాలను ఆమె చూసింది. వాటిని ఒక గోనె సంచీలో వేసి పాత సామాన్లవాడికి ఇచ్చి పది రూపాయలు తీసుకుని తన దగ్గరున్న సొమ్ముతో కలిపి పసిదానికి పాలడబ్బా తీసుకు రావడానికి దుకాణం వైపు వెళ్ళింది. వెనక వినపడుతున్న ఆ పసిబిడ్డ ఏడుపు ఆ నడకను పరుగుగా మార్చి ఎవరూ ఊహించని లక్ష్యం వైపు దారితీశాయి.
వరంగల్ జిల్లా నర్సింహులగూడెం అనే కుగ్రామంలోని పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన జ్యోతిరెడ్డి నేడు అమెరికాలో ఒక కంపెనీని నడిపిస్తూ మంచి వ్యాపారవేత్తగా పేరు పొందింది. వ్యవసాయ కూలీగా రోజుకు 5 రూపాయల దినభత్యంతో పనిచేసిన ఒక గ్రామీణ యువతి నేడు అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓగా ఉంటూ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నదంటే ఎవరికైనా నమ్మబుద్ధి కాదు. కానీ ఇది అక్షరాలా నిజం. దీనికి ప్రత్యక్ష నిదర్శనం అరిజోనాలో ఫీనిక్స్‌లో ఉంటున్న అనిల్‌జ్యోతి.
సైన్యంలో పనిచేసే తండ్రి మన దేశంలో ఎమర్జెన్సీ ఉన్న సమ యంలో ఉద్యోగం వదిలేశాడు. దాంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. నలుగురు పిల్లల్లో ఒకరైన జ్యోతిని తల్లి ఉన్నా కూడా.. అనాథాశ్రమంలో చేర్పించాడు. తల్లి ఉందని చెప్పుకోలేక, అప్పుడప్పుడు చూడడానికి వచ్చే తండ్రిలోనే తల్లిని చూసుకుంటూ అందరికీ దూరంగా 5 నుండి 10వ తరగతి వరకు హాస్టల్లో చదువుకుంది జ్యోతి. వేసవి సెలవుల్లో తన కడుపు నింపుకోవడానికి హాస్టల్ వార్డెన్ ఇంట్లో ఉంటూ అక్కడ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేది. బీదరికం కారణంగా పదో తరగతి పాసు కాగానే జ్యోతికి పెళ్లి చేసేసారు తల్లిదండ్రులు. 18 ఏళ్ళకే ఇద్దరు పిల్లలు. పేదరికం కారణంగా కూలి పనికి వెళ్ళక తప్పలేదు. ఎంత పనిచేసినాకూడా ఆమెలోని తృష్ణ తగ్గలేదు. ఏదో వెలితి.. సంఘర్షణ.. ఇది కాదు జీవితం.. ఇంకా ఏదో చేయాలి. సాధించాలి.. అలా నెహ్రూ యువ కేంద్రంలో వాలంటీర్‌గా చేరి తనతో పనిచేసేవారికి , గ్రామంలోని పెద్దవారికి చదువు చెప్పేది. ఆ తర్వాత తను కూడా చదువుకోవాలని నిర్ణయించుకుని భర్తను, అత్తను ఒప్పించి హన్మకొండకు మకాం మార్చి దూర విద్య ద్వారా డిగ్రీ, బిఇడి పూర్తిచేసి గవర్నమెంటు స్కూల్లో టీచర్‌గా చేరింది. అప్పుడే అమెరికా నుండి వచ్చిన ఒక బంధువువల్ల అక్క డి జీవితం గురించి తెలుసుకుంది జ్యోతి. తన కూతుళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి తను కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంది. కంప్యూటర్ విద్య నేర్చుకుని, పాస్‌పోర్ట్, వీసా కోసం డబ్బులు సమకూర్చుకుని, ఆత్మవిశ్వాసంతో అమెరికా వెళ్లింది. అక్కడ ఆదరిస్తారనుకున్న వ్యక్తులు మొహం చాటేయడం, చేతిలో ఉన్న సొమ్ములు తరిగిపోవడంతో ఒక వీడియో షాపులో చిన్న ఉద్యోగం సంపాదించుకుంది. ఆ తర్వాత వేరొక కంపెనీలో మంచి జీతంతో ఆమెకు ఉద్యోగం దొరికింది. విజటర్స్ వీసా మీద అమెరికా వెళ్లిన జ్యోతి మెక్సికో వెళ్లి హెచ్-1 వీసా సంపాదించడానికి చాలా కష్టాలుపడింది. ఈ అనుభవాలే ఆమెను స్వంతంగా ఒక కంపెనీ ప్రారంభించడానికి ప్రేరేపించాయి. 2000లో అమెరికా వెళ్లిన జ్యోతి ఆ తర్వాత వ్యాపారవేత్తగా మారింది. క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఆమెను అంచెలంచెలుగా విజయపథాన నడిపించాయి. తన కుమార్తెలను మంచి యూనివర్సిటీలో చదివించి పెళ్లిళ్లు చేసింది. అంతటితో ఆమె బాధ్యత తీరిపోలేదు.
జ్యోతి తనకోసం, తన కుటుంబం కోసమే కోట్లు సంపాదించాలని అనుకోలేదు. తన ఆదాయంలో కొంత భాగం సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తూ వచ్చింది. చిన్నప్పటినుండి తాను పడిన కష్టాలను, తనను ప్రోత్సహించినవారిని జ్యోతి ఎప్పుడూ మర్చిపోలేదు. భారత్‌కు వచ్చినపుడల్లా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, బాలికల స్కూళ్లు, కాలేజీలను సందర్శించి చేయూత అవసరమైన వారందరికీ సహాయం చేస్తున్నది. ఎవరిమీదా ఆధారపడకుండా అమ్మాయిలు తమ అస్థిత్వాన్ని తామే నిలుపుకోవాలని, చదువుతో ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కొనేట్టుగా ఉండాలని ఆమె సూచిస్తోంది.
8 వ్యాఖ్యలు:
excellent and inspirational.
మహిళా సాధికారతకు అక్షరవేదం మీ వ్యాసం.
chala atmavisvamto perigindi.....
meevallana naaku aatmavisvasam perigindi....chala spoorty dayakamga undi.....share cheskonnaduku thankyou very much..Himabindu
Of few articles I read so far about Jyothi Reddy garu, this one excellent in content and concept... Thanks for sharing.....
Uma Bharathi
మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
thanks for sharing
Inspiring Women :)
Thanks for sharing such Inspiring story.. :-)
Post a Comment