Wednesday, 7 March 2012

చక్కర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు

ఒక్కోసారి మరక కూడా మంచిదే అనిపిస్తుంది కదా. ఇవాళ ఫేస్ బుక్ లో కొత్తపాళీగారు "చక్కెర కలిపిన తియ్యని పెరుగు" గురించి తెలుసా అని అడిగారు... అంతే.. ఆ పాట యొక్క సాహిత్యం , పాటల లింకులన్ని తవ్వి బయటకు తీసారు.. అది తెలుగు మాట , తెలుగు పాట మీద అభిమానం కాక మరేమిటి??


చక్కర కలిపిన తియ్యని కమ్మని తోడు పెరుగు తెలుగు,
చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల బెడగు
నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు
చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు

హిమగిరి జలనిధి పదముల అమరిన జిలుగు వెలుగు తెలుగు
గణ యతి ప్రాసల రస ధ్వని శాఖల కవితలల్లు పులుగు
నవ నవ పధముల కవితా రధముల సాగిపోవు నెలవు
అలవోకగ అష్టావధానములు సేయు కవుల కొలువు

అల్లసాని అల్లికల జిగిబిగిని అమృతధార తెలుగు
శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు
రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో
రస ధారయై ధ్రువ తారయై మన దేశ భాషలను లెస్సయై
దేవ భాషతో చేలిమిచేసి పలు దేశ దేశముల వాసికెక్కినది

మన అక్షరాల తీరు మల్లెపాదు కుదురు
మన భాష పాల కడలి భావం మధు మురళి
అజంత పదముల అలంకృతం మన భాష అమృత జనితం
భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం

రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

కేదార రాగంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గానం...



విహంగ రాగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం...



4 వ్యాఖ్యలు:

రాజ్ కుమార్

wow..అద్భుతం గా రాశారు జొన్నవిత్తుల గారు.
పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..సేవ్ చేసుకున్నాను.

వసంతం.నెట్

ఇంత చక్కని పాటలని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు :)

sunila

నవ నవ పథముల అనుకుంటా..

Anonymous

నమస్కారం జ్యోతి గారు .. చాల మంచి పాట అండి . ఇవి జొన్నవిత్తుల గారు " తెలుగు శంఖారావం " లో నివి అండి . ఒక వేళ మీకు ఎక్కడయినా దొరికితే కొంచెం " కామధేనువు జున్నుకన్నను కమ్మనయినది తెలుగు రా " అనే పాటను దయచేసి మాతో పంచుకోగలరు . దీని కోసం చాల రోజుల నుండి చూస్తున్నాను కాని ఎక్కడా దొరకలేదు అండి .. ధన్యవాదములతో - కిరణ్

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008