సేవే ధ్యేయం... నృత్యం మార్గం
ప్రవాస భారతీయుల పిల్లల్లో కళల పట్ల ఆసక్తిని పెంచుతూ, సాంస్కృతిక వికాసానికి తనదైన శైలిలో కృషి చేస్తూ ప్రముఖ నృత్యకళాకారిణి ఉమాభారతి ఎందరి నుంచో ప్రశంసలు అందుకుంటున్నారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవన విలువల్ని వ్యాపింపజేయడంలోనే తనకెంతో ఆనందం లభిస్తోందని ఆమె అంటారు. అమెరికాలో ఉంటున్న ఈమె సాధారణ గృహిణిగా కనిపించినా, కళల ప్రస్తావన వస్తే ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారు. తండ్రి ఉద్యోగరీత్యా చెన్నైలో ఉన్నపుడు కొద్ది కాలం సినిమాల్లో పనిచేసినప్పటికీ, వివాహం అనంతరం ఈమె భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. సినిమా నటిగా తన ప్రస్థానం తక్కువ కావడంతో ఆ రంగంలో అంతగా గుర్తింపు రాలేదని బాధపడక, నాట్యరంగంలో సేవలందిస్తునే ఉన్నారు. దివంగత నటుడు ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’లో ప్రేక్షక జనాదరణ పొందిన ‘ఆడవె అందాల సురభామిని’ పాటలో ఊర్వశిగా ఉమాభారతి నటించారు. మేజర్ సత్యనారాయణ, శారద దంపతులకు 1958లో జన్మించిన ఈమె అయిదేళ్ల ప్రాయం నుంచే నృత్యరీతులను అభ్యసించారు. పధ్నాలుగేళ్ల వయసులో హైదరాబాద్‌లో ఆరంగేట్రం చేసి, సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేతుల మీదుగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ బిరుదును అందుకున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రముఖ నృత్య శిక్షకుడు డాక్టర్ వెంపటి చినసత్యం వద్ద నాట్యంలో మెలకువలు నేర్చుకున్నారు. చిన్న వయసులోనే నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘సుడిగుండాలు’ సినిమాలో బాలనటి పాత్రలో మెప్పించారు. ప్రముఖ కవి దాశరథి నవలకు చిత్రరూపమైన ‘చిల్లరదేవుళ్లు’లో కథానాయికగా నటించారు. నటిగా, నర్తకిగా, డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఉమాభారతి సామాజిక సేవా రంగంలోనూ విశేష సేవలందిస్తున్నారు. ఈమె అసలు పేరు ఉమా మహేశ్వరి. అయితే, ‘సుడిగుండాలు’ చిత్రంలో నటించినపుడు ఆ చిత్ర దర్శకుడు ఈమె పేరును ఉమాభారతిగా మార్చారు.
అమెరికాలో స్థిరపడిన అనంతరం ప్రవాస భారతీయుల పిల్లల కోసం సంగీత అకాడమీని ప్రారంభించి, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పదిమందికీ తెలియజేయాలని పరితపిస్తున్నారు. ‘అర్చన ఫైన్ ఆర్ట్సు అకాడమీ’ని స్థాపించి నృత్య తరగతులను నిర్వహిస్తున్నారు. ఏటా వేసవిలో రంగస్థల కళలు, నృత్యం, మేకప్, అలంకరణ తదితర అంశాల్లో ప్రవాస భారతీయుల పిల్లలకు తర్ఫీదునిస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల పిల్లలకు మన కళలను నేర్పించడం అంత సులువు కాదని ఉమాభారతి అంటారు. కేవలం నాట్యం నేర్పడమే తన ఉద్దేశం కాదని, సామాజిక సమస్యలను ఆధారం చేసుకుని వాటి పట్ల పిల్లల్లో కళల ద్వారా అవగాహన కల్పించడం తన ధ్యేయమని ఆమె చెబుతుంటారు. ప్రవాస భారతీయుల పిల్లలు ఎదుర్కొనే సమస్యలపై తన కుమార్తె శిల్పతో కలిసి ‘ఆలయ నాదాలు’ అనే డాక్యుమెంటరీని నిర్మించారు. భారతీయ కళలు, సంస్కృతిని అర్థం చేసుకోవడంలో పిల్లల అవస్థలు, పెద్దలతో ఘర్షణలు వంటి విషయాలను ఈ డాక్యుమెంటరీలో హృద్యంగా చిత్రీకరించారు. వివాహ వ్యవస్థపై అవగాహన కోసం ‘కన్య’ పేరిట డాక్యుమెంటరీ నిర్మించారు. ఆలయ నిర్మాణాలకు నిధులు సేకరించేందుకు కూడా ఈమె సేవలందిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో గణేష్ ఆలయ మండపాన్ని పునర్నిర్మించేందుకు నాట్య ప్రదర్శనలిచ్చి నిధులు సేకరించారు. హైదరాబాద్‌లో విద్యాసంస్థలు, గ్రంథాలయాల నిర్మాణానికి, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా బాధితుల సహాయార్థం నిధులు సేకరించి ఇచ్చారు. నృత్యం, సామాజిక సేవతో పాటు సాహితీరంగంలోనూ కృషి చేస్తున్నారు. ఈమె రచించిన కవితలు, కథలు పలు వెబ్ పత్రికల్లో వచ్చాయి. ఎన్నో అవార్డులు పొందినా, కళాకారిణిగా తన ప్రయాణం ఇంకా సుదీర్ఘమైనదని ఈమె చెబుతుంటారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment