లయ తప్పిన గుండెకు అండగా
అందమైన చిన్న కుటుంబం. భార్యా, భర్త, ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగిపోతున్న సంసారనావ అనుకోకుండా ఒక సుడిగుండంలో చిక్కుకుంది. ఆ సంసారానికి మూలస్తంభమైన ఇంటి ఇల్లాలు ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. దాంతో ఆ కుటుంబమే అతలాకుతలమైంది. ఆస్త్రేలియాలోని మెల్‌బోర్న్ లో ఉంటున్న మారీ భర్త, కొడుకు,కూతురితో సంతోషంగా ఉంటుంది. 2007లో ఒక రోజు కూతురితో ఏదో విషయమై వాగ్యుద్ధం జరిగింది. మరునాడు నిద్ర లేస్తూనే మారీ కుప్ప కూలిపోయింది.. ఆమె క్రమంగా నీలంగా మారిపోవడం చూసాడామె భర్త. వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి అది వచ్చేలోగా CPR పద్ధతితో గుండెను తిరిగి కొట్టుకునేలా చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. సుమారు అరగంట పట్టింది ఆమెలో కదలిక తేవడానికి. హాస్పిటల్ తీసికెళ్ళేలోపు మరో రెండు సార్లు ఆమె గుండె ఆగి, ఆగి మళ్లీ కొట్టుకుంది. హాస్పిటల్‌లో డాక్టర్లు కూడా పదిశాతం మాత్రమే ఆశ ఉందని చెప్పారు. కాని మారీలోని పోరాట పటిమ, బ్రతకాలనే కోరిక గాఢంగా ఉండడమో, దేవుని అనుగ్రహమో ఆరు వారాల తర్వాత మారీ ఇంటికి తిరిగి వచ్చింది కాని ఆమె జీవితం ముందులా లేదు. ఆ తర్వాత ఎన్నో సార్లు సుస్తీ అయింది. దానివల్ల ఆమె కాళ్లు దెబ్బతిన్నాయి . ఊతకర్ర లేకుండా నడవలేకపోయేది. ఇంతకుముందైతే ఎవరి మీదా ఆధారపడకుండా జీవితం సాఫీగా గడిచిపోయేది కాని ఇపుదు ప్రతీదానికి ఒకరిమీద ఆధారపడక తప్పలేదు. రాన్రానూ ఆమె పరిస్థితి దిగజారి చివరికి వీల్ చెయిర్ తప్పనిసరి అయింది..
ఇదంతా ఎందుకు జరిగింది అంటే .. ఎందుకో మరి ఆమె గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. లయబద్ధంగా లబ్ డబ్ అనే గుండె లయ తప్పింది. దీనినే Arrhythmia అంటారు. అంటే లయబద్ధంగా కొట్టుకునే గుండె అతివేగంగానూ, అతి నెమ్మదిగానూ కొట్టుకుంటుంది. దానివల్ల రక్తప్రసరణలో కూడా లొపం ఏర్పడడంవల్ల మిగతా అవయవాలు, నాడీమండలం మొత్తం దెబ్బతింటుంది. ఒక్కోసారి ఇది అంత ప్రమాదకరం కాకపోవచ్చు కూడా అలా అని నిర్లక్ష్యం చేయరానిది. మారీకి కూడా ఇలాగే జరిగింది. ఆమె హృదయపు అస్తవ్యస్త స్పందన వల్ల మారీ శరీరంలోని మిగతా అవయవాలు కూడా దెబ్బతినడం ప్రారంభించాయి. గుండె సక్రమంగా పనిచేయడానికి పేస్ మేకర్ అమర్చారు. కాని ఆమె జ్ఞాపకశక్తి క్షీణించడం మొదలైంది. ఆమె దాదాపు 50 కిలోల బరువు తగ్గిపోయింది.. చర్మసంబంధ వ్యాధులు కూడా మొదలయ్యాయి. కాని డాక్టర్లు కూడా ఈ విషయంలో ఇంకేమీ చేయలేమని చేతులెత్తేసారు. మారీకి వచ్చిన అరుదైన వ్యాధి వంశపారంపర్యంగా వచ్చిందేమో అనుకుంటే ఆమె తలితండ్రులెవరో తెలీదు. ఆమెను చిన్నప్పుడే దత్తత ఇచ్చారు. ఆమె అస్సలు నడవలేకున్నా అదృష్టవశాత్తు తన చేతులను ఉపయోగించుకుని కంప్యూటర్ వాడకం నేర్చుకుంది. ఇప్పుడు ఆ కంప్యూటరే ఆమెకు జీవితంగా మారిపోయింది. కంప్యూటర్లో గేమ్స్ ఆడుతూ, వంటల గురించి చదువుతూ ఉంటుంది. కాని అవి మరునాటికి గుర్తుండవు. కాని ఇలా ఎక్కువ సమయం కంప్యూటర్ మీద గడపడంవల్ల తన జబ్బుకు సంబంధించిన విషయాలమీద ధ్యాస ఉండదని అంటుంది మారీ.
ఇంత బాధలో ఉన్న మారీని ఆమె భర్త పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆమెను దగ్గరుండి చూసుకోవడానికి ఆమె భర్త ట్రెవర్ తన ఉద్యోగం వదిలేసాడు. కదిలితేనే నొప్పితో విలవిలలాడిపోవడం, మతిమరపు కూడా రావడం వల్ల ట్రెవర్ ఆమెను పసిబిడ్డలా చూసుకోక తప్పలేదు. ఆమెకోసం తన జీవనశైలినే మార్చుకున్నాడు. ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. మారీ కోసం ఇంట్లో కూడా చీకటి గదిలో ఉండాలి. దీనివల్ల తాను నష్టపోయిందేమి లేదని, మారీ కోసం నేర్చుకుంటూ ఎన్నో కొత్త కొత్త వంటల ప్రయోగాలు చేసి నైపుణ్యం సాధించానని, తనకు ఇష్టమైన చిత్రలేఖనాన్ని కొనసాగించానన్ని ట్రెవర్ అంటారు. అంతే కాక తన చిత్రాలతో ఒక ప్రదర్శనలో కూడా పాల్గొంటున్నానని చెప్పారు. 28ఏళ్ల సాహచర్యంలో తన సహచరిని ఎలాగున్నా ప్రాణంలా చూసుకుంటానని ట్రెవర్ అంటున్నారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment