Wednesday, 25 April 2012

‘గూగులమ్మ’ తోడుగా.. ‘నెట్టింటి’ వంటలు!




‘గూగులమ్మ’ తోడుగా.. ‘నెట్టింటి’ వంటలు!

నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ , ఇంటర్నెట్ లేని జీవనం ఊహించుకోవడం కూడా కష్టమేమో.  ఇంతటి అద్భుతమైన సాధనాన్ని కనిపెట్టిన మానవుడే నేడు దాని సహాయం లేకుండా రోజు కూడా గడవని స్థితికి చేరుకున్నాడంటే దీని శక్తిని మనం అంచనా వేయగలమా? ఇంతవరకూ మానవుడు ఆవిష్కరించిన మరే యంత్రమూ కంప్యూటర్ చూపినంత ప్రభావాన్ని చూపలేదంటే అతిశయోక్తి కాదు. సాఫ్ట్‌వేర్ కంపెనీలూ, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్లు, కాలేజీల్లోనే కంప్యూటర్ వాడతారు అనుకుంటే పొరబాటే.. అక్కడినుండే మొదలైనా నేడు కంప్యూటర్ నెట్టుతో సహా మన నట్టింట్లోకే వచ్చేసింది. అది చదువుకునే , ఉద్యోగం చేసేవాళ్లకు మాత్రమే ఉపయోగపడడం లేదు. రిటైర్ అయిన వాళ్లు, గృహిణులు కూడా సులువుగా కంప్యూటర్ ఉపయోగించగలుగుతున్నారు. ఎన్నో విషయాలు ఇంట్లో ఉండే నేర్చుకుంటో తమలోని  ఆలోచనా శక్తి, పరిశీలనా శక్తి పెరుగుతోంది. నేడు కంప్యూటర్ ప్రవేశించని రంగమంటూ లేదు. ఉదయం నిద్రలేవగానే చూసే న్యూస్‌పేపరు నుండి విద్యాలయాలు, ఆఫీసులు, పోస్టాఫీసు, రైల్వేస్టేషను ఎక్కడికి వెళ్ళినా మనకు తెలియకుండానే మన పనులు అన్ని కంప్యూటర్ ద్వారా జరుగుచున్నాయి.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ దేశమైనా, ఏ  ప్రాంతమైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఆడవాళ్లైనా, మగవాళ్లైనా అందరికీ కావాల్సింది, ఇష్టమైంది రుచికరమైన భోజనం, వంటకాలు.. ప్రాంతాలు, దేశాల వారిగా ఈ రుచులు మారుతుంటాయి. కాని దేనికదే ప్రత్యేకమైంది అని చెప్పుకోవచ్చు... మామూలుగా పప్పు, కూరలు, వేపుళ్లు చేసుకుంటాం. అప్పుడప్పుడు కొన్ని స్వీట్లు, తినుబండారాలు వగైరా. మరికొన్ని వంటల గురించి తెలుసుకోవాలంటే మార్కెట్లో ఎన్నో వంటల పుస్తకాలు దొరుకుతున్నాయి. టీవీ చానెళ్లలో కూడా ప్రతీ రోజూ మధ్యాహ్నం వంటలప్రోగ్రాములు ప్రసారం అవుతాయి. పైగా పోటీలు లక్షలు, కోట్లలో బహుమతులు. అవి అందరికి లభించవనుకోండి. కాని  ఇప్పుడు ఈ వంటలు అంతర్జాలంలో కూడా విస్తృతంగా రాజ్యమేలుతున్నాయని చెప్పవచ్చు. ఇంట్లో కూర్చునే ఎంతో సులువుగా, కానీ ఖర్చు లేకుండా, తమ మాతృభాషలోనే బ్లాగులు, వెబ్ సైట్లు ప్రారంభించి తమకు తెలిసిన వంటలు ఫోటొలతో సహా వివరంగా రాసుకుంటున్నారు .   ఆ వంటలన్నీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడినుండైనా చూడొచ్చు. అనకాపల్లిలో ఉన్న అరుణ రాసిన బొబ్బట్ల గురించి అమెరికాలో ఉన్న అనుపమ చూసి నేర్చుకుని తయరు చేసుకోవచ్చు.. అలాగే గుజరాతీ స్పెషల్ డోక్లా కూడా ఉప్మా చేసినంత సులువుగా చేయొచ్చు.   ఇంతకు ముందులా అమ్మకు ఫోన్ చేసి ఈ వంట ఎలా చేయాలి?. ఆ మసాలాలో ఏమేం దినుసులు వేయాలి అని అడిగి ఫోన్ బిల్లు పేలిపోయేలా చేసే అవసరం లేదు. అలా కంప్యూటర్ తెరిచి అంతర్జాలంలో కావలసిన వంటకం గురించి గూగులమ్మని అడిగితే ఎన్నో బ్లాగులు, సైట్ల లింకులు దొరుకుతాయి. హాయిగా చదువుకుని చేసుకోవచ్చు. ఇంతకు ముందు వంట రాని అబ్బాయిలు, అమ్మాయిలు, కొత్తగా పెళ్లైన వారు సరియైన తిండి లేక బెంగపడిపోయేవారు. వాళ్లకేమో వంట రాదు. అమ్మ కూడా దగ్గర్లో లేదు. పరాయి ఊరు, పరాయి దేశం. సరుకులు తెచ్చుకుని చేసుకుందామన్నా ఎలా చేయాలో తెలిదు. ఫోన్ చేసి ఎంతసేపని మాట్లాడతాం?. ఎన్ని వంటల పుస్తకాలని కొంటాం అని దిగులుపడేవారు. కాని ఇప్పుడీ అవస్థలు ఉండవు. దిబ్బరొట్టైనా, అరిసెలైనా, రాగి సంకటి ఐనా, సర్వపిండి ఐనా నెట్‌లో సరియైన కొలతలతో, ఫోటోతో సహా వివరాలు లభిస్తున్నాయి.

ఈ బ్లాగులు నిర్వహించడం చాలా సులువు, వెబ్ సైట్లకు మాత్రం కొంచం ఖర్చు అవుతుంది. అందుకే ఈనాడు మన దేశీయులు నిర్వహిస్తున్న వందల బ్లాగులు భారతీయ రుచులను సవివరంగా అందిస్తున్నాయి అది కూడా అందమైన ఫోటోలతో. ఇక ఆ సరుకులు తెచ్చుకుని వండుకోవడమే. తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ, మార్వాడీ,  సింధీ, పంజాబీ,  బెంగాలీ ఇలా ఎన్నో ప్రాంతాల రుచులను సులువుగా నేర్చుకోవచ్చు. టమాటా సాస్ నుండి తందూరీ చికెన్ వరకూ, పాకం ఉండలనుండి పిజ్జాలవరకూ ఎన్నో వంటకాలు అలా నేర్చుకుని చేసుకోవచ్చు. కొన్ని బ్లాగులలో వంటలతో పాటు పోటీలు కూడా పెడుతుంటారు. గెలిచినవాళ్లకు వంటల పుస్తకలు లేదా ఉపయోగకరమైన వస్తువులను బహుమతులుగా పంపిస్తారు.  మరికొన్ని బ్లాగులలో వంటలు ఫోటోలు, వివరణతో మాత్రమే కాక వీడియోలు కూడా తయారు చేసి చూపిస్తున్నారు.  ప్రపంచంలోని అన్ని దేశాల వంటకాలను మీరు ఏ కోర్సు చేయకుండా, ఏ పుస్తకమూ కొనకుండా ఇంట్లో కూర్చునే నేర్చుకోవచ్చు. ఈ బ్లాగులు, సైట్లు నిర్వహించేవారు ఎక్కువగా మహిళలే కావడం విశేషం. ఎంతైనా ఆకలి తెలిసిన అమ్మే కదా అన్నపూర్ణ. ఎంత కాదనుకున్నా రుచికరమైన వంటలు చేయడంలో, నేర్చుకోవడంలో ఆడవాళ్లు  ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.  వంట చేయడంతోపాటు ఎన్నో చిట్కాలు వాళ్ల సొంతం కదా.

సాధారణ మహిళలే కాక సంజీవ్ కపూర్, తరలా దలాల్ లాంటి పాకశాస్త్ర నిపుణులు కూడా వంటకాల సైట్లు నిర్వహిస్తున్నారు. అలాగే వీడియోలు కూడా. ఈ బ్లాగులలో వంటలు మాత్రమే కాక ఆరోగ్యానికి సంబంధించిన వంటకాలు, పళ్లు, కూరగాయల పోషకవిలువలు, పిల్లలకు పెద్దలకు, వివిధ వ్యాధిగ్రస్తులకు ఇవ్వవలసిన ఆహారం వంటి ఎన్నో విషయాలను కూడా ఈ బ్లాగులు, సైట్ల ద్వారా అందిస్తున్నారు. వాహ్ రె వాహ్ అంటూ ఎన్నోరకాల వంటల వీడియోలు మాత్రమే అందించే సైటు ఉంది. కాని దాదాపు ఎక్కువ సైట్లు, బ్లాగులు ఇంగ్లీషులోనే ఉన్నాయి. ప్రాంతీయ బాషల్లో కూడా ఉన్నాయి , ముందు ముందు అవి కూడా పెరగొచ్చు. మన తెలుగులో కూడా రుచికరమైన  వంటలు అందించే బ్లాగులు ఉన్నాయి.  కొంతమంది ఉల్లి, వెల్లుల్లి లేని వంటలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు.. తెలుగు వారి వంటలను ఇంగ్లీషులో అందించే వెబ్ సైట్లు ఎన్నో ఉన్నా  అచ్చమైన తెలుగులో అందించే ఒకే తెలుగు వెబ్ సైట్  షడ్రుచులు.    ఈ వంటల బ్లాగుల గురించి ఎలా తెలుస్తుంది?. ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఏమేం రాసారో ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? అచ్చంగా వంటల బ్లాగులన్నీ ఒక్క చోట చూపించే ఆగ్రిగేటర్ లేదా సంకలిని ఉంది. అదే http://foodworld.redchillies.us/ ..  ఈ బ్లాగులు రాసేవారందరూ ఒకరికొకరు వ్యక్తిగతంగా పరిచయం లేకున్నా వంటల ద్వారా స్నేహితులుగా మారుతున్నారు. పలకరించుకుంటూ తెలిసినవి, తెలియనివి పంచుకుంటారు.  అప్పుడప్పుడు కలుస్తుంటారు కూడా..

ఈ వంటలు బ్లాగుల ద్వారానే కాకుండా ఈనాడు విరివిగా వాడుతున్న ఫేస్‌బుక్ లో కూడా వంటల పేజీలు, గ్రూపులు ఎన్నో ఉన్నాయి. తమ వంటకాలను ఈ పేజీలు, సమూహాల ద్వారా పంచుకుంటూ చర్చించుకుంటారు ఆహార ప్రియులు, పాకశాస్త్ర  ప్రియులు.. అంతే కాక ఆహార సంబంధిత వస్తువులను తయారు చేసే సంస్థలు, గృహోపయోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు కూడా వెబ్ సైట్లు , ఫేస్‌బుక్‌లో పేజీలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు పోటీలు పెట్టీ అందమైన బహుమతులు అందిస్తున్నారు ఈ కంపెనీలవాళ్లు. దీనివలన ఎంతోమందికి ప్రోత్సాహకరంగా ఉంటోంది. వంటలు పంచుకుంటూ, నేర్చుకుంటూ, తెలియనివి తెలుసుకుంటూ, పోటీలలో పాల్గొంటూ తమలోని ఉత్సాహాన్ని, కుతూహలాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇదంతా జరిగేది కానీ ఖర్చు లేకుండా. ప్రతీ ఇంట్లో కంప్యూటర్, నెట్ కనెక్షన్ ఎలాగూ ఉంటుంది. దాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చన్నమాట.
కొన్ని ముఖ్యమైన, ప్రాచుర్యం పొందిన వంటల బ్లాగులు, వెబ్ సైట్లు మీకోసం.. ఇంతకు పదింతల బ్లాగులు, సైట్లు మీకు జాలంలో లభిస్తాయి.. ఓపికగా వెతకాలి.. చదవాలి..చేయాలి... తినిపించాలి. అన్నదాతా సుఖీభవా అనేలా చేయాలి.



10 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni

Good information.. Thank you very much..Madam.

తృష్ణ

బావుందండి ఆర్టికల్.. నా బ్లాగ్ ను కూడా లిస్ట్ లో కలిపినందుకు ధన్యవాదాలు.

లత

చాలా బాగా రాశారండీ,
మీ లిస్ట్ లో నా బ్లాగ్ కూడా చేర్చారు.థాంక్యూ వెరీ మచ్

మరువం ఉష

జ్యోతి, నా వరకు మా మామ్మ, అమ్మల పాళ్ళ లెక్క లేని వంటల ప్రయత్నాల తర్వాత ముందుగా తెలుసుకున్నది విమల గారి కిచెన్ - http://vimalaskitchen.tripod.com/id7.html 2003 మొదలుకుని తరుచూ సరదాకి కూడా చదివేదాన్ని, ఆ శ్రద్దకి, రాసే వివరాలకీను. 2005 లో ఆవిడ స్వర్గస్తులైనప్పుడు చాలా సార్లు బాధ పడ్డాను, కానీ ఇప్పటికీ అటు వెళ్తాను. అనుకోని నీ టపా కారణం గా ఇలా ఆవిడకు నా నివాళీ + కొందరికైనా కొత్త లింకూనూ.

జీవన పయనం - అనికేత్

బ్లాగుల్లోనూ మీ వంటలగోలేనా జ్యోతిగారూ..

జ్యోతి

అనికేత్..
మీరు రోజూ భోజనం చేయరా?? ఐనా నా బ్లాగులో (మాత్రమే ) నేను ఏమైనా రాసుకుంటాను. దానివల్ల మీకు కలిగిన ఇబ్బంది ఏంటి అర్ధం కాదు...

Rao S Lakkaraju

కొందరు ఇంట్లో వంటలు చేసుకోరల్లె ఉంది. మీరు వ్రాయటం మానకండి. మీ "రాగి సంకటి" మా ఇంట్లో వారం వారం ఒక రోజు చేస్తాం.

Anonymous

జ్యోతిగారు,

"రాగి సంకటి" గురించిన వ్యాసం లింక్ ఎక్కడ ఉందో చెప్పగలరా?

జ్యోతి

శ్రీనివాస్ గారు ఇదిగోండి మీరడిగిన లంకె...


http://www.shadruchulu.com/telugu/?p=1894

Anonymous

Jyothy gaaru, Thank you so much. I will try this weekend.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008