Tuesday, 8 May 2012

స్వేచ్ఛ కోసం శతాబ్దాల పోరాటం






             

వరకట్నాలులైంగిక వేధింపులు, ఆడవాళ్లంటూ హద్దులు, ఆంక్షలు .. ఇవన్నీ భారతదేశంలో సర్వసాధారణం. ఇక్కడ పుట్టినందుకు ఇదంతా తప్పదు. అదే అమెరికాలో ఐతేనా?? ఇష్టారాజ్యం. ఎవరూ ఏమనరు? ఇష్టమొచ్చినట్టుగా ఉండొచ్చు. చదువుకోవచ్చు. ఉద్యోగాలు చేయొచ్చు. మహిళలకు అక్కడ ఎటువంటి ఆంక్షలు ఉండవు, అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి..... ఇలా అనుకుంటున్నారా?? అమెరికన్ స్త్రీలను గురించి అసూయ పడుతున్నారా??

కానీ అమెరికన్ స్ర్తిలకు ఈ స్వేచ్ఛ,అవకాశాలు ముందునుంచి లేవు. వాళ్లు కూడా ఎన్నో వివక్షలు, అవమానాలు,అణచివేతలకు లోనయ్యారు. దాదాపు 200 ఏళ్లకు పైబడి అక్కడి మహిళలు పోరాడి స్వేచ్ఛ, అధికారాలను సాధించుకున్నారు. ప్రపంచానికంతటికీ ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం, రారాజు వంటిది అని అనుకుంటున్న అమెరికాలో 1920 వరకు స్ర్తిలకు ఓటు హక్కు అస్సలు లేదంటే నమ్ముతారా? కొనే్నళ్ల క్రితం వరకు అక్కడి స్ర్తిలకు  కూడా సహజమైన, సరైన స్థానం వంటిల్లేనని నిర్థారించారు.



మొగుడికి ఉత్తరం, చాకలిపద్దులు రాసేటంత చదువు ఉంటే చాలు. ఐనా ఆడవాళ్ళు ఎక్కువ చదువుకుని ఏం చేస్తారు? ఉద్యోగాలు చేసి ఊళ్ళేలాలా? ఈ తరహా ఆలోచనలు అమెరికాలోనూ పాతుకుపోయాయి. ఒకవేళ కొందరు స్ర్తిలు ఉద్యోగాలు చేసినా అవి ఎక్కువగా నర్సు, సెక్రటరీ, టీచరు వంటివే ఉండేవి. 1776లో బ్రిటిషు సామ్రాజ్యం నుంచి అమెరికా స్వాతంత్య్రం పొందింది. స్వాతంత్య్రానికి ముందునుంచే అమెరికన్ స్ర్తిలు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు సాగించారు. ఆ రోజుల్లోనే కొందరు ప్రతిభావంతులైన యువతులు తమ పరిస్థితిని మెరుగుపరచుకోవడమే కాకుండా సమాజంలో ఉన్న వివక్షను గుర్తించి వ్యూహాత్మకంగా ఎదుర్కొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చదువు, వృత్తి, ఉద్యోగాలు కష్టసాధ్యంగా ఉన్నా కూడా ప్రతిభావంతులైన స్ర్తిలు ఉద్యమాలు, ఉపన్యాసాలు కొనసాగించారు. కొందరు తండ్రులుకూడా తమ కుమార్తెలను విద్యావంతులుగా, ఆలోచనాపరులుగా తీర్చిదిద్దారు. పత్రికలు, ప్రచురణ సంస్థలుకూడా వీరి రచనలను ప్రచురించి ప్రోత్సహించాయి. అమెరికా దేశ వ్యవస్థాపనకు అతి ముఖ్యమైన స్వాతంత్య్ర సమరంలో సాధారణ మహిళలు కూడా పాల్గొన్నారు. బ్రిటీషు ఉత్పత్తులను బహిష్కరించడంతోపాటు, తమ భర్తలు యుద్ధానికి వెళ్లడంతో సుమారు పదేళ్లపాటు సమర్థవంతంగా వ్యవసాయం చేసి సైన్యానికి తిండికి లోటులేకుండా చేశారు ఆ తరం మహిళలు. అమెరికా చరిత్రలో స్ర్తిలకు వోటు హక్కు కోసం జరిగిన సప్రేజ్ ఉద్యమం చాలా కీలకమైనది, ముఖ్యమైనది అని చెప్పవచ్చు. స్వాతంత్య్ర పోరాటానికి ముందు 1750లో లిడీయా చాపిన్ టాప్ట్ అనే మహిళ స్థానిక రాజకీయాలలో చురకుగా పాల్గొంటూ ఉండేవారు. 18, 19 శతాబ్దంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఎక్కువ అధికారం ఉండేది. అప్పటికి స్ర్తిలకు ఇంకా వోటు హక్కు లేదు. సార్వత్రిక ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో మహిళలకు వోటు హక్కు ఇవ్వడమా? వద్దా? అని తర్జన భర్జనలు జరిగాయి. చివరికి, 1879లో న్యూజెర్సీ అసెంబ్లీ స్ర్తిలకు వోటు హక్కును ఇచ్చింది. కాని ఇరవై ఏళ్ళ తర్వాత రద్దుచేసింది. తమ వోటు హక్కు కోసం మహిళా ఉద్యమకారులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. సుమారు 70 ఏళ్ళపాటు జరిగిన సుదీర్ఘ పోరాటంలో సూసన్ బి.ఏంథొనీ అనే మహిళ కీలక పాత్ర పోషించారు. ఆమె తన రచనలతో, ఉపన్యాసాలతో మహిళా ఉద్యమ కార్యకర్తలనేకాక, సాధారణ పౌరులని, రాజకీయ నాయకులను కూడా ప్రభావితం చేశారు. స్ర్తిల వోటు హక్కు కోసం సూసన్ దాదాపు 45 సంవత్సరాలపాటు దేశమంతా పర్యటిస్తూ ఏడాదికి కనీసం వంద సభల్లో ఉపన్యాసాలు ఇస్తూ అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈ సమయంలో ఎంతోమంది కార్యకర్తలను ప్రభుత్వ ధిక్కార నేరం కింద దీర్ఘకాలం జైళ్ళలో పెట్టారు. చివరికి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1920లో అమెరికన్ కాంగ్రెస్ 19వ రాజ్యాంగ సవరణని ఆమోదించి అమెరికన్ మహిళలకు సార్వత్రిక వోటుహక్కు ఇచ్చింది.


ఇక విద్య, ఉద్యోగాల విషయానికొస్తే అమెరికాలో ఆడపిల్లలకోసం ప్రత్యేకమైన పాఠశాలలు, కళాశాలలు 18వ శతాబ్ది చివరికే ఏర్పడ్డాయి. కాని అవి ఎక్కువగా ఇంటిని చక్కదిద్దుకోవడం, అతిథి మర్యాదలు, పిల్లల పెంపకం వగైరా విషయాలకే పరిమితమై ఉండేవి. తర్వాత 19వ శతాబ్దంలో అనేక విశ్వవిద్యాలయాల్లో మహిళలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి, వైద్య, న్యాయ శాస్త్రాలలో కూడా ప్రవేశం లభించింది. స్ర్తిలు చాలావేగంగా అన్ని రంగాలలో రాణించసాగారు. అంతేకాదు మహిళలు ప్రత్యక్ష రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టారు. 1920లో వోటు హక్కు వచ్చినా, చాలా దశాబ్దాల తర్వాత ఎంతో మంది మహిళలు నగర కౌన్సిలర్లుగా, మేయర్లుగా రాష్ట్ర అసెంబ్లీ సభ్యులుగా ఎన్నికయ్యారు. తొలి తరం అమెరికన్ మహిళలు ప్రారంభించిన పోరాటం కారణంగానే ఈ రోజు అమెరికాలో ఎనిమిది రాష్ట్రాలలో మహిళలు గవర్నర్లుగా, జాతీయ కాంగ్రెస్‌కు ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. న్యూయార్క్ సెనేటర్‌గా ఎన్నికైన తొలి మహిళ హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయినా, నేడు విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


మొదట్లో మహిళలకు అధ్యాపక వృత్తిలో గుర్తింపు లభించినా ఇతర రంగాలలో ప్రవేశం అంత సులువుగా దొరకలేదు. పదేళ్లుగా టీచర్‌గా పనిచేసిన తర్వాత 1849లో ఎలిజబెత్ బ్లాక్వెల్ అనే మహిళ వైద్య కశాళాల నుండి అమెరికాలో తొలి మహిళా డాక్టర్‌గా ఉత్తీర్ణత సాధించారు. అదే సమయంలో కొందరు మహిళలు న్యాయవాద వృత్తిని చేపట్టారు. వివిధ రంగాలలో డాక్టరేట్లు సాధించారు. అమెరికాలో తొలి పరిశ్రమలు ఎక్కువగా వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులకు చెందినవే. సహజంగానే ఆ పరిశ్రమల్లో మహిళా కార్మికులు అధిక సంఖ్యలో ఉండేవారు. వాళ్లకు ఎంత అనుభవమున్నా ఉన్నత హోదాలు ఇచ్చేవారు కాదు. తగిన సదుపాయాలు, సెలవులు కూడా ఉండేవి కావు. వాటికోసం ఆ మహిళలు పోరాటాలు, ఉద్యమాలు చేయక తప్పలేదు. అందులో ప్రముఖురాలు మదర్‌జోన్స్. ఆమె కుటుంబమంతా యెల్లో ఫీవర్ అనే జబ్బుతో మరణించడం, పదేళ్లకుపైగా శ్రమించి అభివృద్ధి చేసుకున్న బట్టల షాపు కాలిపోవడంతో మేరీ జోన్స్ తన గృహసంబంధ, వ్యాపార జీవితాన్ని వదిలివేసి కార్మిక ఉద్యమాలు, సంక్షేమానికి అంకితమయింది. తాను నాయకురాలు అవడమే కాకుండా మిగిలిన స్ర్తిలకు కూడా కార్మిక ఉద్యమాలలో సరియైన స్థానం ఉండాలని కృషి చేసింది. తర్వాతి కాలంలో అమెరికాలో జరిగిన అనేక కార్మిక సంస్కరణలకు మూలం మదర్ జోన్స్‌గా పిలవబడే మేరీ జోన్స్ నడిపించిన ఉద్యమాలే అని అందరూ ఒప్పుకుంటారు. అందుకే ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆమెను ‘అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన స్ర్తీగా అభివర్ణించారు.


ఇక వర్తమానానికి వస్తే 19వ శతాబ్దంలో, 20వ శతాబ్ది ప్రారంభంలో స్ర్తీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి, ఉన్నత విద్యనభ్యసించినా ఒక స్థాయి వచ్చేసరికి వారి ఉద్యోగ ప్రస్థానం ఆగిపోతూ వచ్చింది. ఉద్యోగాలు చేసేవారేకాక చిన్నా, పెద్దా వ్యాపారాలు ప్రారంభించినవారు కూడా అభివృద్ధి చెందారు. కాలక్రమేణా మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పురుషులతో సమానంగా ఉన్నత విద్యలు అభ్యసించి బహుళజాతి వాణిజ్య సంస్థల్లో ఉన్నత పదవులు అధిరోహించారు. వారి ప్రతిభ, సామర్థ్యం అన్నింటా ప్రకాశించింది. ఈ అనూహ్యమైన మార్పు విద్య, ఉద్యోగ, వాణిజ్య రంగాలలోనే కాక రాజకీయాలలో కూడా ప్రముఖంగా కనిపించింది. దాని ఫలితంగానే ఎంతోమంది మహిళలు రాష్ట్ర గవర్నర్లుగా ఎన్నికయ్యారు. హిల్లరి క్లింటన్ దేశాధ్యక్ష పదవికి పోటీపడి ఒబామాకు గట్టి పోటీ ఇచ్చారు. కాని అమెరికాలో కూడా కొందరు ఛాందసవాదులు మాత్రం స్ర్తిలు తమ సాంప్రదాయకమైన కుటుంబ పాత్రను వదిలి ఉద్యోగాలకు ఎగబడుతున్నారని అసూయ పడుతున్నారు. కానీ, తన విలువ తెలుసుకున్న ఏ తల్లయనా ఆత్మవిశ్వాసంతోనే తన పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. తన వృత్తికోసం కుటుంబాన్ని ఎప్పుడూ పణంగా పెట్టదు. రెండు బాధ్యతలనూ సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయాలు సాధిస్తుంది. ఇది మహిళలకున్న ప్రత్యేక లక్షణం. అది భారతదేశంలోనైనా, అభివృద్ధి చెందిన అమెరికా దేశంలోనైనా ఒక్కటే..!

4 వ్యాఖ్యలు:

జలతారు వెన్నెల

ఉద్యోగాలలో ఇక్కడ కూడా కొన్ని positions లో స్త్రీలను చిన్న చూపు చూస్తారు జ్యోతి గారు. Male domination చాలా ఉంటుంది upper level /high level management లో .కాకపోతే బయటికి తేనే పూసిన కత్తుల్లా ఉంటారు. చేసేదంతా చేస్తారు. మంచి పోస్ట్.

శ్యామలీయం

జ్యోతిగారూ, చాలా చోట్ల అంకెలు తప్పుగా వేసారు. దయచేసి మీ యీ మంచి వ్యాసంలోని సంఖ్యలన్నిటినీ ఒక సారి సరిచూసుకోవలసిందిగా విజ్ఞప్తి.

ఉదాః
1. 1976లో బ్రిటీషు సామ్రాజ్యం నుండి అమెరికా స్వాతంత్ర్యం పొందింది.
2. 1920 లో వోటు హక్కు వచ్చినా 10 శతాబ్దం చివరికి ఎంతో మంది ..

శశి కళ

నిజమే ఏమి చెయ్యాలో యెమిటో?

జ్యోతి

శ్యామలీయంగారు ..

తప్పులు చూపినందుకు ధన్యవాదాలు. సరిచేసాను..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008