Wednesday, May 2, 2012

"ఇరుకైన" వంటగది... ఆప్యాయతకు చోటేది??
ప్రతీరోజు ఉదయం ఆరుగంటలనుండి  పదకొండు వరకు ఏ ఇంటి ఇల్లాలిని కూడ పలకరించడానికి సాహసించరాదు. అంత బిజీగా ఉంటారు. భర్త, పిల్లలకోసం టిఫిన్లు పెట్టి, లంచ్ బాక్సులు కట్టి, నీళ్లు వగైరా పెట్టి, నాప్కిన్ మర్చిపోకుండా  పెట్టి వాళ్లను పంపేసాక కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఉద్యోగాలు చేసే వాళ్ల పరిస్ధితి మరీ ఘోరం.  గాలిలో తేలుతున్నట్టుగా ఇంటిపని, వంటపని  ముగించుకుని  ఆదరాబాదరా ఎంగిలిపడి ఆఫీసుకు పరిగెత్తాల్సి వస్తుంది. ఇక ఇంట్లో ఉంటే ఇల్లాల్లు మాత్రం సుఖంగా ఉంటారని కాదు.  భర్త,పిల్లలు వెళ్లిపోయాక కాపీ తాగుతూ కాస్సేపు కూర్చుని ఇల్లు సర్ధడం, పూజ వగైరా చూసుకుంటుంది. తీరిగ్గా మద్యాహ్నం పేపర్ పట్టుకుని కూర్చున్నప్పుడు  పక్కింటి రజని వచ్చింది. "అక్కయ్యా!! వంట అయ్యిందా?"  ఎదురింటి బామ్మగారు కూడా పలకరించారు. "అమ్మాయ్! భోజనం అయిందా?ఇవాళేం చేసావు??ఆడవాళ్లకు ఇలాంటి సంభాషణలు మామూలే కదా. ఎవరినైనా పలకరించినప్పుడు ఆయా సమయాలను బట్టి ముందుగా అడిగేది తిన్నారా? ఇవాళేంటి స్పెషల్? అని. "ఆడవాళ్లకు వంట తప్ప వేరే ముచ్చట్లే ఉండవా??"

వంట చేయడమనేది మన సంస్కృతి స్త్రీకి లభించిన ఒక గొప్ప వరం. అగ్నిముందే నిలబడి వంట చేయడం ఒక యజ్ఞం లాంటిది.. ఇంట్లోవాళ్లందరి ఇష్టాలు, వాళ్ల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని  వంట చేసి వడ్డించి ఆకలి తీర్చడం మాత్రమే  కాక తిన్నవాళ్లు పూర్తిగా  సంతృప్తిపడాలి అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకే తృప్తిగా భోజనం చేసిన తర్వాత  ఎక్కడైనా, ఎవరైనా అనుకోకుండా మనసులో వచ్చే మాట "అన్నదాతా సుఖీభవ"

కాని నిజం చెప్పాలంటే వంట చేయడం ఒక గొప్ప కళ. ఏదో బ్రతకడానికి తినక తప్పదు కాబట్టి వండుకోక తప్పదు అన్నట్టు ఆదరాబాదరా కుక్కర్ పెట్టి, కూరలు తరిగి పోపులో పడేసి వంటింట్లో శతసహస్రావధానం చేసినట్టుగా మారిపోయింది నేటి జీవితం. ఏమంటే  ప్రతీరోజు భార్యాభర్తలు, పిల్లలు కూడా ఒకేవిధంగా   చదువులు,ఉద్యోగాలకు పరిగెత్తక తప్పడంలేదు. అందుకని రెండురోజుల కొకసారికాని, వారంకోసారి కూరలు వండి ఫ్రిజ్ లో పెట్టుకుని రోజుకొకటి మైక్రోవేవ్ లో వేడిచేసుకుని తినేవాళ్లు కూడా ఉన్నారు. ఈ పద్ధతి విదేశాలలో ఉండేవారే చేస్తారు అనుకునేవాళ్లు కాని మన దేశంలో కూడా మొదలైంది ఈ ప్రహసనం. శుభ్రంగా, తాజాగా వంట చేసుకునేవాళ్లు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. సాంకేతిక, మర యంత్రాలతో పాటు పనిచేస్తూ మనిషి జీవితం కూడా యాంత్రికంగా మారిపోతుంది. ఇందులో ఎవరినీ తప్పు పట్టలేం..

కొన్నేళ్ల క్రితం అంటే  నలబై, యాభై  సంవత్సరాల క్రింద   గ్యాసు పొయ్యిలు, కరెంట్ పొయ్యిలు ఎక్కడివి??. కట్టెలు, బొగ్గులు లేదా ఊకతో చేసే పొయ్యిల మీద వంట చేసేవారు. కళాయి పూసిన ఇత్తడి పాత్రలు.(ఇపుడు ఇత్తడి అంటే ఇరవై ఆమడలు పారిపోతున్నారు అతివలు). ఉచితంగా ఇచ్చినా ఇత్తడి గిన్నెలు తీసుకోవట్లేదు ఎవ్వరు కూడా.. ఆప్పటి వంటిల్లు మట్టి గోడలతో ఉండేది. రోజు రాత్రి పడుకునే ముందు వంటిల్లు శుభ్రం చేసి పొయ్యిలో బూడిద అంతా తీసేసి పడుకునేవాళ్లు . ప్రతి గురువారం రాత్రి పేడతో గోడలు అలికి ముగ్గులుపెట్టి శుక్రవారం ప్రత్యేకంగా వంట ప్రారంభించేవాళ్లు.   ఇప్పట్లా భోజనాలు బెడ్ రూముల్లోనో, టీవీ చూస్తూనో తినేవాళ్లు కాదు. వంటింట్లో లేదా మరో పెద్ద గదిలొ  విస్తరాకులు కాని అరిటాకులు వేసి నేలమీదే కుటుంబ సభ్యులందరూ ఒకే వరుసలో కూర్చుని తినేవాళ్లు మగవాళ్లైనా, ఆడవాళ్లైనా. అప్పుడే కష్టసుఖాలు మాట్లాడుకునేది.  ఆరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కాబట్టి పిల్లలు కూడా ఎక్కువగా ఉండేవారు. అందరూ తినడానికి కూర్చుంటే పోట్లాడుకుంటూ సరిగ్గా తినరని అమ్మకాని బామ్మకాని  పెద్ద పల్లెంలో అన్నం పెట్టి వేడి వేడి నెయ్యి వేస్తూ, పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టి పప్పన్నం, చారన్నం, కూరన్నం చివరలో పెరుగన్నం అంటూ ముద్దలు కలిపి పెట్టేది. చిన్నపిల్లలకైతే నోట్లో , పెద్దపిల్లలకైతే చేటిలో పెట్టేది. ఇలా తింటూనే వాళ్లకు ఎన్నో కథలు కూడా చెప్పేది కదా.. పిల్లలు ఆసక్తిగా కధ వింటూ, నాకు నాకు అంటూ పోటీ పడుతూ తినేసి ఆటలకు పరిగెత్తేవాళ్లు .  ఇప్పట్లా పిల్లలు తినడానికి సతాయించేవారు కాదు. అఫ్పుడు ఎవరింట్లోనూ  ఫ్రిజ్ లేదు కాబట్టి రోజు రోజు వండుకోవాల్సిందే. తాజా, నిల్వ పచ్చళ్లు, ఊరగాయలు, అప్పడాలు. పండగలొస్తే తప్పనిసరిగా చేసే పులిహోర, పాయసం.

ప్రతీ పండక్కీ వేర్వేరు రకాల పిండి వంటలు, ప్రసాదాలు. తినేటప్పుడు కూడా కొన్ని నిబంధనలు ఉండేవి. ఏదైనా చెప్పగానే ఎందుకు అని ఎదురు మాట్లాడకుండా పాటించేవాళ్లు అందరూ. భోజనం చేసేటప్పుడు ఎడమచేతిని నేలపై ఉంచడం తప్పు. కంచాన్ని చేతిలో పట్టుకుని తినడం కూడా తప్పని చెప్పేవారు. ఎడమచేత్తో తినే పదార్థాలను తాకడం అనాచారమని చెప్పేవారు పెద్దలు. తినేటప్పుడు తుమ్మొద్దు. తుమ్ము వస్తే పళ్లెం క్రింద కొన్ని నీళ్లుపోయాలి అనేది ఒక నియమం. అలాగే విస్తరాకులో కాని అరిటాకులో కాని వడ్డించేటప్పుడు ప్రతి పదార్థాన్ని ఒక వరుస క్రమంలో వడ్డించాలి. పచ్చడి నుండి మొదలెట్టి చివరగా అన్నం, నెయ్యి వడ్డించేవారు. అన్ని పదార్థాలు వడ్డించేవరకు ఎవ్వరూ భోజనం మొదలెట్టకూడదు.అలాగే భోజనం ఐపోయాక కొంపలు మునిగిపోయినట్టు లేచి వెళ్లిపోకూడదు. మరి కొందరు తినేవరకు కూర్చోవాలి. ఇది ఒక క్రమశిక్షణ లాంటిది.

వంట చేయడం మాత్రమే కాదు వడ్డించడం కూడా చాలా ముఖ్యం. స్థిమితంగా కూర్చుని ఒకరు వడ్డిస్తే భోంచేయడంలో తేడా ఉంటుంది. వడ్డించేవారు ఆప్యాయతతో, ప్రేమతో కావలసినంత వడ్డించడం, మరి కొంచం వేసుకోండి పర్లేదు అని మారు వడ్డన చేయడం ఒక ప్రత్యేకమైన కళ, ఇంత ఆప్యాయంగా వడ్డిస్తే ఎంత మొహమాటస్తుడైన మరికొంచం వడ్డించుకోక తప్పదు. అలాగే వడ్డించేటప్పుడు అవతలి వ్యక్తి ఎవరు, ఏమిటి, అతని హోదా , దర్జా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వడ్డించడం మహాపాపం. ప్రతి వారికి సమానంగా వడ్డించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సహజ సిద్ధంగా ఓర్పు, సున్నితత్వం, లాలన లాంటి లక్షణాలు కలిగిన స్త్రీయే ఇందుకు సమర్ధురాలని తలచే పెద్దలు ఈ మహత్తరమైన బాధ్యతని అప్పగించారేమో. అన్నం ప్రాణుల జీవాధారం. కోటి విద్యలు కూటి కొరకే. ఆనాటినుండి ఈనాటి వరకు ఏ మనిషైనా పొద్దుటినుండి రాత్రి వరకు గానుగెద్దులా కష్టపడేది పట్టెడన్నం కోసమే కదా. ..

ఇదంతా ఓ మధురమైన కలలా ఉందికదా.  కాని సాధ్యం కానిది కాదు కదా. ఎంత బిజీగా ఉన్నా కనీసం కుటుంబ సభ్యులందరూ రోజూ ఒక్కసారన్నా కలిసి , మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తే అది వారిమధ్య అనుబందాన్ని మరింత పెంచుతుంది. ఒకరికొకరు అన్న భావన, ఎవరేం చేస్తున్నారు అన్న సంప్రదింపులు పెరుగుతాయి. ఎవరికి ఆకలైనప్పుడు వాళ్లు కంచంలో అన్నం, కూరలు అన్న పెట్టేసుకుని కంప్యూటర్ ముందో, టీవీ ముందో సెటిల్ ఐపోతున్నారు. కనీసం తాము తినే తిండిని కూడా ఆస్వాదించలేకున్నారు.... పెళ్లిళ్లు, పూజలు వగైరా జరిగినప్పుడు బంతి భోజనాలు తప్పనిసరి. ఎంతమంది వచ్చినా విసుక్కోకుండా అన్ని వంటకాలు ఇష్టపూర్తిగా వడ్డిస్తారు. అడిగి మరీ మారు వడ్డన చేస్తారు. కాని ఈరోజుల్లో ఇంట్లోనే కాదు పెళ్లిల్లు, చిన్న చిన్న పార్టీలలో కూడా వడ్డన జరగడంలేదు. రుచికరమైన, ఖరీదైన వంటకాలు చేయిస్తారు. పెద్ద, పెద్ద టేబుళ్ల మీద అన్నీ అమరుస్తారు. ఇక అతిధులు ప్లేట్లు తీసుకుని లైన్లో నిలబడి మళ్లీ దొరుకుతాయో లేవో అన్నట్టు అన్నం , పప్పు, కూరలు, స్వీట్లు, పెరుగు అన్నీ వడ్డించేసుకుని ఓ పక్కన నిలబడి తినేస్తారు.  దీనివల్ల ఆకలి తీరుతుంది కాని సంతృప్తి కలగదు. ఏదో పెళ్లికొచ్చాం తినాలి కాబట్టి తింటున్నాం అన్నట్టుగా ఉంటుంది అందరి పరిస్ధతి, ఆలోచన కూడా...

3 వ్యాఖ్యలు:

శశి కళ

అవును జ్యోతి గారు ఇప్పుడు పెళ్ళికి వెళ్ళినా ఆ లైన్లో నిలబడి తినలేక వచ్చేస్తున్నాము...వడ్డిస్తే ఇంకా తినాలి అనిపిస్తుంది .

HARIKRISHNA

Chala chakkaga vivarincharandi.Evi prasthutha yanthrika yugapu sathyalu.Naaku chinannati rojulu gurthosthunnai.Eppudu antha maripoyindhi.Prapancheekaranavalla evari brathukulu varidhannatlu thayarayyaru.Vurukula parugula brathukayipoyindhi.Chinnapillalu avva-thathala premanuraaagalu kolpothunnaru.Chivariki thalli dhandrula prema kooda.Eddaru panichesthu pilladini nirlakshyam chesthunnaru.Naaku thelisi maaa bandhuvula intlo jarigina sanghatana okati chepthanu...Thallidhandru liddaru vudhyogam chese vallu dhani valal babu ni choosukovadaniki aaayammanu pettaru.Ekku vaga aaa babu aaa aayammathone vundatam valla aamene amma ani pilusthu ..kanna thallidhandrulante prema lekunda vundetatlu ga maripoyadu.Chethulu kalaka aakulu pattukokunda mundhununche anni vypula nundi biddalanu thagina vidham ga penchali.Good post from you andi............

ఆ.సౌమ్య

>>వంట చేయడమనేది మన సంస్కృతి. స్త్రీకి లభించిన ఒక గొప్ప వరం.<<

అల ఏమీ కాదు లెండి. చాలామంది స్త్రీలు వరం అని అనుకోరు. నెత్తి మీద రుద్దబడిన బాధ్యత అనుకుంటున్నారు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండే కాలంలో వేరు. ఇంట్లోనే ఉంటారు కాబట్టి చేసారనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఇద్దరూ ఉద్యోగస్థులయినప్పుడు వంట వరమనో, సంస్కృతి అనో ఒకరి నెత్తి మీదే రుద్దడం భావ్యం కాదు. వంట, తిండి మనకి జీవితావసరాలు. ఎవరికి ఏది అనువుగా ఉంటుందో అలా చేసుకుంటారు. ఇందులో వరం, సంస్కృతి అనుకోవడానికేమీ లేదు. ఇలా చెప్పి చెప్పి ఉద్యోగం చేసే ఆడవాళ్ళని కూడా ఇంకా వంటింట్లోనే బంధించేస్తున్నారు. వాళ్ళకి మరింత శ్రమ అవుతోంది. బయట ఉద్యోగం, ఇంట్లో వంట కూడాను. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు వంట కూడా కలిసి చేసుకోవడంలోనే ఆనందం ఉంది. అంతే తప్ప ఏ ఒక్కరి నెత్తినో రుద్దవలసిన అవసరం లేదు.

మగవాళ్ళూ వంటలో ఆరితేరినవారే. నలభీములని చెబుతారు కదా. వంటవాళ్లంతా మగవాళ్లే ఉంటారు. కాబట్టి అదేదో వరమో, అదృష్టమో అనుకుని మనకి మనమే కష్టాలు కొనితెచ్చుకోనక్కర్లేదు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008