Saturday, 21 July 2012

'పిల్లచేష్ట' ల్లో... పెద్దలకు జీవిత పాఠాలు

'పిల్లచేష్ట' లలో... పెద్దలకు జీవిత పాఠాలు 

నీవు చిన్నపిల్లవు నీకేం తెలీదు ఊర్కో. చెప్పినట్టు చేయి..

పిల్లలు పిల్లల్లా ఉండాలి .. 

మరీ చిన్న పిల్లాడిలా ప్రవర్తించకు..

ఈ డైలాగులు మనకు నిత్యం వినపడేవే. నిజంగా పిల్లలకు ఏమీ తెలీదా?? వాళ్లకంటూ ఆలోచన, విశ్లేషణా శక్తి ఉండదంటారా?? ఎప్పుడూ పెద్దవాళ్లు చెప్పిందే రైటు. వాళ్లు చెప్పినట్టే పిల్లలు వినాలని ఆంక్షలు పెట్టడం సబబేనా?? 

కాని కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఆ పిల్లలే మనకు పాఠాలు నేర్పే టీచర్లు అని చెప్పవచ్చు. లోకం అంతగా తెలీని, జీవితానుభవం లేని పిల్లలు మనకు పాఠాలు చెప్తారా అని ఆశ్చర్యం కలగొచ్చు. కాని ఇది నిజం.. మనం వయసు పెరుగుతున్న కొద్దీ జీవితాన్ని అలా ఆంగీకరించేస్తాం తప్ప సంపూర్ణంగా అనుభవించం. తినడం, పడుకోవడం. లేవడం, ఉద్యోగానికి వెళ్లడం, సంపాదన, ఖర్చులు... ఇదే జీవితం, కొత్తగా ఏముంటుందిలే అని యాంత్రికంగా జీవితం గడిపేస్తుంటాం. కాని పిల్లలు చూడండి. వాళ్లకు ప్రతీ ఉదయం ఒక కొత్త ఆవిష్కృతి.. ప్రతీరోజూ కొత్తగానే ఉంటుంది వాళ్లకు. ఇంట్లో ఐనా, స్కూలులో ఐనా, ఆటల్లో ఐనా ఎప్పుడూ కొత్తగా ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తుంటారు. నిన్నటి రోజు అనుభవాలు అసలు జ్ఞప్తికి తెచ్చుకోకుండా ఉల్లాసంగా గడిపేస్తుంటారు. పెద్దవాళ్లం మనం వాళ్లనుండి ఎన్నో నేర్చుకోవచ్చు. పుట్టినప్పటినుండి పిల్లల ఎదుగుదలని గమనిస్తూ ఉంటే, ఆ ఎదుగుదలలో వాళ్లకు మనం నేర్పే విషయాలకంటే వాళ్ల నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి. 

పిల్లలు చాలా అమాయకులు. పోట్లాటలు, కోపాలు, అలకలు చాలా తొందరగా మరచిపోతారు. అలాగే తొందరగా క్షమించేస్తారు కూడా. ఉదా... అన్నాచెల్లెలు ఒకే బొమ్మకోసం పోట్లాడుకుంటారు. ఆ పోట్లాటలో బొమ్మను తీసుకుని పరిగెత్తి, క్రిందపడిన చెల్లెలుని చూసి ఆ అన్న బాగైంది అనుకోడు.. అయ్యో అని పరిగెత్తి లేవదీసి చెల్లెలికి ఆ బొమ్మ ఇచ్చేస్తాడు. నిమిషాల్లో ఆ పోట్లాట ప్రేమగా మారిపోతుంది. అది ఒకరు చెప్తే వచ్చిన భావన కాదు. పిల్లల అమాయకపు, నిస్వార్ధపు స్వభావం. అలాగే పిల్లలు తొందరగా సంతోషపడిపోతారు. వాళ్లకు నవ్వడానికి కారణం అక్కరలేదు. సంతోషం కలిగిన వెంటనే మనసారా నవ్వేస్తారు. పెద్దవాళ్ల కంటే ఎక్కువగా నవ్వగలరు పిల్లలు. ఎప్పుడైనా ఈ విషయం గమనించారా??

వాళ్లకు నవ్వడానికి ఎటువంటి హద్దులు, ఆటంకాలు లేవు. మనసులో ఎటువంటి కల్మషం కూడా ఉండదు. ఆరోగ్యం కోసం ఈరోజు ఎంతో మంది బలవంతంగా అవలంభిస్తున్న లాఫింగ్ థెరపీ ని ఆ భగవంతుడు ఈ పిల్లల్లో ఏర్పాటు చేసాడేమో. అందుకే వాళ్లు హాయిగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఎప్పుడైనా, ఎక్కడైనా గట్టిగా నవ్వగలరు. మనమేమో ఎప్పుడూ సమస్యలు, టెన్షన్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. మళ్లీ దానికోసం నవ్వాలి అని నవ్వుతాం తప్ప మనసారా నవ్వలేం....అంతే కాక ఈ పిల్లలున్నారు.. ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. ఒక్కచోట కుదురుగా ఉండరు. దొరికిన, కనిపించిన ప్రతీదాంట్లో ఆనందాన్ని వెతుకుతారు. అది పువ్వైనా, పురుగైనా, బొమ్మైనా, తినే వస్తువైనా సరే.. అలాగే తాము చూసిన వస్తువుల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత, ఉత్సాహం కూడా ఎక్కువే పిల్లలకు. అందుకే చిన్న పిల్లలకు పాము కూడా ఒక ఆటవస్తువే అనుకుంటారు. పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. ఎంతో మంది పెద్దవాళ్లు కెవ్వుమని అరిచి దూరంగా పారిపోయే బొద్దింకలను నవ్వుతూ పట్టుకుంటామని దాని వెనకాల వెళతారు..ఆఖరుకు చక చకా పోతున్న విషకీటకం తేలును చూసి దానివెనకాలే వెళ్లి పట్టుకుందామని ఉరకలేసే గట్టిపిండాలేందరో. ఆ క్రిమి లేదా కీటకం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత తప్ప వాళ్లకు వేరే ఎటువంటి భయముండదు. బురదలో కూడా ఆడుకోవడానికి సంకోచించరు. మనకు అది దుర్గంధభూయిష్టమైన బురదగుంటలా కనిపిస్తుంది కాని పిల్లలకు అది నీటి మడుగు అని మాత్రమే అనుకుంటారు. అందులో ఆడుకుందామని మాత్రమే వారి ఆలోచన. అందులోనే ఆనందం .. ఒకప్పుడు పసిపిల్లలుగా మనమూ అలా ఉన్నవాళ్లమే కాని పెద్దయ్యాక ఎంత మార్పు?? 

మరో విషయం.. పిల్లలకు అందరూ సమానమే . ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. వాళ్లకు రంగు, రూపు, జాతి, కులం , డబ్బు అనే తేడాలుండవు. ఆప్యాయంగా పలకరిస్తే, నవ్వుతూ చేతులు చాస్తే ఎవరితో ఐనా నవ్వుకుంటూ కలిసిపోతారు. స్నేహం చేస్తారు. పెద్దవాళ్లుగా మనం ఎలాంటి స్నేహితులు కావాలో నిర్ణయించుకుంటాం. వాళ్లతోనే తిరుగుతాం, సన్నిహితంగా ఉంటాం. కాని పిల్లలు అలా కాదు. అవతలివాళ్లు ఎలాంటివాళు అనే ఆలోచన లేకుండా జత కట్టేస్తారు. ఈ పిల్లలకు పట్టుదల కూడా ఎక్కువే. ఏదైనా కావాలనుకుంటే అది దక్కేదాకా వదలరు. అది బొమ్మైనా, సైకిల్ ఐనా, ఐస్‌క్రీం ఐనా ఇచ్చేదాకా ఊరుకుంటారా?? అబ్బా! ఏం మొండిపిల్లలని మనమే విసుక్కుంటాం కాని వాళ్లు తగ్గరు.. సైకిల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆడా, మగా అనే తేడా కూడా ఉండదు వాళ్లకు. నేర్చుకోవాలి అంతే.. కాళ్లు అందకున్నా, ఎన్ని సార్లు కింద పడి దెబ్బలు తాకినా సైకిల్ నేర్చుకునేదాకా వదలరు కదా.. మనలో అంత పట్టుదల ఉంటుందంటారా? చిన్న వైఫల్యాలకే కృంగిపోతారు కొందరు. పోరాడే ధైర్యం లేక జీవితాన్నే చాలించాలనుకుంటారు.... ఏడాది నిండని పసిపిల్లలను గమనించారా? ఎంత తొందరగా బోర్లా పడాలి. పాకాలి, ముందుకు జరగాలి, లేచి నిలబడాలి. నడవాలి అని ఆత్రుత పడుతుంటారు. పడతారేమో, దెబ్బలు తాకుతాయేమో అని మనమే భయపడుతుంటాం. కాని ఆ పిల్లలు తమ ప్రయత్నాన్ని ఆపనే ఆపరు. ఈ పిల్లలకు మాట్లాడాలనే తొందర కూడా ఎక్కువే. ఇక నడక, మాటలొస్తే వాళ్లను ఆప తరమా. పెద్దలే పిల్లల వెనకాల పరుగులెత్తాలి. 

ఒకప్పుడు మనమందరమూ ఈ నిష్కల్మషమైన, అమాయకపు పసివాళ్లమే. ఎందుకో ఇపుడు అన్ని మరచి యంత్రాళ్లా మారిపోయాం. అప్పుడప్పుడు ఇలా ఆ బాల్యపు లోకానికి వెళ్లిపోతే ఈ యాంత్రికత తగ్గిపోతుందేమో. ఆ ఉత్సాహాన్ని, నవ్వును, పట్టుదలని మనం కూడా పొందగలమేమో..

Tuesday, 17 July 2012

తెలుగువారి వేదిక - తెలుగువన్



వృత్తి ప్రవృత్తి, చదువులు, వ్యాపారాల మూలంగా ఉన్న ఊరిని వదిలి పొరుగు రాష్ట్రాలు, ఖండాంతరాలు దాటి పోక తప్పదు ఎవరికైనా.. అలా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారు తమ నివాసం ఏర్పరుచుకున్నారు. ఎంత దూరం వెళ్లినా మాతృభాషాభిమానం , పండగలు, పూజలు వగైరా వదులుకోలేరు. విదేశీ సంస్కృతిలో పూర్తిగా ఇమడలేక, భారతీయ సంస్కృతికి దూరం కాలేక తల్లడిల్లిపోయే తెలుగువారు ఎంతో మంది ఉన్నారు. తనవారిని, ఊరిని,అందరినీ వదిలి విదేశాలలో ఉన్నప్పుడు ఏకాకులుగా, దిగాలుగా ఉంటారు.. పండగలు, సినిమాలు, రేడియో, జ్యోతిష్యం, వార్తలు మొదలైనవెన్నింటినో తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కోసం పన్నెండేళ్ల క్రింద ఒక అద్భుతమైన వేదిక ఏర్పాటు చేసారు కంఠమనేని రవిశంకర్. అదే తెలుగువన్. తెలుగువాళ్లం ఎక్కడున్నా ఎప్పుటికి నంబర్ వన్ అని చాటి చెప్పేదే ఈ తెలుగువన్.


స్వతహాగా సాఫ్ట్‌వేర్ నిపుణుడైన రవిశంకర్ తన ఉద్యోగాన్ని వదిలి  2000 లో తెలుగువన్ అనే సైట్ మొదలుపెట్టారు. తెలుగువారందరికోసం ఇందులో ఎన్నో విభాగాలలో ఎంతో అమూల్యమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. వనితలకోసం
ఆరోగ్యం, ఫాషన్, వంటలు, పిల్లల పెంపకం, అందం అలంకరణ మొదలైన విషయాలెన్నో వివరంగా చర్చించబడ్డాయి. తనవారికి దూరంగా భర్తతో పరాయిదేశంలో నివసిస్తూ పిల్లలు, వంటలు, ఆరోగ్య విషయాలలోకలిగే ఎన్నో సందేహాలు, అవసరాలకు ఎవరిని అడగాలో తెలీక, ప్రతీ సారి  ఇండియాకు  ఫోన్ చేయలేక బాధపడే మహిళలకు ఈ విభాగం ఎంతో ఉపయోగపడుతుంది. దేశం కాని దేశంలో ఉన్నప్పుడు మన తెలుగు పండగలు, పర్వదినాల గురించి తెలుసుకోవడానికి తెలుగువన్ లో ఒక విభాగంలో పంచాంగం కూడా ఉంది . ఈ విభాగంలో తెలుగు కాలెండర్, పంచాంగ వివరాలు, తిథి వార నక్షత్ర ఫలాలు. అవసరమైన వారికి నామ మాత్రపు రుసుముతో ప్రత్యేకంగా వ్యక్తిగత జ్యోతిష్య ఫలితాలు కూడా అందిస్తారు.

భక్తి లో తెలుగు వారి పండగల గురించిన వివరాలు, పురాణగాధలు, పుణ్యక్షేత్రాల గురించిన సమగ్రమైన వ్యాసాలు, వివిధ దేవతల స్తోత్రమాలికలు, పూజా వివరాలు మొదలైన అంశాలెన్నో పొందుపరిచారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, తెలుగువారు తమ పిల్లలకు సంగీతం, నాట్యం అన్నమయ్య కీర్తనలు మొదలైనవి తెలుగువన్ ద్వారా నేర్పించవచ్చు.. దీనివల్ల తాము తెలుగుదేశానికి, తెలుగువారికి, తెలుగు సంస్కృతికి, బాషకు దూరమవుతున్నాము, తమ ఉనికిని కోల్పోతున్నామన్న అసంతృప్తి వారికి ఉండదు. భారతీయ సంస్కృతిని తమ పిల్లలకు కూడా అందిస్తున్నామన్న తృప్తి కలుగుతుంది.

అంతే కాదు ప్రతీరోజు ప్రాంతీయ, జాతీయ వార్తా విశేషాలు, పాత, కొత్తసినిమా విశేషాలు కూడా ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయి.  దీనివల్ల తెలుగుదేశానికి దూరంగా ఉన్నా ఇక్కడ జరిగే ప్రతీ విశేషం వారు తెలుసుకోగలుగుతారు. ఇక్కడినుండి విదేశాలకు వెళ్లినవారు మనలా బయట తిరగలేక, తలుపులేసుకుని ఇంట్లోనే మొహాలు చూసుకుంటూ ఖైదీలుగా ఉండే అవసరం లేదు. ఎంచక్కా ఈ తెలుగువన్ పోర్టల్ లో తమకు నచ్చిన కార్యక్రమాలు చూస్తూ  సమయాన్ని ఇట్టే గడిపేయొచ్చు. అంతేకాదు తెలుగువన్ లో  వేల తెలుగు సినిమాలు చూసే సదుపాయం కూడా ఉంది. ఇంట్లో కూర్చునే ఉచితంగా తమకు నచ్చిన పాత కొత్త సినిమాలు చూసుకోవచ్చు.. సాహిత్యాభిలాష ఉన్నవాళ్లకు కూడా ఈ సైట్లో గ్రంధాలు, కావ్యాలు, శ్రీ శ్రీ, శరత్, తిలక్ మొదలైనవారి రచనలు, సాక్షి వ్యాసాలు  కూడా ఉన్నాయి.  హాస్యాన్ని కోరుకునేవారికోసం హాస్యభరితమైన వీడియోలు, సినిమాలు, నాటికలు, హాస్య నటీనటుల సీన్‌లు, హాస్య రచనలు కూడా అందుబాటులో ఉంచారు .. ఎవరికి వారు తమకు నచ్చిన రచనలు, పాటలు, సినిమాలు, ఏవైనా చూడగలిగే అవకాశం ఈ తెలుగువన్‌లో ఉంది.

తెలుగువన్ వారు పిల్లలకోసం ప్రత్యేకంగా కిడ్స్ వన్ నిర్వహిస్తున్నారు. ఇందులో మాతృదేశాన్ని వదిలి విదేశాలలో ఉన్నవారి పిల్లలకు తెలుగుని మరచిపోకుండా ఉండాలని వాళ్లకు నేర్పించడానికి తెలుగు పాఠాలు పొందుపరిచారు. అందమైన బొమ్మలతో, ఇంగ్లీషు, తెలుగులో రాసి వినిపించే తెలుగు పాఠాలు పిల్లలందరికి చాలా సులువుగా అర్ధమయ్యేలా ఉన్నాయి. అంతేకాక జాతీయ నాయకులు, పురాణగాధలు, పద్యాలు, పిల్లల కథలు, పంచతంత్ర కధలు మొదలైనవెన్నో ఇందులో పొందుపరిచారు. ఇవి తెలుగు, హిందీ, తమిళ బాషలలో లభ్యమయ్యే ఈ పాఠాలు  క్లాసు పాఠాలలా కాకుండా ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా తయారు చేసారు.

విదేశాలలో ఉన్న మీ పిల్లలకు, బంధువులకు, స్నేహితులకు బహుమతులుపంపాలనుకుంటున్నారా? ఇక్కడినుండి వెళ్లేవాళ్లు లేరు, ఎలా మరి??   బట్టలు, నగలు, వెండి సామాను, పర్సులు, పుట్టినరోజు కేకులు, వగైరా ఎన్నో బహుమతులు తెలుగువన్ ద్వారా ఆర్డర్ చేసి వివరాలు అందించి తగిన రుసుము చెల్లిస్తే చాలు ఆ బహుమతులు విదేశాలలో ఉన్నవారికి మీరు కోరిన సమయానికే చేరిపోతాయి. అలాగే శుభాకాంక్షలు, బహుమతులు అక్కడినుండి పంపించగలిగే వీలు కల్పించారు.. అమెరికాలో కాని, చైనాలోకాని, జపాన్, ఆఫ్రికాలో ఉన్నా ఇండియా, హైదరాబాదులోని ప్రముఖ దుకాణాల నుండి షాపింగ్ చేసి ఆ వస్తువులు తమ దగ్గరికే తెప్పించుకోవచ్చు ఈ సైట్ ద్వారా..


Sunday, 15 July 2012

తొలకరిలో చిన్నారి చిందులు

రాజ్ కుమార్ తీసిన ఈ చిన్నారి ఫోటో చూడగానే నా మదిలో కదిలిన భావాలు..

మృగశిర దాటగానే తలుపు తట్టే వాన
ఎందుకోమరి అలిగి ,రానని మారాం చేస్తోంది..
ఐనా  మనసుండబట్టలేక
అప్పడప్పుడు కళ్లాపి జల్లిపోతోంది..

సూరయ్య ఆగ్రహానికి వేడెక్కిన నేలతల్లిపై
జాగ్రత్తగా తప్పటడుగులు వేస్తోంది
మట్టిజాడ కానరాక సిమెంట్ రోడ్లు, డాబాలపై
తధిగినతోం అంటూ తబలావాయిస్తోంది.

అమ్మ వద్దంటున్నా, నాన్న వారిస్తున్నా
చిన్నది మాత్రం ఆ జల్లులోకి ఉరికింది
ఆ చిన్నదాన్ని చూసిన వాన కూడా
నేనేం తక్కువా అంటూ అల్లరి చేసింది...

ఒక చినుకు తలపై పూలజడ కాగా
ఒక చినుకు పాపిటబిళ్లగా అమరింది
ఒక చినుకు ముక్కెరై మెరుపులీనగా
ఒక చినుకు కంటి కాటుకై కూర్చుంది..
ఒక చినుకు చెవులకు లోలాకుగా వ్రేలాడగా
ఒక చినుకు పెదవిని ముద్దాడింది
ఒక చినుకు మెడలో కాసులపేరు కాగా
ఒక చినుకు నడుముకు వడ్డాణమై కూర్చుంది
ఒక చినుకు చేతులకు కంకణమైపోగా
ఒక చినుకు కాలికి పట్టీలా  జారిపోయింది..

ఎంత అల్లరిదమ్మ ఈ వాన?
చేయి చేయి కలిపి ఆటలాడింది
మాటలాడనీక ఒళ్లంతా తడిపేసింది.. 
చిన్నదాన్ని చూడగానే ప్రేమగా కావలించుకుంది



Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008