Sunday, 15 July 2012

తొలకరిలో చిన్నారి చిందులు

రాజ్ కుమార్ తీసిన ఈ చిన్నారి ఫోటో చూడగానే నా మదిలో కదిలిన భావాలు..

మృగశిర దాటగానే తలుపు తట్టే వాన
ఎందుకోమరి అలిగి ,రానని మారాం చేస్తోంది..
ఐనా  మనసుండబట్టలేక
అప్పడప్పుడు కళ్లాపి జల్లిపోతోంది..

సూరయ్య ఆగ్రహానికి వేడెక్కిన నేలతల్లిపై
జాగ్రత్తగా తప్పటడుగులు వేస్తోంది
మట్టిజాడ కానరాక సిమెంట్ రోడ్లు, డాబాలపై
తధిగినతోం అంటూ తబలావాయిస్తోంది.

అమ్మ వద్దంటున్నా, నాన్న వారిస్తున్నా
చిన్నది మాత్రం ఆ జల్లులోకి ఉరికింది
ఆ చిన్నదాన్ని చూసిన వాన కూడా
నేనేం తక్కువా అంటూ అల్లరి చేసింది...

ఒక చినుకు తలపై పూలజడ కాగా
ఒక చినుకు పాపిటబిళ్లగా అమరింది
ఒక చినుకు ముక్కెరై మెరుపులీనగా
ఒక చినుకు కంటి కాటుకై కూర్చుంది..
ఒక చినుకు చెవులకు లోలాకుగా వ్రేలాడగా
ఒక చినుకు పెదవిని ముద్దాడింది
ఒక చినుకు మెడలో కాసులపేరు కాగా
ఒక చినుకు నడుముకు వడ్డాణమై కూర్చుంది
ఒక చినుకు చేతులకు కంకణమైపోగా
ఒక చినుకు కాలికి పట్టీలా  జారిపోయింది..

ఎంత అల్లరిదమ్మ ఈ వాన?
చేయి చేయి కలిపి ఆటలాడింది
మాటలాడనీక ఒళ్లంతా తడిపేసింది.. 
చిన్నదాన్ని చూడగానే ప్రేమగా కావలించుకుంది



10 వ్యాఖ్యలు:

Padmarpita

వావ్....
తొలకరిలో చిన్నారి చిందులు
మీ కవితలో భలే పసందులు
అందుకోండి అభినందనలు....

రాజ్ కుమార్

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్... నాకు ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వాన పాట గుర్తొచ్చిందండీ..
బాగుందీ ;) నేను తీసిన ఫోటో ఇలా కవితలు రాయిస్తుందా? సూపరు ;) ;)

భాస్కర్ కె

chakkaga undandi, kavitha, photo kooda.

సి.ఉమాదేవి

కవితాచినుకులు కురిపించారు.చిత్రం బాగుంది.

Sai

చాలా చక్కగా వర్ణించారు అండీ... సూపర్...

సీత

వావ్...మీ కవిత లో మేంఉ తడిసాం గా...!!:)

Kottapali

NICE!

శ్రీ

ఒక చినుకు తలపై పూలజడ కాగా
ఒక చినుకు పాపిటబిళ్లగా అమరింది
ఒక చినుకు చేతులకు కంకణమైపోగా
ఒక చినుకు కాలికి పట్టీలా జారిపోయింది.....
చాలా బాగుంది...జ్యోతి గారూ!
@శ్రీ

జలతారు వెన్నెల

భలే బాగుంది మీ కవిత!

జాన్‌హైడ్ కనుమూరి

so cute jyothi gaaru
and thanks

taken for Vaana - collection from online

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008