Tuesday, August 14, 2012

ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావ్?


ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావ్?


రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికొచ్చాడు రమేష్. ఆ సమయానికి నిశ్శబ్దంగా ఉండే ఇల్లు గోలగోలగా ఉంది. పిల్లలు స్కూలు డ్రెస్‌లు కూడా విప్పకుండా హాల్లో టీవీ చూస్తున్నారు. పెద్దాడు టీవీలో క్రికెట్ చూస్తున్నాడు. చిన్నది కార్టూన్స్ చూస్తానంటూ వాడి చేతిలో రిమోట్ లాక్కోవాలని చూస్తోంది. స్కూలు బాగులు, బూట్లు, సాక్సులు అటూ, ఇటూ గిరాటేసి ఉన్నాయి.


‘రజనీ..’ అని భార్యను పిలుస్తూ కిచెన్‌లోకి వెళ్లాడు. కిచెన్ కూడా యుద్ధం జరిగినట్టుగా బీభత్సంగా ఉంది. పనిమనిషి కడిగి పెట్టిన గినె్నలు స్టాండులో అలాగే ఉన్నాయి. జంతికలు, కారప్పూస డబ్బాలు పొయ్యి పక్కన మూతలు తీసి ఉన్నాయి. కిచెన్ అరుగుమీదా, కిందా కొన్ని పడున్నాయి. అసలు ఇల్లంతా ఇలా ఎందుకుంది? అనుకుంటూ అయోమయంగా బెడ్‌రూంలోకి వెళ్ళాడు భార్యను పిలుస్తూ. అక్కడి దృశ్యం చూశాక అతనిలో కోపం పెరిగిపోయింది. మంచం మీద దుప్పట్లు మడత పెట్టకుండా అలాగే ఉన్నాయి. సైడ్ టేబుల్ దగ్గర తాగి పెట్టిన కాఫీ కప్పుమీద ఈగలు ముసిరి ఉన్నాయి. విడిచిన బట్టలు కుర్చీ మీద పడున్నాయి. ఒక్క క్షణం.. అసలిది రోజూ చూసే తనిల్లేనా? అని సందేహపడ్డాడు.


ఆఫీసు నుంచి వచ్చే సరికి అద్దంలా నీట్‌గా ఉండే ఇల్లు ఇవాళ ఇలా ఎందుకయ్యింది? రజనీ ఇంట్లో లేదా? ఇల్లు సర్దకుండా, పిల్లలను వదిలేసి ఎక్కడికి వెళ్లింది? అనుకుంటూ గట్టిగా అరిచాడు ‘రజనీ’ అంటూ.

పక్కనే బాల్కనీ నుండి వచ్చింది అతని భార్య ఏమిటీ అంటూ..

‘‘ఏంటి.. ఇది ఇల్లేనా? ఏం చేస్తున్నావ్?’’

‘‘మీరు రోజూ అంటారుగా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావని.. ఈ రోజు ఏమీ చేయలేదు’’ అంది ప్రశాంతంగా..
ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్..?- అంటూ మళ్లీ భర్త ఆగ్రహం

... ఇలాంటి మాటలు వినపడని ఇల్లు ఉండదేమో? ఆడవాళ్ళు అందునా ఉద్యోగం చేయని, ఇంట్లోనే ఉండే గృహిణులను ఉద్దేశించి ఈ మాట అలవాటైపోయింది. ఎంత అలవాటైనా కూడా ఒకోసారి కోపమొస్తుంది. అసలు ఇంట్లో ఉండే ఇల్లాల్లు చేసే పని ఒక రకానికి, ఒక నిర్ణీత సమయానికి పరిమితమై ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇరవై నాలుగ్గంటలూ అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి అన్నీ సమకూర్చాలి. ఐనా కూడా గృహిణుల శ్రమకు గుర్తింపు లేదనే చెప్పవచ్చు. అసలు ఇంట్లో ఇల్లాలు చేసే పని, చేస్తే చేసినట్టు కనిపించదు. చెయ్యకపోతే రోజు గడవదు. ఐనా కూడా గుర్తింపు ఉండదు. ఎవరూ అయ్యో అనరు. ఉద్యోగాలు చేసే ఆడవారికి తాము చేసే పని నిర్దిష్టమై ఉంటుంది. వాళ్లు అంతవరకే పని చేస్తారు. కానీ గృహిణులు మాత్రం లేని పనిని వెతుక్కుని మరీ పూర్తి చేస్తారు. ఇంకా సమయం మిగిలితే కుటు,్ల అల్లికలు వగైరా ఉండనే ఉన్నాయి. భర్త, పిల్లలు కూడా అనుకుంటారు. తాము వెళ్లిపోయాక ఆడాళ్లు ఇంట్లో ఉండి ఏం చేస్తారు? తొందరగా ఇల్లు సర్దేసి టీవీ చూడ్డమో, ఫోన్‌లో ముచ్చట్లు పెట్టడమో, పడుకోవడం చేస్తారు. వాళ్లకేం పనుంటుంది అని..! ఎంత పని మనిషి ఉన్నా కూడా ఇల్లాలు ఒక్క రోజు ఏమీ చేయకుండా ఉంటే పైన చెప్పినట్లుగా ఉంటుంది ఇల్లంతా.


పాత రోజుల్లోకంటే ఇప్పుడు ఉద్యోగాలు చేయని ఆడవాళ్లు చేసే పనులు చాలా పెరిగాయి. మగవాళ్లు చేసే పనులు కూడా వాళ్లే చేస్తున్నారు. కరెంట్, టెలిఫోన్, ఇంటర్‌నెట్ బిల్లులు కట్టడం, ఎప్పటికప్పుడు ఆస్తి పన్ను, బీమా చెల్లింపులు, పిల్లల స్కూలు విషయాలు మొత్తం చూసుకుంటారు. పొద్దునే్న పిల్లలను తయారుచేసి టిఫిన్ కట్టి స్కూలుకు పంపడం వరకే కాదు, వాళ్ళచేత హోం వర్క్ చేయించడం, క్లాస్ టీచర్‌తో మాట్లాడడం, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం మొదలైనవి సంతోషంగా చేస్తారు. పిల్లల చదువులోనే కాకుండా ఆటలు, కళలు కూడా నేర్చుకోవాలని వాళ్ల వెంట ఉండి స్విమ్మింగ్, సంగీతం, నాట్యం క్లాసులకు తీసుకెళ్తున్నారు. ఇక వారాంతం రాగానే ఉద్యోగాలు చేసే పిల్లలైనా, భరె్తైనా అలసిపోయాం.. రెస్ట్ కావాలి.. ఎంజాయ్‌మెంట్ కావాలంటారు. పండగలొచ్చినా ఆవిడకే పని పెరుగుతుంది. మగవాళ్ళకేంటి డబ్బులు పెట్టి సామాన్లన్నీ తెచ్చి ఇంట్లో పడేస్తారు. కాని అసలైన పని ఆ తర్వాతే ఉంటుంది. ఆ నెల సరుకులు జాగ్రత్తగా భద్రపరచాలి. చిరుతిళ్లు చేసినా అవి పాడవకుండా, పారేయకుండా చూసుకోవాలి. బెడ్‌షీట్లు, పరదాలు మార్చాలి, కొత్తవి కొనాలి. ఇంకా కాస్త టైమ్ ఉంటే తినడానికి ఏమైనా చేసి పెట్టాలి. అప్పుడప్పుడు వచ్చే చుట్టాలు, వాళ్లకు చేయాల్సిన మర్యాదలు.. ఇలా ఎన్నో పనులు ఉంటాయి. అలాగని ఇంట్లో ఉన్న ఆడవాళ్లందరూ ఇన్ని పనులు చేస్తున్నారని కాదు. మధ్యతరగతికి చెందిన ప్రతి ఇల్లాలి దినచర్య ఇలాగే ఉంటుంది.


ఇంతకుముందైతే- సంపాదన మగవాడి బాధ్యత. ఇంటిని, భర్త, పిల్లలు, చుట్టాలు అందరినీ చూసుకోవడం, ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకోవడం ఇల్లాలి బాధ్యతగా ఉండేది. కాని ఇప్పుడలా కాదు. ఇద్దరూ సంపాదించక తప్పదు. బయటకెళ్లి ఉద్యోగం చేసే వీలు లేనప్పుడు ఎందరో ఆడవాళ్ళు ఇంట్లో ఉండే చిన్న చిన్న వృత్తులు, హాబీలతో కుటుంబ నిర్వహణకు తమ వంతు సాయం చేస్తున్నారు. ఐనా కూడా అందరికీ చాలా సులువుగా వచ్చే మాట ‘‘ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావ్’’ అని. ఈ మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఉండే ఇల్లాలు ఒక్క రోజు ఏమీ చేయకుండా ఏలా ఉంటుందని..?

9 వ్యాఖ్యలు:

Anonymous

* కరెంట్, టెలిఫోన్, ఇంటర్‌నెట్ బిల్లులు కట్టడం, ఎప్పటికప్పుడు ఆస్తి పన్ను, బీమా చెల్లింపులు, పిల్లల స్కూలు విషయాలు మొత్తం చూసుకుంటారు*

పైన చెప్పిన బిల్లులను, ఆఫీసులకి వెళ్లి చెల్లిస్తున్నారేమో,ఐతే మీకొక శుభవార్త. ఇప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా ఆన్ లైన్ లో పే చేయవచ్చు, ఒక్క మౌస్ క్లిక్ తో రెండునిముషాలలో మొత్తం పని అయిపోతుంది :)

"ఇంకా కాస్త టైమ్ ఉంటే తినడానికి ఏమైనా చేసి పెట్టాలి"
హల్దిరాం, పెప్సి కంపేని లేహర్ పేరుతో మురుకుల నుంచి సోమాసాల వరకు గుజరాతి,మహారాష్ట్ర, బెంగాలి, సౌత్ తినుబండారాలు అన్ని తయారు చేసి అమ్ముతున్నారు. ఇవేకాక బింగో పేరుతో ఒక పదిరకాల ఫ్లేవర్స్ తో స్నాక్స్ దొరుకుతున్నాయి. ఇంకా చేసుకోవటం ఎందుకు? సమయం వృధా.


"గృహిణుల శ్రమకు గుర్తింపు "

వాళ్ల శ్రమకు గుర్తింపు లేదనుకొన్నపుడు, ఒక్కసారి వారి పేర మీద ఉన్న ఇళ్లు వాకిళ్లు, ఒంటి మీద ఉన్న బంగారు నగలు, రవ్వల ముక్కు పుడక మొదలైన భర్త కొనిచ్చిన ఆభరణాలు చూసుకొంటే, వారు ఇంటిని చక్కగా మైంటైన్ చేస్తున్నందుకు ఖర్చు చేసిన శ్రమకన్నా భర్తగారు ఎక్కువగా చెల్లించారు అని తెలుసుకొంటారు. గృహిణుల శ్రమ అని మీరు చెప్పే అంట్లు తోమటం,గుడ్డలు ఉతకడం, ఇల్లు శుభ్ర పరచటం పనులలో సహాయం చేసే పనిమనుషులకు ఇచ్చే జీతాలు ఎంత ? భార్యగారి కి ఇచ్చే నగల విలువ ఎంత? గృహిణులకు వారు పడే శ్రమశక్తి లేక్క కట్ట కుండా ఇచ్చేది భర్త మాత్రమే!

అదే గృహిణి గారు తోటి స్రీ, పనిమనిషి ఒక నాలుగోందలు జీతం పెంచమంటే గీకి గీకి బేరాలు ఎలా చేస్తుందో అందరికి తెలుసు. ఆడవారి విశాల హృదయం తెలుసుకోవాలంటే కూరలు వాడితో బేరాం మొదలుకొని నగల దుకాణంలో బేరం వరకు అడుగడుగునా చూడవచ్చు.


"ఇంట్లో ఉండే ఇల్లాలు ఒక్క రోజు ఏమీ చేయకుండా ఏలా ఉంటుందని..?"
పోన్ లో మాట్లాడుతూనో,టి వి చూస్తూనో, బ్లాగులు చదువుతూ, వ్యాఖ్యలు రాసుకొంట్టు ఉండవచ్చు కదా! :)

మీరెంత పనుందని చెప్పుకొనా ఈ రోజులలో ఆడవారికి చేయటానికి పెద్ద పని లేదని అందరికి తెలుసు. ఇంట్లో వాళ్లు చేసే పనులలో పెద్ద వాల్యు అడిషన్ లేదని అభద్రతా భావం ఎక్కువై ,ఉద్యోగల పైన పడుతున్నారు. ఈ కాలంలో చిన్న వయసులో ఉన్న చాలామంది మధ్య తరగతి ఆడవారు కూడ, నెల్లురి కాంతారావులా చిన్న సైజు వస్తాదులలాగా కనిపిస్తున్నారు. చెప్పింది అబద్దమని పిస్తే భారత మాట్రిమోని సైట్లో ఒక సర్చ్ కొట్టి చూడండి మీకే తెలుసుతుంది. ఒకరు ఇద్దరు యక్సెప్షన్.

Anonymous

ఓరి నాయనోయ్!!! :))

శశి కళ

నిజం చెప్పారు జ్యోతి గారు ఏమిటో పని పెరిగిపోతుందో ,మనం పెంచేసుకున్తున్నామో అర్ధం కావటం లేదు.పిల్లల హోం వర్క్స్,ప్రాజెక్ట్స్
చెయ్యటం అన్నిటికన్నా పెద్ద పని అయిపోతుంది

Kasturi

ఉత్త తెలివి తక్కువ వ్యాసం. సానుభూతులతో సమస్యలు పరిష్కారం కావు. గొంగళీలో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిదే ఈ వ్యాసం.
అ. ఇంటి పని వేరు. బయటి పని వేరు. వాటిని పోల్చకూడదు.
ఆ. స్త్రీ,పురుషులిద్దరూ ఇంటి పనీ, బయటి పనీ రెండూ చెయ్యాలి. ఒకరు ఇంటి పనీ, ఇంకొకరు బయటి పనీ అని విభజించుకుంటే, ఇదిగో ఈ వ్యాసంలో రాసిన విషయాలే జరుగుతాయి.
ఇ. మారకం విలువతో పోలిస్తే, ఇంటి పని విలువ కన్నా బయటి పని విలువే ఎక్కువ చాలా రెట్లు. ఉపయోగపు విలువతో వాటిని అస్సలు పోల్చకూడదు. అర్థం లేదు. బయటి పని అంటే, సమాజంలో జరిగే ఉత్పత్తి కార్యక్రంలో పాల్గొనడం. ఇంటి పని అంటే, కుటుంబ శ్రమ. తమ కోసం తాము శ్రమించడం. భార్యా భర్తలిద్దరూ రెండు రకాల శ్రమలూ చేసే పరిస్థితి లేకపోతే, ఇంటి పని అంతా భార్యల మీద మాత్రమే పడి, వారికి ఆత్మ గౌరవం లేని పరిస్థితులు కలుగుతాయి. ఓర్నాయనో గారి పరిశీలనలు పూర్తిగా తప్పని అనగలరా? ఇంటి పని మీద ఆయనకి ఏంత చిన్న చూపో అర్థం అవట్లేదూ?
స్త్రీలు తెలివి తక్కువగా, జ్ఞానం లేకుండా, మూర్ఖంగా ఉన్నంత కాలం ఇలాంటి మాటలు పడక తప్పదు.

కస్తూరి

Zilebi

అబ్బా, అలా ముఖం మీద కొట్టినట్టు చెప్పండి.

అసలు బ్లాగుల్లో కామెంట్లు రాయడానికి కూడా సమయం లేకుండా పోతోంది ఈ మధ్య మరీ .

@ఓరి నాయనోయ్-

మీరు చెప్పినవన్నీ కొని, తద్వారా ఇల్లు నడపాలంటే, మొగుడనే మగాడు రోజుకి నలభై ఎనిమిది గంటలు పని చెయ్యాల్సి వస్తుందేమో, కాస్త బుర్ర పెట్టి ఆలోచించ వలె.

రెండు, మన భారద్దేశం లో మహిళలు కిచను - వంట గది, మూట కడితే, భారద్దేశం లో మరో 'వంట విప్లవం' ఖచ్చితం గా వస్తుందని నా సదభిప్రాయం.

ఒక బిలియన్ పై బడి ఉన్న జనాభా కి బువ్వ పెట్టడానికి కావాల్సిన 'వంట' అంగాడి లు కావాలంటే, చూసుకోండి మరి ఎంత బిజినెస్ టర్నోవర్ జరగ గలదో మరి.

కాబట్టి, మహిళల్లారా ఏకం కండి, ఇంట్లో కిచను మూట కట్టండి, దాన్నే వ్యాపార సరళి లో 'రెస్ట్' అండ్ డైన్ బరిస్తా లు గా మార్చండి.!

వంట విప్లవం జిందాబాద్!

చీర్స్
జిలేబి.

Anonymous

/ఇంట్లో ఉండే ఇల్లాలు ఒక్క రోజు ఏమీ చేయకుండా ఏలా ఉంటుందని..?/
మీరు చెప్పింది సబబుగా వుందనుకోండి... పాపం ఏంచేస్తోందో తెలుసుకుందామని ఆసక్తి/ఆతృత/కన్‌సర్న్ చూపే భర్తలను అలా చిన్నబుచ్చడం/తీసిపారేయడం బాగోలేదండి. చేస్తున్న పనులన్నీ ఓ లిస్ట్ రాసి అడిగినపుడల్లా ఓ కాపీ ఇస్తూ వుండడమే. కొన్నాళ్ళకు అడగటం మానుకుంటారు. :)
మరీ పైఆదాయం బాగా వున్న స్టేట్ గవర్నమెంట్ వుద్యోగిలా కాక, నెలలో 2-3రోజులు ఐచ్చిక సెలవులు కూడా తీసుకుంటుండాలి

Anonymous

@చిత్తూరుజిల్లా జిలేబి గారు,

మీది పాత తరం గాబట్టి అలా అనుకొంట్టున్నారు. నేను భారత దేశ జనాభా అంతటికి రాయలేదు. బ్లాగుల్లో రాసే వారేక్కువగా మిడిల్ క్లాస్,అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే వాళ్ల జీవితం లో మొగుడు చేత పైన చెప్పిన వాటిలో చాలా మటుకు కొనిచ్చుకొంటారు.

"మన భారతద్దేశం లో మహిళలు కిచను - వంట గది, మూట కడితే"

నేను ఉండే సిటిలో ఈ విప్లవం వచ్చి 10సం|| పైన అవుతున్నాది. ఇంటికి ఎవరైనా అతిధులు వస్తే గృహిణులు మొదట పోన్ దగ్గరికి వేళ్లి పిజ్జా, కోక్ ఆడర్ ఇచ్చి వచ్చి, అథిధులతో మాట్లాడటం మొదలు పెడతారు. కాఫి,టి నీళ్లు పోయటం కూడ ఎప్పుడో మూలపడింది. రానున్న కాలంలో పిజ్జా రేట్లు తగ్గించి డొర్ డేలివరి చేస్తాననంటే, మీరు కూడ అదే పని చేయొచ్చు. ఇక శని ఆది వారాల్లో ఎదైన పెద్ద రేస్టారేంట్ కి వేళితే కూఛొటానికి కుర్చీ దొరకదు. టొకన్ నంబరలతో పిలవటం సాధరణ విషయం.

ప్రస్తుత కాలం ఆధునిక గృహిణులు ఏ పని లేదు. అందువలననే టి వి షోలలో కి వచ్చి గెంతులు వేస్తూ, ఎగురుతూంటారు. మీరు వృద్ద గృహిణులు కనుక పని అలవాటై అలా చేసుకోంట్టూంటారు. మిమ్మల్ని ఎవరు మార్చ లేరు. మా ఇంట్లో పెద్ద వాళ్లకి మంచి హోటల్ నుంచి రోజు భోజనం తెప్పించుకొని తినమని చెప్పి చెప్పి ఊరుకొన్నాను. మా అమ్మకి అదొక పిచ్చి సలహాలాగా అనిపిస్తుంది. నా ముందర సరే సరే అని ఆమే చేసుకొనే పని చేసుకొంట్టూంటుది. ఇంటి పని,వంట పని చేయటమనేది మీ అస్తిత్వం లో భాగం కనుక దానిని చేయటం మానుకోరు.

Anonymous

"ఉత్త తెలివి తక్కువ వ్యాసం"

@కస్తూరి ,

జ్యోతక్క రాసిన దానిని అలా ఆనటం బాగా లేదు. అమేది పాత సినేమాలో ఆమనిలా "రాదే చెలి నమ్మ రాదే చెలి అని మగవారినిలా నమ్మరాదే చెలి" అని ఆరోపణలు చేసే సాఫ్ట్ స్రీవాదం. ఈవిడ చెప్పిన సమస్యలే మగవారికి ఆఫీసులో ఉంటాయి. మగవారు ఇతరుల చేత ఒక మాట ఎందుకు పడాలి, నాకు కోపం వస్తుంది, మనసు గాయపడిందని పై వాడిని తప్పూపడుతూ వ్యాసాలు రాస్తే, ఉద్యోగం వదలి ఇంటికి వచ్చి కూచోవాలి. మరి వారు అలా చేస్తున్నారా? ఎంతో సహనం తో పని చేసుకొని వచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నారు.

Kasturi

ఓర్నాయనో గారూ,
మీరు నన్ను కొంచెం తప్పర్థం చెస్తుకున్నట్టు వున్నారు. జ్యోతి గారు రాసిన దానితో నేను పూర్తిగా వ్యతిరేకించడం లేదు. అసలు సమస్య ఏమిటీ, దాని పరిష్కారం ఏమిటీ అన్న విషయాలనే ఎక్కువ పట్టించు కున్నాను. జ్యోతి గారు రాసిన దాంట్లో పురుషాహంకారం గురించి విషయాలు వున్నాయి. అవి కరెక్టే అని మీరు రాసిన వ్యాఖ్యలు చదివినప్పుడు రుజువు అయ్యాయి కూడా. ఇంటి పనులు మాత్రమే చేసే స్త్రీలు ఎంత మందో వున్నారు. ఆ ఇంటి పనుల గురించి బొత్తిగా అవగాహన లేని పురుషులు, అహంకారంగా ప్రవర్తించడం చూస్తూనే వున్నాము. దీనర్థం, ఇంటి పని చేసే స్త్రీలందరూ చక్కటి వారనీ, బయట పని చేసే పురుషులు మాత్రమే చెడ్డ వారనీ కాదు. జనరల్‌గా సమస్యని పరిశీలించాలి. బయటి ఆఫీసుల్లో పని ఎగ్గొట్టి, ఎలాగో ఒక లాగా మేనేజ్ చేసే పురుషులు వున్నట్టే, ఇంటి పని సరిగా చెయ్యని స్త్రీలు కూడా వుంటారు. అలాంటి కేసుల గురించి మాట్టాడనవసరం లేదు ఇక్కడ. పురుషులు బయట (తమ కున్న బయట సమస్యలతో) పని సరిగా చేస్తూ, స్త్రీలు (వారి సమస్యలు వారి కున్నప్పటికీ) ఇంటి పని సరిగా చేస్తూ వున్న కేసుల్లో కూడా, పురుష పెత్తనం వల్ల వచ్చే సమస్య గురించి మాట్టాడడం ఇది. దీనికి పరిష్కారం ఇద్దరూ రెండు పనులూ చేస్తూ వుండటమే. ఇంత కన్నా అభిప్రాయ వేదికలో ఎక్కువగా వివరించడానికి కుదరదు.

కస్తూరి

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008