Monday, 29 October 2012

Happy Birthday My Friend ................



Many Happy Returns of the Day  My Dear Friend.. 

What can i give you as birthday gift this time?? I dont have anything special to give you except my achievements.. Thanks for everything....

Friday, 19 October 2012

వాణి - మనోహరిణి (అంతర్జాల అష్టావధానం)





మాలిక పత్రిక ఆధ్వర్యంలో మొట్టమొదటి అంతర్జాల అవధానం రేపు శనివారం భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలనుండి తొమ్మిది గంటలవరకు   నిర్వహింపబడుతుంది. ఈ అంతర్జాల అవధానం యొక్క శీర్షిక " వాణీ - మనోహరిణీ " అంతర్జాలంలో అవధానం ఎలా జరుపుతారు అనుకుంటున్నారా?? ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక గ్రూపు ప్రారంభించబడి అందులోనె చర్చలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ఒక తుది రూపానికి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.

మొదట నిర్వాహకుల స్వాగత వచనాలు.
తరువాత అవధాని గారి స్వపరిచయం, వరుసగా పృచ్ఛకుల స్వపరిచయం, అతిథుల స్వపరిచయం...
అవధాన ప్రారంభం
అవధానిగారి చేత దైవ ప్రార్థన, స్వవిషయం, (అవసరమనుకుంటే) అవధాన ప్రక్రియా పరిచయం, ప్రాశస్త్యాలు పద్యాలలో...
నాలుగు ఆవృత్తుల వరుసక్రమం ఇలా  ఉంటుంది.
1.నిషిద్ధాక్షరి
2.మొదటి దత్తపది
3.రెండవ దత్తపది
4.మొదటి సమస్య
5.రెండవ సమస్య
6.మూడవ సమస్య
7.వర్ణన
అప్రస్తుత ప్రసంగం నిర్వహించే పృచ్ఛకులకు ఎప్పుడైనా మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. నిరంకుశులు కదా!
నాలుగు ఆవృత్తుల అనంతరం ధారణ
చివర అవధాని గారు, నిర్వాహకుడు ధన్యవాదాలు తెలుపడంతో అష్టావధాన కార్యక్రమం ముగుస్తుంది.

ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారు? అసలు ఈ అవధాని ఎవరు అని అడగాలనుకుంటున్నారా?? చెప్తున్నాగా..  "వాణీ -మనోహరిణీ" కార్యక్రమానికి అవధానిగా వస్తున్నవారు ..
 "అవధాని రత్న" ,సాహిత్య శిరోమణి
 డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ ,,,యం.ఎ ., బి. యెడ్., పిహెచ్. డి
సంస్కృతోపన్యాసకులు
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల
టి.టి.డి,, తిరుపతి 

ఇక ఈ  అవధాన కార్యక్రమంలో పృచ్ఛకులుగా పాల్గొనే మిత్రుల వివరాలు....
1. నిషిద్ధాక్షరి - రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు
2. మొదటి సమస్య : లంకా గిరిధర్ గారు
3. రెండవ సమస్య : పోచిరాజు సుబ్బారావు గారు
4. మూడవ సమస్య : భైరవభట్ల కామేశ్వర రావు గారు
5. మొదటి దత్తపది :  గోలి హనుమచ్ఛాస్త్రి గారు
6. రెండవ దత్తపది :
7. వర్ణన : సనత్ శ్రీపతి గారు
8. అప్రస్తుత ప్రశంస :
పేరు : చింతా రామకృష్ణారావు గారు
నిర్వాహకుడు :  కంది శంకరయ్య

మరో ముఖ్యమైన విషయం: ఈ అవధాన కార్యక్రమంలో పాల్గొనలేని వారికోసం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అది మాలిక  పత్రికలో రేపు సాయంత్రం ఆరునుండి మొదలవుతుంది. తప్పుకుండా చూడండి మరి..

మాలిక పత్రిక : http://magazine.maalika.org

అవధాని గారి గురించి మరి కొన్ని వివరాలు:
అవధాని శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారు 1970 జూన్ 3 వ తేదీన అనంతపూర్లో జన్మించారు. ఈయన తండ్రిగారు కీ.శే.బ్రహ్మశ్రీ మాడుగుల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు  వేదపండితులు మరియు పురోహితులుగా ఉండేవారు. తల్లిగారు సంస్కృతాంధ్ర భాషలలో పండితురాలు, సంగీత విద్వాంసురాలు. అనిల్ గారు సంస్కృత సాహిత్య శిరోమణి అభ్యసించిన తర్వాత శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సంస్కృతంలో యం.ఏ చేసారు. తర్వాత ప్రస్తుత వేదిక్ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ శ్రీ సన్నిధానం సుదర్శన శర్మగారి  పర్యవేక్షణలో రఘువంశ మహాకావ్యంపై పి.హెచ్.ఢి చేసారు. ఎన్నో పత్రికలలో వ్యాసాలు, పద్యాలు వ్రాసారు. సెమినార్లలో పత్రసమర్పణ చేసారు. ఆయన ఇంతవరకు ఎన్నో అవధానాలు చేసారు.  శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల , తిరుపతి అధ్యాపక బృందం వారు "అవధాని రత్న " బిరుదు అందజేశారు. సంస్కృతాంధ్ర భాషలలో 13 పుస్తకముల రచన కూడా చేసారు..
ఇవి ఆయన రచనలు:
1 . శ్రీ వేంకటేశ్వర అక్షరమాలా స్తోత్రము
2. శ్రీ రాఘవేంద్ర అక్షరమాలా స్తోత్రము
3. అమందానంద మందాకిని
4. శ్రీ వేంకట రమణ శతకము
5.అనిల కుమార శతకము
6. భావాంజలి
7.వసంత కుసుమాంజలిః ( సంస్కృతం లో వివిధ దేవతలపై విభిన్న వృత్తాలలో  అష్టకాలు నవరత్నాలు )   
8.రఘువంశ మహాకావ్యే సాదృశ్య విన్యాసః (పిహెచ్ .డి పరిశోధన ప్రబంధము )
9. భోజ చరిత్ర ( సంస్కృత మూలమునకు అనువాదము )
10. విక్రమార్క చరిత్ర ( సంస్కృత మూలమునకు అనువాదము)
11. వాల్మీకి( సంస్కృత మూలమునకు అనువాదము)
12. శ్రీ రామనామ రామాయణము ( నామ రామాయణము లోని నామములకు సందర్భసహిత వ్యాఖ్యానము )
13. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కల్పము ( పురుష సూక్తానుసారము సంకలనము)
         
సంకల్పము :- ప్రాచీనాంధ్ర భాషలో ఛందోబద్ధ కవిత్వానికి ఆదరణ చేకూర్చే ప్రయత్నము. అవధానాన్ని ప్రాచీనావదానుల వాలె  ఛాలెంజ్ లా కాక ఒక కళగా ఆరాధించి వ్యాపింప జేయడము .

Wednesday, 17 October 2012

అంతర్జాల అవధానం (మాలిక పత్రిక సౌజన్యంతో)



 అవధానం అనేది చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. లేదంటే క్రింది వివరాలు చూడండి.. ఇటువంటి మహత్తర సాహితీ ప్రక్రియను సాంకేతికంగా నిర్వహించడం అనేది ఎందుకు సాధ్యంకాదు అనే ఆలోచనతో మాలిక పత్రిక అంతర్జాలంలో అష్టావధానాన్ని నిర్వహింప తలపెట్టింది. ఈ కార్యక్రమం ఈ శనివారం 20 -10 -2012 నాడు ఏర్పాటు చేయబడుతుంది.. దీనికోసమై సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియజేసేవరకు అవధానం గురించి కొన్ని వివరాలు (ఊకదంపుడు బ్లాగునుండి) మీకోసం..


అవధానం అనేది ఒక విశిష్టమైన సాహితీ ప్రక్రియ.ఈ అవధానం ఆంధ్రులకే సొంతమని కూడా ప్రతీతి. ఈ అవధానం తెలుగులో మాత్రమే కాక సంస్కృతాంధ్రములలో కూడా అవలీలగా అవధానం చేసే ఉద్ధండ పండితులు ఉన్నారు. అవధానంలో క్లిష్తమైనది అష్టావధానం.  ఇది మనం అందరం చెప్పుకునే Multitasking అని చెప్పవచ్చు.

అవధాని తను నిర్వహించదలుచుకున్న ఎనిమిది అంశాలను ముందుగా ఎంచుకుంటారు:

౧. సమస్యాపూరణం
౨. దత్త పది
౩. వర్ణన
౪. ఆశువు
౫. వ్యస్తాక్షరి
౬. నిషిద్దాక్షరి
౭. న్యస్తాక్షరి
౮. చంధోభాషణం
౯. పురాణపఠనం
౧౦.అప్రస్తుత ప్రసంగం
౧౧. ఘంటా గణనం ( లేక సుమగణనం?)
౧౨. చదరంగం

వీటిలో ఏవేని ఒక ఎనిమిది తీసుకొని అష్టావధానం చేస్తారు.  పై ద్వాదశం లో మొదటి పదీ సాహితీ పరమైన అంశాలు. మొదటి నాలుగు, మరియు అప్రస్తుత ప్రసంగం లేకుండా బహుశ: ఏ అష్టావధానం ఉండదు. ఒక్కక్క అంశానికి ఒక్క పృఛ్చకుడు/పృఛ్చకురాలు ఉంటారు. ఒక అధ్యక్షులు/సమన్వయకర్త ఉంటారు. ఇష్టదేవతా స్తుతి, గురుస్తుతి, పుర స్తుతి తో అవధాని ప్రారంభిస్తారు. తరువాత పృఛ్చకులు తమతమ అంశాలలో ప్రశ్నలను అడుగుతారు. ప్రశ్న అడిగిందే తడవుగా అవధాని మొదటి పాదాన్ని చెబుతారు. వెంటనే తరువాతి పృఛ్చకులు తమ ప్రశ్న అడుగుతారు. మధ్యలో అప్రస్తుత ప్రసంగి తనకు ఇష్టమున్న విషయాని ప్రస్తావించవచ్చు, అడగవచ్చు. ఒకవేళ పృఛ్చకులు అడిగినదానికో అవధాని చెప్పినదానికో అభ్యంతరాలుంటే అధ్యక్షులవారు పరిష్కరించాలి.

ఉదాహరణకి దత్త పది,సమస్యా,వర్ణన,నిషిద్దాక్షరిపృఛ్చకులు వరసగా కూచుంటే/తమ ప్రశ్నలడిగితే, దత్తపది మొదటి పాదం చెప్పి, సమస్య మొదటి పాదం చెప్పి , వర్ణన మొదటిపాదం చెప్పి .. మధ్యమధ్యలో అప్రస్తుత ప్రసంగి ప్రశ్నలకు తగురీతిలో సమధానంచెప్పి .. ఇలా ఎనిమిది అంశాలకు మొదటి పాదం పూర్తిచేయాలి. తిరిగి దత్తపది రెండో పాదం చెప్పాలి అప్పుడు దత్తపది ఆయన.. బాబు నేను దత్తపది ఇచ్చాను -ఇచ్చిన పదాలు ఇవి నువ్వు చెప్పిన మొదటి పాదం ఇది అని చెప్పడు. అన్నీ అవధానే గుర్తు పెట్టుకోవాలి.. అలానే మిగతా అంశాలు కూడా. రెండో పాదం తరువాత మూడోపాదానికీ ఇదేవరుస. ఇలా నాలుగు ఆవృతులయ్యేటప్పటికి అష్టావధానం పూర్తవుతుంది. దీనికి మినహాయింపు అప్రస్తుత ప్రసంగం, ఆశువు. అప్రస్తుత ప్రసంగానికి వెంటనే పెడవిసురు ( retort) ఉండాలి. ఆశువుకు పద్యం మొత్తం ఆశువుగా అడిగినవెంటనేచెప్పాలి. ఈ నాలుగు ఆవృతాలు పూర్తి ఐన తరువాత ధారణ చేయాలి అంటే దత్త పది,సమస్యా,వర్ణన,నిషిద్దాక్షరి మిగతా అంశాలకు తను చెప్పిన పద్యాలు వరుసగా పొల్లుపోకుండా అప్పచెప్పాలి. (ఆశువు కు?) అప్రస్తుత ప్రసంగానికి ధారణ లేదు. ఒకసారి అవధాని ధారణ మొదలు పెట్టిన తరువాత అప్రస్తుత ప్రసంగి/పృఛ్చకులు ఎవరూ మాట్లాడరాదు. ధారణ తో అవధానం పూర్తవుతుంది. తరువాత కార్యక్రమం ఇక వేడుక -సన్మానాలు, సత్కారలు, ప్రశంసలు, బిరుదులూ,ఇత్యాదులు.

పై ౧౦ అంశాలగురించి క్లుప్తంగా:

౧. సమస్యాపూరణం :
ఏదైనా అసంబద్ధ విషయన్ని ఇస్తే దానిలో అసంబద్ధత తొలగించి ఇది సాధరణ విషయమే నన్నట్టు పద్యం చెప్పి మెప్పించాలి. సామాన్యం గా పదాల విరుపుతోనో , అక్షరాల చేరికతోనో, కాకుంటే క్రమాన్వయంతోనో పరిష్కరిస్తూ ఉంటారు. ఆంధ్రనాట, మంచి ఆదరణ నోచుకున్న సాహితీ ప్రక్రియ.అవధానాల్లోనేగాక, సమస్యాపూరణం సొంత కాళ్లమీద కూడా నడుస్తోంది. ఆకాశావాణి, దూరదర్శనం, భవిష్యవాణి లాంటి కొన్ని పత్రికలు, ఇంకా బ్లాగ్‍సాహితీప్రియులు దీని విశ్వవ్యాప్తికి బహుదాకృషి చేస్తున్నారు.
౨. దత్త పది:
ఏవేని నాలుగు పదాలు ఇచ్చి , ఒక ఘట్టము/ సంధర్భము ఇస్తే ఇచ్చినపదాలనుపయోగించి కోరిన ఘట్టాన్ని కోరిన చంధం లో చెప్పాలి. సమస్యాపూరణతో సరి ప్రాధాన్యమున్న ప్రక్రియ.
౩. వర్ణన:

ఇచ్చిన అంశాన్ని వర్ణిస్తూ పద్యం చెప్పాలి. శ్లేష /ద్వర్ధి కూడా అడగవచ్చు. ఒక అవధానం లో తాడిచెట్టు/విష్ణుమూర్తి మీద పద్యం చెప్పమని అడిగారు అంటే పద్యాన్ని తాడిచెట్టు అన్వయించుకొని అర్ధం చెప్పుకోవచ్చు.విష్ణుమూర్తి అన్వయించుకొనీ అర్ధం చెప్పుకోవచ్చు. ( అవి పాత రోజులులెండి)
౪. ఆశువు:
ఇచ్చిన విషయం మీద ఆశువుగా పద్యం చెప్పాలి.
౫. వ్యస్తాక్షరి:
పృఛ్చకుడు ౧౮-౨౦ అక్షరాల సమాసాన్ని లేదా పద్యపాదాన్ని ఒక్కొక్క అక్షరం చొప్పున ఇస్తారు. అన్ని అక్షరాలు ఇచ్చిన తరువాత , నాలుగో ఆవృతిలో ఆ సమాసము లేదా పద్యపాదం చెప్పాలి.

౬. నిషిద్దాక్షరి:
ఇది కష్టమైన ప్రక్రియ, పృఛ్చకునికి అవధానికి సమ ఉజ్జీగా ఆలోచించాలి, ప్రతి అక్షరానికి అవధాని తరువాత ఏ అక్షరం వేస్తాడో ఊహించి దానిని నిషేదించాలి. మొదటి ఆవృతి లో మొదటి పాదం ,రెండో ఆవృతి లో రెండో పాదం చొప్పున నాలుగు ఆవృతులలో పూర్తి చేయాలి.

౭. న్యస్తాక్షరి:
పృఛ్చకుడు నాలుగు అక్షరాలు ఇస్తారు. ఒక్కొక అక్షరం పద్యంలో ఏ పాదంలో ఎన్నవ అక్షరంగా రావాలో చెబుతారు. ఇచ్చిన అక్షరాలను నిర్దేశిత స్థానాలలో వేసి అడిగిన విషయం మీద పద్యం చెప్పాలి.

౮. చంధోభాషణం:
పృఛ్చకుడు అవధాని ఒక విషయం గూర్చి చంధోబద్ధంగామాట్లాడతారు. అంటే సంభాషణ మొత్తం పద్యాలలోనే అన్నమాట.
౯. పురాణపఠనం:
పృఛ్చకుడు ఒక పురాణ ఘట్టాన్ని ప్రస్తావిస్తే అవధాని దాని పూర్వాపరాలు తెలపాలి.
౧౦.అప్రస్తుత ప్రసంగం:
ఇది బహుళ ప్రచారానికి నోచుకున్న అంశం. అవధానికి పృఛ్చకమహాశయునికి మధ్య చమత్కార సంభాషణం.
౧౧. ఘంటా గణనం ( లేక సుమగణనం?):
పృఛ్చకుడు అవధానం మొదలు ధారణవరకు ఎన్ని మార్లు ఘంటానాదం చేశారో/ పూలు విసిరారో చెప్పాలి.
౧౨. చదరంగం : చదరంగపు ఆట.

Wednesday, 10 October 2012

నవ్వు నవ్వు నవ్వు మనసారా నవ్వు




అప్పుడప్పుడు ఏదో ఆలోచన, ఆవేశం,బాధ, స్పందన లాంటివన్నీ కధలుగానో,వ్యాసాలుగానో, కవితలుగానో బయటకు వస్తాయి. అలా రావడం కూడా మంచిదే. ఎందుకంటే జీవితానుభవాలనుండి పుట్టేదే సాహిత్యం కదా. అందుకే ఒకరోజు నాలో చెలరేగిన ఆలోచనలను  పేస్ బుక్ లో ఇలా రాసుకున్నాను. చాలామంది బావుందన్నారు. ఇంగ్లీషులోకి కూడా అనువాదం చేసారు ఒక ఫ్రెండ్.. దాన్ని ఒక కవితాసంకలనంలో వేస్తామన్నారు సంపాదకులు. అందుకే ఈ కవితలాంటి నా మనోభావాలను ఇక్కడ నిక్షిప్తం చేద్దామనుకుంటున్నాను...


కోపంలో, బాధలో, దుఃఖంలో నవ్వు

తీరిగ్గా ఉన్నవేళ ప్రకృతిని చూసి నవ్వు


ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు చిరాకుపడకుండా మిగతావాళ్లని చూసి నవ్వు

హైవే మీద సాఫీగా వెళుతున్నప్పుడు మరింత హాయిగా నవ్వు

కష్టాల కడలిలో మునిగినప్పుడు ఇంకా చలేంటనుకుని వాటిని చూసి నవ్వు

సంతోష సమయంలో అంబరానికెగరక నేలను అదిమి చిన్నగా నవ్వు

ఆత్మీయులు, స్నేహితులని నమ్మి ఎలా ఫూల్ అయ్యావోతలుచుకుని మరీ నవ్వు

ఎన్నో విపత్తులలో భయపడ్డ సంఘటనలు గుర్తుచేసుకుని నవ్వు

ప్రతీదానికి విపరీతంగా ఆలోచించే, స్పందించే నిన్ను చూసుకుని నవ్వు

చుట్టూ ఉన్న సమస్యలను చూసి ఒక్కసారి గట్టిగా నవ్వు

మనసులోని దిగులును బయటకు పారద్రోలేలా నవ్వు

ఎవరు, ఎలాటివారో తెలుసుకుని లైట్ మామా అనుకుంటూ నవ్వు

ఎవరూ నీవారు కారు, నీ తోడు రారని గుర్తుంచుకుని నవ్వు

ఉన్నది చిన్న జీవితం. చేసుకుంటూ దాన్ని పదిలంగా నవ్వు

నిన్న మనది కాదు, రేపు మన చేతిలో లేదు. నేడు ని కాపాడుకుని నవ్వు

అన్నీ మరచి, అప్పుడప్పుడు మనసారా నవ్వు .. నవ్వు..

పోటోలో ఉన్నది మా అమ్మాయి దీప్తి, ఫోటో తీసిందా మా అబ్బాయి కృష్ణచైతన్య...

Friday, 5 October 2012

మాలిక పత్రిక ఆశ్వయుజ సంచిక విడుదల


మాలిక పత్రిక ఆశ్వయుజ సంచిక (October 2012 ) విడుదలయ్యింది.. ఈ సంచిక కోసం తమ అమూల్యమైన రచనలను పంపిన వారందరికి ధన్యవాదాలు.

మాలిక .. http://magazine.maalika.org/


మాలిక పత్రికకోసం రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

ఈ పత్రికలోని అంశాలు..

0. సంపాదకీయం: కలసి ఉంటే కలదా సుఖం? 

1.  శ్రీ లక్ష్మి నారాయణ హృదయం

2. ప్రేమకు మారుపేరు

 3. అడవి దేవతలు సమ్మక్క సారలక్క

 4.  కరగని కాటుక

 5. పైడికంట్లు

 6.  సీత… సీమచింత చెట్టు

 7.  బ్రతుకు జీవుడా

 8.  చీరల సందడి

9.  వాయువు

10. వన్ బై టు కాఫీ

11. ఇలాగే ఇలాగే సరాగమాడితే

12. సామెతల్లో మూఢనమ్మకాలు,కులవివక్ష,అవహేళన

13. వికృ(త)తి రాజ్యం

 14. ఇంటర్‌నెట్-2

 15. చింపాజీలపై పరిశోధనలో అగ్రగామి – జేన్ గుడాల్

 16. అక్రూరవరద మాధవ

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008