Friday, October 19, 2012

వాణి - మనోహరిణి (అంతర్జాల అష్టావధానం)

మాలిక పత్రిక ఆధ్వర్యంలో మొట్టమొదటి అంతర్జాల అవధానం రేపు శనివారం భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలనుండి తొమ్మిది గంటలవరకు   నిర్వహింపబడుతుంది. ఈ అంతర్జాల అవధానం యొక్క శీర్షిక " వాణీ - మనోహరిణీ " అంతర్జాలంలో అవధానం ఎలా జరుపుతారు అనుకుంటున్నారా?? ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక గ్రూపు ప్రారంభించబడి అందులోనె చర్చలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ఒక తుది రూపానికి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.

మొదట నిర్వాహకుల స్వాగత వచనాలు.
తరువాత అవధాని గారి స్వపరిచయం, వరుసగా పృచ్ఛకుల స్వపరిచయం, అతిథుల స్వపరిచయం...
అవధాన ప్రారంభం
అవధానిగారి చేత దైవ ప్రార్థన, స్వవిషయం, (అవసరమనుకుంటే) అవధాన ప్రక్రియా పరిచయం, ప్రాశస్త్యాలు పద్యాలలో...
నాలుగు ఆవృత్తుల వరుసక్రమం ఇలా  ఉంటుంది.
1.నిషిద్ధాక్షరి
2.మొదటి దత్తపది
3.రెండవ దత్తపది
4.మొదటి సమస్య
5.రెండవ సమస్య
6.మూడవ సమస్య
7.వర్ణన
అప్రస్తుత ప్రసంగం నిర్వహించే పృచ్ఛకులకు ఎప్పుడైనా మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. నిరంకుశులు కదా!
నాలుగు ఆవృత్తుల అనంతరం ధారణ
చివర అవధాని గారు, నిర్వాహకుడు ధన్యవాదాలు తెలుపడంతో అష్టావధాన కార్యక్రమం ముగుస్తుంది.

ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారు? అసలు ఈ అవధాని ఎవరు అని అడగాలనుకుంటున్నారా?? చెప్తున్నాగా..  "వాణీ -మనోహరిణీ" కార్యక్రమానికి అవధానిగా వస్తున్నవారు ..
 "అవధాని రత్న" ,సాహిత్య శిరోమణి
 డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ ,,,యం.ఎ ., బి. యెడ్., పిహెచ్. డి
సంస్కృతోపన్యాసకులు
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల
టి.టి.డి,, తిరుపతి 

ఇక ఈ  అవధాన కార్యక్రమంలో పృచ్ఛకులుగా పాల్గొనే మిత్రుల వివరాలు....
1. నిషిద్ధాక్షరి - రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు
2. మొదటి సమస్య : లంకా గిరిధర్ గారు
3. రెండవ సమస్య : పోచిరాజు సుబ్బారావు గారు
4. మూడవ సమస్య : భైరవభట్ల కామేశ్వర రావు గారు
5. మొదటి దత్తపది :  గోలి హనుమచ్ఛాస్త్రి గారు
6. రెండవ దత్తపది :
7. వర్ణన : సనత్ శ్రీపతి గారు
8. అప్రస్తుత ప్రశంస :
పేరు : చింతా రామకృష్ణారావు గారు
నిర్వాహకుడు :  కంది శంకరయ్య

మరో ముఖ్యమైన విషయం: ఈ అవధాన కార్యక్రమంలో పాల్గొనలేని వారికోసం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అది మాలిక  పత్రికలో రేపు సాయంత్రం ఆరునుండి మొదలవుతుంది. తప్పుకుండా చూడండి మరి..

మాలిక పత్రిక : http://magazine.maalika.org

అవధాని గారి గురించి మరి కొన్ని వివరాలు:
అవధాని శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారు 1970 జూన్ 3 వ తేదీన అనంతపూర్లో జన్మించారు. ఈయన తండ్రిగారు కీ.శే.బ్రహ్మశ్రీ మాడుగుల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు  వేదపండితులు మరియు పురోహితులుగా ఉండేవారు. తల్లిగారు సంస్కృతాంధ్ర భాషలలో పండితురాలు, సంగీత విద్వాంసురాలు. అనిల్ గారు సంస్కృత సాహిత్య శిరోమణి అభ్యసించిన తర్వాత శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సంస్కృతంలో యం.ఏ చేసారు. తర్వాత ప్రస్తుత వేదిక్ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ శ్రీ సన్నిధానం సుదర్శన శర్మగారి  పర్యవేక్షణలో రఘువంశ మహాకావ్యంపై పి.హెచ్.ఢి చేసారు. ఎన్నో పత్రికలలో వ్యాసాలు, పద్యాలు వ్రాసారు. సెమినార్లలో పత్రసమర్పణ చేసారు. ఆయన ఇంతవరకు ఎన్నో అవధానాలు చేసారు.  శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల , తిరుపతి అధ్యాపక బృందం వారు "అవధాని రత్న " బిరుదు అందజేశారు. సంస్కృతాంధ్ర భాషలలో 13 పుస్తకముల రచన కూడా చేసారు..
ఇవి ఆయన రచనలు:
1 . శ్రీ వేంకటేశ్వర అక్షరమాలా స్తోత్రము
2. శ్రీ రాఘవేంద్ర అక్షరమాలా స్తోత్రము
3. అమందానంద మందాకిని
4. శ్రీ వేంకట రమణ శతకము
5.అనిల కుమార శతకము
6. భావాంజలి
7.వసంత కుసుమాంజలిః ( సంస్కృతం లో వివిధ దేవతలపై విభిన్న వృత్తాలలో  అష్టకాలు నవరత్నాలు )   
8.రఘువంశ మహాకావ్యే సాదృశ్య విన్యాసః (పిహెచ్ .డి పరిశోధన ప్రబంధము )
9. భోజ చరిత్ర ( సంస్కృత మూలమునకు అనువాదము )
10. విక్రమార్క చరిత్ర ( సంస్కృత మూలమునకు అనువాదము)
11. వాల్మీకి( సంస్కృత మూలమునకు అనువాదము)
12. శ్రీ రామనామ రామాయణము ( నామ రామాయణము లోని నామములకు సందర్భసహిత వ్యాఖ్యానము )
13. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కల్పము ( పురుష సూక్తానుసారము సంకలనము)
         
సంకల్పము :- ప్రాచీనాంధ్ర భాషలో ఛందోబద్ధ కవిత్వానికి ఆదరణ చేకూర్చే ప్రయత్నము. అవధానాన్ని ప్రాచీనావదానుల వాలె  ఛాలెంజ్ లా కాక ఒక కళగా ఆరాధించి వ్యాపింప జేయడము .

1 వ్యాఖ్యలు:

SRRao

జ్యోతి గారూ !

మీకు, మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు

శిరాకదంబం వెబ్ పత్రిక

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008