Wednesday, 17 October 2012

అంతర్జాల అవధానం (మాలిక పత్రిక సౌజన్యంతో)



 అవధానం అనేది చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. లేదంటే క్రింది వివరాలు చూడండి.. ఇటువంటి మహత్తర సాహితీ ప్రక్రియను సాంకేతికంగా నిర్వహించడం అనేది ఎందుకు సాధ్యంకాదు అనే ఆలోచనతో మాలిక పత్రిక అంతర్జాలంలో అష్టావధానాన్ని నిర్వహింప తలపెట్టింది. ఈ కార్యక్రమం ఈ శనివారం 20 -10 -2012 నాడు ఏర్పాటు చేయబడుతుంది.. దీనికోసమై సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియజేసేవరకు అవధానం గురించి కొన్ని వివరాలు (ఊకదంపుడు బ్లాగునుండి) మీకోసం..


అవధానం అనేది ఒక విశిష్టమైన సాహితీ ప్రక్రియ.ఈ అవధానం ఆంధ్రులకే సొంతమని కూడా ప్రతీతి. ఈ అవధానం తెలుగులో మాత్రమే కాక సంస్కృతాంధ్రములలో కూడా అవలీలగా అవధానం చేసే ఉద్ధండ పండితులు ఉన్నారు. అవధానంలో క్లిష్తమైనది అష్టావధానం.  ఇది మనం అందరం చెప్పుకునే Multitasking అని చెప్పవచ్చు.

అవధాని తను నిర్వహించదలుచుకున్న ఎనిమిది అంశాలను ముందుగా ఎంచుకుంటారు:

౧. సమస్యాపూరణం
౨. దత్త పది
౩. వర్ణన
౪. ఆశువు
౫. వ్యస్తాక్షరి
౬. నిషిద్దాక్షరి
౭. న్యస్తాక్షరి
౮. చంధోభాషణం
౯. పురాణపఠనం
౧౦.అప్రస్తుత ప్రసంగం
౧౧. ఘంటా గణనం ( లేక సుమగణనం?)
౧౨. చదరంగం

వీటిలో ఏవేని ఒక ఎనిమిది తీసుకొని అష్టావధానం చేస్తారు.  పై ద్వాదశం లో మొదటి పదీ సాహితీ పరమైన అంశాలు. మొదటి నాలుగు, మరియు అప్రస్తుత ప్రసంగం లేకుండా బహుశ: ఏ అష్టావధానం ఉండదు. ఒక్కక్క అంశానికి ఒక్క పృఛ్చకుడు/పృఛ్చకురాలు ఉంటారు. ఒక అధ్యక్షులు/సమన్వయకర్త ఉంటారు. ఇష్టదేవతా స్తుతి, గురుస్తుతి, పుర స్తుతి తో అవధాని ప్రారంభిస్తారు. తరువాత పృఛ్చకులు తమతమ అంశాలలో ప్రశ్నలను అడుగుతారు. ప్రశ్న అడిగిందే తడవుగా అవధాని మొదటి పాదాన్ని చెబుతారు. వెంటనే తరువాతి పృఛ్చకులు తమ ప్రశ్న అడుగుతారు. మధ్యలో అప్రస్తుత ప్రసంగి తనకు ఇష్టమున్న విషయాని ప్రస్తావించవచ్చు, అడగవచ్చు. ఒకవేళ పృఛ్చకులు అడిగినదానికో అవధాని చెప్పినదానికో అభ్యంతరాలుంటే అధ్యక్షులవారు పరిష్కరించాలి.

ఉదాహరణకి దత్త పది,సమస్యా,వర్ణన,నిషిద్దాక్షరిపృఛ్చకులు వరసగా కూచుంటే/తమ ప్రశ్నలడిగితే, దత్తపది మొదటి పాదం చెప్పి, సమస్య మొదటి పాదం చెప్పి , వర్ణన మొదటిపాదం చెప్పి .. మధ్యమధ్యలో అప్రస్తుత ప్రసంగి ప్రశ్నలకు తగురీతిలో సమధానంచెప్పి .. ఇలా ఎనిమిది అంశాలకు మొదటి పాదం పూర్తిచేయాలి. తిరిగి దత్తపది రెండో పాదం చెప్పాలి అప్పుడు దత్తపది ఆయన.. బాబు నేను దత్తపది ఇచ్చాను -ఇచ్చిన పదాలు ఇవి నువ్వు చెప్పిన మొదటి పాదం ఇది అని చెప్పడు. అన్నీ అవధానే గుర్తు పెట్టుకోవాలి.. అలానే మిగతా అంశాలు కూడా. రెండో పాదం తరువాత మూడోపాదానికీ ఇదేవరుస. ఇలా నాలుగు ఆవృతులయ్యేటప్పటికి అష్టావధానం పూర్తవుతుంది. దీనికి మినహాయింపు అప్రస్తుత ప్రసంగం, ఆశువు. అప్రస్తుత ప్రసంగానికి వెంటనే పెడవిసురు ( retort) ఉండాలి. ఆశువుకు పద్యం మొత్తం ఆశువుగా అడిగినవెంటనేచెప్పాలి. ఈ నాలుగు ఆవృతాలు పూర్తి ఐన తరువాత ధారణ చేయాలి అంటే దత్త పది,సమస్యా,వర్ణన,నిషిద్దాక్షరి మిగతా అంశాలకు తను చెప్పిన పద్యాలు వరుసగా పొల్లుపోకుండా అప్పచెప్పాలి. (ఆశువు కు?) అప్రస్తుత ప్రసంగానికి ధారణ లేదు. ఒకసారి అవధాని ధారణ మొదలు పెట్టిన తరువాత అప్రస్తుత ప్రసంగి/పృఛ్చకులు ఎవరూ మాట్లాడరాదు. ధారణ తో అవధానం పూర్తవుతుంది. తరువాత కార్యక్రమం ఇక వేడుక -సన్మానాలు, సత్కారలు, ప్రశంసలు, బిరుదులూ,ఇత్యాదులు.

పై ౧౦ అంశాలగురించి క్లుప్తంగా:

౧. సమస్యాపూరణం :
ఏదైనా అసంబద్ధ విషయన్ని ఇస్తే దానిలో అసంబద్ధత తొలగించి ఇది సాధరణ విషయమే నన్నట్టు పద్యం చెప్పి మెప్పించాలి. సామాన్యం గా పదాల విరుపుతోనో , అక్షరాల చేరికతోనో, కాకుంటే క్రమాన్వయంతోనో పరిష్కరిస్తూ ఉంటారు. ఆంధ్రనాట, మంచి ఆదరణ నోచుకున్న సాహితీ ప్రక్రియ.అవధానాల్లోనేగాక, సమస్యాపూరణం సొంత కాళ్లమీద కూడా నడుస్తోంది. ఆకాశావాణి, దూరదర్శనం, భవిష్యవాణి లాంటి కొన్ని పత్రికలు, ఇంకా బ్లాగ్‍సాహితీప్రియులు దీని విశ్వవ్యాప్తికి బహుదాకృషి చేస్తున్నారు.
౨. దత్త పది:
ఏవేని నాలుగు పదాలు ఇచ్చి , ఒక ఘట్టము/ సంధర్భము ఇస్తే ఇచ్చినపదాలనుపయోగించి కోరిన ఘట్టాన్ని కోరిన చంధం లో చెప్పాలి. సమస్యాపూరణతో సరి ప్రాధాన్యమున్న ప్రక్రియ.
౩. వర్ణన:

ఇచ్చిన అంశాన్ని వర్ణిస్తూ పద్యం చెప్పాలి. శ్లేష /ద్వర్ధి కూడా అడగవచ్చు. ఒక అవధానం లో తాడిచెట్టు/విష్ణుమూర్తి మీద పద్యం చెప్పమని అడిగారు అంటే పద్యాన్ని తాడిచెట్టు అన్వయించుకొని అర్ధం చెప్పుకోవచ్చు.విష్ణుమూర్తి అన్వయించుకొనీ అర్ధం చెప్పుకోవచ్చు. ( అవి పాత రోజులులెండి)
౪. ఆశువు:
ఇచ్చిన విషయం మీద ఆశువుగా పద్యం చెప్పాలి.
౫. వ్యస్తాక్షరి:
పృఛ్చకుడు ౧౮-౨౦ అక్షరాల సమాసాన్ని లేదా పద్యపాదాన్ని ఒక్కొక్క అక్షరం చొప్పున ఇస్తారు. అన్ని అక్షరాలు ఇచ్చిన తరువాత , నాలుగో ఆవృతిలో ఆ సమాసము లేదా పద్యపాదం చెప్పాలి.

౬. నిషిద్దాక్షరి:
ఇది కష్టమైన ప్రక్రియ, పృఛ్చకునికి అవధానికి సమ ఉజ్జీగా ఆలోచించాలి, ప్రతి అక్షరానికి అవధాని తరువాత ఏ అక్షరం వేస్తాడో ఊహించి దానిని నిషేదించాలి. మొదటి ఆవృతి లో మొదటి పాదం ,రెండో ఆవృతి లో రెండో పాదం చొప్పున నాలుగు ఆవృతులలో పూర్తి చేయాలి.

౭. న్యస్తాక్షరి:
పృఛ్చకుడు నాలుగు అక్షరాలు ఇస్తారు. ఒక్కొక అక్షరం పద్యంలో ఏ పాదంలో ఎన్నవ అక్షరంగా రావాలో చెబుతారు. ఇచ్చిన అక్షరాలను నిర్దేశిత స్థానాలలో వేసి అడిగిన విషయం మీద పద్యం చెప్పాలి.

౮. చంధోభాషణం:
పృఛ్చకుడు అవధాని ఒక విషయం గూర్చి చంధోబద్ధంగామాట్లాడతారు. అంటే సంభాషణ మొత్తం పద్యాలలోనే అన్నమాట.
౯. పురాణపఠనం:
పృఛ్చకుడు ఒక పురాణ ఘట్టాన్ని ప్రస్తావిస్తే అవధాని దాని పూర్వాపరాలు తెలపాలి.
౧౦.అప్రస్తుత ప్రసంగం:
ఇది బహుళ ప్రచారానికి నోచుకున్న అంశం. అవధానికి పృఛ్చకమహాశయునికి మధ్య చమత్కార సంభాషణం.
౧౧. ఘంటా గణనం ( లేక సుమగణనం?):
పృఛ్చకుడు అవధానం మొదలు ధారణవరకు ఎన్ని మార్లు ఘంటానాదం చేశారో/ పూలు విసిరారో చెప్పాలి.
౧౨. చదరంగం : చదరంగపు ఆట.

2 వ్యాఖ్యలు:

రాజ్ కుమార్

చాలా వివరంగా చెప్పారండీ ధన్యవాదాలు..
నాకు ఐడియా ఉందిగానీ ఇంత డీటెయిల్డ్ గా తెలీదు.

అవధానులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు

శ్రీలలిత

చాలా గొప్పపని తలపెట్టారు. దిగ్విజయంగా నడవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008