Saturday, 30 March 2013

శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం (మాలిక పత్రిక సౌజన్యంతో)




మాలిక పత్రిక  తరఫున  రేపు సాయంత్రం భారతీయ కాలమానం ప్రకారం  6 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు రెండవ అంతర్జాల అష్టావధానం నిర్వహించబడుతుంది. ఇదే శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం. ఈసారి అవధాన కార్యక్రమం మొత్తం ఆహారానికి సంబంధించినదై ఉంటుంది. చూడాలి మరి ఎంత రసవత్తరంగా సాగుతుందో....  ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా శ్రీ శాకంబరీ పేరిట ఒక గ్రూపు ప్రారంభించబడి అందులోనే  చర్చలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ఒక తుది రూపానికి తీసుకురావడం జరిగింది. అందులో అవధానిగారు,  పృచ్ఛకులు, మాలిక ప్రతినిధులు పాల్గొని అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు..


ఈ అవధాన కార్యక్రమంలోని ముఖ్య అంశాలు, పృచ్ఛకుల వివరాలు:


మొదట నిర్వాహకుల స్వాగత వచనాలు.
తరువాత అవధాని గారి స్వపరిచయం, వరుసగా పృచ్ఛకుల స్వపరిచయం, అతిథుల స్వపరిచయం...
అవధాన ప్రారంభం
అవధానిగారి చేత దైవ ప్రార్థన, స్వవిషయం, (అవసరమనుకుంటే) అవధాన ప్రక్రియా పరిచయం, ప్రాశస్త్యాలు పద్యాలలో...
నాలుగు ఆవృత్తుల వరుసక్రమం ఇలా  ఉంటుంది.
1.నిషిద్ధాక్షరి
2.మొదటి దత్తపది
3.రెండవ దత్తపది
4.మొదటి సమస్య
5.రెండవ సమస్య
6.వర్ణన
అప్రస్తుత ప్రసంగం నిర్వహించే పృచ్ఛకులకు ఎప్పుడైనా మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. నిరంకుశులు కదా!
చివర అవధాని గారు, నిర్వాహకుడు ధన్యవాదాలు తెలుపడంతో అష్టావధాన కార్యక్రమం ముగుస్తుంది.



అష్టావధాని :  డా . మాడుగుల అనిల్ కుమార్ గారు, ఎం .ఎ ; బి.ఎడ్ ;  పీహెచ్ .డి.
(సంస్కృతోపన్యాసకులు , శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల , తిరుపతి)


అధ్యక్షులు మఱియు సంచాలకులు : శ్రీ చింతా రామ కృష్ణారావుగారు,  భాషా ప్రవీణ , ఎం .ఎ


 పృచ్ఛకులు :

1. నిషిద్ధాక్షరి :  శ్రీ చింతా రామ కృష్ణారావు గారు 
                     
2. నిషిద్ధాక్షరి :  శ్రీ ముక్కు రాఘవ కిరణ్ గారు

3. దత్తపది   :  శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు

4. దత్తపది  డా . శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ గారు

5. సమస్య  : శ్రీ యం.నాగగురునాథశర్మగారు

6. సమస్య  : శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు

7. వర్ణన    :   శ్రీమతి వలబోజు జ్యోతిగారు

8.అప్రస్తుత ప్రసంగం :     శ్రీ నల్లాన్ చక్రవర్తుల కిరణ్ గారు


మరో ముఖ్యమైన విషయం: ఈ అవధాన కార్యక్రమాన్ని ఆస్వాదించి, ఆనందించాలనుకునే వారికోసం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అది మాలిక  పత్రికలో రేపు సాయంత్రం ఆరునుండి మొదలవుతుంది. తప్పుకుండా చూడండి మరి..  ప్రతీ ఐదు నిమిషాలకోసారి ఈ పేజిన్ Refresh / Reload చేస్తుండాలి. ఈ ప్రత్యక్షప్రసార బాధ్యతలు నిర్వహిస్తున్నది భరద్వాజ్ వెలమకన్ని..

మాలిక పత్రిక : http://magazine.maalika.org

Thursday, 28 March 2013

శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం (మాలిక పత్రిక )






శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం
భారతీయ కాలమానం ప్రకారం 31st  March 2013    సాయంత్రం ఆరుగంటలనుండి రాత్రి తొమ్మిదివరకు
పూర్తి వివరాలు ఎల్లుండి విడుదల చేయబడతాయి...

గతంలో విజయదశమి సంధర్భంగా మాలిక పత్రిక నిర్వహించిన మొదటి అంతర్జాల అవధానం మిక్కిలి ప్రశంసలు  పొందింది. ఈ ఉత్సాహముతో విజయనామ నూతన సంవత్సరాది సందర్భంగా మరోమారు ఈ అంతర్జాల అవధాన ప్రయోగాన్ని చేయ తలపెట్టింది. కాని ఈసారి కాస్త ప్రత్యేకత ఉంది. ఈసారి అవధాన కార్యక్రమంలో మొత్తం అందరికీ ఇష్టమైన ఆహారం గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుంది. అందుకే శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం అని నామకరణం చేయబడింది. ముందుగా ఈ శాకంబరి దేవిని స్మరించుకుందాం..

 అడగకుండానే ఆకలి తీర్చేది అమ్మ.  తనకు కష్టమని తలంచకుండా ఎవరికి ఇష్టమైన రీతిగా వాళ్లకు చేసిపెట్టేది తల్లి.
శాకంబరిదేవి మనిషి ఆకలిని తీర్చడానికి ఉద్భవించిన తల్లి. క్షామం నుంచి విముక్తం చేయడానికి ఎప్పుడూ ఆకలి దరి చేరకుండా ఉండడానికి భక్తులు శాకంబరి దేవిని పూజిస్తారు. అమ్మవారి ఉత్సవాలలో వివిధరకముల శాకములు (కూరగాయలతో అలంకరించి పూజలు చేస్తారు) శాకంబరి నీలవర్ణ దేహంతో సుందరంగా ఉంటుంది. కమలాసనంపై కూర్చుండి, పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకుని, మిగతా చేతులలో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు తదితర కూరగాయలు ధరించి ఉంటుంది.
శాకంబరి ఎవరు?
దేవీ భాగవతంతో పాటు మార్కండేయ పురాణాంతర్గత చండీసప్తశతిలో శాకంబరి గురించి వివరించబడి ఉంది. హిరణ్యాక్షుని వంశంవాడైన దుర్గముడనే రాక్షసుని అకృత్యాల వల్ల దేవతల శక్తి క్షీణించి, ప్రకృతి వైపరీత్యం ఏర్పడి, నీటి చుక్క లేకుండా నూరు సంవత్సరాలపాటు క్షామ పరిస్థితులు ఏర్పడి, ప్రాణకోటి ఆపదలో ఉన్న సమయంలో భూమి మీద ఉన్న మునీశ్వరులు జగన్మాతను ప్రార్థించగా... ‘‘నేను అయోనిజగా అవతరించి, నూరు కన్నులతో చూస్తూ, మునులను లోకాలను కాపాడతాను. ఆ తర్వాత నా దేహం నుంచి శాకములను పుట్టించి ప్రజల ఆకలి తీరుస్తూ మళ్లీ వర్షాలు కురిసేంత వరకు ప్రాణికోటిని, జనులను కాపాడతాను’’ అని వరమిచ్చి, ఆవిధంగానే అవతరించి, ప్రాణకోటిని రక్షించి, శాకంబరీదేవిగా పూజలందుకుంది.  


 అసలు అవధానం అంటే ఏమిటి? వివరాలు తెలుసుకోవాలంటే:




ఇంతకు ముంధు మాలిక పత్రిక నిర్వహించిన వాణి - మనోహరి అంతర్జాల అవధానం వివరాలు

వాణి - మనోహరి

Saturday, 23 March 2013

ఈ ఒక్క రోజు నన్ను వదిలేయండి ప్లీజ్..


ఈ ఒక్క రోజు నన్ను వదిలేయండి ప్లీజ్....



 చాలాకాలంగా మిత్రులెందరో నన్ను కధలు రాయడం మొదలుపెట్టండి అంటూనే ఉన్నారు. కాని నాకే ధైర్యం చాలడం లేదు. వ్యాసాలు రాయడం ఐతే పట్టు దొరికింది కాని కధలు అంటే అమ్మో అనుకున్నా. అందుకే ముందు కధలు చదవడం మొదలుపెట్టాను. ఎలాగోలా ధైర్యం చేసి ఈ చిన్ని కధ (పేజీల లిమిట్ ఉండింది మరి) రాసా. బావున్నా, బాలేకున్నా చెప్పండి. సర్ధుకుని, మరింత ధైర్యం తెచ్చుకుని కధలు రాయడం కంటిన్యూ చేస్తాను. :)


ఆడవాళ్లు ఆదివారం సెలవు కావాలంటే వెక్కిరించారు. గేలి చేసారు. సినిమాలు తీసారు. ఐనా ఎవ్వరూ మారలేదు. అందుకే ఇలా చేస్తే బావుంటుందని నా ఆలోచన.. కాని ఎంతమంది ఇలా ధైర్యం చేసి తమగురించి తాము నిర్ణయం తీసుకోగలరు??



‘‘తిన్న తర్వాత అందరూ హాల్లో కూర్చోండి. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి’’ రాత్రి పది గంటలకు భర్త, పిల్లలిద్దరికి భోజనాలు పెడుతూ చెప్పింది ఇందిర.

‘‘ఇప్పుడే చెప్పొచ్చుగా మమ్మీ.. మళ్లీ హాల్లో కూర్చోవడం ఎందుకు?’’ అన్నాడు కొడుకు చైతన్య.

‘‘అబ్బా..! మమ్మీ రేపు ఆదివారం కదా. అందరూ ఇంట్లోనే ఉంటారు. నాకు పని ఉంది. రేపు మాట్లాడుకుందాంలే’’ అంది కూతురు సౌమ్య.

‘‘ఇందూ! అంత అర్జంట్‌గా మాట్లాడేది ఏముంటుంది? పిల్లలెందుకు? నాతో చెప్పొచ్చుగా?...’’ మొబైల్ మాట్లాడుతూ అన్నాడు భర్త రాజేష్.

‘‘నేను చెప్పే విషయం మీ ముగ్గురికీ సంబంధించిందే. తొందరగా తినండి.. మాట్లాడాక ఎవరి పనులు వాళ్లు చేసుకోండి’’ అంది ఇందిర.

అరగంట తర్వాత నలుగురూ హాల్లో కూర్చున్నారు. ఇందిర టీవీని కూడా ఆపేసింది. ‘‘అబ్బా! మమ్మీ క్రికెట్ మాచ్ వస్తుంది. మాట్లాడుతూ టీవీ చూస్తే ఏమైంది? ఎందుకు ఆపేస్తావ్?’’ విసుక్కున్నాడు చైతన్య.

‘‘నోరు మూసుకో. ఎప్పుడూ మొబైల్‌లో ముచ్చట్లు, కంప్యూటర్ ముందు లేదా టీవీ ముందు తప్ప వేరే ఏవీ కనపడవు మీ ఇద్దరికీ’’.

‘‘తొందరగా చెప్పు మమ్మీ. ఈ సస్పెన్స్ ఏంటి?’’ అంది సౌమ్య.

రాజేశ్ మాత్రం ఎన్నడూ లేనిది ఇందిర ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా? అని ఆలోచిస్తున్నాడు. అతను కొద్ది రోజులుగా మౌనంగా, ఏదో ఆలోచనల్లో ఉంటున్నా గమనిస్తూనే ఉన్నాడు ఇందిరని. తాను బిజనెస్ పనులలో తలమునకలుగా ఉన్నందున ఆమెను- ‘ఏమైందని?’ అడగలేకపోయాడు. ఆరోగ్యంగా ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంది కదా! అని అంతగా పట్టించుకోలేదు. ఏమై ఉంటుందా? అని ఆలోచనలో పడ్డాడు రాజేశ్.

‘‘నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు. మీ అందరితో చర్చించాల్సిన అవసరం కూడా కనపడలేదు నాకు. కొంతకాలంగా నాలో నేను మదనపడుతూ చివరికి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక నుండి ప్రతి ఆదివారం నేను ఇంట్లో ఉండను. ఈ ఒక్కరోజు నా కోసం నన్ను వదిలేయండి... నాకు ఇష్టమైన, నాకు సంతృప్తినిచ్చే పని చేయడానికి వెళ్తున్నా. ఇన్నేళ్లుగా భర్త, పిల్లలు, బంధువులు అంటూ అసలు నాకంటూ కోరికలు ఉన్నాయని కూడా మర్చిపోయాను. దానికి నేను బాధపడడం లేదు. ఇప్పుడు మీరు పెద్దవాళ్లయ్యారు. మీకు నా అవసరం అంతగా లేదు. నా మీద ఆధారపడి లేరు. మీకు ఇష్టమైన పనులు మీరు చేసుకోవాలనుకున్నప్పుడు నేనెందుకు నా ఇష్టాలను చంపుకోవాలి? మీ అవసరాలే నాకు ఇష్టాలా?’’ అడిగింది ఇందిర.

‘‘ఇందూ! ఇప్పుడింతగా ఎందుకు? నీకేం తక్కువైంది? డబ్బుకు ఎప్పుడూ కొదువ లేదు. టీవీ చూడు, పూజలు, వ్రతాలు చేసుకో లేదా కిట్టీ పార్టీలకు వెళ్లు. నాతో మీటింగులకు, పార్టీలకు రమ్మంటే రావు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటానంటావ్? నీకలా ఉండడమే ఇష్టం కదా! ఇప్పుడేమైంది మరి?’’ అడిగాడు రాజేశ్.

‘‘మమీ..! నీకు ఇష్టమైన చీరలు, నగలు కొంటానంటే డాడీ వద్దనరు కదా.. ఇంట్లో అన్నీ ఉన్నాయి. కారు ఉంది బయటకు వెళ్ళడానికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లడానికి. కానీ- నీకు ఉన్నది ఒకే ఫ్రెండు. ఇంట్లోనుండి బయటకు కదలవు. మా అందరి ఇష్టాలను తెలుసుకుని అన్నీ తీరుస్తున్నావు. మా సంతోషమే నీ సంతోషం కదా! ఇంకా ఇష్టాలు, కొత్త పని ఏంటి? అసలు నువ్వు పని చేయాల్సిన అవసరమేంటి? అదీ ఈ వయసులో? మరీ టూ మచ్’’ విసుక్కున్నాడు చైతన్య.

‘‘అసలు నాకు ఏమిష్టమో మీకెవరికైనా తెలుసా? కడుపు నిండా తిండి, మంచి బట్టలు, నగలు, ఆర్థిక ఇబ్బంది అసలే లేని జీవితం. ఇవేనా..? మీరనుకునే నా ఇష్టాలు, కోరికలు. అంతకంటే వేరే ఏవీ ఉండవా? ఎప్పుడైనా నన్ను అడిగారా? నాకు ఇష్టమైన వస్తువులు, పని ఏంటి? మనస్ఫూర్తిగా నీకు ఏం కావాలి అని? మీ అందరి ఇష్టాలు, అభిరుచులను తీర్చడమో, తీర్చుకునేలా సహాయం చేయడమో చేసాను. ఇప్పుడు నా గురించి నేనే ఆలోచించుకోవాలనుకుంటున్నాను. నాకు ఏమవసరమో, ఇష్టమో నేనే తెలుసుకుని తెచ్చుకుంటాను. కనీసం ఇప్పుడైనా నాకంటూ కొంత సమయం కేటాయించుకోనివ్వండి..’’

‘‘ఓకే! ఏం చేయాలనుకుంటావ్ మమ్మీ?’’ అంతవరకు వౌనంగా ఉన్న సౌమ్య అడిగింది.

భర్త రాజేశ్, కొడుకు చైతన్య కూడా ఆసక్తిగా చూసారు. ఏం చెప్తుందో..? అని.

‘‘రేపటి నుండి నేను పొద్దున్నే ఎనిమిది గంటలకు వెళ్లిపోతాను. ఇల్లంతా మీరే చూసుకోవాలి. ప్రతి ఆదివారం మీకు సెలవు కావాలి, రెస్ట్ కావాలంటారు. ఇంట్లో ఉండి ఏ పనీ చేయకుండా అన్నీ స్పెషల్స్ చేయమంటారు. కూర్చున్న దగ్గరికే అన్నీ తెచ్చివ్వమంటారు. ఏమంటే? వారమంతా కష్టపడ్డాం కదా, రెస్ట్ కావాలి అని... మరి నాకు ఎప్పుడు రెస్ట్? అందుకే ఆ రెస్ట్,  నా సంతృప్తి కోసమే- ఒక రిటైర్డ్ లెక్చరర్ దగ్గర తెలుగు అనువాదాలు చేసి, తెలుగు టైపింగ్ చేయడానికి ఒప్పుకున్నాను... మధ్యాహ్నం సంగీతం, వీణ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. సాయంత్రం ఆరు గంటలకు తిరిగొస్తాను. అంతవరకు మీ పనులన్నీ మీరే చూసుకోండి.. చేసుకోండి..’’ అని కాస్త ఆగింది ఇందిర.

తల్లి అలా గట్టిగా చెప్పేసరికి పిల్లలిద్దరూ షాక్ అయ్యారు. ఏమనాలో తెలీలేదు. వద్దు అన్నా ఆగేట్టు లేదు అని అర్థమైపోతోంది. అసలు అమ్మ బయటకెళ్లాల్సి పనేంటి? ఇంట్లో ఉండొచ్చుగా? ఇప్పుడు సంగీతం, వీణ నేర్చుకుని ఏం చేస్తుంది? కచేరీలు ఇస్తుందా? ఈ వయసులో నేర్చుకుని ఏం చేయాలి? ఎవరిని ఉద్ధరించాలి? మరి రేపు మమ్మీ ఇంట్లో లేకుంటే ఎలా? ముఖ్యంగా భోజనం. హాయిగా సెలవు రోజున బ్రేక్‌ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు ఏదో ఒక స్పెషల్ చేస్తుంది. మరి సడెన్‌గా ఇప్పుడేమైంది? అని ఏమీ మాట్లాడకుండా లేచి తమ గదుల్లోకి వెళ్లిపోయారు. రాజేష్, ఇందిర వౌనంగా కూర్చున్నారు. ఇందిర మనసులో ఎటువంటి కల్లోలం లేదు- దృఢనిశ్చయం తప్ప. రాజేశ్ మాత్రం ఆమెను చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఇందిర వెళ్లి తలుపులన్నీ చెక్ చేసి పడుకుంది. రాజేశ్ ఎప్పుడు పడుకున్నాడో తనకే తెలీదు.

రోజులాగే తొందరగా నిద్ర లేచి స్నానం, పూజ చేసుకుని టీ చేసి తనకో కప్పు, భర్తకో కప్పు తీసుకుని బెడ్‌రూంలోకి వెళ్లింది. పేపర్ చదువుతున్న భర్తకు కప్పు ఇచ్చి తను కూడా టీ తాగింది. ‘‘నేను వెళ్తున్నా.. మీరు చూసుకుంటారు కదా..!’’ అని సందేహపడుతూనే అడిగింది.. తలెత్తిన రాజేశ్ ప్రశాంతంగా చూసి ‘‘డోంట్ వర్రీ ఇందూ. నువ్వెళ్లు. నేను ఉంటాను.. వీలైతే మీ తమ్ముడింటికి వెళ్లు సాయంత్రం..’’

ఎనిమిదైనా ఇంకా అలాగే నిద్రపోతున్న పిల్లలను ఓసారి చూసి నిశ్చింతగా, ధైర్యంగా బయటకు నడిచింది ఇందిర.

Thursday, 14 March 2013

Happy Women's Day






"హలో!"
"హలో! ఎవరూ! శ్యామలా?" ఏంటి చెప్పు? చాలా రోజులకు కాల్ చేసావ్?"
"Happy Womens Day వదిన..."
".........................."
"హలో వదిన!! ఉన్నావా? ఏంటి సైలెంట్ అయ్యావ్ .. మాట్లాడటం లేదేంటి? హలో.."
"ఉన్నా! పొద్దుటినుండి పేపర్లలో, పత్రికలలో, టీవీలో, రేడియోలో, ఫేస్‌బుక్‌లో ఈ వుమన్స్ డే గోల చూసి తిక్కతిక్కగా ఉంది. అందుకే నీ మాట వినగానే కోపంతో తిట్టలేక సైలెంట్ అయ్యా"
"కోపమా? ఎందుకు? ప్రపంచమంతా జరుపుతుంటున్నారు కదా అని నేను విష్ చేసా.. తప్పా?"
"తప్పా! తప్పున్నరా!!... అసలు ఈ వుమన్స్ డేని కనిపెట్టినోడిని, ఇలా   జరుపుకోండని ప్రచారం చేసేవాళ్లని పాత న్యూస్ పేపర్లు  వేసి తగలెట్టాలి. ఇదో జాఢ్యంలా తయారైంది.."
"అయ్యో! చాలా హై లెవెల్ లో కోపంగా ఉన్నట్టున్నావ్? ఐనా ఎవరైనా కిరోసిన్ పోసి తగలెడతారు. పిడకలు, కట్టెలతో తగలెడతారు.నువ్వేంటి పాత న్యూస్ పేపర్లని కొత్త ఐడియా చెప్తున్నావ్?"
"అదే మరి... ఈ పేపర్లు పత్రికలు బిల్లు నెలకు ఐదొందలకు తక్కువ కాదు కదా... అవే అమ్మితే యాభై కూడా రావు.అంతకంటే చిత్తు, చెత్త ఏముంది తగలెట్టడానికి. గాసు, కిరోసిన్ దొరకవాయే.. ఏంటి  నామాటలు నీకు ఎగతాళిగా ఉన్నాయా?"
"లేదొదినా! ఎగతాళి ఏంటి? అసలు జరిగిందేంటి చెప్పు?"
"ఏదో ఉద్ధరిచ్చాము, సాధించాము అని తెగ ఆవేశంగా అందరూ వుమెన్స్ డే, మహిళ దినోత్సవం, మన్నూ మశానము అని జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా అదే గోల కాదేటి? నిజంగా ఆడవాళ్లలో ఎంతమంది గొప్ప గొప్ప విజయాలను సాధించారు. ఎంతమంది ప్రతిభ అందరికీ తెలుస్తుంది.పది శాతం మందిని పైకి చూపించి వాళ్లకు సన్మానం చేసి  అదే మహిలా దినోత్సవం అంటే సరిపోతుందా? మనలాంటి గృహిణులకు ఈ మహిలా దినోత్సవం జరుపుకున్నందువల్ల వీసమెత్తైనా లాభం సంగతి వదిలిపెట్టు,, మార్పు కలుగుతుందా. ఇలా విషెస్ చెప్పుకోవడం తప్ప ఆ ఒక్క రోజన్నా ఒక్క పనైనా తగ్గుతుందా.. అన్ని రోజుల లాగే అది కూడా ఒక రోజు కాదా?
"నిజమే సుమా!"
"అసలు ఉద్యోగాలు చేసినా చేయకున్నా, ఆడవాళ్లు తమ ఇంటిపని తప్పించుకునే, తగ్గించుకునే మార్గం ఉందా? ఏప్పుడో పుష్కరాలకన్నట్టు ఓకటి రెండు యాత్రలు చేయించి అదే మన మొహాలకు ఎక్కువ అంటారు. ఇంటిపనంతా చేసి టీవీ చూస్తామా?.  అదో నస.. ఎప్పుడు చూసినా టీవీలో మునిగిపోతావు. కాస్త ఇంటి సంగతి చూడు అని. ఎక్కడ తప్పు వెతుకుదామా అని చూస్తుంటారు...ఎవరో కొందరు మహా టీవీ పిచ్చోళ్లు ఉంటారులే. పోనీలే చూడనీ అనరు. మగాళ్లు మాత్రం క్రికెట్టు, న్యూస్ మాత్రం వదలకుండా చూస్తారు. అవేమన్నా ఉద్ధరిస్తాయా? అంటే ఏమీ లేదు. సీరియళ్లు చూసినా, క్రికెట్టు చూసిన, వార్తలు చూసినా టైంపాస్, టైం వేస్ట్ అని అందరికీ తెలుసు. ఐనా ఆడాళ్ల మీదే ఎందుకు ఏడ్పు?"
"నిజమే కాని... మనం ఎంత అరిచినా, మొత్తుకున్నా ఎవరికి అర్ధమవుతాయి ఇవన్నీ?"
"నోరు మూసుకుంటుంటే అలాగే అంటుంటారు. అదే కాదు. ఊరికే టీవీ చూస్తున్నావు, షాపింగ్ అని డబ్బులన్నీ ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు, ఫ్రెండ్స్ తో కలిసి పనికి రాని ముచ్చట్లు తప్ప నువ్వు చేసేదేమీ లేదు ఎప్పుడు బాగుపడతావో అని అంటుంటే కంప్యూటర్ నేర్చుకుని ఏదో మన కిష్టమైన కథలు, కవితలు, పాటలు... ఏదో చదువుకుంటూ గడిపేస్తున్నామా? దానికీ ఎగతాళి చేయడం. ఎంత ఇంటిపనంతా చేసి కంప్యూటర్ ముందు కూర్చుని మనకు ఇష్టమైన పని చేసుకుంటున్నా సరే ఏదో ఒక తప్పు బయటకు తీసి అస్తమానం ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటావ్. అందుకే ఇల్లు ఇలా తగలడింది. ఇంటి పని ముందు చూసుకో అంటారా లేదా?"
"మీ ఇంట్లో కూడా సేమ్ స్టోరీనా వదినా?"
"మరే!! వంట చేస్తూ, బట్టలు ఉతుకుతూ, ఇల్లు సర్దుతూ, నీళ్లు పడుతూ, గిన్నెలు కడుగుతూ మధ్యలో ఇక్కడ ఫేస్‌బుక్కు, బ్లాగులు , పత్రికలు చూస్తుంటే కూడా భరించలేరు. ఇంట్లో ఎంత పని చేసినా కనపడదు. తీరిగ్గా కంప్యూటర్ ముందు కూర్చుని మన పని చేసుకుంటుంటామా అఫ్పుడు వస్తుంది ఇంట్లొవాళ్లకు కష్టం? వాళ్లు కూర్చుని చేసుకునేది పనికొచ్చే, దేశాన్ని ఉద్ధరించే పనులు. మనం చేసేవి పనికిరానివి. మనం ఇలా కంప్యూటర్ పనో, పుస్తకాలు చదువుకోవడమో, రాసుకోవమో చేసుకుంటుంటే మన పని ఏమైనా పంచుకుంటారా? బట్టలు మడతపెడతారా? గిన్నెలు సర్దుతారా? ఇల్లు సర్దుతారా? కనీసం మనకు ఇవ్వకుంటే  పోనీ వాళ్ల కోసం టీ కాని, నీళ్లు కాని తెచ్చుకుంటారా? లేదే? ఎంత సీరియస్ వర్కులో ఉన్నా మనమే లేచి మరీ చేసివ్వాలి. వాళ్ళు కంప్యూటర్ల ముందు కూర్చుంటే మనమే సేవలు చేయాలి. మన పని చేసుకుంటున్నా సరే మధ్యలో వదిలేసి వాళ్ళు అడిగినవి చేసి పెట్టాలి?  కాదంటావా?"
"నువ్వలా చెప్తే నాకు కోపం కాదు గాని బాధ కలుగుతుంది వదినా"
"ఇంకో విషయం మర్చిపోయా !!!..  ఇంటిపనంతా చేసి కంప్యూటర్ ముందు కూర్చుని మన పని చేసుకుంటుంటామా? అప్పుడు మన మీద అంతులేని ప్రేమ పొంగుకొస్తుంది. వెళ్లి పడుకోరాదూ. ఇపుడు కంప్యూటర్ ముందు కూర్చోవడం అవసరమా? నీ హెల్త్ పాడవుతుంది. మళ్ళీ కాలు నొప్పి, తల నొప్పి అంటావ్.. అంటారు. అంటే ఇంటి పని చేస్తుంటే మనం అలిసిపోము. నొప్పులు ఉన్నా కనపడవు. అన్ని పూర్తి  చేసుకుని ఇలా కూర్చుంటే మాత్రం లింకులన్నీ కలిపేస్తారు. తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, అన్నింటికి కారణం మనం కంప్యూటర్ ముందు కూర్చోవడం... రైట్... ఇంట్లో ఇలా ఉందా? ఫేస్ బుక్ లో మరో తలతిక్క మేళం.. ఏదో ఇంటర్నెట్ unlimited కదా అని పాటలు వింటూ, పని చేసుకుంటూ,  కంప్యూటర్ ఆన్ లో పెట్టేస్తామా? మన పేరు పక్కన గ్రీన్ లైట్ చూసి ఈవిడకు పనీపాట లేదు. ఇంట్లో మొగుడు, పిల్లలను పట్టించుకోకుండా అస్తమానం కంఫ్యూటర్ ముందు కూర్చుంటుంది అనుకుంటారు. అదీ కూడా చాటింగ్ చేస్తూందని.. అందరూ వాళ్లలాగే ఫేస్ బుక్ లో టైమ్ పాస్ కోసమే కూర్చున్నారనుకుంటారు. రాత్రిపూట కనిపిస్తే మరీ ఘోరం.. అసలు వీళ్లందరికి మనమేం చేస్తే ఎందుకంట?
"నిజమే!!"
"మరి ఇలాంటప్పుడు  మన మొహాలకు  Woman's Dayలు అవసరమా? ......మళ్లీ  చెప్పకు. అలాగే Happy Dasara, Happy Diwali, Happy Holi కూడా. అసలు మన హిందూ పండగలకు హ్యాపీ అంటూ విష్ చేసుకోవడమేంటి మాయరోగం కాకుంటే..



ఈ డైలాగులు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.... ఎక్కడబ్బా???

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008