ఈ ఒక్క రోజు నన్ను వదిలేయండి ప్లీజ్..
ఈ ఒక్క రోజు నన్ను వదిలేయండి ప్లీజ్....
చాలాకాలంగా మిత్రులెందరో నన్ను కధలు రాయడం మొదలుపెట్టండి అంటూనే ఉన్నారు. కాని నాకే ధైర్యం చాలడం లేదు. వ్యాసాలు రాయడం ఐతే పట్టు దొరికింది కాని కధలు అంటే అమ్మో అనుకున్నా. అందుకే ముందు కధలు చదవడం మొదలుపెట్టాను. ఎలాగోలా ధైర్యం చేసి ఈ చిన్ని కధ (పేజీల లిమిట్ ఉండింది మరి) రాసా. బావున్నా, బాలేకున్నా చెప్పండి. సర్ధుకుని, మరింత ధైర్యం తెచ్చుకుని కధలు రాయడం కంటిన్యూ చేస్తాను. :)
ఆడవాళ్లు ఆదివారం సెలవు కావాలంటే వెక్కిరించారు. గేలి చేసారు. సినిమాలు తీసారు. ఐనా ఎవ్వరూ మారలేదు. అందుకే ఇలా చేస్తే బావుంటుందని నా ఆలోచన.. కాని ఎంతమంది ఇలా ధైర్యం చేసి తమగురించి తాము నిర్ణయం తీసుకోగలరు??
‘‘తిన్న తర్వాత అందరూ హాల్లో కూర్చోండి. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి’’ రాత్రి పది గంటలకు భర్త, పిల్లలిద్దరికి భోజనాలు పెడుతూ చెప్పింది ఇందిర.
‘‘ఇప్పుడే చెప్పొచ్చుగా మమ్మీ.. మళ్లీ హాల్లో కూర్చోవడం ఎందుకు?’’ అన్నాడు కొడుకు చైతన్య.
‘‘అబ్బా..! మమ్మీ రేపు ఆదివారం కదా. అందరూ ఇంట్లోనే ఉంటారు. నాకు పని ఉంది. రేపు మాట్లాడుకుందాంలే’’ అంది కూతురు సౌమ్య.
‘‘ఇందూ! అంత అర్జంట్‌గా మాట్లాడేది ఏముంటుంది? పిల్లలెందుకు? నాతో చెప్పొచ్చుగా?...’’ మొబైల్ మాట్లాడుతూ అన్నాడు భర్త రాజేష్.
‘‘నేను చెప్పే విషయం మీ ముగ్గురికీ సంబంధించిందే. తొందరగా తినండి.. మాట్లాడాక ఎవరి పనులు వాళ్లు చేసుకోండి’’ అంది ఇందిర.
అరగంట తర్వాత నలుగురూ హాల్లో కూర్చున్నారు. ఇందిర టీవీని కూడా ఆపేసింది. ‘‘అబ్బా! మమ్మీ క్రికెట్ మాచ్ వస్తుంది. మాట్లాడుతూ టీవీ చూస్తే ఏమైంది? ఎందుకు ఆపేస్తావ్?’’ విసుక్కున్నాడు చైతన్య.
‘‘నోరు మూసుకో. ఎప్పుడూ మొబైల్‌లో ముచ్చట్లు, కంప్యూటర్ ముందు లేదా టీవీ ముందు తప్ప వేరే ఏవీ కనపడవు మీ ఇద్దరికీ’’.
‘‘తొందరగా చెప్పు మమ్మీ. ఈ సస్పెన్స్ ఏంటి?’’ అంది సౌమ్య.
రాజేశ్ మాత్రం ఎన్నడూ లేనిది ఇందిర ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా? అని ఆలోచిస్తున్నాడు. అతను కొద్ది రోజులుగా మౌనంగా, ఏదో ఆలోచనల్లో ఉంటున్నా గమనిస్తూనే ఉన్నాడు ఇందిరని. తాను బిజనెస్ పనులలో తలమునకలుగా ఉన్నందున ఆమెను- ‘ఏమైందని?’ అడగలేకపోయాడు. ఆరోగ్యంగా ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంది కదా! అని అంతగా పట్టించుకోలేదు. ఏమై ఉంటుందా? అని ఆలోచనలో పడ్డాడు రాజేశ్.
‘‘నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదు. మీ అందరితో చర్చించాల్సిన అవసరం కూడా కనపడలేదు నాకు. కొంతకాలంగా నాలో నేను మదనపడుతూ చివరికి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక నుండి ప్రతి ఆదివారం నేను ఇంట్లో ఉండను. ఈ ఒక్కరోజు నా కోసం నన్ను వదిలేయండి... నాకు ఇష్టమైన, నాకు సంతృప్తినిచ్చే పని చేయడానికి వెళ్తున్నా. ఇన్నేళ్లుగా భర్త, పిల్లలు, బంధువులు అంటూ అసలు నాకంటూ కోరికలు ఉన్నాయని కూడా మర్చిపోయాను. దానికి నేను బాధపడడం లేదు. ఇప్పుడు మీరు పెద్దవాళ్లయ్యారు. మీకు నా అవసరం అంతగా లేదు. నా మీద ఆధారపడి లేరు. మీకు ఇష్టమైన పనులు మీరు చేసుకోవాలనుకున్నప్పుడు నేనెందుకు నా ఇష్టాలను చంపుకోవాలి? మీ అవసరాలే నాకు ఇష్టాలా?’’ అడిగింది ఇందిర.
‘‘ఇందూ! ఇప్పుడింతగా ఎందుకు? నీకేం తక్కువైంది? డబ్బుకు ఎప్పుడూ కొదువ లేదు. టీవీ చూడు, పూజలు, వ్రతాలు చేసుకో లేదా కిట్టీ పార్టీలకు వెళ్లు. నాతో మీటింగులకు, పార్టీలకు రమ్మంటే రావు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటానంటావ్? నీకలా ఉండడమే ఇష్టం కదా! ఇప్పుడేమైంది మరి?’’ అడిగాడు రాజేశ్.
‘‘మమీ..! నీకు ఇష్టమైన చీరలు, నగలు కొంటానంటే డాడీ వద్దనరు కదా.. ఇంట్లో అన్నీ ఉన్నాయి. కారు ఉంది బయటకు వెళ్ళడానికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లడానికి. కానీ- నీకు ఉన్నది ఒకే ఫ్రెండు. ఇంట్లోనుండి బయటకు కదలవు. మా అందరి ఇష్టాలను తెలుసుకుని అన్నీ తీరుస్తున్నావు. మా సంతోషమే నీ సంతోషం కదా! ఇంకా ఇష్టాలు, కొత్త పని ఏంటి? అసలు నువ్వు పని చేయాల్సిన అవసరమేంటి? అదీ ఈ వయసులో? మరీ టూ మచ్’’ విసుక్కున్నాడు చైతన్య.
‘‘అసలు నాకు ఏమిష్టమో మీకెవరికైనా తెలుసా? కడుపు నిండా తిండి, మంచి బట్టలు, నగలు, ఆర్థిక ఇబ్బంది అసలే లేని జీవితం. ఇవేనా..? మీరనుకునే నా ఇష్టాలు, కోరికలు. అంతకంటే వేరే ఏవీ ఉండవా? ఎప్పుడైనా నన్ను అడిగారా? నాకు ఇష్టమైన వస్తువులు, పని ఏంటి? మనస్ఫూర్తిగా నీకు ఏం కావాలి అని? మీ అందరి ఇష్టాలు, అభిరుచులను తీర్చడమో, తీర్చుకునేలా సహాయం చేయడమో చేసాను. ఇప్పుడు నా గురించి నేనే ఆలోచించుకోవాలనుకుంటున్నాను. నాకు ఏమవసరమో, ఇష్టమో నేనే తెలుసుకుని తెచ్చుకుంటాను. కనీసం ఇప్పుడైనా నాకంటూ కొంత సమయం కేటాయించుకోనివ్వండి..’’
‘‘ఓకే! ఏం చేయాలనుకుంటావ్ మమ్మీ?’’ అంతవరకు వౌనంగా ఉన్న సౌమ్య అడిగింది.
భర్త రాజేశ్, కొడుకు చైతన్య కూడా ఆసక్తిగా చూసారు. ఏం చెప్తుందో..? అని.
‘‘రేపటి నుండి నేను పొద్దున్నే ఎనిమిది గంటలకు వెళ్లిపోతాను. ఇల్లంతా మీరే చూసుకోవాలి. ప్రతి ఆదివారం మీకు సెలవు కావాలి, రెస్ట్ కావాలంటారు. ఇంట్లో ఉండి ఏ పనీ చేయకుండా అన్నీ స్పెషల్స్ చేయమంటారు. కూర్చున్న దగ్గరికే అన్నీ తెచ్చివ్వమంటారు. ఏమంటే? వారమంతా కష్టపడ్డాం కదా, రెస్ట్ కావాలి అని... మరి నాకు ఎప్పుడు రెస్ట్? అందుకే ఆ రెస్ట్, నా సంతృప్తి కోసమే- ఒక రిటైర్డ్ లెక్చరర్ దగ్గర తెలుగు అనువాదాలు చేసి, తెలుగు టైపింగ్ చేయడానికి ఒప్పుకున్నాను... మధ్యాహ్నం సంగీతం, వీణ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. సాయంత్రం ఆరు గంటలకు తిరిగొస్తాను. అంతవరకు మీ పనులన్నీ మీరే చూసుకోండి.. చేసుకోండి..’’ అని కాస్త ఆగింది ఇందిర.
తల్లి అలా గట్టిగా చెప్పేసరికి పిల్లలిద్దరూ షాక్ అయ్యారు. ఏమనాలో తెలీలేదు. వద్దు అన్నా ఆగేట్టు లేదు అని అర్థమైపోతోంది. అసలు అమ్మ బయటకెళ్లాల్సి పనేంటి? ఇంట్లో ఉండొచ్చుగా? ఇప్పుడు సంగీతం, వీణ నేర్చుకుని ఏం చేస్తుంది? కచేరీలు ఇస్తుందా? ఈ వయసులో నేర్చుకుని ఏం చేయాలి? ఎవరిని ఉద్ధరించాలి? మరి రేపు మమ్మీ ఇంట్లో లేకుంటే ఎలా? ముఖ్యంగా భోజనం. హాయిగా సెలవు రోజున బ్రేక్‌ఫాస్ట్ నుండి డిన్నర్ వరకు ఏదో ఒక స్పెషల్ చేస్తుంది. మరి సడెన్‌గా ఇప్పుడేమైంది? అని ఏమీ మాట్లాడకుండా లేచి తమ గదుల్లోకి వెళ్లిపోయారు. రాజేష్, ఇందిర వౌనంగా కూర్చున్నారు. ఇందిర మనసులో ఎటువంటి కల్లోలం లేదు- దృఢనిశ్చయం తప్ప. రాజేశ్ మాత్రం ఆమెను చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఇందిర వెళ్లి తలుపులన్నీ చెక్ చేసి పడుకుంది. రాజేశ్ ఎప్పుడు పడుకున్నాడో తనకే తెలీదు.
రోజులాగే తొందరగా నిద్ర లేచి స్నానం, పూజ చేసుకుని టీ చేసి తనకో కప్పు, భర్తకో కప్పు తీసుకుని బెడ్‌రూంలోకి వెళ్లింది. పేపర్ చదువుతున్న భర్తకు కప్పు ఇచ్చి తను కూడా టీ తాగింది. ‘‘నేను వెళ్తున్నా.. మీరు చూసుకుంటారు కదా..!’’ అని సందేహపడుతూనే అడిగింది.. తలెత్తిన రాజేశ్ ప్రశాంతంగా చూసి ‘‘డోంట్ వర్రీ ఇందూ. నువ్వెళ్లు. నేను ఉంటాను.. వీలైతే మీ తమ్ముడింటికి వెళ్లు సాయంత్రం..’’
ఎనిమిదైనా ఇంకా అలాగే నిద్రపోతున్న పిల్లలను ఓసారి చూసి నిశ్చింతగా, ధైర్యంగా బయటకు నడిచింది ఇందిర.
18 వ్యాఖ్యలు:
జ్యోతి గారు,
చెప్పదలచిన, చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పారు. ఆడవాళ్ళకు ఆ(దివారం) ఒక్క రోజు సెలవు కావాలంటం సబబే.ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవటం చాలా బాగుంది.
శర్మ జీ ఎస్
బాగుందండీ. సమస్య చెప్పడమే కాకుండా అంత చిన్న కథలో దానికి పరిష్కారం చూపించడం కూడా బాగుంది.
ఆ భర్తని, పిల్లలని అంతగా తనపై ఆధారపడేలా చేసుకున్నదెవరంటారు? మొదటినుంచి ఎందుకు తన విషయం తను ఎందుకు పట్టించుకోలేదు? దానినే వారు ఈజ్ మెంటు హక్కుగా భావించారు
పోనీలే వదిలెయ్యండ్రా ,
పిచ్చి పిల్ల అది ఆదివారం అంతం అనుకుంటుంది ! సోమవారం వారానికిమళ్ళీ ఆది అని తెలియదులే మరి !
సోమవారం: జిలేబీ నిన్న హ్యాపీ నా ? అయ్యగారి ఆప్యాయత!
.... ఓఒ... జిలేబీ జవాబు !
అయ్య గారు: నిన్న బాగా రిలాక్స్ అయ్యావు కాబట్టి, జిలేబీ ఇవ్వాళ టి నించి , తెల్లారి డబల్ టిఫిన్ , మద్యాన్న భోజనాననికి ఆంధ్రా వంట, రాతిరి సింపల్ గా నార్త్ ఇండియన్ డిష్ చేయ్యవోయ్ !
జిలేబీ: హమ్మోయ్, వద్దే వద్దు ఆదివారం బ్రేక్!
జిలేబి.
జ్యోతి గారు .. మీరు ఎంచుకొన్న ఇతివృత్తం చాలా బాగుంది . ప్రతీ స్త్రీ జీవితం లో ఏదో ఒక టైం లో మధన పడే అతి సున్నతం ఐన సమస్య ఇది ..
జ్యోతిగారూ, చాలా బాగా రాశారు.
శర్మగారు, శ్రీలలితగారు, పద్దుగారు, కిశోర్ వర్మగారు ధన్యవాదాలండి..
కష్టేఫలిగారు మీరు చెప్పింది నిజమేనండి. మేమే మొదటినుండి అన్నీ చేసిపెట్టి చెడగొట్టింది.ఇక వాళ్లెలా మారతారు. కాని పెళ్లప్పుడు మా పెద్దలు.. అమ్మాయ్. ఇఫ్పుడు నీ ఇల్లు నీ అత్తారిల్లే.. భర్తే నీ దేవుడు.. భర్తను, పిల్లలను ఏ కష్టం లేకుండా చూసుకోవాలి. అంటూ చాలా బోధలు చేసిపంపారు. వాటిని అలాగే పాటిస్తూ వచ్చాం.. కాస్త తెలివి తెచ్చుకుని ఎదురు తిరిగితే....
జిలేబీగారు.. అంతేకదండి. ఐనా అఫ్పుడప్పుడనే కాదు ఎన్నోసార్లు విసుగొస్తుంది కదా.. అసలు అడిగినవి, అడగనివి కూడా చేసిపెట్టి వాళ్లను చెడగొట్టింది ఎవరంట??
టైటిల్ చూసి కథ ఇలాగే వుంటుందని ఊహించా :) బాగా రాశారు .
జ్యోతిగారూ, కష్టేఫలే శర్మ గారి బ్లాగులో మీ టపా గురించిన అవలోకనం చూసి ఇక్కడికి వచ్చాను. కథ ఇతివృత్తం బాగుంది, చాలా మంది స్త్రీల విషయంలో నిజమేనని నేనూ అంగీకరిస్తాను. కాని నాణానికి రెండోవైపు కూడా ఉందని నా అభిప్రాయం.
'నాకు అప్పుడప్పుడూ మార్పు కోసం బయటికి వెళ్ళి తినాలని అనిపిస్తుంది, కానీ మా ఆవిడకి బయట తినాలంటే ఇష్టం ఉండదు. నేను ఎప్పుడైనా ఒక ఆదివారం బయటికి వెళ్దామంటే తనే ఇంట్లో ఏదో స్పెషల్ చేస్తానంటుంది. నేను ఒక్కడినే బయటికి వెళ్ళలేక, తను చేసినది తిని ఎడ్జెస్ట్ అవ్వలేక విసుగనిపిస్తుంది. దానికి తోడు తను ' కష్టపడి ' చేసినందుకు ఒక పొగడ్త కూడా ఇవ్వాలి ' అని నా స్నేహితులు చాలా మంది అంటుంటారు. ఈ కథ లో రాజేస్ కూడా అంతేనేమో. తల్లి తను ఎప్పుడైనా 2-3 రోజులు ఇంట్లో లేకపోతే కుటుంబంలో అందరూ కష్టపడిపోతారు (లేక జరగదు) అనుకోవచ్చు కానీ అలా వెళ్ళినప్పుడు తండ్రి, పిల్లలు స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయిన సందర్భాలు కూడా బాగానే చూసాను.
అందరి ఇష్టాలు, అభిరుచులను తీర్చడమో, తీర్చుకునేలా సహాయం చేయడమో చేస్తాను కాని తనకు మనస్ఫూర్తిగా ఏమి కావాలో ఎవరూ పట్టించుకోరు అని స్త్రీ అనుకున్నట్టే, మాకు మంచిది అని తనకు అనిపించింది తను చేస్తుంది, మమ్మల్ని చెయ్యమంటుంది కానీ మాకు స్వేచ్చ నివ్వదు అని మిగిలిన కుటుంబసభ్యులు కూడా అనుకోవచ్చు కదా (బొమ్మరిల్లు టైపు).
స్త్రీలకి శలవు దినాలంటూ ఉండవు, ఎప్పుడూ పని ఉంటునే ఉంటుంది. నేను దాన్ని తక్కువ చేసి చెప్పను కానీ చాలామంది (ఉద్యొగం చేయనివారు) సంవత్సరంలో కనీసం 1-2 నెలలు పుట్టిల్లు, సోదరులు/సోదరీమణుల ఇల్లు అని వెళ్తుంటారు. కానీ ఎంతమంది మొగవారికి ఒక వారం శలవు తీసుకునే అవకాశం ఉంటుంది? దాదాపు అందరూ సుమ్మారు 40 ఏళ్ళు పని చెయ్యాలి. ఒక రోజు/ఒక వారం శలవు కావాలన్నా ఎవడిదో అనుమతి తీసుకోవాలి, ఒక్కొక్క సారి తిట్లు కూడా తినాలి. ఇది భర్తతో, కుటుంబసభ్యులతో తిట్లు తినడం (నేను దీన్ని సమర్ధించడం లేదు) కన్నా చాలా కష్టం..
ఉద్యోగం చేసే వారిది వేరే కేసు, దానికి కథతో సంబంధం లేదు. మొత్తానికి కథ వ్రాయటంలో మీ మొదటి ప్రయత్నం సఫలమైనట్టే ఉంది :)
--శ్రీనివాస్
శ్రీనివాస్ గారు ధన్యవాదాలాు..
అదేంటోగాని నేను ఎప్పుడు ఆడవాళ్ల గురించి ఏ టపా రాసినా మొత్తం మగజాతినే అవమానించినట్టు, తక్కువ చేసినట్టు, ఆడవాళ్లను ఎవరెస్టు శిఖరానికెక్కించినట్టు జనాలు ఫీల్ అయి బాధపడిపోతున్నారు. ప్రతీసారి నేను సమర్ధించుకోలేను. సమాజంలోని ఒక అంశమిది. లేరని మాత్రం చెప్పలేను.. నేు ఎప్పుడు కూడా ఊహించి,పుస్తకాలలో చదివినవి కాని రాయను. నా స్వంత అనుభవంలోకి వస్తేనే అది అక్షరరూపంగా మారుస్తాను. ఇది నచ్చనివారికి అది నేను హోల్సేలుగా తిట్టేసాననుకుంటే అది నా తప్పు కాదు..
జ్యోతిగారూ, మీరు ఇలాంటి టపాలు ఇంతకుముందు వ్రాసారేమో నాకు తెలియదు..నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ బ్లాగుకు రావటం ఇదే మొదటిసారి..
మీరు prejudice తో చదివి నా వ్యాఖ్యని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. పై వ్యాఖ్య వ్రాసింది ' శ్రీనివాస్ ' కాకుండా ఒక అమ్మాయి అనుకుని మళ్ళి చదివి చూడండి, మీ రియాక్షన్ వేరే రకంగా ఉంటుందేమో...
అయ్యో లేదండి మిమ్మల్ని తప్పుగా ఏమనుకోలేదు. కష్టేఫలి బ్లాగుపోస్టు చదివాక అలా చెప్పాను.. సమాజమంతా ఒక్కలా ఉండదు. మీరు చెప్పినట్టుగానూ, నేను చెప్పినట్టుగానూ ఉంది..
తనకంటూ కొంత విశ్రాంతి కావాలనుకోవడం, తన అభిరుచి లని పట్టించుకుని అందులో మునిగిపోవాలనుకోవడం లాంటి ఆలోచన రావడమే సగం విజయం. నిజంగా ప్రయత్నించి సఫలీకృతం కావడం నిజమైన విజయం
బావుంది జ్యోతి గారు
జ్యోతి గారూ,
మీ కథ బాగుంది. నా వరకూ నాకేమనిపిస్తుందంటే.....ఆదివారం అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు కాకుండా ఇంకొక రోజు సెలవు తీసుకుంటే బాగుంటుందని.
మాధురి.
జ్యోతిగారు!స్త్రీ ఐనా పురుషుడైనా ఎవరి భాద్యతలు వారు నిర్వర్తించినప్పుడు సెలవు అనే సమస్య వుండదు. ఈ రోజుల్లో ఇద్దరూ కష్టపడుతున్నారు. ఇంతకు ముందు మగవాడు బయట కష్టపడితే ఆడది ఇంట్లో కష్తపడేది. మరి సెలవు ఎవరికి కావాలి? కానీ మీరు తీసుకున్న నిర్ణయం మాత్రం బాగుంది. చెయ్యాలనుకున్న విషయాన్ని సూటిపోటి మాటలు చేతల ద్వారా కాకుండా మీరు చెయ్యలన్న పనిని సూటిగా చెప్పారు.కుటుంబానికి భార్యా భర్తలు జోడు ఎద్దుల లాంటివాళ్ళు. మనం చెయ్యాలనుకున్న పనిలో నిబద్ధత స్థిరత్వం ఉన్నప్పుడు విజయాలే చేకూరుతాయి. కుటుంబంలోని మిగిలిన వాళ్ళ సహాయసహకారాలు కూడా అందుతాయి. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను.
జ్యోతిగారు బాగా రాసారు. కానీ అందరూ సెలవు సంపాదించలేము కాబట్టి కనీసం మనకోసం మనం టైం చూసుకోవాలి అనేది మాత్రం ఎప్పుడూ ఆడవాళ్ళూ అందరూ గుర్తు పెట్టుకోవాలి . సెలవు లో మాత్రమే మనం మనగురించి అలోచిన్చుకోగలం ఆనుకొనే నిరాశని పక్కన పెట్టి ప్రయత్నిస్తే మన టైం మన చేతిలోనే వుంటుందనేది అందరూ తెలుసుకోవాలి అని నా కోరిక .
జ్యోతిగారు చాలా బాగా రాసారు. మొత్తం జీవితం ఇంటికోసమే కేటాయించేసి తరువాత బాధపడడం అనవసరం . అందరూ సెలవు సంపాదించడం అంత సులువైన పనికూడా కాదు కాబట్టి మన కోసం టైం కేటాయించుకోవడం మన ఇష్టాలను మనమైనా గుర్తించడం వాటివి మనమే ఎప్పటికప్పుడు చూసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి అని నా అభిప్రాయం . తప్పుగా రాసివుంటే క్షమించండి.
Post a Comment