Thursday, 14 March 2013

Happy Women's Day






"హలో!"
"హలో! ఎవరూ! శ్యామలా?" ఏంటి చెప్పు? చాలా రోజులకు కాల్ చేసావ్?"
"Happy Womens Day వదిన..."
".........................."
"హలో వదిన!! ఉన్నావా? ఏంటి సైలెంట్ అయ్యావ్ .. మాట్లాడటం లేదేంటి? హలో.."
"ఉన్నా! పొద్దుటినుండి పేపర్లలో, పత్రికలలో, టీవీలో, రేడియోలో, ఫేస్‌బుక్‌లో ఈ వుమన్స్ డే గోల చూసి తిక్కతిక్కగా ఉంది. అందుకే నీ మాట వినగానే కోపంతో తిట్టలేక సైలెంట్ అయ్యా"
"కోపమా? ఎందుకు? ప్రపంచమంతా జరుపుతుంటున్నారు కదా అని నేను విష్ చేసా.. తప్పా?"
"తప్పా! తప్పున్నరా!!... అసలు ఈ వుమన్స్ డేని కనిపెట్టినోడిని, ఇలా   జరుపుకోండని ప్రచారం చేసేవాళ్లని పాత న్యూస్ పేపర్లు  వేసి తగలెట్టాలి. ఇదో జాఢ్యంలా తయారైంది.."
"అయ్యో! చాలా హై లెవెల్ లో కోపంగా ఉన్నట్టున్నావ్? ఐనా ఎవరైనా కిరోసిన్ పోసి తగలెడతారు. పిడకలు, కట్టెలతో తగలెడతారు.నువ్వేంటి పాత న్యూస్ పేపర్లని కొత్త ఐడియా చెప్తున్నావ్?"
"అదే మరి... ఈ పేపర్లు పత్రికలు బిల్లు నెలకు ఐదొందలకు తక్కువ కాదు కదా... అవే అమ్మితే యాభై కూడా రావు.అంతకంటే చిత్తు, చెత్త ఏముంది తగలెట్టడానికి. గాసు, కిరోసిన్ దొరకవాయే.. ఏంటి  నామాటలు నీకు ఎగతాళిగా ఉన్నాయా?"
"లేదొదినా! ఎగతాళి ఏంటి? అసలు జరిగిందేంటి చెప్పు?"
"ఏదో ఉద్ధరిచ్చాము, సాధించాము అని తెగ ఆవేశంగా అందరూ వుమెన్స్ డే, మహిళ దినోత్సవం, మన్నూ మశానము అని జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసినా అదే గోల కాదేటి? నిజంగా ఆడవాళ్లలో ఎంతమంది గొప్ప గొప్ప విజయాలను సాధించారు. ఎంతమంది ప్రతిభ అందరికీ తెలుస్తుంది.పది శాతం మందిని పైకి చూపించి వాళ్లకు సన్మానం చేసి  అదే మహిలా దినోత్సవం అంటే సరిపోతుందా? మనలాంటి గృహిణులకు ఈ మహిలా దినోత్సవం జరుపుకున్నందువల్ల వీసమెత్తైనా లాభం సంగతి వదిలిపెట్టు,, మార్పు కలుగుతుందా. ఇలా విషెస్ చెప్పుకోవడం తప్ప ఆ ఒక్క రోజన్నా ఒక్క పనైనా తగ్గుతుందా.. అన్ని రోజుల లాగే అది కూడా ఒక రోజు కాదా?
"నిజమే సుమా!"
"అసలు ఉద్యోగాలు చేసినా చేయకున్నా, ఆడవాళ్లు తమ ఇంటిపని తప్పించుకునే, తగ్గించుకునే మార్గం ఉందా? ఏప్పుడో పుష్కరాలకన్నట్టు ఓకటి రెండు యాత్రలు చేయించి అదే మన మొహాలకు ఎక్కువ అంటారు. ఇంటిపనంతా చేసి టీవీ చూస్తామా?.  అదో నస.. ఎప్పుడు చూసినా టీవీలో మునిగిపోతావు. కాస్త ఇంటి సంగతి చూడు అని. ఎక్కడ తప్పు వెతుకుదామా అని చూస్తుంటారు...ఎవరో కొందరు మహా టీవీ పిచ్చోళ్లు ఉంటారులే. పోనీలే చూడనీ అనరు. మగాళ్లు మాత్రం క్రికెట్టు, న్యూస్ మాత్రం వదలకుండా చూస్తారు. అవేమన్నా ఉద్ధరిస్తాయా? అంటే ఏమీ లేదు. సీరియళ్లు చూసినా, క్రికెట్టు చూసిన, వార్తలు చూసినా టైంపాస్, టైం వేస్ట్ అని అందరికీ తెలుసు. ఐనా ఆడాళ్ల మీదే ఎందుకు ఏడ్పు?"
"నిజమే కాని... మనం ఎంత అరిచినా, మొత్తుకున్నా ఎవరికి అర్ధమవుతాయి ఇవన్నీ?"
"నోరు మూసుకుంటుంటే అలాగే అంటుంటారు. అదే కాదు. ఊరికే టీవీ చూస్తున్నావు, షాపింగ్ అని డబ్బులన్నీ ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు, ఫ్రెండ్స్ తో కలిసి పనికి రాని ముచ్చట్లు తప్ప నువ్వు చేసేదేమీ లేదు ఎప్పుడు బాగుపడతావో అని అంటుంటే కంప్యూటర్ నేర్చుకుని ఏదో మన కిష్టమైన కథలు, కవితలు, పాటలు... ఏదో చదువుకుంటూ గడిపేస్తున్నామా? దానికీ ఎగతాళి చేయడం. ఎంత ఇంటిపనంతా చేసి కంప్యూటర్ ముందు కూర్చుని మనకు ఇష్టమైన పని చేసుకుంటున్నా సరే ఏదో ఒక తప్పు బయటకు తీసి అస్తమానం ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటావ్. అందుకే ఇల్లు ఇలా తగలడింది. ఇంటి పని ముందు చూసుకో అంటారా లేదా?"
"మీ ఇంట్లో కూడా సేమ్ స్టోరీనా వదినా?"
"మరే!! వంట చేస్తూ, బట్టలు ఉతుకుతూ, ఇల్లు సర్దుతూ, నీళ్లు పడుతూ, గిన్నెలు కడుగుతూ మధ్యలో ఇక్కడ ఫేస్‌బుక్కు, బ్లాగులు , పత్రికలు చూస్తుంటే కూడా భరించలేరు. ఇంట్లో ఎంత పని చేసినా కనపడదు. తీరిగ్గా కంప్యూటర్ ముందు కూర్చుని మన పని చేసుకుంటుంటామా అఫ్పుడు వస్తుంది ఇంట్లొవాళ్లకు కష్టం? వాళ్లు కూర్చుని చేసుకునేది పనికొచ్చే, దేశాన్ని ఉద్ధరించే పనులు. మనం చేసేవి పనికిరానివి. మనం ఇలా కంప్యూటర్ పనో, పుస్తకాలు చదువుకోవడమో, రాసుకోవమో చేసుకుంటుంటే మన పని ఏమైనా పంచుకుంటారా? బట్టలు మడతపెడతారా? గిన్నెలు సర్దుతారా? ఇల్లు సర్దుతారా? కనీసం మనకు ఇవ్వకుంటే  పోనీ వాళ్ల కోసం టీ కాని, నీళ్లు కాని తెచ్చుకుంటారా? లేదే? ఎంత సీరియస్ వర్కులో ఉన్నా మనమే లేచి మరీ చేసివ్వాలి. వాళ్ళు కంప్యూటర్ల ముందు కూర్చుంటే మనమే సేవలు చేయాలి. మన పని చేసుకుంటున్నా సరే మధ్యలో వదిలేసి వాళ్ళు అడిగినవి చేసి పెట్టాలి?  కాదంటావా?"
"నువ్వలా చెప్తే నాకు కోపం కాదు గాని బాధ కలుగుతుంది వదినా"
"ఇంకో విషయం మర్చిపోయా !!!..  ఇంటిపనంతా చేసి కంప్యూటర్ ముందు కూర్చుని మన పని చేసుకుంటుంటామా? అప్పుడు మన మీద అంతులేని ప్రేమ పొంగుకొస్తుంది. వెళ్లి పడుకోరాదూ. ఇపుడు కంప్యూటర్ ముందు కూర్చోవడం అవసరమా? నీ హెల్త్ పాడవుతుంది. మళ్ళీ కాలు నొప్పి, తల నొప్పి అంటావ్.. అంటారు. అంటే ఇంటి పని చేస్తుంటే మనం అలిసిపోము. నొప్పులు ఉన్నా కనపడవు. అన్ని పూర్తి  చేసుకుని ఇలా కూర్చుంటే మాత్రం లింకులన్నీ కలిపేస్తారు. తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, అన్నింటికి కారణం మనం కంప్యూటర్ ముందు కూర్చోవడం... రైట్... ఇంట్లో ఇలా ఉందా? ఫేస్ బుక్ లో మరో తలతిక్క మేళం.. ఏదో ఇంటర్నెట్ unlimited కదా అని పాటలు వింటూ, పని చేసుకుంటూ,  కంప్యూటర్ ఆన్ లో పెట్టేస్తామా? మన పేరు పక్కన గ్రీన్ లైట్ చూసి ఈవిడకు పనీపాట లేదు. ఇంట్లో మొగుడు, పిల్లలను పట్టించుకోకుండా అస్తమానం కంఫ్యూటర్ ముందు కూర్చుంటుంది అనుకుంటారు. అదీ కూడా చాటింగ్ చేస్తూందని.. అందరూ వాళ్లలాగే ఫేస్ బుక్ లో టైమ్ పాస్ కోసమే కూర్చున్నారనుకుంటారు. రాత్రిపూట కనిపిస్తే మరీ ఘోరం.. అసలు వీళ్లందరికి మనమేం చేస్తే ఎందుకంట?
"నిజమే!!"
"మరి ఇలాంటప్పుడు  మన మొహాలకు  Woman's Dayలు అవసరమా? ......మళ్లీ  చెప్పకు. అలాగే Happy Dasara, Happy Diwali, Happy Holi కూడా. అసలు మన హిందూ పండగలకు హ్యాపీ అంటూ విష్ చేసుకోవడమేంటి మాయరోగం కాకుంటే..



ఈ డైలాగులు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.... ఎక్కడబ్బా???

4 వ్యాఖ్యలు:

శశి కళ

"ఇంకో విషయం మర్చిపోయా !!!.. ఇంటిపనంతా చేసి కంప్యూటర్ ముందు కూర్చుని మన పని చేసుకుంటుంటామా? అప్పుడు మన మీద అంతులేని ప్రేమ పొంగుకొస్తుంది. వెళ్లి పడుకోరాదూ. ఇపుడు కంప్యూటర్ ముందు కూర్చోవడం అవసరమా? నీ హెల్త్ పాడవుతుంది. మళ్ళీ కాలు నొప్పి, తల నొప్పి అంటావ్.. అంటారు. అంటే ఇంటి పని చేస్తుంటే మనం అలిసిపోము. నొప్పులు ఉన్నా కనపడవు. అన్ని పూర్తి చేసుకుని ఇలా కూర్చుంటే మాత్రం లింకులన్నీ కలిపేస్తారు. తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, అన్నింటికి కారణం మనం కంప్యూటర్ ముందు కూర్చోవడం... రైట్..<<<<ఎస్...ఎస్....మండుద్ది చూడు ఎందుకులే జ్యోతక్క ...

చాతకం

LOL. How about google glass?

వనజ తాతినేని/VanajaTatineni

నా మనసులో ఉన్న మాటనే భలే చెప్పారు జ్యోతి గారు. మీరు చెప్పింది అక్షరాలా నిజమ్.

Zilebi

ఈవిడ ఎవరండీ మరీ చాదస్తపు జిలేబీ లా ఉన్నది ?

మన రోజు ని మనం హ్యాపీ హ్యాపీ డే అనకుంటే వేరే ఎవరో ఎందుకు అంటారు !

ఊహూ... నొ యూజ్!


చీర్స్
జిలేబి.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008