అమ్మ వేసిన పూలజడ
వేసవి మొదలైందంటే చాలు నాకు తప్పకుండా గుర్తొచ్చేవి మల్లెపూలు, మామిడిపళ్లు. ప్రతీరోజు మామిడిపళ్లు తినాల్సిందే. మల్లెపూలు పెట్టుకోవాల్సిందే. చిన్నప్పటినుండి అలా అలవాటైపోయింది. ఇంకా ఈ వేసవి స్పెషల్ అంటే అమ్మవేసే మల్లెపూలజడ.. ఇప్పుడు వేసుకునే వయసు దాటిపోయినా అప్పటి అనుభూతి ఇంకా నిత్యనూతనమే కదా.. అమ్మవేసి (మల్లె)పూలజడ ఊసులు ఇవాళ్టి "నమస్తే తెలంగాణా" పేపర్లోని ఆదివారం ఎడిషన్ "బతుకమ్మ" లో
అమ్మ వేసిన పూలజడ
పూలజడ అందానికి మాత్రమే ప్రతీక కాదు. అనుబంధానికీ, ఆప్యాయతకీ మారుపేరు. ఇప్పుడు డబ్బులు పెడితే నిముషాల్లో బ్యూటీషియన్లు పెళ్లికూతురు జడను అలంకరిస్తున్నారు. కానీ ఏం లాభం? అవి ఎంత అందంగా ఉన్నా అమ్మ కుట్టే పూలజడకు సాటి వస్తాయా?
జ్యోతి వలబోజు
పొడువాటి వాలుజడ... చివర జడగంటలు... తలనిండుగా మల్లెపూల దండలు ప్రతీ అమ్మాయికి అందాన్ని, నిండుదనాన్ని ఇస్తయి. కానీ, ఈ రోజుల్లో పొడుగు జడల అమ్మాయిలు కనపడటమే అరుదైపోయింది. ఒక రబ్బర్ బ్యాండ్ కట్టి వదిలేస్తున్నరు, తమ బెత్తెడు జుట్టును. కానీ, పాపం... ఈ జడలోని అందాలు, అది చేసే ఆగడాలు ఈనాటి అమ్మాయిలు తెలుసుకోకుండా ఉన్నరు. వాలుజడతో వయ్యారంగా కొట్టినా అది తన మీద ప్రేమే అనుకుని వెంట పడతరు కుర్రవాళ్ళు. ఇక కొత్త కాపురంలో వాలు జడ అప్పుడప్పుడు సరసానికి, చిలిపి యుద్ధానికి కూడా సై అంటది. నాగుపాము లాంటి జడలు ఇప్పుడు ఎంతమందికి ఉన్నయి? అంత ఓపిక ఎవరికున్నది? ఆ వాలు జడని పూలతో అలంకరిస్తే ఇంక దాని సౌందర్యం ఆస్వాదించే వాళ్లకే తెలుస్తది. పెళ్ళిలో కూడా పూలజడ వేసుకోవడం బరువైపోతుంది ఈనాటి అమ్మాయిలకు. ప్చ్!
ఇప్పటి సంగతులు ఇంతేగని, నా చిన్నప్పటి రోజులే గొప్పవి! ఎండాకాలం వచ్చిందంటే చాలు మల్లెపూలతో పూలజడ తయారు చేయించుకోవడం నాకు అలవాటు. అయితే, పూలజడ వేసుకోవడం పెళ్ళితోనే అంతమైనా ఆ మధుర జ్ఞాపకాలు ప్రతి వేసవిలో వెంటాడుతునే ఉంటయి. ఎండాకాలంలో మల్లెపూలు వచ్చాయంటే చాలు ఇప్పటికీ ఆ చిన్నప్పటి పూలజడ ముచ్చట్లు గుర్తుకొస్తయి.
అందరి సంగతి ఏమో కానీ మా అమ్మ మాత్రం ప్రతీ వేసవిలో మల్లెపూలు మొదలయ్యాయంటే చాలు కనీసం రెండు మూడుసార్లైనా పూలజడ వేసేది. ఇప్పట్లా రెడీమేడ్‌గా దొరికే విస్తరాకు మీద కుట్టి జడకు అతికించేది కాదు మా అమ్మ., అచ్చంగా నా జడకు డైరెక్టుగా కుట్టాల్సిందే. ఆ అనుభూతే వేరు!పూలజడ వేసుకునే రోజు కూడా ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండేది. ఎండాకాలం సెలవుల్లో ఒకరోజు ఖరారు చేసుకొని పొద్దున్నే త్వరగా వంటపని, ఇంటిపని పూర్తి చేసుకొని అమ్మ మొజంజాహి మార్కెట్లో ఉన్న హోల్‌సేల్ పూల దుకాణాలకు వెళ్లేది. గట్టివి, పెద్దవి మల్లె మొగ్గలు ఓ అరకిలో, కనకంబరాలు, దవనం కొనుక్కొని వచ్చేది. ఇక మా అమ్మ స్నేహితులు వచ్చి జడ వేయడంలో సాయం చేసేవారు. నా జుట్టు లావుగా, పొడుగ్గానే ఉండేది. అయినా, ఇంకొంచెం పొడుగు ఉంటే బావుంటుందని అమ్మ చిన్న సవరం, చివర జడగంటలు పెట్టి గట్టిగా జడ అల్లేది. అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ చీపురు పుల్లలకు మొగ్గలు గుచ్చి ఇస్తే ముందు అనుకున్న డిజైన్ ప్రకారం నా జడకు కుట్టడం... నేను అసహనంతో కదిలితే ఓ మొట్టికాయ వేయడం....అటు ఇటూ తిరిగే తమ్ముళ్ళు నన్ను ఏదో ఒకటి అంటూ గేళి చేయడం-కనీసం మూడు గంటలు కూర్చుంటే కానీ జడ పూర్తయ్యేది కాదు.
ఒక్కోసారి ఒక్కో డిజైన్‌లో కుట్టేది అమ్మ. ఇక సాయంత్రం కాగానే మొహం కడుక్కొని పట్టు లంగా వేసుకుని, అమ్మ నగలు పెట్టుకుని ఫొటో స్టూడియో కెళ్ళి వెనకాల అద్దం పెట్టి మరీ ఫొటో దిగడం. (అద్దం ఉన్న స్టూడియో కోసం తిరిగేవాళ్ళం). అదో మరపురాని అనుభూతి. ఆ నాటి ఫొటోలు చూసుకుంటుంటే ఆప్పటి జ్ఞాపకాలు గిర్రున తిరుగుతాయి. డిసెంబర్‌లో వచ్చే నా పుట్టినరోజు నాడు కూడా పూలజడ వేసుకోవాలనిపించేది. స్కూలుకు బోలెడు మల్లెపూలు పెట్టుకొని వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది. కానీ డిసెంబర్‌లో చామంతి పూలు మాత్రమే వచ్చేవి. దాంతో కూడా పూలజడ వేసుకోవచ్చు. కానీ, చాలా బరువు అని నిరాశ పడేదాన్ని. ‘నా పుట్టినరోజు మల్లెపూలు దొరికే ఎండాకాలంలో వస్తే ఎంత బాగుండో’ అని కూడా అనుకునేదాన్ని!చిన్నప్పుడు. బరువైన పూలజడతో నిద్రపోవడం కూడా కష్టంగానే ఉండేది. అయినా ఇష్టంగా భరించేదాన్ని. పొద్దున లేవగానే వాడిన, రంగు మారిన పూవులను చూసి ‘అయ్యో! అప్పుడే తీసేయాలా’ అని బాధ కలిగేది. పూలు తీసేసినా కూడా వాటి గుబాళింపు మూడునాలుగు రోజుల వరకు వెంట్రుకలను వదిలేది కాదు.
పెద్దయ్యాక అంటే ఇక పెళ్ళిలోనే పూలజడ వేసుకోవడం. నా ఎంగేజ్‌మెంట్‌కి మా నాన్న ‘రెడీమెడ్ పూలజడ తెప్పిస్తా’ అంటే కూడా మా అమ్మ తనే పూలజడ కుట్టడం, అంత బిజీలోనూ, ఇంటినిండా చుట్టాలున్నా కూడా తన బిడ్డకు తన చేతులతో పూలజడ కుట్టడం- అమ్మ అభిమానం, ఆప్యాయతల మధుర జ్ఞాపకం నా పూల జడ.ఇక పెళ్ళిలో అయితే పొద్దున్న ఒక డిజైను, రాత్రికి ఒక డిజైను. ఓహ్! ఆ ఆనందమే వేరు. అప్పుడప్పుడు పెళ్ళి ఫొటోలు చూస్తుంటే ఆ మల్లెపూల పరిమళం అలా లీలగా తేలివచ్చినట్లు అనిపిస్తుంది. నేను చివరగా పూలజడ వేసుకున్నది శ్రీమంతానికే. నేను ‘వద్దు’ అన్నా కూడా మా అమ్మ, ‘మళ్ళీ పూలజడ వేసుకుంటానో లేదో’ అని తన ఇష్టంతో పూలు తెచ్చి మరీ పూలజడ కుట్టింది. ఇవీ పూలజడ చుట్టూ నా జ్ఞ్ఞాపకాలు. మా అమ్మద్వారా పూలజడ కుట్టడం నాకూ అలవాటైంది. ఆ అలవాటుతోనే మా అమ్మాయికి, మాకు తెలిసిన వాళ్లకి కూడా నేనే పూలజడ వేసేదాన్ని. కానీ, ఈ కాలంలో అది కరువైపోయింది, బరువైపోయింది.