Thursday 23 May 2013

సూర్యదేవర రామ్మోహనరావుగారితో మాటా-మంతి



mail id: suryadevaranovelist@gmail.com
website: http://www.suryadevararammohanrao.com/index.html


నమస్కారం సూర్యదేవర రామ్మోహన్ గారు.. మా మాలిక పత్రికకోసం మీ నవలను సీరియల్ గా ఇవ్వడానికి, ఈ చిన్న మాటామంతి చేయడానికి ఒప్పుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు..

1. ఎన్నో ఏళ్ళుగా ఆంధ్రుల అభిమాన , సంచలన రచయితగా పేరు పొందిన మీరు, మీ గురించి కొన్ని మాటలు చెప్పండి.
మాది కృష్ణాజిల్లాలోని మున్నలూరు గ్రామం. మా నాన్నగారు వ్యవసాయంతో పాటు చుట్టుపక్కల నలభై గ్రామాల వారికి  ఆయర్వేద వైద్యం చేసేవారు. అమ్మ గృహిణి. ఆరుగురిలో చిన్నవాడిని. నా భార్య గృహిణి. నాకు ఇధ్దరబ్బాయిలు అమెరికాలో చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు.


2. మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ఎలా మొదలైంది? అసలు ఈ రంగంలోకి రావాలని ఎందుకనిపించింది మీకు?? ప్రత్యేక కారణమేమైనా ఉందా?
 మా నాన్నగారు ఆయర్వేద, పశువైద్యం చేసేవారు. గోసంపదని కుటుంబ సంపదకంటే ఎక్కువగా భావించేవారు. మా కుటుంబ ఆస్తులను అమ్మి మరీ  ఆయర్వేద వైద్యం చేసేవారు. ఆయన వైద్య పరిజ్ఞానాన్ని గ్రంధస్తం చేస్తే బావుంటుందని నేను అంటే , మనవాళ్లలో రాయడం అనే ఆలోచన, ఆసక్తి ఎవరికీ లేదు. ఆ పని నువ్వే చేయాలిరా అన్నారు. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. నాన్నగారి ఈ మాటలే నాలో రాయాలనే కోరిక మొదలవ్వడానికి కారణం. అలా మొదలైన రచనాసక్తి డిగ్రీ చదివేటప్పుడు కూడా  కొనసాగింది. మొదట్లో జయశ్రీ, అనామిక పత్రికలలో చిన్న చిన్న కధలు ప్రచురించబడ్డాయి. 


3. ఓక సీరియల్ లేదా నవల రాయాలంటే దానికి టాపిక్ ఎలా ఎంచుకొంటారు. తర్వాత దాని గురించి ఎలా వర్క్ చేస్తారు?
నేను రాయడం మొదలుపెట్టినప్పటినుండి పుస్తకాలు, సమాచార సేకరణ మొదలుపెట్టాను. ముందుగా మా నాన్నగారి దగ్గరే బోలెడు సమాచారం ఉంది. ఆ తర్వాత కొందరు మిత్రులు సహాయ పడ్డారు. నాకు పురాణాలు, ప్రాచీన సంప్రదాయాలు, సంస్కృతి, ఇతిహాసాలు, వాటి గొప్పదనం చరిత్ర, ఆత్మశక్తి, మన పూర్వీకులు సాధించిన గొప్ప గొప్ప విజయాలు గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. వాటికి సంబంధించిన పుస్తకాలు, తాళపత్రగ్రందాలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. 


4. పత్రికలలో సీరియల్స్ రాసేటప్పుడు ప్రారంభం నుండి చివరి వరకు మొత్తం మీ చేతిలో ఉంటుందా? లేదా పత్రికలవాళ్లు అలా రాయాలి , ఇలా ఐతే బావుంటుంది అని అంటారా? దానికి మీ స్పందన ఎలా  ఉంటుంది? అసలు ఎప్పుడైనా మీకు  ఇలాంటి సందర్భం ఎదురైందా??
లక్కీగా నాకు ఇంతవరకు సీరియల్స్, నవలల విషయంలో ఎటువంటి సమస్యలు రాలేదు. నేను రాసే టాపిక్ మీద ఏ పత్రికవాళ్లు కూడా ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. నేను ఉదయం, జ్యోతి, స్వాతి మొదలైన పత్రికలలో రెగ్యులర్ గా రాసాను. కాని ఎవ్వరూ కూడా నన్ను ఈ టాపిక్ మీద రాయాలి. ఇలా రాయాలి అని నిర్ధేశించలేదు. నా రచనల విషయంలో నాకు సంపూర్ణ స్వేచ్చ ఉంది ఇప్పటికీ కూడా. కాని అప్పట్లో ఆంధ్రభూమిలో సికరాజుగారు ఎడిటర్ గా ఉన్నప్పుడు రచయితలకు కొన్ని టాపిక్ లు ఇచ్చి కధలు, సీరియల్స్ వగైరా రాయమనేవారు. అది కూడా వాళ్లు చెప్పిన విధంగానే రాయమనేవారు. కొందరు రచయితలు అలాగే రాసారు కూడా . కాని నేనలా చేయలేదు. చేసే అవసరమూ రాలేదు.


5. రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా?  లేదా ఎవరి ప్రభావం ఐనా ఉందా..?
ముందే చెప్పాను కదా.. నేను రాయడానికి కారణం మా నాన్నగారి దగ్గరున్న విజ్ఞాన సంపదను భద్రపరచాలనే సదుద్ధేశ్యం.. ఇక ఎవరి ప్రభావమంటూ లేదు. అంతా నా స్వంత ఆలోచనలే..



6. మీ రచనా శైలి మొదటినుండి ఒకే విధంగా ఉందా? మార్చుకుంటూ వచ్చారా? ఈ శైలి మీకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటారా? లేక పాఠకులు ఇష్టపడేట్టు ఉండాలనుకుంటారా?? ఒకవేళ అది బాలేదు, మీరు ఇలా రాస్తే బావుండేది. అని ఎవరినా పాఠకులు సలహాలు, సూచనలు ఇచ్చారా ? దానికి మీ స్పందన ఎలా ఉండింది??
తప్పకుండా మారుతుందండి. వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఈ ప్రభావం వివిధ సంఘటనలు, అనుభవాల ఆధారంగా రచనా శైలి మీద కూడా పడుతుంది. నా రచనలు నాకు నచ్చి, పాఠకులు మెచ్చేవిధంగా ఉండాలనుకుంటాను. ఇప్పటివరకు అలాగే రాస్తూ వచ్చాను. కొన్నిసార్లు ఈ  సంధర్భం , ఆ సన్నివేశం ఇలా ఉంటే బావుండేదని   పాఠకులు చెప్తుంటారు. సద్విమర్శలను ఎఫ్పుడూ గౌరవిస్తాను.



7.  ఎన్నో ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. మీకంటూ  ప్రత్యేకమైన లక్ష్యం పెట్టుకున్నారా?
నేను 1985 అంటే 28 ఏళ్లుగా రాస్తున్నాను. నవలా రచయితలందరిలో అత్యధికంగా ఇఫ్పటివరకు 96 నవలలు పూర్తి చేసాను. ఎఫ్పుడు కూడా ఒక లక్ష్యమంటూ పెట్టుకోలేదు. రాసుకుంటూ పోవడమే.. అసలు ఈ లక్ష్యాలు, రికార్డులు అంటే నాకు నచ్చదు. ఈ గిన్నీస్ రికార్డ్ కూడా పెద్ద ఫార్స్.. అంతా వ్యాపారం. ఒక రికార్డ్ సృష్టించాలనే కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు, గిన్నీస్ వాళ్లను పిలవడం. వాళ్ల అతిధి మర్యాదలు వగైరా అన్నీ వ్యాపారాత్మకమైనవే. ఈ రికార్డులవల్ల ఒరిగేదేమీ  లేదు. ఒక సమాజసేవ చేసినవారినో, పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినవారినో గౌరవించి, బిరుదులు ఇచ్చి ప్రోత్సహిస్తే మంచిది కాని ఇలా రికార్డ్ కోసం ఎందుకూ పనికిరాని కార్యక్రమాలు, సాహసాలు చేయడం పిచ్చిపని అని అంటాను.


8.  నవలలు, సీరియళ్లు, కథా ప్రచురణల్లో మీరు గమనిస్తూ వచ్చిన మార్పు ఎలా ఉంది. అలాగే పాఠకులు, పత్రికలు, రచయితల విషయంలొ కూడా ఎటువంటి మార్పు గమనించారు?.
చాలా మార్పు వచ్చింది. 80, 90 దశకాలలో వారపత్రికలు, మాసపత్రికలలో కధలు, సీరియళ్ల ప్రభంజనం నడిచింది. ముఖ్యంగా మహిళలు సీరియళ్ల కోసమే పత్రికలను చదివేవారు. 95,, 96 వరకు ఆడవాళ్లు వివిధ పత్రికలు, నవలలు ఎక్కువగా చదివేవారు కాని ఆ తర్వాత మొదలైన టీవీ సీరియళ్లు పుస్తకాలను పక్కకు జరిపేసాయి. అదీకాక అప్పుడు విరివిగా రాసిన ఎందరో రచయితలు కూడా  మునుపట్లా రాయడం లేదనిపిస్తుంది. కాని కొత్త రచయితలు/ రచయిత్రులు వస్తున్నారు. ఇది మంచిదే కదా. ఈ మధ్యకాలంలో టీవీ సీరియళ్లు, ప్రోగ్రాములు కూడా జనాలకు విసుగును కలిగిస్తుండడంతో మళ్లీ పుస్తకాలవైపు మొగ్గు చూపుతున్నారు. సినిమాలు వినోదాన్ని ఇస్తాయి. టీవీ సీరియళ్లు కాలక్షేపాన్ని ఇస్తాయి. కాని పుస్తకాలు ఎప్పటికీ వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని ఇస్తాయి..


9. అప్పటి తరం, ఇప్పటి తరం పాఠకుల అభిరుచి ఏమైనా మారిందా? మీ రచనలకు వచ్చే స్పందనతో మీకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందనుకుంటా. అసలు కధలు, నవలలు  చదివినవారిని మారుస్తాయా?? వాళ్ల ఆలోచనలను తప్పు దారి పట్టిస్తాయంటారా? ఇది రచయిత తప్పు కాదే.. కాని అందరూ రచయితనే దోషిగా నిలబెడతారు..
అవును పాఠకుల అభిరుచి మారింది. అప్పట్లో క్రైమ్, సస్పెన్స్, ఫామిలీ, ఫాంటసీ కధలమీద మక్కువ చూపిన పాఠకులు ఇప్పుడు లేరు. కొత్తతరం వాళ్లకు తమకేం కావాలో బాగా తెలుసు. ఈనాటి తరం పాఠకులు ఎక్కువగా కెరీర్, ప్రేమ, విలాసాలు,ఆధ్యాత్మికం మొదలైన రచనలు కోరుకుంటున్నారు. ప్రాచీన సంప్రదాయాలు, రహస్యాలను గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. తన రచనవల్ల కలిగే పరిణామాలకు రచయితదే బాధ్యత. సమాజానికి చెడు చేసే రచనలు మంచివి కావు. 


10. మీ నవలలు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. మామూలు ప్రేమ కథ, ఫామిలీ కథల్లా టైమ్ పాస్ కోసమన్నట్టు  కాకుండా ఎంతో పరిశోధన చేసి సవివరంగా రాస్తున్నారు. దీనికోసం మీరు చేసే హోంవర్క్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఆ ప్రాసెస్ లో మీరు ఎదుర్కొన్న కష్టసుఖాలు..
నా  దగ్గర మొదటినుండి మా నాన్నగారి దగ్గరనుంఢి సేకరించిన సమాచారం. పురాతన గ్రంధాలు, తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి. కొందరు మిత్రులు కూడా నాకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తుంటారు. అంతే కాక ఒక రచన చేసేటప్పుడు దానికి సంబందించిన సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ కూడ ఉపయోగిస్తాను. ఆయా ప్రదేశాలకు వెళ్లి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుంటాను. ఇప్పటివరకు నేను రాసిన నవలలు మాడలింగ్, గుర్రప్పందాలు, ఆటోమొబైల్, పబ్లిసిటీ, పునర్జన్మ, ఆయుర్వేదం, జ్యోతిష్యం, సినిమారంగం, రాజకీయాలు. మూఢ నమ్మకాలు, మంత్ర తంత్రాలు, వశీకరణ యోగం, ఫోరెన్సిక్ సైన్స్, బ్రహ్మంగారి కాలజ్ఞానం, నిధి అన్వేషణ మొదలైన టాపిక్స్ మీద నవలలు రాసాను. మరో ఐదువందల నవలలు రాయగలిగినంత సమాచారం నా దగ్గర ఉంది..



11.   మరి మీ రచనలపైన తీవ్రమైన అభ్యంతరాలు తెలిపి, బెదిరింపులు గట్రా ఏమైనా జరిగాయా?
 నా రచనలలో నేను చెప్పే విషయాలన్నీ నిజమైనవే ఉంటాయి. మొదటినుండి ఏదైనా సరే నిర్భయంగా రాసేవాడిని.   కొన్ని రచనల మీద కేసులు కూడా పెట్టారు. ఐనా భయపడలేదు. ఎర్రసముద్రం నవల మీద 5-6 కేసులు  పెట్టారు.. కార్మికులని రెచ్చగొట్టటం తప్ప వారికి బాధ్యత నేర్పించటంలేదని నేను ఒక రాజకీయ పార్టీ మీద చేసిన విమర్శలు, చదువులేనివారు పదవులనలరిస్తే లాభంలేదని రాజకీయనాయకులని ఉద్దేశించి చేసిన విమర్శలు వివాదానికి కారణమయ్యాయి..


12. రాన్రానూ తెలుగు చదివేవారు తగ్గిపోతున్నారు. పుస్తకాలు అస్సలు చదవడంలేదు, కొనడం లేదు  అని ఎంతోమంది బాధపడుతున్నారు. కాని కొత్త కొత్త పుస్తకాల ప్రచురణ మాత్రం  ఆగడం లేదు. ఎన్నో కొత్త వార పత్రికలు, మాస పత్రికలు కూడా ప్రచురించబడుతున్నాయి. వీటి అమ్మకాలు, ఆదరణ ఎలా ఉన్నాయో తెలీదు మరి..
90ల దాకా తెలుగు చదివేవారు బాగానే ఉండేవారు. అయితే టీవీల ప్రభావం చేత పాఠకులు చదవటంకన్నా చూడటం మీద ఎక్కువ ఆసక్తి చూపించటం మొదలుపెట్టారు. అయితే ఆ టీవీ సీరియళ్ళు కూడా పాతబడి, వాటిమీద అందరికీ ఆసక్తి తగ్గిపోవటంతో మళ్ళీ పాఠకులు పుస్తక పఠనం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఏదేమైనా సరే ప్రింట్ మీడియా స్థిరంగానే ఉంటుందని నా అభిప్రాయం


13. రీసెర్చ్ బేస్డ్ నవలలకు యండమూరి ఆద్యుడైతే మీరు రీసెర్చ్ తో పాటూ థీం బేస్ట్ నవలల్ని రాసి తెలుగు నవలల్ని స్థాయిని పెంచారు. ఇప్పటికీ ఇంగ్లీషులో అలాంటి నవలలు వస్తున్నాయి, అవి సినిమాలుగా కూడా రూపొందుతున్నాయి. కానీ తెలుగులో ఆ పరిస్థితి లేదు. కారణం ఏమిటి? సినిమాలవాళ్ళు కథల్లేవు కథల్లేవు అంటుంటారు కానీ మీర్రాసిన నవలలన్నీ సినిమాగా తియ్యదగ్గవే. అలాంటిది ఒకటోఅరా తప్ప మరివేటినీ సినిమాగా తియ్యలేదెందుకో?
పాఠకుల అభిరుచి, అవసరాలను దాటి వెళ్లినవాడు రచయిత అవుతాడు కాని పాఠకుల మనసులో ఉండలేడు. కన్నడ, మళయాళ పాఠకులు మారతారేమో కాని తెలుగు ప్రేక్షకులు మాత్రం మారలేదు. మారరు కూడా. సినిమాలు తీసేది ఎంటర్ టెయిన్మెంట్ కోసమే. అందుకు కధతో పాటు డాన్సులు, పాటలు, ఫైట్లు, పారిన్ లోకేషన్లు వగైరా తప్పనిసరి ఉండాలి. సినిమా కధలన్నీ అలాగే ఉండాలి. కాని నాకు ఈ సినిమాల మీద అంత ఆసక్తి లేదు అందుకే నా రచనలు సినిమాలు చేయమని నేను అడగలేదు. ఏ ప్రోడ్యూసర్ కూడా అంత ఆసక్తి చూపలేదు. రీసెర్చ్ బేస్డ్ నవలలకి ఆదరణ ఎప్పుడూ ఉందండీ. అదే లేకపోతే నా నవలలు సీరియళ్ళుగా అచ్చయ్యుండేవి కావు. నవలల రూపంలో కూడా అవి చాలా ఖ్యాతినే అర్జించాయి. నా ముందు తరాలవారు, తరువాతి తరంవారు రచనలు మానేసి వేరే పనులమీద ధ్యాస పెట్టినా నేను మాత్రం రచనలని వదలదలచుకోలేదు. చాలా ఇష్టంతో చేస్తున్న పని ఇది. తెలుగులో అత్యధికంగా పుస్తకాలు వ్రాసింది నేనే (దాదాపు వంద)


14. ఒక రచయిత రాసిన కథ కాని, నవల కాని అందులో చెప్పిన ఒక మాట లేదా సంఘటన పాఠకులందరినీ కాకున్నా కొందరినైనా తమ జీవితాలకు అన్వయినంపచేసుకుని ఆలోచింప చేస్తుంది. విదుర్‌నీతి సీరియల్ మొదటి భాగంలో ఆత్మహత్య గురించి మీరు చెప్పిన మాట లాగా .... అలా ఆలోచించి, ఫీల్ అయ్యి మీతో చెప్పినప్పుడు మీరెలా ఫీల్ అవుతారు??
చాలా సంతోషం కలుగుతుంది. తనకు నచ్చినట్టుకాకుండా  పాఠకులు నచ్చి, మెచ్చేవిధంగా రచనలు చేయాలి. చదివి మర్చిపోయేట్టు కాకుండా తన మాటలు ఆలోచింప చేస్తే ఏ రచయితైనా సంతోషిస్తాడు.



15. ఒక రచయిత తన కథ కాని నవల కాని తనకు నచ్చినట్టుగా రాయాలా? పాఠకులకు నచ్చేట్టుగా రాయాలా? కొంతమంది రాసినవి చాలా సులువుగా అందరికి అర్ధమైపోతాయి. కాని కొందరి రచనలు చాలా లోతుగా ఆలోచిస్తే కాని అర్ధం కావు. దానికోసం పాఠకులందరూ కష్టపడతారనుకోను.. అలాగని అవి మంచి రచనలు కావని అనను. నేనైతే ముందు రచయితకు తను రాసింది తనకు నచ్చాలంటాను.
రచయిత తను రాసింది ఎక్కువమంది పాఠకులకు చేరి అర్ధమైనప్పుడే ఆతని రచనయొక్క ముఖ్య ఉధ్ధేశ్యం నెరవేరుతుంది. కాని మాకు జర్నలిజంలో నేర్పిన పాఠంలో ముఖ్యమైనది Don’t over estimate or under estimate the Readers .. రచయితకు ఎన్ని గొప్పు భావాలున్నా వాటిని పాఠకులకు సులభంగా అర్ధమయ్యేలా రాయక తప్పదు. అర్ధమైతేనే కదా పాఠకులను చేరేది.



16. రచయితలకు అప్పుడు, ఇప్పుడు ఉన్న విలువ గౌరవం ఎలా ఉన్నాయి? మార్పు అంటే ఎవరిలో  కలిగింది. పాఠకులా? రచయితలా?
మంచి రచనలు చేసే రచయితలకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. 80 నుండి 95 వరకు రచయితల హవా నడిచింది. అఫ్పుడు కొందరు రచయితలకు బ్రహ్మరధం పట్టారు పాఠకులు. కాని ఈరోజు పాస్ట్  లైఫ్ అయిపోయింది. పుస్తకాలు కొని చదివే ఓపిక, సమయం ఉండడం లేదు. ఒకవేళ చదివే ఆసక్తి ఉన్నా ఐపోన్, ఐపాడ్ లలో చదువుకుంటున్నారు. కాని రచయితలంటే ఇప్పటికీ ఆ గౌరవం ఉంది.


17 . తెలుగు భాషతో పాటు అంతా సాంకేతికమైపోతున్న ఈ రోజుల్లో ప్రింట్ పత్రికలతో పాటు అంతర్జాల (నెట్) పత్రికలు, ప్రింట్ పుస్తకాలకు బదులు ebooks  విరివిగా వచ్చేసాయి. ఇవి క్రమక్రమంగా  వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి.  మరి వీటి ప్రభావం ఎలా ఉంటుంది.  చెట్లను కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలి. పేపర్ వాడకం తగ్గించాలి అంటూ రాన్రానూ ప్రింట్ పత్రికలు, పుస్తకాలు కనుమరుగవుతాయేమో. ఈ పరిణామం మంచిదేనంటారా?
 అమెరికాలో మనకంటే సాంకేతికంగా ఎంత ముందంజలో ఉన్నా ఇప్పటికీ అక్కడ వాషింగ్టన్ పోస్ట్ లాంటి   పేపర్లు, ఎన్నో పత్రికలు, పుస్తకాలు కూడా విజయవంతంగా నడుస్తున్నాయి. మన దగ్గర కూడా పేపర్లు చదువుతున్నారు. పత్రికలు కూడా బాగానే చదువుతున్నారని తెలుస్తుంది. కాని 70 – 95 మధ్యలో బ్రహ్మాండమైన సాహిత్యం వెలువడింది. ఈ పరిణామానికి ఆద్యులు యద్ధనపూడి సులోచనరాణి అని చెప్పవచ్చు. ఆవిడ   మధ్యతరగతి పాఠకుల మనసుల్లో దాగి ఉన్న ఎన్నో ఆలోచనలు, కోరికలు వెలికి తీసి కధలు, సీరియళ్లుగా రాసారు. అవి అందరికి నచ్చాయి. తర్వాత కొమ్మూరి సాంబశివరావు, మధుబాబులాంటి రచయితలు డిటెక్టివ్ పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. ఈ పుస్తకాలను కూడా చాలామంది పాఠకులు ఇష్టపడేవారు. తర్వాత మల్లాది వెంకటకృష్ణమూర్తి. యండమూరి, ఆ తర్వాత నేను.. ఇలా ఒకరి తర్వాత ఒకరు తమ రచనలతో పాఠకుల మనసుల్లో ఓక చెరగని ముద్ర వేసుకున్నారు. మిగతావాళ్లు ముందులా ఎక్కువగా రాయడం లేదు. నేను మాత్రం రాస్తూనే ఉన్నాను. ఇఫ్పటికీ అందరికంటే ఎక్కువ నవలలు రాసాను. ముందు ముందు ఈ  పుస్తక పఠనం ఇంకా పెరుగుతుంది. దానికి ఈ సాంకేతిక విఫ్లవం దోహదపడుతుంది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు నెట్ లో రోజువారి తెలుగుపేపర్లు మనకంటే ముందుగానే చదివేస్తున్నారు. అలాగే పుస్తకాలను కూడా eబుక్స్ లా మరింత ప్రాచుర్యం పొందుతాయి అని నా నమ్మకం. అలాగే చదివే తీరికలేనివారు ఆడియో బుక్స్ ద్వారా కూడా కధలు, నవలలు వింటారు...

8 వ్యాఖ్యలు:

శ్రీ

సూర్యదేవర గారి మోడల్ సీరియల్ అప్పట్లో బాగా పేరు వచ్చిన సీరియల్ , అలాగే అశ్వమేధం , ఎర్ర సముద్రం గట్రా ....
మీరు ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగితె బాగుండేది అని భావన :
మీరు ఘోస్ట్ రైటర్ గా పనిచేశారా ... మీకు ఘోస్ట్ రైటర్ ఉన్నారా .....
ఈయన అప్పట్లో ఒక నవల రాసారు ... పేరు నైమిశ అనుకుంటా .... షెల్డన్ ఈఫ్ టుమారో కమ్స్ కి మక్కి కి మక్కి ... ఆ నవల ముందు మాట లో పిచ్చ కామెడి ఎపిసోడ్ రాసారు ... ఒక రోజు రాత్రి ఇయన , రాఘవేంద్ర రావు గారు, వీరేంద్ర గారు కథ చర్చల్లో ఉండగా తల వేడ్డిక్కి ఇయన టి తాగుదాం అని అన్నపూర్ణ స్టూడియో గేటు దగ్గర ఉన్న టి షాప్ లో టి తాగుతుండగా ఒక చిన్న పేపర్ ఐటెం కనపడి దాన్ని ఇలా రాసా అన్నది ఆ ముందు మాట (లేక మందు మాటో ) సారాంశం .
ఇంకా ఈ సారే రాసిన చిక్కలేదు చిన్న దాన్ని ఆచూకి అన్న ఇంకో మహత్తర నవల రాజాన్ని చదివి నా వెంట్రుకలు సగం తెల్ల బడ్డాయి ... పదో పేజి లో ఉన్నదానికి నలబై ఓ పేజి లో ఉన్నదానికి సంభందం లేదు ఆ నవలలో .... నేనే ఎక్కువ రాసా రాసా అని అంటారు కాని ... మల్లాది గారు ఇయన కన్నా ముందుగా ఎక్కువ రాసారు నాకు తెలిసి ...

Sharma


మీరు ఇంటర్వ్యూ విధానం , సూర్యదేవర సమాధానాలు సంతోషాన్నిచ్చాయి .
రచనలోని అంతరార్ధం పాఠకులు గ్రహిస్తే ఆ రచయిత ఆనందం అంతా , యింతా కాదు .

మాలా కుమార్

మీ ఇంటర్వ్యూ బాగుంది . కాకపోతే నాకు ఈయన నవలలు అంతగా నచ్చవు . చదువుతాను కాని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించదు .

శ్యామలీయం

నూరు నవలలు రాసానని సూర్యదేవరగారు జబ్బలు చరుచుకోవటం నచ్చలేదు.

ఒకప్పుడు శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు వేయి నవలలు రాసారు - గొప్ప పేరు తెచ్చుకున్నారు కూడా. అయినా యీ నాడు శ్రీకొవ్వలివారి గురించె యెంత మందికి తెలుసు?

కాలక్షేపం సరుకు రాసేవారు కూడా ఇంటర్వ్యూలలో తామేదో సాహిత్యకారులమనీ సరస్వతీసేవ చేసామని చెప్పుకోవటం సాధారణవిషయమే.

సరస్వతీమంటపంలో ఇలాంటి రచనలు చేసేవాళ్ళు తట్టలకొద్దీ రాళ్ళు గ్రుమ్మరిస్తూంటే కొంచెంమంది సిసలైన రచయితల మణిమాణిక్యాలలాంటి రచనలు ఆ చెత్త క్రింద కూరుకుపోయి ప్రజలదృష్టికి రాకుండా పోతున్నాయి. విచారించాల్సిన సంగతి.

Zilebi


ఇట్లా బ్లాగ్ లోకం లో 'ఇంటర్వ్యూ ఇస్తే, చెడా మడా, వాయిస్తారని తెలిసి ఉంటే, రావు గారు బ్లాగ్ లోకం ఈ మాటా మంతీ ఇచ్చి ఉండక పోయి ఉంటారేమో !!



జేకే !

జిలేబి

Unknown

చిన్నతనంలో ఈయన రాసిన, "నైమిష" అన్న నవల చదివాను. "భలే వుందే" అనుకున్నాను. కొన్నేళ్ళకి, షిడ్నీ షెల్డన్ రాసిన, "ఇఫ్ టుమారో కంస్‌" అనే నవల చదివాను. ఈ షిడ్నీ షెల్డన్ అన్నాయన, "నైమిష" నవలని మక్కీకి మక్కీగా కాపీ కొట్టి, మొదటి భాగంగా రాశారు. అదే నవలలో, రెండో భాగం సొంతంగా రాసుకున్నారు. ఆ భాగం కూడా సూర్యదేవర రామ్మోహన రావు గారు రాసి వుంటే, ఈ షెల్డన్ దాన్ని కూడా కాపీ కొట్టేవారే!!

ఇంటర్వ్యూలు చేసే వారు, ఎవరూ ధైర్యం చేసి, "గొప్ప వారు" చేసిన చెడ్డ పనుల గురించి అడగరు. అడిగితే, అవతల వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వరనీ, తద్వారా తమకి ఖ్యాతి రాకుండా పోతుందనీ భయం. అన్ని ప్రశ్నలూ, సమాధానాలూ ప్రజలని ఉద్ధరించేటట్టుగా వుంటాయి గానీ, మొహమాటం లేకుండా విషయాలు అడిగినట్టు వుండవు. మనుషుల్లో లేని నిజాయితీ, వాళ్ళ రాతల్లో మాత్రం ఎక్కడ కనబడుతుందీ?

ప్రసాద్

Unknown

suryadevara rammohana raoగారితో జ్యోతిగారు జరిపిన ముఖాముఖి ఆమూలాగ్రంగా రెండుసార్లు చదివేశాను.తన రచనవల్ల కలిగే పరిణామాలకు రచయితదే బాధ్యత-అనే వారి పలుకులతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.అంతా నా స్వంత ఆలోచనలే-అనే వారి వాక్కు మాత్రం శుద్ధాబద్ధం!సిడ్నీ షెల్డన్ ఈఫ్ టుమారో కంస్ కు నైమిష పరమ కాపీ అని అభిజ్నులు నుడివిన పలుకుతో నేను పూర్తిగా ఏకీభవించడం లేదు కాని అనువాదం అనవచ్చునేమో పునఃపరిశీలించవలసినదిగా వేడుకొంటున్నాను!అయితే అక్కడక్కడ కొంచం స్వతంత్రించారు!అంతే!ఇక తెలుగులో అత్యధికపుస్తకాలు రాసిందీ వీరేనట!ఒక్క చేత్తో వెయ్యినవలలు రాసి ఆనాటి చదువరులకు అభిరుచికలిగించి చదివే అలవాటును పెంచిన కొవ్వలివారు ఏమయిపోవాలి పాపం!తెలుగునవలల స్థాయిని రావుగారు పెంచారని జ్యోతిగారు అనవసరంగా కితాబు ఇచ్చారు!కాని బుచ్చిబాబు,చలం,గోపీచంద్,కొకు,పాప,వడ్డెర చండీదాస్,పతంజలి,కేశవరెడ్డి గారలేమయిపోవాలి!మరో ఐదువందల నవలలు రాయగలిగేంత సమాచారం ఇంకా వీరివద్ద ఉందట!అమ్మబాబోయ్ పత్రికాసంపాదకులు తెలుగు చదువరులను రక్షించుదురు గాక!

Unknown

సూర్య ప్రకాష్ అప్కరి గారు ఇలా రాశారు:
"సిడ్నీ షెల్డన్ ఈఫ్ టుమారో కంస్ కు నైమిష పరమ కాపీ అని అభిజ్నులు నుడివిన పలుకుతో నేను పూర్తిగా ఏకీభవించడం లేదు కాని అనువాదం అనవచ్చునేమో పునఃపరిశీలించవలసినదిగా వేడుకొంటున్నాను!అయితే అక్కడక్కడ కొంచం స్వతంత్రించారు!అంతే!"
1. అసలు ఈయన, "నైమిష" గానీ, "ఇఫ్ టుమారో కంస్" గానీ చదివారా అన్న అనుమానం వస్తోంది ఈ వాక్యాలు చదువుతుంటే. "అనువాదం అనవచ్చునేమో" అన్న అనుమానం. అంటే, ఏది అనువాదమో, ఏది కాదో తెలియని పరిస్థితి అన్న మాట. బాగుంది వెనకేసుకుని రావడం. వేడుకోళ్ళతో కాపీ కొట్టడం అనే క్రియ అనువాదంగా మారిపోతుందా?
2. ఏదో మాట వరసకి, ఈయన వేడుకున్నట్టుగానే, అది అనువాదం అనుకుందాం. మరా మాట ఆ రచయిత తన పుస్తకంలో చెప్పారా? ముందు మాటలో మరొక లాగా రాశారెందుకు, ఇంకోకాయన అన్నట్టు? అనువాదానికి అనుమతి తీసుకున్నారా? మరి పూర్తిగా, అంటే, సిడ్నీ షెల్డన్ రాసిన రెండవ భాగం కూడా అనువదించ లేదెందుకని? ఈ రెండు భాగాలూ ఒకే పుస్తకంలో వున్నాయి.
3. ఆ రచయిత, "అక్కడక్కడ కొంచం స్వతంత్రించ" లేదు. బాగానే "స్వతంత్రిం"చారు. కాపీ కొట్టే వాళ్ళు ఎంత బాగా స్వతంత్రిస్తారో, అంత బాగానూ స్వతంత్రించారు.
ప్రసాద్

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008