పువ్వులు చెప్పే శుభాకాంక్షలు
జ్యోతి వలబోజు
నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మ వంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి మా
ప్రాణము తీతువా యనుచు బావురుమన్నవి క్రుంగిపోతి నా
మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై
మల్లెలు - గులాబీలు.... బంతి - చామంతి, కనకాంబరం - సంపెంగ, కార్నేషన్స్ - డాలియా,, లిల్లీ –గ్లాడియోలస్, .. ఇలా చెప్పుకుంటూ పోతే పూలల్లో ఎన్నో వర్ణాలు. ఎన్నో అందాలు, ఎన్నో సుమధుర సోయగాలు.. అన్నీ నయనానందకరమే.. మానసికోల్లాసమే.
ప్రకృతి మనకిచ్చిన అందమైన, రంగురంగుల బహుమతులు ఈ పువ్వులు. కాసిన్ని నీళ్లు, కాస్త ఎండ, కాస్త ప్రేమ ఇస్తే చాలు మధురమైన సువాసనను, పులకింపజేసే అందమైన సొగసులతో మనలను నిత్యం అలరిస్తాయి, సంతోషాన్నిస్తాయి... అందుకే భారతదేశమైనా, ప్రపంచంలో ఏ దేశమైనా పువ్వులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పువ్వుల వ్యాపారం ఒక పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది.. అసలు మనకు పువ్వులు అంటే ఎప్పుడు అవసరం పడుతుంది. గుర్తొస్తుంది. పండగలు, పూజలు, పెళ్లి పేరంటాలు, పుట్టినరోజు, పెళ్లిరోజులు ... కాని ఇలా ప్రత్యేకమైన రోజులకు మాత్రమే కాకుండా ప్రతీ చిన్న సంతోషసమయానికి, పలకరింపులకు కూడా పూలను పట్టుకెళుతున్నారు. ఎందుకంటే ఈ పువ్వులు ఇచ్చే ఆనందం అనంతమైనదని అందరికీ తెలుసుకదా..
ఇటీవలి కాలంలో పువ్వులను అలంకరణకే కాకుండా ఎవరినైనా పలకరించడానికి వెళ్లినప్పుడు, ఆహ్వానించేటప్పుడు ఈ పూలుబుకేలు ఇవ్వడం సర్వసాదారణమైపోయింది.. పది రూపాయిలనుండి రెండు, ఐదువేలవరకు కూడా పలికే ఈ పూలబుకేలు ఆయా సందర్భాలను బట్టి, ఇచ్చేవాళ్ల ఆసక్తి, తాహతును బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరోజు లేదా మూడురోజులకంటే ఎక్కువ నిలవ ఉండని ఈ పూలకి ఇంత ఆదరణా, ఖర్చా అనుకోవచ్చు కాని ఆ పూలను వాటి అలంకరణను చూడగానే ఆ ఖర్చు సంగతే మర్చిపోతాం..
ఇక ఈ పూలబుకేల గురించి వివరాల్లోకి వెళితే....
కొన్ని రకాల పువ్వులును, ఆకులను కలిపి అందంగా అలంకరించితే అది బుకేలా తయారవుతుంది. ఈ బుకేలను చేతికి ఇవ్వొచ్చు, ఇంట్లో కాని ఆఫీసులో కాని అలంకరణకు ఉపయోగించవచ్చు. మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్య ఖర్చుకు వెనుకాడకుండా ఈ అలంకరణకు పువ్వుల వినియోగం చాలా పెరిగిపోయింది. ఈ బుకేల ఆకారం, స్టైల్ ని బట్టి, వాడిన పువ్వలను బట్టి క్రిసెంట్, నొస్ గే, కాస్కేడింగ్ బుకేలని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఈ బుకేలను ఎక్కువగా పుట్టినరోజు, పెళ్లిరోజులాంటి సంధర్భాలలో ఎక్కువగా ఇస్తారు. అలాగే పెళ్లిళ్లలో హాలు, కళ్యాణమంటపం అలంకరణకు కూడా ఎన్నోరకాల పువ్వులను విరివిగా ఉపయోగిస్తున్నారు. సాంప్రదాయకంగా, ఆధునికంగా చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలలో తయారుచేసిన బుకేలను గృహాలంకరణలో , ఆపీసుల్లో ఉపయోగిస్తారు. ఆయా ప్రాంతపు ఆచారవ్యవహారాలకు, సంధర్భాలకు అనుగుణంగా ఈ పువ్వుల ఎంపిక ఉంటుంది.
అలంకరణకు పువ్వులను ఉపయోగించడం ఈనాటి కళ కాదు శతాబ్దాల క్రితం అంటే 2500BC నుండి ఈజిప్టులో మొదలైందని చెప్పుకుంటారు. అప్పట్లో పవిత్రమైన కమలాలను ఎక్కువగా ఉపయోగించేవారట. ఇకెబానా గురించి కొత్తగా చెప్పేదేముంది. 1445 నుండి జపానులో ఈ పూల అలంకరణ ఇకెబానా ప్రాచుర్యంలో ఉందంటారు. కాలక్రమేణా ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ పూల అలంకరణం, అమరిక భౌద్ధ మునుల ద్వారా జపాన్ కు వచ్చింది. వారు చైనాలో ఉన్నప్పుడు ఈ కళను గురించి తెలుసుకున్నారంట. ప్రాచీన చైనా దేశంలో పూలఅలంకరణ ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తూ, ప్రతీ జీవం విలువైనదే అని తెలుసుకుని, గౌరవిస్తూ కట్ చేసిన పువ్వులను తక్కువగా, జాగ్రత్తగా ఉపయోగించేవారట. భౌద్ధులలో ఇప్పటికీ ఈ పువ్వల సమర్పణ ఒక సంప్రదాయకమైన ఆచారంగా కొనసాగుతుంది.
ఐరోపాలో ఈ కళ డచ్ దేశీయులలో మొదలైందంటారు. 18వ శతాబ్దంలో ధనవంతులు, రాజకుటుంబీకుల గృహాలను అలంకరించడానికి పువ్వలను ఉపయోగించేవారు. వేర్వేరు రుతువులకు, సంధర్భాలకు వేర్వేరు పువ్వులను వినియోగించేవారట. తెల్లని ప్లమ్ బ్లాసమ్ పుష్పాలను వింటర్ కి, పీచ్, చెర్రీ బ్లాసమ్ పుష్పాలను స్ప్రింగ్ కి, తామరపువ్వులను సమ్మర్ కి, క్రిసాంతిమమ్ పువ్వులను ఫాల్ సీజన్ కు ఉపయోగిస్తారు. ఇక కొన్ని సందర్భాలలో ఇప్పటికి ప్రత్యేకమైన పూల అలంకరణ ఉంటుంది. క్రిస్టియన్ పెళ్లిలో వధువు తన చేతిలో "tussie-mussie" లేదా nosegay అని పిలువబడే పూల బుకే పట్టుకుని ఉంటుంది. ఇది వారి ఆచారం. కోన్ లా తీర్చిదిద్దే ఈ పూలబుకేలో ప్రత్యేకమైన పువ్వులు, ప్రత్యేకమైన అలంకరణ వారి ప్రత్యేకమైన నమ్మకానికి ఆధారంగా వాడతారు. మరో ఆసక్తికరమైన విషయం ఉంది. పెళ్లిమంటపంలోకి వచ్చేవరకు
రాయలవారి కాలంలో పుష్పలావికల గురించి విన్నాం కదా. పూలబుకేల వినియోగం విస్తృతంగా పెరిగిపోవడంతో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ పుష్పాల పరిశ్రమ Floristry గా విలసిల్లుతుంది. ఇందులో అవసరమైన పువ్వలు పెంపకం, వ్యాపారం మాత్రమే కాకుండా వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలు, వివిధ సంధర్బాలకు అనువైన, అందమైన అలంకరణలు, ప్రదర్శన, అమ్మకాలు, వాటి డెలివరీ లాంటి ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉంటాయి. హోల్సేల్ వ్యాపారులు వేర్వేరు పువ్వులను రిటైల్ వ్యాపారులకు అమ్ముతారు. వారు వివిధ అలంకరణలతో బుకేలను తయారుచేసి అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. చిన్న చిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్లు మొదలైన చోట ఈ పూలబుకేలను అమ్మకానికి పెడతారు.
ఫ్రోరల్ డిజైన్ లేదా ఆర్ట్ కి ఫ్రోరిస్ట్రి ఒకటే అనుకుంటారు కాని రెండింటికి చాలా తేడా ఉంది. కట్ చేసిన పువ్వులు, ఎండిన లేదా తాజా ఆకులు, అలంకరణకు ఉపయోగించే ఇతర పదార్ధాలతో సందర్భానికి అనుగుణంగా అలంకరించడం ప్లోరల్ ఆర్ట్ అంటారు. పువ్వులతో మొదటినుండి అంటే పెంపకంనుండి పని చేస్తూ వాటిని రిటైయిలర్ కు అమ్మేవరకు బాధ్యత తీసుకునేవారు ఫ్లోరిస్టులు అని పిలువబడతారు.ఇందుకోసం వివిధ పుష్పాల గురించి సరైన అవగాహనం వాటి పెంపకం, రక్షణ గురించిన సమాచారం మాత్రమేగాక వాటిని తాజాగా నిలవ ఉండేలా చూడడం మొదలైనవి విషయాలలో సమర్ధులై ఉండాలి. వివిధ సంధర్భాలకు వేర్వేరు పువ్వులు, బుకేల తయారి గురించి కూడా సరైన అవగాహన ఉండడం చాలా అవసరం. ప్రస్తుతం ఈ పూల వ్యాపారం చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. ఎటువంటి విద్యార్హతలు అవసరం లేని ఈ వ్యాపారం మూలంగా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. వివిధ కార్యక్రమాలు, మీటింగుల కోసం, సెంటర్ పీసెస్, స్వాగతద్వారం, రిసెప్షన్ టేబుల్స్, పెళ్లి మంటపం, వేదికలు. బిజినెస్ మీటింగులు, గెట్ టుగెదర్లు ... ఇలా అన్ని సందర్భాలలో పూల అలంకరణ అవసరం ఉంటుంది . ఇందుకు వేర్వేరు అలంకరణతో పాటు వేర్వేరు పువ్వలను ఉపయోగిస్తారు. ఇతర ప్రాంతాలు,రాష్టాలు, దేశాలనుండి కూడా పూలను దిగుమతి చేస్తున్నారు. ఈ పూల బుకేలు, అలంకరణలకు ప్రాంతాలవారిగా, దేశాలవారిగా వేర్వేరు పేర్లు ఉన్నాయి. ఆయా సంప్రదాయాలు, అందుబాటులో ఉన్న పూలని బట్టి ఎవరి స్టైల్ వారిదే.. ఉదాః ఇకెబానా, ఇంగ్లీష్ గార్డెన్, మాడర్న్, యూరోపియన్,
మొదలైనవి.
కాలానుగుణంగా లభించే పువ్వలును అందిస్తారు ఫ్లోరిస్టులు. మీకు తెలుసా? విభిన్నమైన సంప్రదాయాలలో ఈ పువ్వులకు వేర్వేరు అర్ధాలున్నాయట. అలాగే ఆయా సమయాలకు వినియోగించే పువ్వులు కూడా. బ్రిటన్, కామన్వెల్త్ దేవాలలో పాప్పీస్ అనే పువ్వులను యుద్ధంలో అమరులైన సైనికులకోసం ఉపయోగిస్తారంట. అలాగే పువ్వుల రంగులకు కూడా వేర్వేరు అర్ధాలున్నాయి. కొన్ని ప్రేమ, స్నేహం,సంతోషానికి ప్రతీకగా భావిస్తే కొన్ని చావు, విషాదాలకు అనుగుణంగా ఉంటాయంట. అందరికీ తెలిసిందే.. ఎర్రగులాబీలు ప్రేమకు చిహ్నం అంటారు. అలాగే పసుపు గులాబీలు/ పువ్వులు స్నేహానికి ప్రతీక అంటారు. తెలుపు పువ్వులు మాత్రం గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఆసియా ప్రాంతంలో ఈ శ్వేతపుష్పాలను చావు, విషాద సంధర్భాలకు వాడితే. యూరోపియన్ దేశాలలో పవిత్రత, అమాయకత్వానికి ప్రతీక అంటారు.
ప్రపంచవ్యాప్తంగా హోల్సేల్ పూల మార్కెట్లు, వేలం వేసే మార్కెట్లు చాలా ఉన్నాయి. అన్నింటికంటే పెద్దది హాలెండ్ లోని ఆల్సమీర్. తర్వాత దుబాయి ఫ్లవర్ సెంటర్, జపాన్ లోని ఓటా ప్లవర్ మార్కెట్. ఉత్తర అమెరికాలో మియామి పువ్వులకు ప్రధాన కేంద్రం అంటారు. ఇక్కడ అన్ని దేశాలనుండి పువ్వలను దిగుమతి చేసుకుంటారు. చాలామంది స్థానిక హోల్సేల్ వ్యాపారులు ఇక్కడినుండి కొనుగోలు చేసి తమ ప్రాంతాలలో చిన్న చిన్న షాపులవాళ్లకు అమ్ముతారు. న్యూయార్క్, బోస్టన్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్ణియా, కెనడాలోని టోరంటో, మాంట్రియల్, వాంకోవర్లో కూడా ఈ హోల్ సేల్ పూలవ్యాపారులున్నారు.
ఒక పువ్వుల/ఫ్లోరిస్ట్ దుకాణం నిర్వహించడానికి తగిన స్థలం ఎంపిక చేసుకోవాలి. తయారీకోసం, ప్రదర్శనకోసం ఉంచడానికి తగినంత స్థలం ఉండాలి. రోడ్డు పక్కన ఉండే ఫ్లోరిస్టులకు చిన్న చిన్న బుకేలతో పని అయిపోతుంది కాని పెద్ద బుకేలకు మాత్రం ఒక షాపులాంటిది తీసుకోవాలి. ఈ ఖరీదైన పువ్వులు తాజాగా ఉండడానికి వేడి తగలకుండా చల్లగా ఉంచాలి. కస్టమర్స్ చూడడానికి అద్దం షోకేసులు ఉండాలి. వాటిని చల్లగా ఉంచడానికి ఏ.సి , కూలర్ / చిల్లర్ లాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. తాజాగా లేకుంటే ఎవరు కొంటారు. అన్ని ప్రాంతాలకు అనువైనవి గులాబీలు, ట్యూలిప్స్, కార్నేషన్స్, ఆర్కిడ్స్, లిల్లీలు మొదలైన పువ్వులు..కొన్ని షాపుల్లో ఈ పువ్వులను మరింత అందంగా, స్పెషల్ గా గిఫ్ట్ పాక్ చేయడం, పూలు, పళ్లు, చాక్లెట్లు లాంటివి కూడా కలిపి అందంగా పాక్ చేసి కూడా ఇస్తారు.
ఈ పూలబుకేలను ఎక్కువగా క్రిస్మస్, వాలెంటయిన్ డే, మదర్స్ డే, ఈస్టర్, అడ్వెంట్, ఆల్ సోల్స్ డే, పెళ్లిళ్లు, చావులకు ఉపయోగిస్తారు. అలాగే పుట్టినరోజులు, యానివర్సరీలు, రిటైర్మెంట్ పార్టీ, గెట్ వెల్ అంటూ వివిధ సందర్భాలకు తగినట్టుగా అందం కోసం , ఆనందం కోసం వినియోగిస్తున్నారు. పది రూపాయిలకే ఒక్క గులాబీ పువ్వును కూడా కొన్ని ఆకులను కలిపి అందంగా పాక్ చేసి ఇస్తారు. అలాగే ఖరీదైన పువ్వులతో చేసే బుకేలు వేలల్లో కూడా లభిస్తాయి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడినుండైనా ఎక్కడికైనా ఎప్పుడైనా అందమైన బుకేలను పంపించవచ్చు. ఎలా అంటారా .. ఆన్లైన్లో... ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా ఈ పూల బుకేల వ్యాపారం వ్యాపించింది. ఆన్లైన్ ద్వారా కాని, ఫోన్ ద్వారా కాని ఇల్లు కదలకుండా ఆర్డర్ చేస్తే చాలు మీరు చెప్పిన సమయానికి ఆ పూలు అవతలివారికి అందుతాయి. సో సింపుల్...
0 వ్యాఖ్యలు:
Post a Comment