Monday 9 February 2015

ధీర....




ధీర ...

ప్రముఖ మహిళలు అంటే ఎవరు??? తరచూ పేపర్లలో, టీవీ చానెల్స్ లో, పత్రికలలో హెడ్ లైన్స్ లో ఉండేవాళ్లా??? లేదా సినిమా, టీవీ యాక్టర్లు, యాంకర్లు, బిజినెస్ ప్రముఖులు, రచయిత్రులా???  మిగతా స్త్రీలల్లో ప్రముఖులెవ్వరూ లేరా. వారినుండి మనం తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన, స్ఫూర్తి, సాయం పొందవలసిన విషయాలేమీ ఉండవా???  మరి పైన చెప్పిన మహిళలు ఆకాశం నుండి ఊడిపడలేదు కదా. వారు కూడా సామాన్యులనుండి ఎంతో కష్టపడి  అసామాన్యులుగా ఎదిగారు..  మొదటి మెట్టునుండి ఎవరూ కూడా ఒకేసారి చివరి మెట్టు మీదకు ప్రాకి సింహాసనం మీద కూర్చోలేరు.. ఎవరైనా ఎత్తి కూర్చోబెట్టినా తొందరగా క్రింద  పడతారు కూడా..

పతివ్రతలు అంటే ఎవరు అంటే.... సీత , సావిత్రి, అనసూయ అని లిస్ట్ చదవేముందు నేను మా అమ్మా, బామ్మ అని ఎంతమంది చెప్తారు.. ప్రపంచంకంటే ముందు మన చుట్టూ చూసుకోవడం మంచిది.. ఎన్నో వింతలు, విశేషాలు, ప్రముఖులు, పెద్దవారు ఉంటారు.. ఏధైనా సాధించాలంటే మగవారికంటే ఆడవారికే ఎక్కువ శ్రమ, ఆటంకాలు, ఇబ్బందులు ఉంటాయి.. ఇది అందరికీ తెలుసు.వివరాలడగొద్దు..

సంగతేంటంటే....

మాలిక పత్రిక మార్చ్ నుండి ఒక కొత్త శీర్షిక ప్రారంభిస్తుంది... ధీర...

ఈ శీర్షికన మాలిక పత్రికలో  వీలైనప్పుడల్లా సామాన్యులలోని ప్రముఖ మహిళలను గురించి పరిచయం చేయబడుతోంది.. ఇందులో పెద్ద చదువులు, పదవులు ఉన్నవారే కాదు. ఎన్నో ఆటంకాలను, సమస్యలను ఎదుర్కొని తన పిల్లలను ఉన్నత స్థానంలో నిలపడానికి శ్రమించిన ఒక తల్లి కావొచ్చు. ఇంట్లో ఇబ్బందులు ఎన్నున్నా ధైర్యంగా ముందుకు సాగిన ఒక అమ్మాయి కావొచ్చు. ఒక ఉద్యోగి, ఒక డాక్టరు .... ఇలా ఎవరైనా గొప్ప మహిళ అనిపిస్తే వారిని పరిచయం చేయండి.. ఇది ఆడవాళ్లే రాయాలని రూలేమీ లేదు. ఎవరైనా రాసి పంపొచ్చు... అలాటి స్ఫూర్తిదాయకమైన మహిళల గురించిన మంచి విషయాలు కనీసం ఒకరిద్దరినైనా ఆలోచింప చేస్తే ఎంతో మేలు... ఈ మహిళలు తెలుగువారు, భారతీయులే కానక్కరలేదు. ఎవరైనా సరే.. ....

మీ రచనలు పంపవలసిన చిరునామా:   editor@maalika.org

6 వ్యాఖ్యలు:

శ్యామలీయం

చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు జ్యోతిగారూ. మీకివే నా హృదయపూర్వకమైన అభిఅనందనలు. మీ ప్రయత్నం తప్పక విజయవంతమౌతుంది.

Sharma

నిజ్జంగా మంచి ప్రయత్నమే . వారి ఫొటోలతో సహా ప్రచురిస్తే బాగుంటుంది .

గాంధీ గారన్నట్లు
చెడు వినకు ,
చెడు అనకు ,
చెడు కనకు .

ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేసినా ప్రభావితం చేస్తాయి .

అలాగే మంచి కూడా , అన్నా , విన్నా , కన్నా వెంటనే ప్రభావితం చేయవచ్చు . కాని ఆచరణకు రావాలంటే మననం అ(త్య)వసరం .

కనుక మీ ఈ ప్రయత్నం చాలా మందిలో మార్పు తీసుకు వచ్చి " రేపటి మహిళలను " తయారు చేయగలదని భావిస్తున్నాను , ఆశిస్తున్నాను , మనసార దీవిస్తున్నాను .

Zilebi

మొట్ట మొదట గా జ్యోతి గారు బేడీ గారి తో ఆరంభిస్తా రను కుంటా !

నిజంగా నే ధీరా ఆవిడ !

జిలేబి

జ్యోతి

శ్యామలరావుగారు, శర్మగారు ధన్యవాదాలు..

జిలేబీగారు.. ఎవరు కిరణ్ బేడీ నా?? ఆవిడ గురించి అందరికీ తెలిసిందే కదా. ఇంకా కొత్తగా చెప్పడానికేముంది..

శ్యామలీయం
This comment has been removed by the author.
శ్యామలీయం

జ్యోతిగారూ,

మహామహిమోపేతచరితులైన మహిళలతో భారతదేశపు చరిత్రా వర్తమానమూ‌ నిశ్చయంగా నిండి ఉన్నాయి. అందులో ఎవరికీ ఎంతమాత్రమూ సందేహం అవసరం లేదు. ముందుతరాల్లోనూ భారతీయసంస్కృతీప్రాభవాన్ని జగజ్జేయమానంగా నిలిపే సత్తా ఉన్నవారు మన మహిళామణులే అన్న విషయంలో కూడా ఎవరూ సందేహించవలసిన పనిలేదు. ఐతే యాజ్ఞ్యవల్కమహర్షిని నిలువరించి అతడి బ్రహ్మజ్ఞానాన్ని పరీక్షకు పెట్టిన గార్గి నుండి, కొన్ని తరాలక్రిందటి భండారు అచ్చ్చమాంబగారి గురించీ, దుర్గాబాయమ్మగారి గురించీ, నిన్నమొన్నటి దువ్వూరిసుబ్బమ్మగారి దాకా ఎంతమంది గురించి నేడు పురుషపుంగవులకైతే నేమి నారీమణులకైతే నేమి యేమాత్రం తెలుసూ అన్నది దారుణమైన ప్రశ్నార్ధకం. దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతతరాల్లోని స్త్రీలలోని అధికులూ కనీసం వారిని గురించి తెలుసుకొని స్ఫూర్తిని పొందే పరిస్థితులు లేకపోవటం. డబ్బుసంపాదించటమో దానికోసం అడ్దమైనవీ‌ బట్టీబట్టటమో అనే కార్యక్రమాలూ, వినోదం పేరిట భల్లూకాల్లాగా స్మార్ట్‌ఫోనులకూ టీవీలకూ‌ అతుక్కుపోవటం అనే సాంస్కృతికవిధ్వంసనజీవనసరళిలో మన ప్రస్తుత తరాలు (స్త్రీపురుషబేధం ఆట్టే లేకుండా) చిక్కుబడి పోయాయి. ఐనా మనం‌ ఆశాజీవులం. విలువల గురించి ఎలాగోలా తాపత్రయ పడి జనానికి మనస్సు కెక్కించాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. యయాతి చక్రవర్తి కొడుకులకు రాజ్యం అప్పగించి వానప్రస్థానికి పోతూ చెప్పిన నీతివాక్యం


క. ఎఱుక గలవారి చరితలు
గఱచుచు సజ్జనులగోష్టిఁ గదలక ధర్మం
బెఱుఁగుచు నెఱిఁగిన దానిని
మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్.


అవశ్యం‌ శిరోధార్యమైనది. కాబట్టి మీరు పూనుకొని మంచి ఎఱుకగల ధీరవనితల గురించి లోకానికి పునఃపరిచయం చేయాలని కొంగుబిగించి పూనుకోవటం ఇంతింతనరానంత గొప్ప సత్కార్యం. అందుచేత, మీ‌కలం నుండి వచ్చే రచనలకోసం ఎదురుచూస్తున్నాను.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008