ముఖపుస్తకంలో మంచీ-చెడూ
ఈనాడు ప్రతీనోటా వినిపిస్తున్న మాట ఫేస్బుక్.
ఇంటి అడ్రస్, మెయిల్ ఐడిలా ఫేస్బుక్ ఐడి కూడా ఉండడం చాలా ముఖ్యమైపోయింది.
ఫలానావారి గురించి తెలుసుకోవాలంటే ముందు ఫేస్బుక్ వెతుకుతున్నారు. పెళ్లిసంబంధాల విషయంలో
కూడా ఇదే పద్ధతి. కంప్యూటర్లోనే కాదు
చేతిలోని ఫోన్ లో కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండడంతో ఫేస్బుక్ వాడకం చాలా వేగంగా పెరుగుతూ,
వ్యాపిస్తూ సమాజంలో మమేకమైపోయింది. అన్ని
విషయాలలో లాగానే ఫేస్బుక్ వల్ల మంచి, చెడూ రెండూ ఉన్నాయి. స్కూలు విద్యార్థులు, యువతీయువకులు,
నేరస్తులు, వ్యాపారస్తులు, గృహిణులు, విద్యావేత్తలు, విశ్రాంత ఉద్యోగులు... ఇలా అన్ని
వయసులు, రంగాలవారు ఫేస్బుక్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు . చాలామంది ఈ సోషల్ నెటవర్కింగ్ సైట్ ని ఎన్నో
మంచి పనులకు ఉపయోగించుకుంటుంటే చాలామంది కులాలు, మతాలు, రాష్ట్రాలు అంటూ
కుమ్ములాడుకుంటున్నారు. ఒకవైపు ప్రేమను, స్నేహాన్ని, సహాయాన్ని, సంతోషాన్ని పంచుతుంటే
మరోవైపు ద్వేషం, కోపం,కులాల కుమ్ములాటలు, గొడవలు.. అందుకే ఈ అంతర్జాలం అనేది
రెండువైపులా పదును ఉన్న కత్తి అని చెప్పవచ్చు..
వివిధ రంగాలలో ఉన్న కొందరు వ్యక్తులను ఫేస్బుక్ ఎలా ఉపయోగించుకుంటున్నారు
అని అడిగితే ఇలా చెప్తున్నారు...
ఎస్.నారాయణస్వామి
Detroit, USA
నా మట్టుకి నాకు ఫేస్ బుక్ ద్వారా జరిగిన
చాలా గొప్ప మేలు ఎప్పుడో ఆచూకీ తప్పిపోయిన మిత్రులు మళ్ళీ కలవడం. రామకృష్ణ అని నా
తొలి బడి రోజుల మిత్రుడు. కాలేజికి వెళ్ళేదాకా ఒకే బెంచిలో కూర్చునేవాళ్ళం,. తరవాత మెల్లగా దూరమవుతూ ఆఖరుకి
పాతికేళ్ళ కిందట పూర్తిగా ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ మిత్రుడు సుమారు రెండేళ్ళ
కిందట ఫేస్ బుక్ ద్వారా మళ్ళీ కలిశాడు. 2013లో మేం భారత్ వచ్చినప్పుడు కేవలం నన్ను
కలవడానికి పుదుచ్చేరి నుండి విజయవాడ వచ్చి కలిశాడు. ఇటువంటిదే మరో ఉదాహరణ గొప్ప
వైణిక విద్వాంసులు అయ్యగారి శ్యామసుందరం గారు, వారి శ్రీమతి
జయలక్ష్మి గారితో ఎప్పటిదో పాత పరిచయం మళ్ళీ పునరుద్ధరించబడి, సరికొత్త స్నేహంగా వృద్ధి పొందింది. ఇప్పటికీ ఇంకా ముఖాముఖీ కలుసుకోకపోయినా,
పరస్పరం ఉన్న అభిరుచులవల్ల కొన్ని డజన్లమంది మంచి మిత్రులయ్యారు.
వీరిలో ఎవరితోనైనా ఫేస్ బుక్ ద్వారా జరిగే సంభాషణలు చమత్కారంగానూ, విజ్ఞానదాయకంగానూ, ఉత్తేజకరంగానూ ఉంటూ ఉంటాయి.
కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు. ముఖ్యమైనది
స్పాం. రెండోది, మనం లాగిన్ అయ్యాము అని కనబడగానే,
ఇక్కడ పనిలో ఉన్నామా, తీరిక ఉందా అని
పట్టించుకోకుండా ప్రైవేటు మెసేజిలు చేసి విసిగించే కొంతమంది పోకిరీలు. దీనికి తోడు
మన ప్రసక్తి ప్రమేయం లేకుండా మనని నానా గ్రూపుల్లో చేర్పించేవాళ్ళు - ఇలాంటి
కొన్ని చికాకులు ఉన్నాయి. ఐతే లాభనష్టాల
బేరీజులో ఫేస్ బుక్ లో కొనసాగడమా వద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఇతరుల
పట్ల మర్యాదగా ప్రవర్తించడం, దీని మీద గడిపే సమయాన్ని అదుపు
చేసుకోవటం - ఎవరైనా ఈ రెండు ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకుంటే ఇది మంచి
ఆహ్లాదకరమైన అనుభవంగా ఉంటుంది.
హేమచంద్ర బాలాంత్రపు ..
విశ్రాంత వ్యాపారవేత్త
విశ్రాంత జీవితం గడుపుతున్న నాకు ఫేస్బుక్
మంచి స్నేహితుడిగా మారింది. చాలా ఉపయోగంగా కూడా ఉంటోంది. నా తీరిక సమయాన్ని ఎక్కువగా పుస్తకాలు
చదవడానికి వెచ్చించేవాడిని. దానికోసం లైబ్రరీకి వెళ్లడం నా దినచర్యగా మారింది.
కాని ఎక్కువమంది రచయితలు, పుస్తక ప్రియులను కలవాలన్నా, మాట్లాడాలన్నా, అభిప్రాయసేకరణ చేయాలన్నా, కొత్తవిషయాలు తెలుసుకోవాలన్నా
పుస్తకప్రదర్శనలాంటి సందర్భాలలో మాత్రమే వీలయ్యేది. నేను ఫేస్బుక్ ఎప్పుడో మొదలుపెట్టినా దానిమీద
ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదు. కాని ఎప్పుడైతే నేను క్రమం తప్పకుండా ఫేస్బుక్
వాడడం ప్రారంభించానో నాకోసం ఎన్నో నూతన
ద్వారాలు తెరుచుకున్నాయి. దూరంగా ఉన్న
పాతమిత్రులను కలుసుకోవడం, కొత్త స్నేహాలు ఏర్పరచుకోవడం, ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడం,
నేర్చుకోవడం జరిగింది. మంచి చిత్రాలు,
మంచి పాటలు, మంచి రచనలు, వ్యక్తుల గురించి తెలుసుకోవడం, ఆస్వాదించడం, ఆనందించడం
అంతా ఇంట్లో కూర్చునే చేయగలుగుతున్నాను. ఈ ఫేస్బుక్ నా ప్రపంచాన్ని మార్చింది అని
చెప్పగలను. ఎంతోమంది ప్రముఖులు నన్ను
గుర్తించడం, గౌరవించడం, ఆహ్లాదకరమైన చర్చలు జరపడం నాకు చాలా సంతోషాన్ని, తృప్తిని
ఇస్తోంది.. కాని కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. నేను ఎక్కువ సమయం ఫేస్బుక్ లో గడపడం
వల్ల కంటి చూపు కాస్త దెబ్బతింది. అందుకే ఇప్పుడు జాగ్రత్తపడుతున్నాను. ఈ ఫేస్బుక్ వల్ల
నాకు ఎంతోమంది కవులు, చిత్రకారులు, సంగీతజ్ఞులు, రచయితలు, క్రిటిక్స్ , కళాకారులు పరిచయమయ్యారు. వీళ్లందరిని తరచూ ఫేస్బుక్
వేదికగా కలుసుకోవడం ముచ్చటించడం, చర్చించడం నాకు చాలా ఆనందాన్నిస్తుంది. నా జీవనవిధానంలో సంతృప్తికరమైన మార్పును
తీసుకొచ్చిన ఈ నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనసారా అభినందిస్తున్నాను.
రాజు ఈపూరి.. కార్టూనిస్ట్
నన్నడిగితే fb వలన అందరి కన్నా ఆర్టిస్ట్స్ కే
ఎక్కువ లాభం ఉంటుందని చెప్తాను. ముఖపుస్తకం
వల్ల కొంత మంది మంచి ఫ్రెండ్స్ ని సంపాదించుకోగలిగాను. ప్రపంచoలో ఎంతో మంది గొప్ప
గొప్ప ఆర్టిస్టులని ఫ్రెండ్స్ గా పొంది
వారి ఆర్ట్ ని చూడగలిగినందుకు ఆనందపడ్డాను. కొంతమంది బొమ్మల కోసం నన్ను
సంప్రదించారు కూడా. fb ని అక్రమాలకూ, పిచ్చి
పిచ్చి కూతలకు వాడుకోకుండా మనకి కావలసిన మంచిని తీసుకోగలిగితే అందరికీ ఉపయోగపడే
మాంచి సోషల్ మీడియా. చెడు అన్నిటిలోనూ
ఉంది దాని జోలికి పోకుండా ఉండాలంతే. నేను
వేసిన కార్టూన్స్ పత్రికలకు పంపితే వందో, యాభయ్యో
వస్తుంది గాని కార్టూన్ పోస్ట్ చేసి, పత్రికవాళ్లు నచ్చి, ఎప్పుడు
వేస్తారో తెలియక ప్రతివారం ఎదురు చూసి తీరా ప్రింట్ ఐన తరువాత ఆ వంద ఇస్తారో
ఇవ్వరో తెలియక ఎదురుచూసి చూసి ఛ అని మనసులో తిట్టుకొని ఇంకెప్పుడు వారికి
పంపకూడదని ప్రతిజ్ఞలు చేసుకొని ......ఇవన్నీ ఎందుకని కార్టూన్ ఐడియా రాగానే పది నిమిషాల్లో కార్టూన్ వేసి fb లో పోస్ట్ చేస్తే
మరుక్షణంలోనే వచ్చిన likes, comments చూసుకొని తృప్తిపడిపోయి ఆ ఆనందంలో వెంటనే ఇంకో
ఐడియా తట్టి మళ్లీ పది నిమషాల్లో కార్టూన్ వేసి fb లో పోస్ట్
చేసి ....[అలా ఒక్క గంటలో పది కార్టూన్స్ వేసిన రోజులు కూడా ఉన్నాయి] ఆ ఆ ఆనందం
వేరు. అందుకే fb నాకు
ముఖపుస్తకం కాదు విశ్వ పుస్తకంగా
అనిపించింది . fb లో నేను వేసిన కార్టూన్స్ దొంగిలించిన
వారూ లేకపోలేదు . సోషల్ మీడియా లో ఉన్నది
ఏదైనా ఫ్రీ గా వాడేసుకోవచ్చు అని ఆ దొంగల నమ్మకం. కొంతమంది అడిగి తీసుకుంటారు
[డబ్బులకు కాదు లెండి]. fbలో వివిధ దేశాల ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకుంటే వారి బొమ్మలు చక్కని
ప్రదేశాలు వారి వూర్లు, ఇల్లు అన్ని ప్రతిరోజు చూసుకొనే అవకాశం కలుగుతుంది. వారు
చేసి వర్క్స్ నిమషాల్లో చూపిస్తారు. అది ఒక్క fb వలెనే
సాద్యం.
ప్రియదర్శిని కృష్ణ
ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, ఫ్రీలాన్సర్
ఫేస్బుక్ లోకి నేను ఎప్పుడో వచ్చినా, 2009 నుంచి కాస్త ఎక్కువగా చూడటం, పోస్టులు పెట్టడం చేస్తున్నాను. నిజానికి నేను FBలోకి వచ్చింది నా చిన్ననాటి మిత్రులను,
తప్పిపోయిన బాల్యస్నేహితులను వెతుక్కోడానికే. అలా, కొన్నిరోజుల్లోనే నా పాతస్నేహం మళ్లీ చిగురించింది. తర్వాత నాకు తోచిన విషయాలను, ఫోటోలను పోస్ట్ చేసేదాన్ని. వృత్తిపరమైన
విషయాలు, రాజకీయాలు, ప్రాపంచిక విషయాలు,
సినిమాలు మాత్రమే కాదు ఇంకా ఎన్నో మంచి విషయాలు మిత్రులతో చర్చించడం,
తెలుసుకోడం మొదలయింది... కొంతకాలానికి విడిగా గ్రూపులు మొదలయ్యాయి.
సంగీతం, నాట్యం, సాహిత్యం, సినిమాలు, సినిమా పాటలు, జోకులు,
వంటలు ఇలా పలు అంశాల గ్రూపుల్లో ఎన్నో విషయాలు తెలుసుకునే వీలు కలిగింది. అంతేకాకుండా
నా వ్యాపార లావాదేవీలు విస్తారపర్చేందుకు
కూడా నాకు చాలా ఉపయోగపడింది. నాకు ఇష్టమైన అంశాలను పోస్ట్ చేసుకునే వీలుగా పేజి
కూడా నిర్వహిస్తున్నాను . FB ద్వారా చాలామంది పాతతరం రచయితలు,
జర్నలిస్టులు, సినిమా
డైరెక్టర్లు, డాక్టర్లు ఇలా అనేకమందితో కొత్త పరిచయం
ఏర్పడింది.
FB ద్వారా తమ కెరీర్ ని మెరుగుపర్చుకున్న
ఫ్రెండ్స్ చాలామంది వున్నారు. నేను నా సినిమారంగ ప్రముఖులతో పరిచయం దృఢపర్చుకోడానికి
అవకాశం కలిగింది. మొన్నామధ్య నేను తెలుగు దర్శకుల సంఘం ఎన్నికల్లో అత్యంత భారీ
మెజారిటితో EC మెంబర్ గా గెలవడానికి FB కూడా నాకు సాయపడింది. నిజానికి FBని వృత్తిపరమైన
అంశాలకు ఎంతో చక్కగా వాడుకోవచ్చు. మన సృజనని ప్రదర్శించడానికి ఇది మంచి ప్లాట్
ఫార్మ్ అని నేను నమ్ముతున్నాను.
నా మటుకు నాకు కీడు కంటే మేలే ఎక్కువ
కలిగింది. FB లో అమ్మాయిల పట్ల అసభ్యంగా ఇతర మెంబర్లు
ప్రవర్తించడం కద్దు. అలాంటివి చాలా నా దృష్టికి వచ్చాయి. ఐతే, నా FB సెట్టింగ్స్ చాలా క్లిష్టమైనవి. ఎవరంటే వారు
చొరబడకుండా జాగ్రత్తగా సెట్ చేసుకున్న ఇక ముఖాముఖిగా పరిచయమున్న మిత్రులద్వారా
మాత్రమే కొత్త మిత్రులను కలుపుకుంటా. ఇది కూడా ఒకందుకు నాకు మేలు చేసింది.
మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఫేస్బుక్
లేదా ముఖపుస్తకం "వాడుకున్నవారికి వాడుకున్నంత", మంచికి మంచి చెడుకి చెడు..!!!
0 వ్యాఖ్యలు:
Post a Comment