Sunday, 7 June 2015

శేవల తయారీ ఇలా! - నవతెలంగాణ


 



Thu 04 Jun 01:35:04.736066 2015

ఈ మధ్య టీవీ యాడ్స్‌ లో ఆటా నూడుల్స్‌, వీట్‌ నూడుల్స్‌ అని వస్తున్నాయి చూసారా! ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అని సినిమా తారలతో చెప్పిస్తున్నారు. ఆరోగ్యం అంటే ఎవరు మాత్రం వెనుకడుగు వేస్తారు చెప్పండి. ఇప్పుడు మార్కెట్లో విరివిగా అమ్ముడవుతున్న విస్తృతంగా ఉపయోగించబడుతున్న నూడుల్స్‌ మైదాపిండితో తయారు చేస్తారు. అవి ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లే అంటున్నారు. అంతేకాదు, తాజాగా మ్యాగీ నూడిల్స్‌లలో సీసం శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఉందని కేసు కూడా నమౌదమయింది. కాని కొన్నేళ్ల క్రిందట ఇవే నూడుల్స్‌ లేదా సేమియాని మేలురకపు గోధుమలను మర ఆడించి ఆ పిండితో ప్రతీ ఇంట్లో తయారయ్యేవని ఎంతమందికి తెలుసు? వాటిని సేవలు లేదా శేవలు అని అనేవారు. అవే పెద్ద పెద్ద మిషన్లలో తయారు చేసి అందమైన ప్యాకింగులతో ఆకర్షణీయంగా సేమియా, నూడుల్స్‌ అని అమ్ముతున్నారు.

మీకు తెలియనిది కాదు, ఇప్పుడు ఎండాకాలం సెలవులు వస్తున్నాయంటే చేసేదేముంటుంది.. పిల్లలకు ఆ కోచింగూ, ఈ కోచింగూ లేదా స్పెషల్‌ క్లాసులు... వాళ్లను పట్టుకుని తిప్పుతూ, తిరుగుతూ హైరానాపడే తల్లిదండ్రులు. కాని ఈ కంప్యూటర్లు, టీవీలు, ఆటలు ఏవీ లేని కాలంలో అమ్మలకు, పిల్లలకు వేసవి సెలవులనగానే ఎన్ని పనులో... ఎండలు ముదురుతున్నాయనగానే ఏడాది కాలానికి సరుకులు తెచ్చి నిలవ చేసుకోవడం, పచ్చళ్లు, వడియాలు, వొరుగులు పెట్టుకోవడం ప్రతీ ఇంటా సర్వసాధారణంగా ఉండేది. అప్పుడు సూపర్‌ మార్కెట్లు లేవు మరి. ఎవరికివాళ్లు ఇంట్లో చేసుకోవాల్సిందే లేదా పనివాళ్లను పెట్టి చేయించుకోక తప్పేది కాదు. ఏడాది కోసం ఒకేసారి బియ్యం, పప్పులు, చింతపండు తెచ్చి జాగ్రత్తగా నిలవ చేసుకోవడం, మిరపకాయలు తెచ్చి ఎండబెట్టి పొడిగొట్టించడం, పసుపు తెచ్చి కడిగి ఎండబెట్టి గిర్నీలో లేదా ఇంట్లోనే తిరగలితో పొడి చేసుకోవడం తప్పనిసరి. ఆవకాయ పని ఉండనే ఉంది.. వీటన్నింటితో పాటు మరో ముఖ్యమైన వస్తువు ఉంది. టిఫిన్లు చేసుకోవడానికి సేవలు/శేవలు. వేసవిఎండల్లో వీటిని చేసి పెట్టుకుంటే సంవత్సరమంతా పనికొస్తుంది. వీటినే ఇప్పుడు సేమియా లేదా నూడుల్స్‌ అంటున్నారు.

ఇప్పుడంటే చాలా కంపెనీలు తయారుచేసిన సేమియా, నూడుల్స్‌ విరివిగా అందుబాటులో ఉంటున్నాయి ఆ కాలంలో అంటే ముప్పై , నలభై ఏళ్ల క్రితం ఈ సేమ్యా అంతగా లభించేది కాదు. దాదాపుగా అందరూ ఇంట్లో తయారుచేసుకుని ఎర్రటి ఎండల్లో రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టుకుని డబ్బాల్లో నిలవ చేసుకునేవారు. మంచి షర్బతీ గోధుమలను తెచ్చి శుభ్రం చేసుకుని కాస్త ఎండబెట్టి గిర్నీలో పట్టిచ్చి జల్లెడ పట్టాలి. ఈ పిండికి తగినన్ని నీళ్లు చేర్చి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చిన్నచిన్న ఉండలుగా చేసుకొని, చేతితో ఒత్తుతూ సన్నగా పొడవుగా సేమ్యా మాదిరిగా చేయాలి. వీటిని రెండు, మూడు రోజులు ఎండబెట్టాలి. ఈ శేవలు చేయడానికి ప్రత్యేకమైన మిషన్‌ ఉంటుంది. ఇది మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ మిషన్‌ను చేత్తోనే తిప్పాలి. దీనికి పొడవాటి కర్రముక్క పెట్టి స్టూలు లేదా కుర్చీని తిరగేసి బిగించేవారు. సెలవుల్లో ఇంట్లో ఉన్న పిల్లలను కూర్చోబెట్టి తిప్పించి ఆ శేవలను ఎర్రటి ఎండలో చాపల మీద వేసి రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టి డబ్బాల్లో వేసి పెడితే ఏడాదంతా నిలువ ఉంటాయి. ఈ శేవలు సన్నగా, కాస్త లావుగా కూడా చేసుకునేవారు. వీటితోనే ఉప్మా చేసుకునేవారు. కూరగాయలు లేదా మటన్‌ కీమా వేసి కూడా స్పెషల్‌ టిఫిన్‌ తయారు చేసుకునేవాళ్లు. అప్పుడప్పుడు స్కూలునుండి పిల్లలు రాగానే ఆకలి అంటారు.. కాస్త లావుగా ఉన్నశేవలు ఉడికించి పాలు, పంచదార, కాస్త యాలకుల పొడి వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్లు. ఇప్పటికీ ప్రతి వినాయక చవితికి మిషనుతో కాకున్నా చేత్తోనైనా గోధుమపిండితో ఇంట్లో ఈ శేవలు చేసి బెల్లం, నెయ్యి, యాలకులపొడి వేసి ఉడికించి ప్రసాదంగా తయారు చేయడం తెలంగాణ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. మేలురకపు గోధుమపిండితో చేసిన సేమ్యా/ శేవలు కాలంతోపాటు పేరు మార్చుకుని నూడుల్స్‌ గా ప్రసిద్ధి పొందాయి. ఆ కాలంలో అంటే కొన్నేళ్ల క్రింద ఇన్ని అనారోగ్యాలు, రోగాలు, ఆసుపత్రులు లేవు. నాణ్యమైన ఆహారపు దినుసులు, వంటకాలు, కూరగాయల వల్ల దాదాపు అందరూ ఆరోగ్యంగానే ఉండేవారు. కాని కొత్త కొత్త ఆవిష్కరణలు, ఉత్పత్తులు, రెడీమేడ్‌ దినుసులు, ఫాస్ట్‌ఫుడ్‌ అంటూ వండినవి కూడా సులువుగా లభించడంతో ఎటువంటి శారీరక శ్రమ లేకుండా పోయింది. మార్కెట్లో ప్రకటనల మాయాజాలంలో చిక్కి తమ ఆరోగ్యాలను, పిల్లల ఆహారపు అలవాట్లను కూడా పాడు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇలా కొన్ని తినుబండారాలు, వస్తువులు ఆరోగ్యానికి మంచిది తప్పకుండా వాడండి అనగానే ఆశపడిపోయి ధర ఎక్కువైనా కొనేస్తుంటారు. కాని కాస్త శ్రమ తీసుకుంటే ఇంట్లోనే ఎంతో శుభ్రంగా పోషకాలతో కూడిన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చని అర్ధం చేసుకోరు. అర్ధం చేసుకున్నా పాటించలేరేమో.



శేవలతో పాయసం

కావలసిన పదార్థాలు: శేవలు - 200గ్రా, బెల్లం తురుము - 250గ్రా, నెయ్యి - నాలుగు టీ స్పూన్లు, గసగసాలు - టీ స్పూను, యాలకుల పొడి - టీ స్పూను, పాలు- కప్పు, కొబ్బరి తురుము - కొద్దిగా,
తయారీ: ఒక గిన్నెలో బాగా ఎండిన శేవలు, తగినన్ని నీళ్లు పోసి శేవలను ఉడికించాలి. బెల్లం తురుము, పాలు, నెయ్యి వేసి నెమ్మదిగా కలపాలి. బాగా ఉడికిన తర్వాత యాలకుల పొడి, గసగసాలు వేయాలి. కొబ్బరి తురుముతో గార్నిష్‌ చేసి దించేయాలి. వేడివేడి శేవల పాయసం రెడీ.



పాల తాలికలు
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - అర కప్పు, నీళ్లు - సరిపడా, బెల్లం - ఒక కప్పు, యాలకుల పొడి - అర స్పూను, జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్‌ - ఒక్కో స్పూను చొప్పున, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూను.

తయారీ: ముందుగా గోధుమపిండిని నీళ్లతో చపాతీపిండిలా కలుపుకోవాలి. పిండిని చేత్తో సన్నగా సేమియాల్లా చేసుకోవాలి. వీటిని తాలికలు అంటారు.

ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు మరిగించి తయారు చేసుకున్న తాలికలు అందులో వేసి ఉడికించాలి. తాలికలు ఉడికిన తర్వాత పొడిగా చేసి పెట్టుకున బెల్లం, నెయ్యి వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. స్టౌ మీద నుంచి దించిన తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. నేతిలో వేయించిన బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అలంకరించుకుంటే శేవలతో పాలతాలికలు రెడీ.

- జ్యోతి వలబోజు

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008