Sunday, 7 June 2015

ష్,,గప్ చుప్! పానీపూరీ బహుత్ ప్యారీ - నమస్తే తెలంగాణ



 
నమస్తే తెలంగాణ : 28.5.2015

పూరీ కాని పూరీ.. పిల్లలకు బహుత్ ప్యారీ పానీపూరీ! చూస్తే సరి.. లొట్టలేసుకొని మ్మ్‌ఁఁ అంటూ నోట్లో వేసుకొని గుటుక్కుమనాల్సిందే.. మరల మరల వేయమంటూ.. మసాలా మజానంతా జుర్రాల్సిందే.. ఎక్కడికో వెళ్లే శ్రమ లేకుండా మీ వంటింట్లోకి గప్‌చుప్‌గా వచ్చి రుచి చూపిస్తానంటోంది పానీపూరీ.. ఆలస్యమెందుకు.. చెండంటి చిన్న పూరీకి కుండ వలెన్ బొక్క పెట్టి.. కూర్చి మసాలా..నిండా నీరు నింపగ.. గప్‌చుప్‌న మింగాలె.. పానీపూరీ అని పద్యమేసుకొని ఖాళీ కడుపులో కాసింత పానీ నింపండి!!

రంగీలా పానీపూరి

కావలసిన పదార్థాలు:- పూరీలు :- బొంబాయి రవ్వ : 1 కప్పు, మైదా : 3 టేబుల్‌స్పూన్లు, వంట సోడా : చిటికెడు, పాలకూర రసం : 1 టీస్పూన్ బీట్‌రూట్ రసం : 1 టీస్పూన్, క్యారెట్ రసం : 1 టీ స్పూన్, పసుపు : చిటికెడు నూనె : వేయించడానికి పానీ : చింతపండు పులుసు : 1/2 కప్పు, నీళ్లు : 2 కప్పులు, జీలకర్ర పొడి : 2 టేబుల్‌స్పూన్లు కారంపొడి : ఇక టీస్పూన్ నల్ల ఉప్పు : 1 టేబుల్‌స్పూన్, బెల్లం : 1 టీస్పూన్ స్టఫింగ్ : ఉడికించిన బంగాళ దుంపలు : 2 ఉడికించిన శనగలు : 1/4 కప్పు, బూందీ : 1/4 కప్పు కారంపొడి, మిరియాలపొడి, ఉప్పు : రుచికి సరిపడా

తయారీ :- రవ్వలో మైదా, చిటికెడు ఉప్పు, వంటసోడా కలిపి నాలుగు భాగాలుగా చేసుకోవాలి. ఒక దాంట్లో పాలకూర రసం, మరో దాంట్లో బీట్‌రూట్ రసం, ఒక దాంట్లో పులుసు, ఇంకో దాంట్లో క్యారెట్ రసం పోసి తగినన్ని నీళ్లు కలుపుకొంటూ పూరీపిండిలా విడివిడిగా కాస్త గట్టిగా తడిపి మూతపెట్టి ఉంచాలి. చింతపండు నీళల్లో జీలకర్ర, పొడి, కారంపొడి, బెల్లం, నల్ల ఉప్పు, నీళ్లు వేసి కలిపి పులుపు సరిచేసుకుని వడకట్టి ఉంచుకోవాలి. ఉడికించిన బంగాళాదుంపలు చిదిమి శనగలు, బూందీ కలుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, కారంపొడి, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. నానిన రవ్వను బాగా పిసికి మృదువుగా చేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీల్లా వత్తుకుని వేడి నూనెలో కరకరలాడేలా వేయించుకోవాలి. నాలుగు రంగుల్లో పూరీలు తయారుగా ఉన్నాయి కదా.. పూరీ మధ్యలో కొద్దిగా ఖాళీ చేసి బంగాళదుంప ముద్ద కొంచెం పెట్టి తయారు చేసుకున్న నీళ్లలో ముంచుకొని తినాలి.

మిక్స్‌ఫ్రూట్ పానీపూరి
కావలసిన పదార్థాలు:- ఆపిల్ ముక్కలు : 1/2 కప్పు, అరటిపండు ముక్కలు : 1/2కప్పు, ఆరెంజ్ ముక్కలు : 1/2 కప్పు, పైనాపిల్ ముక్కలు : 1/2 కప్పు, పానీపూరీలు : 25, తాజా క్రీమ్ : 2 కప్పులు, తేనె : 5 టేబుల్‌స్పూన్లు

తయారీ :- పళ్ల ముక్కలన్నీ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని తేనె ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తాజా క్రీమ్ తీసుకోవాలి. పానీపూరీల మధ్యలో రంధ్రం వేసి కాసిన్ని పండ్లు పెట్టి చెంచాతో క్రీమ్ వేసి వెంటనే సర్వ్ చేయాలి.

చాకో వేఫర్ పానీపూరీ
కావలసిన పదార్థాలు :- పానీపూరీలు : 20, చాకోస్ : 1/2 కప్పు కాజు, బాదాం : 1/4 కప్పు మంచ్ / వేఫర్ చాక్లెట్స్ : 4, కాఫీ పౌడర్ : 3 టీస్పూన్స్, చక్కెర: 5 టేబుల్‌స్పూన్స్

తయారీ :- రెండు కప్పుల నీళ్లు మరిగించి చక్కెర కలిపి దింపేయాలి. ఇందులో కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి చల్లరాకా ఫ్రిజ్‌లో పెట్టాలి. సర్వ్ చేసేముందు జీడీపప్పు, బాదం చిన్న, చిన్న ముక్కలు చేసుకోవాలి. వేఫర్ చాక్లెట్స్ లేదా మంచ్ చాక్లెట్స్ ముక్కలు చేయాలి. ఒక గిన్నెలో చాకోస్, మంచ్ ముక్కలు, డ్రైఫ్రూట్స్ ముక్కలు అన్నీ కలిపి పెట్టుకోవాలి. ఇష్టముంటే మిల్క్ చాక్లెమ్ ముక్కలు వేసుకోవచ్చు. సర్వ్ చేసే ముందు పూరీలను మధ్యలో చిల్లు పెట్టి ఈ మిశ్రమం కొంచెం వేసి ఇంతకుముందు తయారుచేసి పెట్టుకున్న కోల్డ్ కాఫీతో సర్వ్ చేయాలి.

చాక్లెట్ పానీపూరీ
కావలసిన పదార్థాలు:-పానీపూరీలు : 20, చక్కెర : 1 1/2 కప్పులు, నీళ్లు : 3 కప్పులు, కోకోపౌడర్ : 3/4 కప్పుఉప్పు : చిటికెడు,వెనీల్లా ఎసెన్స్ : 1 టీస్పూన్

తయారీ :-వెడల్పాటి పాన్‌లో చక్కెర, నీళ్లు కలిపి మరిగించాలి. చక్కెర కరిగిన తర్వాత కోకోపౌడర్, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుతూ చిక్కబడేవరకు ఉంచాలి. ఓ మూడు నిమిషాలు చిన్న మంటమీద మరిగించి దింపేసి వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. చాక్లెట్ సిరప్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో పానీపూరీలు పెట్టి ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత అవి కాస్త గట్టి పడతాయి. అప్పుడు ఈ పానీపూరీలు అలాగే తినేయొచ్చు. లేదా తర్వాత కూడా తినొచ్చు.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008