Thursday, 30 July 2015

పుస్తకం ఒక బహుమతి.. 50% ధరకే పుస్తకాలు ...

 
“Books make great gifts because they can unveil hidden secrets.” –Dan Brown

“Books make great gifts because they expand your horizons and keep you cooking.” –Emeril Lagasse

“Books make great gifts because they have whole worlds inside them, and it’s much cheaper to buy somebody a book than it is to buy them the whole world.” –Neil Gaiman

“Books make great gifts because… [they don’t] come in any particular size, so you don’t have to be embarrassed if you bought somebody the wrong size.” –Valerie Bertinelli

“Books make great gifts because in a time of trouble, they can take the reader personally into a place of hope.” –Glenn Beck

“Books make great gifts because they’re everybody’s favorite things.” –Julie Andrews

“Books make great gifts because they’re something you love that you can share.” –John Lithgow

“[Books are] the most fun you can have for under $25. You and your significant other can’t go to a movie and buy popcorn and have that much fun!” –Al Roker

“Books make great gifts because you don’t have to plug them in.” –Alec Baldwin

మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, ఎవరింట్లో పార్టీ లేదా పెళ్లికి వెళ్లినా బహుమతులు ఇవ్వడం రివాజు. దానికోసం ఏ ప్లాస్టిక్ డబ్బానో, స్టీల్ లేదా గ్లాస్ ఐటెమ్స్, లేదా చిన్న చిన్న షో పీసెస్ ఇస్తుంటాం. ఇక దేవుళ్ల ఫోటోలు, గడియారాలకు లెక్కలేదనుకోండి. కాని ఇవి తీసుకున్నవారు ఎంత సంతోషించారో, తిట్టుకున్నారో మనకు తెలీదు. తెలుసుకోవాలని కూడా అనుకోము. ఎంత చిన్న గిఫ్ట్ ఐనా సుమారు యాభై రూపాయలు పెట్టక తప్పదు. కాని అది ఎక్కడో స్టోర్ రూమ్ లోకి వెళుతుంది లేదా ఇంకెవరికో గిఫ్ట్ గా వెళుతుంది. మనం ఇచ్చిన బహుమతులు ఎంత మంది భద్రంగా దాచుకుంటారు. చాలా అఫురూపమైన బహుమతి , ఫలానావారు ఇచ్చారు అని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటారు. ఇధే ఆలోచన మనకు కూడా వర్తిస్తుంది..

అందుకే కాస్త ట్రెండ్ మారుద్దాం. ఇప్పటికే ఈ పద్ధతిని కొందరు పాటిస్తున్నారు కాని అందరం అలవరచుకుందాం..
పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి.. ఇవి వెలకట్టలేనివి. చదివేవారు లేరు అంటారా.. ఉన్నారు. కాని మనం ఎవరింటికైనా వెళుతుంటే. వారికి బహుమతి ఇవ్వాలనుకుంటే వారి గురించి కాస్తైనా తెలిసుంటుంది కదా. వారి అభిరుచి మేరకు మన బడ్జెట్ లోనే పుస్తకాలు కొని ఇవ్వొచ్చు. అది కథలైనా, నవలైనా, పద్యాలైనా, ఆటలైనా, టెక్నికలైనా, బొమ్మలైనా, పూజలైనా, తీర్థయాత్రలైనా... ఏవైనా సరే.. పుస్తకాలు చదవండి. చదివించండి..
ఈ క్రమంలో జె.వి.పబ్లికేషన్స్ ఒక కొత్త ఆలోచన చేస్తోంది. ఎప్పుడైనా, ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటే జె.వి.పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించబడిన పుస్తకాలలో కనీసం 25 అయినా తీసుకునేవారికి సగం ధరకే ఆ పుస్తకాలను ఇవ్వడం జరుగుతోంది. మరికొందరు మహిళా రచయిత్రులు కూడా తమ పుస్తకాలను సగం ధరకు ఇవ్వడానికి సుముఖులుగా ఉన్నారు..

మరి ఇంకెందుకు ఆలస్యం. ఆలోచించండి..

మానవత్వపు విలువల 'దీపతోరణం'



నవతెలంగాణ    Jyothi Valaboju

దీపతోరణం సమీక్ష (దర్వాజా సాహితీ పేజి)

Mon 20 Jul  2015


సమాజంలో మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు సాహిత్యానికి పునాది వేస్తాయి. రచయితలు తమదైన భావవ్యక్తీకరణ శైలిలో ఈ సంఘటనలు, అంశాలు, వ్యక్తుల గురించి అందమైన కథలుగా మలుస్తారు. అందుకే చాలా కథలు చదివినప్పుడు అవి మనకు తెలిసినట్టుగా, చూసినట్టుగానే అనిపిస్తాయి. రచనలు చేయడం మాత్రమే కాదు ఒక సంఘసేవికగా, సమాజం పట్ల ఒక బాధ్యతగల వ్యక్తిగా ఇటువంటి సున్నితమైన అంశాలతో రాసిన కథలను 'దీపతోరణం'గా గుచ్చి తన మూడవ పుస్తకంగా ఆవిష్కరించారు శ్రీమతి కన్నెగంటి అనసూయ. మొత్తం పదిహేను కథలతో అందించిన ఈ తోరణంలోని ప్రతీ కథ పాఠకులను చదివించి, కదిలించి, ఆలోచింపజేస్తుంది. ఆసక్తికరమైన కథనం, చక్కని కథాంశాలతో రాసిన ఈ కథలలో అవసరమైన చోట అందమైన పలుకుబడులతో పుస్తకం ఆసాంతం చదివిస్తాయి. 'పితృదేవోభవ' కథలో తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే కొడుకు తండ్రి భుజాలమీద ఎక్కాలనే చిన్న ఆనందం, చెరకుగడలు నాన్నే ముక్కలు చేసి ఇవ్వాలి అనే కోరికలు తీరక తండ్రి మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు.

''ఆ చల్లని నీడలో'' కథలో స్కూలుపిల్లలకు వానాకాలంలో రక్షణకు గొడుగులు ఇవ్వాలనుకుంటే వాన వస్తే స్కూలు ఎగ్గొట్టచ్చనే కోరికతో పిల్లలు వాటిని తిరస్కరిస్తారు. ఆ స్కూలులో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనపు పథకం విషయంలో పొదుపుగా ఖర్చుపెట్టి మిగిలిన డబ్బుతో పిల్లలకు ఇంకో కూర చేయించి పెట్టాలనే హెడ్‌ మాస్టర్‌ గారి అంకితభావాన్ని చూపించారు రచయిత్రి.

మరో కథ 'జీవితాన్ని శాసించేవి' కథలో సమాజంలో నిత్యం ఎదురయ్యే సమస్య ఇంటి / కుటుంబ సమస్య. చిన్న ఇంటిని వదలి పెద్ద ఇంట్లో మనిషికో గది పేరిట కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయానురాగాలు కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఇల్లు విశాలమైనా కూడా మనసులు ఇరుకున పడిపోయే ప్రమాదం ఎదురైనవేళ వాళ్ళు తీసుకున్న నిర్ణయం కథకు ముగింపునిస్తుంది.

వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కలిగిస్తుంది 'ఆ మాత్రం చాలు' కథ. 'ఏదైనా అంతే' కథలో ప్రతీ గృహిణి ఎదుర్కొనే నీటి సమస్యను, నీటి పొదుపు గురించి రాసిన ప్రతీ వాక్యం అభినందనీయం.. చిన్నప్పుడు దీపావళి పండగ సమయంలో సిసింద్రీలు తయారు చేస్తూ కంటి చూపు కోల్పోయిన స్నేహితుడి కోసం దీపావళి పండగ జరుపుకోవడమే మానేసిన రామారావు కథే 'దీపతోరణం'. కన్నెగంటి అనసూయ పుట్టిన గ్రామ పరిసరాలు, ఆత్మీయతానురాగాలు, పల్లె వాతావరణం, ఇవన్నీ ఆమె కథలలో తొంగి చూస్తాయి. ఆమె సేవాభావం కూడా ఈ కథలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది...

 - జ్యోతి వలబోజు,

Sunday, 19 July 2015

బంధాలు - అనుబంధాలు ( నవతెలంగాణ )



బంధాలు.. అనుబంధాలు
Wed 15 Jul 02:56:51.551319 2015
భార్య .. భర్త
తల్లిదండ్రులు.. పిల్లలు
కొడుకులు... కోడళ్ళు
కూతుళ్ళు... అల్లుళ్లూ
అత్తలు.. మామలు
పిన్ని... బాబారు
ఇలా... భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఎన్నో బంధాలు అనుబంధాలు... అందరి మధ్య రక్త సంబంధంతో కూడిన ప్రేమ, అనురాగం, గౌరవం, మమకారం కనిపిస్తుంది. నీది నాది అని కాకుండా మనది అనే అందమైన ఆప్యాయతతో కూడిన భావన అందరికీ ఉంది. నమ్మశక్యం కావట్లేదు కదా... చదువుతుంటే, వింటే చాలా బావుందనిపిస్తుంది. కాని ఇది ఒకప్పటి మాట అని అందరూ ఒప్పుకునే చేదు నిజం . ఈ రోజు ఈ అనుబంధాలన్నింటిలో ఎన్నో పరిమితులు, వలయాలు, పొరలు, ఆత్మవంచనలు, స్వార్థాలు, మోసాలు చోటు చేసుకున్నాయి.
నిజజీవితంలో మనుషుల మధ్య దూరం పెరిగిపోతుందన్న మాట మాత్రం వాస్తవమే. ఒకరి మాట ఒకరికి నచ్చదు. వారి ఉనికిని కూడా సహించరు. ఇంట్లో ఎదురుగా కనబడే పెద్దలను లెక్క చేయని యువత ఆమెరికా ఫ్రెండుతో రోజూ గంటల తరబడి ముచ్చట్లేస్తుంటారు. కొత్తవారితో స్నేహం పెంచుకోవడానికి చూపే ఆసక్తి, ఉత్సాహం, ఇంట్లో వున్న వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగు పరుచుకోవడంలో మాత్రం చూపడం లేదు.
ఒకప్పుడు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరికోసం ఒకరు అన్నట్టుగా కుటుంబ శ్రేయస్సు కోసమే కలిసి కష్టపడేవారు. ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబమైనా అందరినీ ప్రేమగా చూసుకుంటూ బాధ్యతలను సమంగా పంచుకుని అందరినీ ఒక్కతాటిపై నడిపించేవారు. కాని నీటి ఆధునిక యుగంలో ఈ బంధాలు అనుబంధాలకు గల అర్థాలు మారిపోతున్నాయి. బిజీ లైఫ్‌ మనిషి జీవితంలో అనూహ్యమైన మార్పులను తెస్తుంది. భార్యాభర్తలు, అన్నదమ్ములు, పిల్లలు అందరూ 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్టుగా జీవిస్తున్నారు.
డబ్బు సంపాదనపైనే అందరి దృష్టి. మానవ సంబంధాలను అంతగా పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు తమకంటూ విడిగా బ్యాంక్‌ అకౌంట్లు, ఇళ్ళు, వాహనాలు, వస్తువులు కొనుక్కుంటున్నారు. ఒక్క ఇంట్లో ఉండేవారే తల్లైనా, తండ్రైనా, పిల్లలైనా నీది నాది అని మాట్లాడుకుంటున్నారు.. ఇలాంటి బిజీలైఫ్‌లో పూర్తిగా మునిగిపోయిన తల్లిదండ్రులు తాము కన్న పిల్లలను తమ తల్లిదండ్రులకో, అత్తామామలకో, పనిమనుషులకో, క్రెష్‌లకో అప్పగిస్తున్నారు. పెద్దవాళ్లైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపేస్తున్నారు. దీంతో తల్లితండ్రులకు పిల్లలకు మధ్య సహజంగా ఉండాల్సిన అనుబంధం, ఆప్యాయతలు కొరవడుతున్నాయి.
మనం చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఉంది. సమాచార, సాంకేతిక విప్లవం ఈ విశాల ప్రపంచాన్ని చిన్న గ్రామంలా మార్చేసింది. దేశవిదేశాల మధ్య సరిహద్దులను చెరిపేసి వేల మైళ్ల దూరాన ఉన్నవారిని కూడా నిమిషాల్లో కలిపేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవ సంబంధాలు మెరుగైనట్లు కనిపించినా కుటుంబ సంబంధాలు మాత్రం దెబ్బ తింటున్నాయని కొందరంటున్నారు.
కాని నిజజీవితంలో మనుషుల మధ్య దూరం పెరిగిపోతుందన్న మాట మాత్రం వాస్తవమే. ఒకరి మాట ఒకరికి నచ్చదు. వారి ఉనికిని కూడా సహించరు. ఇంట్లో ఎదురుగా కనబడే పెద్దలను లెక్క చేయని యువత ఆమెరికా ఫ్రెండుతో రోజూ గంటల తరబడి ముచ్చట్లేస్తుంటారు. కొత్తవారితో స్నేహం పెంచుకోవడానికి చూపే ఆసక్తి, ఉత్సాహం, ఇంట్లో వున్న వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగు పరుచుకోవడంలో మాత్రం చూపడం లేదు.నిత్యం కలుసుకునే వ్యక్తులు, స్నేహితులు, రక్తసంబంధీకుల మధ్య ఉండే కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఇంటర్‌నెట్‌లో కలిసిన వ్యక్తుల మధ్య ఉండడం లేదు. ఆ వ్యక్తులు కేవలం మాటలు, రాతల ద్వారానే పరిచయం. వాళ్లు ప్రత్యక్షంగా కూడా కలిసి వుండరు. అయినా వారి మధ్య ఎంతో నమ్మకం, ఆత్మీయత. ప్రతీ బంధం ఇలాగే వుండాలని లేదు. ప్రేమ, నమ్మకం, ద్వేషం, మోసం అనేవి వాస్తవ ప్రపంచం, మిధ్యా ప్రపంచం రెండింటిలో సమానంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇంటర్నెట్‌ ద్వారా ముచ్చటించుకుంటున్నారు. ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఫొటోలు పంపించుకుంటున్నారు. ఇక్కడ ఒకే ఊర్లో ఉన్నవారికి తెలియని విషయాలు ఫేస్బుక్‌ ద్వారా బంధువులకు తెలిసిపోతున్నాయి. ఇది మంచికో, చెడుకో గాని దాచాలనుకున్నవి బయటపడిపోతున్నాయి. దూరంగా ఉన్నవారి మధ్య కూడా బంధం తెగకుండా ఉంటోంది.
అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండవు. నిజజీవితంలో ఈ పరస్పర విభేదాలతోనే అపార్థాలు, అనుమానాలతో గొడవలు మొదలవుతాయి. కాని నెట్‌ ద్వారా పరిచయమైన వ్యక్తులలో ఒకే విధమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నవారు దగ్గరవుతారు. అందుకే వారి మధ్య ఎటువంటి భేదాభిప్రాయం, గొడవలు ఉండవేమో. మానవ జీవితాలు ఆనందంగా సుఖమయంగా ఉండడానికే ఎన్నో అనుబంధాలు ఏర్పడతాయి. ఈ సమాజంలో మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి అవసరం ఎప్పుడో ఒకప్పుడు మనకు కలుగుతుంది. అందుకే సమాజంలో అందరినీ కలుపుకుని ఎటువంటి భేషజాలు, స్వార్థం, మోసాలు, ద్వేషాలు లేకుండా ఉండాలి.
భిన్నమైన వైరుధ్యాలు, దృక్పథాలు గల మనుషుల మధ్య కలిసి బతకడానికి స్నేహంగా ఉంటూ అందరినీ గౌరవించడం అలవర్చుకోవాలి. ఈ మానవ సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి ముందు కుటుంబం నుండే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. కుటుంబంలో సఖ్యతకు ముందుగా ఇంటి ఇల్లాలే ముందడుగు వేయాలి. అత్తలో తల్లిని, కోడలిలో కూతురుని, ఆడపడుచు, తోటి కోడలిలో సోదరిని చూడగలిగితే అందరూ సంతోషంగా ఉంటారు. అవసరమైన వేళ అందుబాటులో ఉండి తోడుగా ఉంటారు. తాత్కాలిక భోగాలైన ఆధిపత్యం, అధికారం, డబ్బు, హోదా, పలుకుబడి మొదలైన వాటిని గుర్తించి వాటిని పక్కనపెట్టి బంధుత్వాలు, బాంధవ్యాలు గుర్తించాలి. అప్పుడే అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. ఇలాంటి మాటలు చెప్తే అందరూ నవ్వుతారు సోది అని... కాని ఆచరణలో తీసుకువస్తే మాత్రం అందరికీ ఉపయోగకరమే.
- జ్యోతి వలబోజు

Tuesday, 7 July 2015

అత్యాచారం - అమానుషం




భగవంతుడు తన సృష్టిలో ఆడా, మగా అని సమానంగా సృష్టించాడు. ఇద్దరూ అందమైనవాళ్లే, శక్తివంతులే. ఒకరినొకరు గౌరవించుకుంటూ సమాజాన్ని ముందుకు నడిపించేవాళ్లే.

కానీ ఈనాడు కాదు పురాణాలనుండి ఆడదాన్ని ఒక విలాసవస్తువుగా భావించారు. నచ్చిన స్త్రీని శాస్త్రయుక్తంగా కానీ, గాంధర్వరీతిని గానీ, రాక్షసరీతిని గానీ వివాహం చేసుకునేవారు రాజులు, మహారాజులు. కాలక్రమేనా స్త్రీ తనలోని ప్రతిభని గుర్తించి దైన్యాన్ని, నిస్సహాయతని వీడి ఒక శక్తిగా మారసాగింది. ఈనాడు ఎంత అభివృద్ధి చెందినా, స్త్రీ అంట్లు తోమడం, ఆవకాయ పెట్టడం నుండి అంతరిక్షంలోకి దూసుకుపోయే స్ధితికి ఎదిగినా ఆమెకు భద్రత లేకుండా పోయింది. ప్రతీచోటా ప్రమాదమే.. ఎదిగిన ఆడపిల్ల విషయంలోనే కాదు మూడేళ్లు, ఐదేళ్ళ పసిపాపల మీద కూడా కామాంధుల పైశాచిక దాడులు జరుగుతున్నాయి. చదువుకునే సమయంలో, ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో, ఉద్యోగం కాని ఏదైనా అవసరార్ధం మగవాళ్ల దగ్గరకు వెళ్లాలంటే దాదాపు అందరూ ఆడవాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోక తప్పడంలేదు. చివరికి ఉద్యోగం నుండి ఇంటికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వాహానాలలో కూడా భద్రత ఉండడం లేదని అందరికీ తెలిసిన విషయమే. ఆడవాళ్లు అనాలా? ఆడపిల్లలు అనాలా? చిన్నారులు అనాలా? అందరూ ఏదో విధమైన ఆకృత్యాలకు బలైపోతున్నారు. చివరికి తండ్రి, అన్నలు , కుటుంబ సభ్యుల చేతిలో కూడా అత్యాచారానికి లోనవుతున్న ఆడపిల్లల కథలు కూడా వినవస్తున్నాయి. 

ఇక వయసులో ఉన్న ఆడపిల్ల అత్యాచారానికి గురైతే ముందుగా సమాజం ఆమెను దోషిగా, చాలా పెద్ద తప్పు చేసినదానిలా చూస్తుంది. చెడగొట్టబడలేదు.. చెడిపోయింది కాబట్టి ఆ అమ్మాయిని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. అసలు ఆ అమ్మాయే తను చేయని నేరానికి శిక్ష పడి ఒక పనికిరాని వస్తువు అవుతుంది. ప్రతీవారు ఒక వింతలా చూస్తారు. మీడియావాళ్లైతే తమ లాభం కోసం దాన్నొక స్పెషల్ స్టోరీ చేసుకుంటారు. కాని తర్వాత ఆ అమ్మాయి సంగతేంటి?? ఎవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అందుకనే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టమున్నా లేకుండా బంధువులందరూ కలిసి ఒప్పించి మానభంగం చేసినవాడికే ఇచ్చి పెళ్లి చేయమంటారు. అసలే అత్యాచారానికి గురైన అమ్మయి. మళ్లీ ఆ దుర్మార్గుడికే జీవితాంతం బానిసగా పడుండాలి. ఒకరివల్ల అమ్మాయి జీవితం నాశనమైతే సమాజం ముందుకొచ్చి పూర్తిగా నాశనం చేసేస్తుంది... ఇది ఆ అమ్మాయి చేసిన దోషమా? కొవ్వెక్కి చేసిన ఘనకార్యమా? అత్యాచారానికి గురై వాడినే పెళ్లి చేసుకుని ప్రతిదినం అత్యాచారం చేయించుకోవాలి. అప్పుడు అది తప్పు కాదన్నమాట....

కాని అత్యాచారానికి గురైన ఆడపిల్లను తల్లిదండ్రులు ఆమెను చేరదీసి కాపాడుకుని జరిగినదొక పీడకలగా భావించి ముందుకు సాగాలి. కాని ఇప్పటికీ ఈ అత్యాధునిక, అభివృద్ధి చెందిన సమాజం మాత్రం రేప్ చేసిన దుర్మార్గుడికే ఇచ్చి పెళ్లి చేయడం ఉత్తమమైన పరిష్కారం అని చెప్తోంది .. నేనో కథ చదివా.. తన కూతురు అత్యాచారానికి గురై ఇంటికి వస్తే తల్లి అంటోంది.. "వెళ్లి తలారా స్నానం చేసిరా. ఏమీ జరగలేదు. ఒక యాక్సిడెంట్ అంతే. స్నానం చేసి, తినేసి పడుకో. ఎవరితో ఏమీ చెప్పాల్సిన పని లేదు."

నా ఈ మాటలకు, ఉద్వేగానికి కారణం Rajuగారి ఈ కార్టూన్. చాలామందికి ఇది చిన్న సూక్తి లేదా మంచి మాట చెప్పే బొమ్మలాగే అనిపించవచ్చు . కాని ఆ తండ్రి కళ్లలోని నిస్సహాయత, ఆ తల్లి మనసులోని ఆవేదన ఎంతమందికి కనిపిస్తోంది. ఎంతమందిని ఆలోచింపచేస్తుంది....

ప్రముఖాంద్రలో జ్యోతి వలబోజు

జ్యోతి వలబోజు
లేదావిడకు ఫోజు
చక్కని తెలుగంటే మోజు
అది అందరికీ పంచడం రివాజు


రచన: గోటేటి వెంకటేశ్వరరావుగారు.. ప్రముఖాంధ్ర మాసపత్రిక




 

ఆహా! నోరూరగాయాయనమః - తెలుగు వెలుగు




రేలపూలు - పుస్తక సమీక్ష



 తండావాసుల గుండెచెమ్మ
 Sun 28 Jun 00:56:03.96997 2015

         జీవితానుభవాలే సాహిత్యానికి పునాదివంటివి. నిత్యం మన చుట్టూ ఎన్నో కథలు తిరుగాడుతూ ఉంటాయి. వాటిని మనసుతో బంధించి అక్షరీకరించడం ద్వారా మరెంతోమందికి ఆ వాతావరణాన్ని, పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపించవచ్చు. ఎందుకంటే ఈ కథలు చదువుతుంటే ఆయా పాత్రలు, సంఘటనలు మనముందు కళ్లకు కట్టినట్టుగా ప్రత్యక్షమవుతాయి. అటువంటి ప్రతిభ గల రచయిత్రి శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారి రెండవ పుస్తకం 'రేలపూలు'.

        ఉద్యోగినిగా తను పనిచేస్తున్న మారుమూల గ్రామంలో అరకొర సౌకర్యాల నడుమ, చాలీచాలని ఆదాయంతో తండావాసులు, వాళ్ల పిల్లలు పడుతున్న వెతలు రోజూ కళ్లారా చూస్తున్న రచయిత్రి వాటికి తన శైలిలో కథలుగా మలిచారు. తను ఎవరిగురించైతే కథలు రాస్తుందో వాళ్లు ఈ కథలను చదవలేకున్నా వారిగురించి సమాజంలోని మనం సాటిపౌరులుగా చదివి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నదంటున్నారు రచయిత్రి.

 ఆస్తిత్వం కథలో పేర్ల గురించి ప్రస్తావిస్తూ అక్కడ తండాలో పిల్లల పేర్లు అన్నీలాల్‌, పోలీ, అమ్రు, సాల్కి, సక్రూ, రాంనాయక్‌, హర్యాలాల్‌, బిక్కూలాల్‌ వంటి అమ్మా నాన్నలు పెట్టిన అందమైన పేర్లు పనికిరావని, బాలేవని బళ్ళో టీచర్లు మార్చేసి అనిల్‌ కుమార్‌, ప్రవల్లిక, అనూష, శైలజ, పవన్‌ కళ్యాణ్‌, రాంచరణ్‌, హరీష్‌, మహేష్‌ బాబు అని పిలుస్తున్నారు. కాని రేషన్‌ కార్డులో ఒక విధంగా, ఆధార్‌ కార్డులో ఒక విధంగా పేర్లు రాయడం వల్ల చాలా గందరగోళం ఏర్పడుతోంది. చదువు రాకపోవడం వల్ల ఇవి సరిచేసుకోలేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. పేరు మార్చుకోవడం కూడా పెద్ద తంటా కావడంతో వారికి రావలసిన సౌకర్యాలను వదులుకోవలసి వస్తోంది. అందుకే పేర్లను మార్చుకుని క్రమంగా తమ అస్తిత్వం కోల్పోయే దశకు చేరుకున్నారు.

        దివిలి కథలో అడవిలోని పువ్వుల్లో పువ్వుగా, చెట్టులో చెట్టుగా, పిట్టల్లో పిట్టగా ఆనందించే దివిలి, ఆమె అన్న రూప్లా. అతను చదువుకోవటానికి పట్నం వెళ్లినప్పుడు దివిలికి ప్రాణంలో ప్రాణమైన పువ్వులనే ఎరగా వేసి ఆమె మానాన్ని కబళిస్తాడు రాజు నాయక్‌. పెళ్లి కాకుండానే తల్లి అయిన చిన్నారి దివిలి తన పాపకు జన్మనిచ్చి కన్ను మూస్తుంది. ఆ పాప విరిని తన ప్రాణంగా చూసుకుంటూ, రూప్లా తన చెల్లెలు దివిలి సమాధి దగ్గర పూలు పెట్టి పాపను చూపిస్తాడు. అన్నంటే ఇలానే ఉండాలి అనిపించే 'రూప్లా' పాత్ర, తుమ్మెద వంటి రాజూనాయక్‌, పసిపాప వంటి దివిలి... మన మనసులో అలాగే నిలిచిపోతారు. ఈ కథ చదివిన తరువాత మన మనసును ఎవరో పట్టి నొక్కేసిన భావన కలగక మానదు. ఈ కథలో తండావాసుల ఆచార వ్యవహారాలను వివరంగా తెలిపారు రచయిత్రి.

        'జై జై జై గణేశా!' కథలో తండాల్లో ఇంటింటికీ తిరుగుతూ, అందరికీ మందులు ఇస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకై పాటుపడుతూ, అందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరించే రజని ఒక ప్రభుత్వోద్యోగి. తండావారంతా కలిసి వినాయకుడిని కొనడానికి జమచేసిన సొమ్మంతా రజనీ కోసం ఖర్చుపెడతారు. చదువుసంధ్యలు లేకున్నా సాటి మానవుడికి సాయం చేయడం దేవుడికి పూజచేయడం వంటిదని తమ మానవత్వాన్ని నిరూపిస్తారు అమాయకపు తండావాసులు.

 వారధి కథలో బయటి ప్రపంచానికి, అడవిలో దాగి ఉన్న ఆ తండాకి వారధి - ఊరికి కొత్తగా వేసిన బస్సు... ఆ బస్సు రావటం కోసం టీచర్లు తన్వీ, శాలిని ఎంతగా ప్రయత్నించి సాధించారో, చివరికి ఎంతగా విలపించారో తెలిపే హృద్యమైన కథ. ఇప్పటికి ఈ తండావాసులుండే ప్రాంతానికి బస్సు సౌకర్యం లేదంటే నమ్మరెవరూ. కాని ఇది నిజం.
 ఈ కథాసంకలనంలో కూర్చిన కథలన్నీ సహజత్వాన్ని నింపి అచ్చంగా తండాల్లో తెలుగు మాటలను పొందుపరిచారు. ఒక్కో కథ చదువుతుంటే తండాల్లోని వాస్తవ పరిస్థితులు, జీవన విధానం , నమ్మకాలు, అమ్మకాలు, నిర్లక్ష్యాలు, అసౌకర్యాలు ఎన్నో మన కళ్లముందు కదలాడతాయి. అంతేకాక గిరిజనులు జరుపుకునే పండుగలు, ఆచారవ్యవహారాలను, సమస్యలను సమగ్రంగా తన కథల్లో చర్చించారు రచయిత్రి సమ్మెట ఉమాదేవి.

 - జ్యోతి వలబోజు

Wednesday, 1 July 2015

మాలిక పత్రిక జులై 2015 సంచిక విడుదల

 Jyothivalaboju
Chief Editor and Content Head


విభిన్నమైన అంశాలతో , ఆ పాత మధురాలు, ఈనాటి విశేషాలతో జులై మాలిక పత్రిక మీకోసం సిద్ధంగా ఉంది..  సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మికం, సీరియల్స్, సినిమా, కథలతో పాటుగా కొద్దిరోజుల క్రితం జరుపుకున్న ఫాదర్స్ డే కి సంబంధించిన మరికొన్ని ముచ్చట్లు కూడా ఈ సంచికలో చదవొచ్చు..

మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

జులై సంచిక విశేషాలు:

01. ధీర - 4
02. అనగా అనగా Rj వంశీతో
03. తరం తరం నిరంతరం
04. వెన్నెల్లో గోదారి అందం
05. చిగురాకు రెపరెపలు 6
06. శోధన 4
07. అంతిమం 4
08. ఆరాధ్య - 10
09. చేరేదెటకో తెలిసి 4
10. మాయానగరం 16
11. Dead People Dont Speak 6
12. వెటకారియా రొంబ కామెడయా 10
13. పప్పణ్ణం ఎప్పుడు?
14. పితృోత్సాహం
15. అమ్మా నాన్న - ఓ గారాల కూతురు
16. Me and My Dad
17. ఎంత మంచివారో మా నాన్న
18. అంతా నాన్న పోలికే
19. అప్పగా పిలవబడే నాన్న
20. పద్యమాలిక జూన్ 15
21. పద్యమాలిక జూన్ 1
22. మన వాగ్గేయకారులు - 1
23. నిషాధుల మధ్య ఒక బ్రాహ్మణుడు
24. రామాయణం - ఒక్క వాల్మీకి విరచితమేనా?
25. రమణస్థితి
26. శరణాగతి
27. కార్టూన్స్
28. అక్షర సాక్ష్యం
29. ఈ దేహం నాదే




Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008