Sunday, 2 August 2015

కాదేదీ అసాధ్యం - మన తెలంగాణ



ఒకానొక సమయంలో నేనేమిటో తెలియని శూన్యపు, అయోమయపు స్థితిలో, ఇల్లలుకుతూ తన పేరే మరచిపోయిన ఈగలా మారిన నన్ను, నా పరిస్థితిని అర్ధం చేసుకుని నాకు సులువుగా అర్ధమయ్యేలా చెప్పి, నన్ను చదవమని, చదివినదానిని గురించి రాయమని, ఆ రాతలను సరిదిద్ది, విశ్లేషించి నాలోని ఆలోచనలను, భావాలను, సంఘర్షణలను అన్నింటిని అక్షరాలుగా మార్చుకోమని, నాకంటూ ఒక కొత్త దారిని సృష్టించుకోమని దిశానిర్ధేశం చేసిన, గృహిణినుండి ఈనాడు ఇన్నిరకాల పాత్రలతో అందరి అభిమానం పొందడానికి మూలకారణమైన, ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ, విశ్లేషిస్తూ, తప్పులుంటే హెచ్చరిస్తూ, ఒక నేస్తంగా, గురువుగా, శ్రేయోభిలాషిగా, మార్గదర్శిగా తోడున్న ఫ్రియమైన వ్యక్తికి ఈ వ్యాసాన్ని అంకితం చేస్తున్నాను. రక్తసంబంధాలకంటే స్నేహబంధానికి ఎక్కువ విలువని, గౌరవాన్ని ఇచ్చే నేను ఈ స్నేహితులదినోత్సవంనాడు నా ఆత్మీయనేస్తానికి గురుదక్షిణగా ఇంతకంటే విలువైన బహుమతి ఏమివ్వగలను.

థాంక్ యూ ఫ్రెండ్...






http://www.manatelangana.org/jyothi-in-talks-for-wonder-woman/



మన తెలంగాణ దినపత్రికలో నారి శీర్షికలో ఈ వ్యాసం..

 

 ఒక
సాధారణ గృహిణి జ్యోతి వలబోజు. భర్త గోవర్థన్ సివిల్ ఇంజనీర్. ఒక కొడుకు కృష్ణ చైతన్య, సివిల్ ఇంజనీర్ అయిన కూతురు దీప్తి. వాళ్లు కాలేజీలకు వెళ్లిపోతారు. ఇక అంతా ఖాళీ సమయమే.. ఏం చేయాలి..? కుట్లు అల్లికలు, సాఫ్ట్ టాయిస్ తయారు చేయడం, పెయింటింగ్స్ వేయడం చేస్తుండేవారు. కాని పిల్లలకు కంప్యూటర్ పైన చేస్తున్న పని చూశాక తనూ నేర్చుకుంటే..?అనే ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా కంప్యూటర్ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు జ్యోతి. .. కట్ చేస్తే .. నేడు ఆమె ఒక బ్లాగర్. తన బ్లాగు ద్వారా అనేక విషయాలు అంతర్జాలంలో వివరిస్తున్నారు రచయిత్రి, బ్లాగర్ జ్యోతి వలబోజు…. ‘మన తెలంగాణ’ ఆమెను కలిస్తే అనేక విషయాల గూర్చి ఇలా చెప్పారు…


పిల్లలు పెరిగే దాకా ఇంటిపని, వంట ఇలా సరిపోయేది. ఖాళీ సమయంలో కుట్లు, అల్లికలు చేసేదాన్ని. అప్పుడప్పుడు పెయింటింగ్స్ వేసేదాన్ని. ఇంకా ఏదైనా సమయం ఉంటే టీవీ చూసేదాన్ని. పిల్లల కోసం మెల్లగా కంప్యూటర్ నేర్చుకున్నాను. ఇంటర్నెట్‌ను కూడా తెలుసుకుంటుంటే ఇంకా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మొదలైంది. అలా అలా నేర్చుకుంటూ 2006లో తెలుగు టైపింగ్ నేర్చుకొని మిత్రుల సహాయంతో ఒక బ్లాగును మొదలు పెట్టాను. తెలుగు టైపింగ్ కొంచెం బాగా రాగానే నాఆలోచన్లకు ఒక రూపం ఇచ్చాను. ఒక్కో ఆలోచనకు ఒక్కో బ్లాగును తయారుచేశాను. అవి జ్యోతి, షడ్రుచులు.. చైత్రరథం.. ఆముక్తమాల్యద.. బ్లాగ్ గురువు.. విజయ విలాసము..గీతలహరి.. నైమిశారణ్యం.. అన్నపూర్ణ .. ఇలా నా బ్లాగులు ఉన్నాయి. ముఖ్యంగా నేను నేర్చుకున్నట్లే ఎవరైనా బ్లాగులను నేర్చుకోవాలని ఉంటే ఉపయోగపడేలా నా ‘బ్లాగు గురువు’ ను నేర్పుతున్నట్లే ఉంచాను. అలాగే మంచిమంచి తెలుగు పద్యాలను, ఆడియో రూపంగా నా ‘ఆముక్తమాల్యద’ బ్లాగులో ఉంచాను. నైమిశారణ్యం బ్లాగు పూర్తిగా ‘ఆధ్యాత్మికత’పైనే. తరువాత షడ్రుచులు అంటే తెలంగాణ వంటలు.
సరదాగా తెలుసుకుందామని మొదలుపెట్టిన ఈ బ్లాగుల ప్రయాణం సరదా..సరదాగా సాగుతూ ఎన్నో రాతలు, వంటలతో సాగింది. నేను పెద్దగా రాసేదాన్ని కాదు. కానీ ఆ రాతలూ, వంటలూ నన్ను ముందుకు తీసుకెళతాయని ఎప్పుడూ అనుకోలేదు.


aమన తెలుగు వంటకాలు తెలుగులోనే తెలుసుకుంటే…? ఎంత ఆనందం. మన భాషలో చదువుకోవడం.. తరువాత తయారు చేసుకోవడం చాలామంది మహిళలకు ఉపయోగపడేలా, అందరికీ అందుబాటులో ఉండేలా తెలుగు, ఇంగ్లీషు వెబ్‌సైట్‌లో ఉంచాను. తెలుగువారు ఎక్కడున్నా అంతర్జాలం(ఇంటర్నెట్)లో వెతికి పట్టుకుని ఆయా వంటను నేర్చుకుంటారు. ఇలా బ్లాగుల్లో రాసుకుంటూ నా రచనా వ్యాసంగాన్ని మెరుగు పరచుకున్నాను. ప్రముఖ పత్రికలలో నా వ్యాసాలు రావడం ప్రారంభమైంది. అలా ఒక ప్రముఖ వారపత్రికలో ‘రుచి’ శీర్షికతో నా రచనలు నాలుగు సంవత్సరాలు రెగ్యులర్‌గా నడిచాయి. ఈ మధ్యనే ‘నొవాటెల్’ హోటల్ వారు తెలంగాణ వంటల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తే దానికి నేనే ఫుడ్ కన్సల్టెంట్‌ని. ఈ ఫెస్టివల్‌లో మనం మరచిపోయిన మన తెలంగాణ వంటలకు అనూహ్యంగా స్పందన వచ్చింది. ఒకసారి ఒక రచయిత నాకు చిన్న సూచన చేశారు. అదేమిటంటే ‘మన తెలంగాణ వంటలు ఎవరూ పరిచయం చేయలేదు. మీరు తెలంగాణ వంటల మీద రాయండి’అని. ఆ తర్వాత ఆలోచించి మా పెద్దవాళ్లను, మా అమ్మను, మా అత్తమ్మను, ఇతర మిత్రులను అడిగి తెలంగాణ వంటలను ఒక సంవత్సరం పాటు సేకరించాను. మన పెద్దలు ఆనాడు చేసే వంటలు తిని ఎంత ఆరోగ్యంగా ఉండేవారో అని తెలుసుకుని ముందుగా అలా వచ్చిందే వెజ్ వంటలు. తరువాత దాని స్పందనను చూసి మాంసాహార వంటలు కూడా ప్రింట్ చేశాను. ఇవన్నీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచాను.
ఇక 2010వ సంవత్సరంలో నా సంపాదకత్వాన ‘మాలిక’ అనే ఆన్‌లైన్ మాసపత్రికను ప్రారంభించాను. దీన్లో కవితలు, పద్యాలు కథలు వస్తుండేవి. ఇలా వచ్చిన కథలలో 24 మంది రచయితలతో ఒక పుస్తకం అచ్చువేశాను. అదీ మా ‘జెవి పబ్లికేషన్స్’ తరుపున ప్రింట్ చేశాము. ఈ పబ్లికేషన్‌ను 2014లో స్టార్ట్ చేశాము. అలాగే ఉమెన్ రైటర్స్ గ్రూపును ఏర్పాటు చేసి ‘ప్రమదాక్షరి’కథామాలికను ప్రింటు చేశాము. దీనికీ చాలా బాగా స్పందన వచ్చింది.
ప్రమదాక్షరి, జెవి పబ్లికేషన్స్ కలిసి 2014 డిసెంబర్‌లో జరిగిన బుక్ ఫెస్టివల్‌లో మా పబ్లికేషన్ పుస్తకాలతో స్టాల్ నిర్వహించాము. రచయితలు, రచయిత్రులు కూడా ఈ స్టాల్ నిర్వహణలో పాలుపంచుకున్నారు. వాళ్లు సరాసరి పుస్తకప్రియులను, అభిమానులను కలుసుకోవడంతో చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు.
అంతర్జాలం చాలా మాయగా ఉంటుంది. ఏది నేర్చుకోవాలన్నా ఇంటర్నెట్‌లో చదువుతూ, ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవచ్చు. దీనికి ఉన్నత విద్య అంతగా అవసరం లేదు. నేర్చుకోవాలనే కోరిక, లక్షం ఉంటే తప్పనిసరిగా వస్తుంది. ఫేస్‌బుక్‌లో చాలా మంది స్నేహితులు కలుస్తారు. రకరకాల వాళ్లు పరిచయం అవుతారు. అయితే మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోనివి వస్తాయి. బాధిస్తాయి. నేనైతే నా ఆత్మీయ మిత్రుల ద్వారా చాలా నేర్చుకున్నాను. ఇక చివరగా మహిళలు టీవీ సీరియల్స్‌తో పొద్దుపుచ్చకుండా ఇంటర్నెట్ ద్వారా వాళ్లకు నచ్చిన అంశాలపై నేర్చుకోవచ్చు. అంతేకాక బిజినెస్ చేసుకోవచ్చు. అదీ ఇంట్లోనే ఉంటూ. ఎక్కడికీ వెళ్లకుండా ఆన్‌లైన్లోనే బుకింగ్, డిస్పాచ్ తదితర కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మనకు సంకల్పం ఉండాలేకానీ సాధించలేనిది ఏదీ లేదు అన్నారు జ్యోతి వలబోజు.
ఇంటర్వూ… దామర్ల విజయలక్ష్మి

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008