Sunday, 13 September 2015

నవమ వార్షికోత్సవ శుభవేళ...




అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు. ఎవరో పాప నీళ్లలో పడిందంట .. అందరూ నీళ్లలోకి తొంగి చూస్తూ ఆదుర్దాగా, కంగారుగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఎవరో దూకిన చప్పుడైంది. ఆ  దూకిన వ్యక్తి ఆ పాపను  పైకి తీసుకువచ్చాడు. అందరూ అభినందించారు. ప్రాణాలకు తెగించి పాపను కాపాడావు. గొప్పవాడివి అంటూ పొగిడేసారు. కాని ఆ వ్యక్తి చిరాకుపడుతూ ఎవడ్రా తొంగిచూస్తున్న నన్ను నీళ్లలోకి తోసింది. అసలే నాకు ఈత రాదు. ఐనా ప్రాణభయంతో ఈదుతూ పాపను కూడా లాక్కొచ్చాను అని కోపంగా అరుస్తూ వెళ్లిపోయాడు..

ఇలాగే టైమ్ పాస్ కోసం అంతర్జాలానికి వచ్చిన నన్ను బ్లాగుల్లోకి తోసేసినవాళ్లందరిమీద చాలా కోపంగా ఉంది. ముఖ్యంగా ఒక ఫ్రెండ్  టీవీ సీరియళ్లు, నవళ్లు, సస్పెన్స్ సీరియల్స్ తప్ప వేరే తెలుగు సాహిత్యమంటే తెలీని నన్ను నువ్వు రాయగలవు, రాయి, ఆలోచించు. రాయి అంటూ  నాచేత అక్షరయజ్ఞం మొదలెట్టించారు. నా ఆలోచనలు చాలావాటిని మెరుగుదిద్ది రాసేలా చేసారు. అలా అలా సాగిపోతుంది. ఇప్పుడు కాస్సేపు టీవీ చూద్దామన్నా, పడుకుందామన్నా తీరిక దొరకడంలేదు. వందిళ్ల పూజారి అన్నట్టు  ఒకటి కాగానే ఇంకో పని...ఇష్టమైన పనే కాని అప్పుడప్పుడు విసుగు రాదేంటి ఎవరికైనా..  అందుకే ఒక్కోసారి ఆ వ్యక్తి మీద చాలా కోపమొస్తుంది. తిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలా రాయడం అలవాటు కాకుంటే ఎంచక్కా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సీరియల్స్ అన్నీ చూస్తూ హాయిగా ఉండేదాన్ని. ఏ టెన్షనూ లేకుండా టీవీ చూస్తూ, అఫ్పుడప్పుడు ఊరిమీద పడి తిరుగుతూ, కావలసినప్పుడల్లా నిద్రపోతూ ఉండేదాన్ని. ఎంత ఖాళీ సమయముండేది.. ఇప్పుడవన్నీ కుదరడం లేదు కదా.. కోపం రాదేంటి మరి..

సెప్టెంబరు నెల వస్తుందనగానే ప్రతీ సంవత్సరం నాలోని ఆలోచనలు,
జ్ఞాపకాలు  రింగులు.. రింగులు చుట్టుకుంటూ గిర్రున వెనక్కి వెళ్లిపోతుంటాయి. ఎందుకంటే నా జీవితంలో ఊహించని మలుపు తిప్పిన తెలుగు బ్లాగు ప్రయాణం ప్రారంభమైంది  ఇదే సెప్టెంబరు 14, 2006లో కాబట్టి. అసలైతే ఏదో ఏడాది లేదా రెండు లేదా మూడేళ్లకు బ్లాగు రాయడం ఆపేసేదాన్ని. కాని దిగినకొద్దీ నేర్చుకోవడానికి ఎన్నో నిధినిక్షేపాలు దొరుకుతుంటే ఎవరు మాత్రం వెనక్కు తిరుగుతారు. కంప్యూటర్ అంటే ఒక డబ్బా టీవీ, టైప్ రైటర్ అని తప్ప వేరే తెలీని నాకు ఓపికగా ఎన్నో సాంకేతిక విషయాలను, ఎప్పటికప్పుడు, అడిగినప్పుడల్లా వివరంగా నేర్పించిన వారెందరో.. నా పిచ్చి రాతలను రచనలుగా చేసుకోవడంలో ప్రోత్సహించి, తప్పులను ఎత్తి చూపి సరిదిద్దుకునేలా చేసిన సాహిత్య గురువు ... మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా మిత్రుల సాయంతో నా బ్లాగ్ ప్రయాణం ఆపకుండా కొనసాగించాను..  ఒకానొక సమయంలో నేనేంటి? నా జీవితం ఇలాగే గడిచిపోవాలా? పిల్లలు ఉద్యోగాల్లో చేరి, పెళ్లిల్లయ్యాక వాళ్లకు, వాళ్ల పిల్లలకు సేవలు చేయడం, టీవీ చూడడం, అందరి బాగోగులు చూడడమేనా నా పని? వేరే ఏమీ చేయలేనా? నా గుర్తింపు ఏంటి? అసలు నేనేమి చేయగలను? ఉద్యోగం చేయాలంటే పెద్ద చదువులు లేవు. పాండిత్యము లేదు. ఇప్పుడు చదువుకుని మాత్రం ఏం చేయాలి ?? చదివినదంతా టైమ్ పాస్ పుస్తకాలే. సస్పెన్స్ నవళ్లు, వార పత్రికలు .. పుట్టింటివైపు, అత్తింటివైపు పండితులనదగ్గవారు లేరు. తెలుగు  పాండిత్యం కాస్తైనా నాకు ఉందేమో అనుకోవడానికి. నేను ఎప్పటికీ ఫలానా వారి కూతురు, భార్య, తల్లి అని అనిపించుకోవాలా? ఎప్పుడు వారి మీద ఆధారపడాలా?? థూ!! యెదవ జన్మ.... నా బతుకింతే... ఇలా సమాధానం లేని ప్రశ్నలెన్నో ?? కాని వీటన్నింటికి సమాధానాలు కనుక్కొని నా ప్రస్థానాన్ని ప్రింట్ మీడియాకు, పత్రికా నిర్వహణకు, చివరకు పబ్లిషింగ్ రంగంలోకి మారడం వరకు మూలకారణమైన నా బ్లాగు నాకు ఎప్పటికీ అపురూపమే. ఎప్పుడే ఆలోచన వచ్చినా బ్లాగులో రాసేసేదాన్ని కాని  ఇప్పుడు ఆ ఆలోచనలు  కొన్ని పత్రికలకు మరికొన్ని ఫేస్బుక్ గోడమీదకు చేరిపోతున్నాయి. అందుకే బ్లాగుల్లో ముందులా రాయలేకపోతున్నానే అని దిగులుగా ఉంటుంది. రోజుకు మరో నాలుగు .. కనీసం రెంఢుగంటలైనా ఎక్కువుంటే బావుండు. ఎవరైనా అరువిస్తే బావుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో... 


జీవితపు రెండవ భాగంలో మొదలెట్టిన ఈ జాలప్రయాణంలో మొదట ఒడిదుడుకులైనా ధైర్యంగా నిలదొక్కుకోవడం వల్ల అంతా విజయమే.. బ్లాగులు (Jyothi, జ్యోతి, షడ్రుచులు, బ్లాగ్ గురువు, పొద్దు గడి, చిత్రమాల, గీతలహరి, నైమిశారణ్యం, ఆముక్తమాల్యద, విజయవిలాసం) అన్నీ కలిపి  ఇంతవరకు సందర్శించిన ఆత్మీయబందువులు సుమారు 7 లక్షలవరకు ఉన్నారు) ఈ ప్రేమ, అభిమానమంతా నా స్వార్జితం .. నా సొంతం మరి... 


తొమ్మిదేళ్ల నా బ్లాగు సుందరి జ్యోతి నన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది.  పద్యాల ఆటలాడింది. బొమ్మలతో మాటలాడింది.  భక్తిసాగరంలో ఓలలాడించింది.. నాకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులేసేలా చేసింది నా బ్లాగు.. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటాను.... నా బ్లాగు నా హృదయభాను అన్నమాట. అందుకే ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను.. తెలుగు బ్లాగులవల్ల నాకంటే ఎక్కువగా లాభపడింది ఎవరూ లేరు అని. J ఆ మాత్రం గొప్ప చెప్పుకుంటే తప్పేంటంట.. 


నా పుట్టినరోజుతో పాటు నాకు పునర్జన్మని, మహత్తరమైన గుర్తింపునిచ్చిన నా బ్లాగు జ్యోతి కి తొమ్మిదవ హ్యాపీ హ్యాపీ బర్త్ డే  అన్నమాట..... ఈ సందర్భంగా నాకు తోడున్న, ప్రోత్సహించిన, అభినందించిన, సంతోషించిన ఆత్మీయ మిత్రులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు..

శుభం భూయాత్......

3 వ్యాఖ్యలు:

Zilebi


కాల మహిమ కాకుంటే , జ్యోతి వారి టపా కి జీరో కామింటా :)

జ్యోతి గారు శుభాకాంక్షలు చెబుతున్నా !

అయినా దాని తో బాటే మరో 'కటువైన' మాట కూడా అంటున్నా (జిలేబి కడువా !) ఇట్లా వార్షికోత్సవాలకి టపా రాసే పధ్ధతి తో బాటు వీలు చేసుకుని మునుపటి లా మరిన్ని టపాలు ప్రతి వారం వ్రాయండి (జిలేబి సీరియస్ గా ఎప్పుడూ చెప్పలేదు ! అయినా ఆనవాయితీ కి విరుద్ధం గా ఇది చాలా సీరియస్ గా వ్రాస్తున్న కామింటు :)

జిలేబి

జ్యోతి

థాంక్ యూ జిలేబీగారు. ఎవరు రాసినా రాయకున్నా మీ కామెంట్ మాత్రం తప్పకుండా ఉంటుంది కదా.. చాలు..

ఇక రాయడం అంటే ఇప్పుడు రాయాలనుకున్నవి సగం పత్రికలకు పంపితే, సగం ఫేస్బుక్ మీదకు వెళుతున్నాయి. తర్వాత ఇక్కడ బ్లాగులోకి వస్తున్నాయి. ఇక మాలిక పని ఉండనే ఉంది. బ్లాగులో రెస్పాన్స్ కూడా చాలా తగ్గడంతో ఇక్కడ తరచూ రాయాలనే ఆసక్తి కూడా తగ్గుతోంది..

అదన్నమాట సంగతి

Mahesh

9 samacharaalu miru telugu lo blogger kaa rayadam. mee blog chadavatam iroju start chayadam chala happy unthi madam.
mee patha posts samayam thorikinappudu chathavali.
keep writing madam.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008