Saturday, 3 September 2016

కుడుంపట్టు - సాక్షిలో వినాయకచవితి స్పెషల్స్



విఘ్నాలు సర్వజ్ఞుల్ని ఏమీ చెయ్యలేవు.
విఘ్నం అంటే.. పనికి బ్రేక్.
సర్వజ్ఞత అంటే..
బ్రేకు పడ్డా ‘ఓకే ఇట్సాల్ రైట్’ అనుకోవడం.
బట్.. ఎంతటి సర్వజ్ఞులైనా...
ప్రసాదాల దగ్గర, నైవేద్యాల దగ్గర,
భోజనాల దగ్గర బ్రేక్‌ని తట్టుకోలేరు.
విఘ్నేశ్వరుడి ‘మెనూ’ దగ్గర ఆసలే ఆగలేరు.
ఉడుం పట్టులా... అదొక కుడుంపట్టు.
సర్వజ్ఞత వదిలి మీరూ ఓ పట్టు పట్టండి.
అడ్వాన్స్‌గా... హ్యాపీ వినాయక చవితి!
ఆరగించమని... లంబోదరునికీ వినతి!


****************************************************

క్యారట్ - పప్పు ఉండ్రాళ్లు
కావలసినవి: బియ్యప్పిండి- రెండు కప్పులు; క్యారట్ తురుము- పావు కప్పు; పెసరపప్పు - పావు కప్పు; జీలకర్ర- అర టీ స్పూన్; ఉప్పు- తగినంత; నెయ్యి- 3 చెంచాలు

తయారీ: పెసరపప్పు కడిగి నీరు పోసి కొద్దిసేపు నానపెట్టి తర్వాత కాస్త పలుకుగా ఉడికించి జల్లెడ లేదా చిల్లుల పాత్రలో వేయాలి. బియ్యప్పిండిలో ఉప్పు, జీలకర్ర, క్యారట్ తురుము, పెసరపప్పు వేసి కలిపి నీళ్లు పోసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని జారుడుగానూ ఉండకూడదు. పూరీ పిండిలా ఉండాలి. ఈ పిండిని పెద్ద నిమ్మకాయంత ఉండలు చేసి ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. ఇష్టమైతే కొబ్బరి తురుముతో గార్నిష్ చేయవచ్చు.

కొబ్బరి కోజుకట్టై
కావలసినవి: పచ్చి కొబ్బరి తురుము- ఒక కప్పు; బెల్లం తురుము- ముప్పావు కప్పు; ఏలకుల పొడి- ఒక టీ స్పూన్; బియ్యప్పిండి- ఒకటిన్నర కప్పులు; కొబ్బరి నూనె- రెండు టీ స్పూన్లు; ఉప్పు- చిటికెడు

తయారీ: బెల్లం తురుములో కొద్దిగా నీరు పోసి మరిగించి ముదురు పాకం వచ్చిన తర్వాత కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. నీరు ఇగిరి పోయి ముద్దయిన తర్వాత ఏలకుల పొడి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత కొబ్బరి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు మరిగించాలి. అందులో ఉప్పు, బియ్యప్పిండి వేసి కలుపుతూ దగ్గర అయ్యే వరకు సన్నమంట మీద ఉడికించాలి. ముద్దగా అయిన తర్వాత దించాలి. చల్లారిన తర్వాత పిండిని బాగా మర్దన చేసి మృదువుగా అయ్యాక నిమ్మకాయ సైజు ఉండలు చేసుకోవాలి. చేతికి కొబ్బరి నూనె రాసుకుని ఉండను కొంచెం వెడల్పుగా చేసి మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి అన్ని వైపుల నుంచి మూసేయాలి. ఇలా పిండి మొత్తం చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో లేదా ప్రెషర్ కుకర్‌లో జల్లెడ వంటిది అమర్చి పైన కోజుకొట్టైలను పెట్టి ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. గమనిక: కొంత బియ్యప్పిండిలో కేసర్ రంగు కలిపి దానిని మిగిలిన బియ్యప్పిండిలో కలిపి ఉండలు చేసుకుంటే కొబ్బరి కోజుకొట్టైలలో రంగు చారలుగా కనిపిస్తూ అందంగా ఉంటుంది.

పాల తాలికలు
కావలసినవి: బియ్యప్పిండి - ఒక కప్పు; బెల్లం తురుము - అర కప్పు; పంచదార - అర కప్పు; నెయ్యి - ఒక చెంచా; ఏలకుల పొడి - పావు టీ స్పూన్

తయారీ: ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు మరిగించి దించాలి. అందులో బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన పెట్టాలి. ఈ లోపు మరొక గిన్నెలో పాలను మరిగించాలి. ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని వేడినీటితో తడిపిన బియ్యప్పిండి కొద్దిగా తీసుకుని అర చేతుల మధ్య మృదువుగా రుద్దితే పొడవుగా తాలికలుగా వస్తుంది. వీటిని వెడల్పుగా ఉన్న పళ్లెంలో వేసి పది నిమిషాల సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత తాలికలను మరుగుతున్న పాలలో వేసి (తాలికలు ఒకదాని మీద ఒకటి పడి అతుక్కుపోకుండా జాగ్రత్తగా వదలాలి) ఉడికించాలి. తాలికలు ఉడికిన తర్వాత బెల్లం తురుము, పంచదార వేసి కలుపుతూ మరికొంత సేపు మరిగించాలి. పాలు చిక్కపడిన తర్వాత యాలకుల పొడి వేసి కలిపి దించాలి. ఇష్టమైతే జీడిపప్పు, బాదం, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు.

రవ్వ మోదక్
కావలసినవి: బియ్యప్పిండి- ఒక గ్లాసు; బొంబాయి రవ్వ- ఒక గ్లాసు; పంచదార- ఒకటింపావు గ్లాసు; నెయ్యి- 5 టీ స్పూన్‌లు; యాలకుల పొడి- అర చెంచా; ఉప్పు - తగినంత

తయారీ: ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు, చెంచా నెయ్యి వేసి మరిగించి, బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా కలిపి మూతపెట్టి పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి
* పెనంలో చెంచా నెయ్యి వేడి చేసి రవ్వను దోరగా వేయించి రెండు గ్లాసుల నీరు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. నీరు ఇగిరి, రవ్వ దగ్గరైన తర్వాత పంచదార, ఏలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేయాలి. అరచేతికి నెయ్యి రాసుకుని బియ్యప్పిండి మిశ్రమాన్ని బాగా పిసికి పెద్ద నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి
* ఇప్పుడు ఒక బియ్యపిండి ఉండను వెడల్పుగా చేసి (చిన్న పూరీలా) మధ్యలో రవ్వ ఉండను పెట్టి అంచులు మూసేయాలి. ఇలా చేసుకున్న మోదక్‌లను ఇడ్లీ కుక్కర్ లేదా స్టీమర్‌లో పెట్టి ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. తీసిన తరవాత పైన కొబ్బరి తురుము చల్లుకోవచ్చు.
గమనిక: మోదక్ మిశ్రమం చేయడం సులభమే కానీ అంచులు అందంగా అతికించడం నైపుణ్యంతో కూడిన పని. మోదక్‌లు చేయడానికి అచ్చులు దొరుకుతాయి. (కజ్జికాయల అచ్చుల్లాగ) వాటితో చేస్తే మోదక్ ఆకృతి చూడముచ్చటగా ఉంటుంది.

కొంకణి పాథోలి
కావలసినవి: బియ్యప్పిండి- ఒక కప్పు; నీళ్లు- ఒక కప్పు; ఉప్పు- చిటికెడు; నెయ్యి- 3 స్పూన్లు; తాజా కొబ్బరి తురుము- ఒక కప్పు; బెల్లం తురుము- అర కప్పు; ఏలకుల పొడి- ఒక టీ స్పూన్; పసుపు ఆకులు లేదా అరటి ఆకులు (పాథోలీ చుట్టడానికి)

తయారీ: ఒక గిన్నెలో నీరు పోసి ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేసి దించి ఉండలు కట్టకుండా కలిపి మూతపెట్టి ఒక నిమిషం సేపు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చేతికి నెయ్యి రాసుకుని బియ్యప్పిండిని మృదువుగా వచ్చే వరకు మర్దనా చేయాలి. ఒక పెనంలో కొద్దిగా నీరు పోసి సన్నమంట పెట్టి బెల్లం తురుము వేయాలి. బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి తురుము వేసి ఉడికించాలి. మొత్తం ఉడికి దగ్గరగా అయిన తర్వాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. ఇప్పుడు పసుపు ఆకు లేదా అరటి ఆకు తీసుకుని బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న బత్తాయి సైజులో తీసుకుని ఆకు మీద వేసి తడి అరచేత్తో వత్తాలి. మధ్యలో చెంచా బెల్లం, కొబ్బరి మిశ్రమం పెట్టి ఆకుతోనే మెల్లగా సగానికి మడత పెట్టాలి. అంచులు విడిపోకుండా పిండిని వత్తాలి. అంతా ఇలాగే చేసుకుని వాటిని స్టీమర్ లేదా ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద 15 నిమిషాల సేపు ఉడికించాలి. చల్లారిన తర్వాత ఆకును తీసేసి వడ్డించాలి.

శేవల పాయసం
కావలసినవి: గోధుమ పిండి - 200 గ్రా; బెల్లం తురుము - 250 గ్రా; పాలు- పావు లీటరు; ఏలకుల పొడి - ఒక టీ స్పూన్; నెయ్యి- 5 టీ స్పూన్లు; కొబ్బరి తురుము- ఒక టేబుల్ స్పూన్; గసగసాలు- ఒక టీ స్పూన్

తయారీ: గోధుమపిండిని చపాతీకోసం తడిపినట్లు తడపాలి. ఒక గంట సేపటి తర్వాత పిండిని అరచేతిలో వేసి రుద్దుతూ పొడవు తీగలుగా చేసి అరగంట సేపు ఆరబెట్టాలి. వీటిని శేవలు అంటారు. వాటిని కుకర్‌లో రెండింతలు నీటిని పోసి, ఒక చెంచాడు నెయ్యి వేసి ఉడికించాలి. నెయ్యి వేయడం వల్ల శేవలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఒక మోస్తరుగా ఉడికిన శేవలలో బెల్లం తురుము, వేడి పాలు వేసి గిన్నె అడుగు అంటుకోకుండా కలియబెడుతూ మరికొంత సేపు ఉడకనివ్వాలి. శేవలు మెత్తబడి, మిశ్రమం దగ్గరగా అయిన తరవాత ఏలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపాలి. చివరగా కొబ్బరి తురుము, గసగసాలు చల్లాలి. ఇష్టమైతే జీడిపప్పు, బాదం కూడా వేసుకోవచ్చు.

5 వ్యాఖ్యలు:

Madhu

ఇంతకుముందు టీవీల్లో వంటలు చేసేవాళ్ళని తెగ కామెడీ చేస్తూ మీ పాత బ్లాగ్ లో,పుస్తకాలలో కూడా కధలు రాసేవారు. ఇప్పుడేమో అభిరుచి,అక్కడ వంట,ఇక్కడ వంట ఇలా టీవీల్లో, పేపర్లో ఎక్కడ చూసినా మీ వంటలే కనిపిస్తున్నాయి.అంటే వేరే వాళ్ళు చేస్తే ఎగతాళి,మీరు చేస్తే ఘనకార్యమా :)

Madhu

link to your post

ఇంటా – వంటా – తంటా – పెంట

https://vjyothi.wordpress.com/2007/08/15/%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%be-%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b0%be-%e0%b0%a4%e0%b0%82%e0%b0%9f%e0%b0%be-%e0%b0%aa%e0%b1%86%e0%b0%82%e0%b0%9f/

జ్యోతి

మధుగారు. మీరు చెప్పింది నిజమే.. మీరు లింక్ ఇచ్చిన పో్స్టులో నేను చెప్పింది ఇప్పటికి మార్చను. మీరు గమనించారో లేదో నా వంటలు, నా వేషధారణ ఆ పోస్టులో చెప్పినట్టుగా అస్సలుండవు. నేను పాటించేదే రాస్తాను. ఎవరికైనా చెప్తాను.

పైన టపాలో చెప్పినటువంటి వంటకాలు, వేషధారణ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి....

Madhu

వేషము, భాష మార్చినంత మాత్రాన ఇక్కడ Main Concept ఐతే టీవీలో వచ్చి మరీ వంట చేయటమే కదా .. ఇక వేషధారణ అంటారా ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి. తాను మెచ్చింది -------- అని మీలాగే అందరూ అనుకుంటారు కదా

Madhu

నేను 2008 నుండి బ్లాగ్స్ ఫాలో అవుతున్నాను.వంటల గురించి ఒకప్పటి మీ పోస్టులు,మీ పోస్టులకి మించి ఏం టీవీల్లో వంటలు చూపిస్తే తప్ప వంటలు చేసుకోలేరా అని అప్పటి బ్లాగర్స్ కామెంట్లు, ఇప్పుడు టీవీల్లో మీ వంటలు చూసి ఇలా అడగాలనిపించింది అంతే.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008