వెచ్చదనపు స్పర్శ - ప్రమదావనం
అసలే చలికాలం. బాగా చలిగా ఉంది. స్వెట్టర్ వేసుకోవడం మర్చిపోవద్దు. చలికి బయట తిరగొద్దు. ఉలెన్ బ్లాంకెట్ కప్పుకోండి. చెవులలో దూది పెట్టుకోండి. మఫ్లర్ కట్టుకోండి.. ఇలా ప్రతి ఇంట , ప్రతి చోట ఈ కాలంలో వినిపించే, పాటించక తప్పని మాటలు కూడా.
కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికి అవసరం. కాని ఎందరో అభాగ్యులకు ఇది అందని ఫలమే.. కూడు ఎలాగో దొరికినా, గూడు లేకున్నా ఎక్కడ కాసింత జాగా దొరికితే పడుకుంటారు.. కాని గజ గజ వణికించే చలిలో దుప్పటి లేకుండా పడుకునే వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తారు. హృదయాన్ని కదిలించే ఈ దృశ్యాన్ని చూసి, చలించి, వారికి ఇతోదికంగా సహాయం చెయాలని ప్రమదావనం సంకల్పించింది. ఐతె ఎవరు వారు? ఎచటి వారు? అనే వివరాలు అడగకుండా, చెప్పకుండా నిశ్శబ్దంగా సహాయం చేయాలని నిర్ణయించాము. పదివేల విలువైన ఉలెన్ రగ్గులు కొని నిన్న అంటే ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాము. ఆదివారం ఉదయం నేను , మా అబ్బాయి , వాడి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. ఉదయం మూడుగంటలకు బయలుదేరి ఫుట్ పాత్ ల మీద, దుకాణాల ముందు చలికి ముడుచుకుని పడుకున్నవారికి నిద్రాభంగం కలగకుండా దుప్పట్లు కప్పేసి వచ్చేసాము. ఒకటి రెండు చోట్ల మాత్రం కొందరు మేల్కొన్నారు. ఈ దుప్పట్ల ఎవరికి బడితే వాళ్లకి ఇవ్వలేదు. ఎక్కువగా ముసలివాళ్లు, పిల్లలు, ఆడవాళ్లకే ప్రాధాన్యం ఇచ్చాం. చాలా మంది కనీసం కప్పుకోవడానికి బట్ట లేక ప్యాకింగ్ చేసే ప్లాస్తిక్ సంచుల దుప్పటి కప్పుకున్నారు. మూడు నాలుగు చోట్ల హటాత్తుగా వెచ్చగా అనిపించిందేమో రగ్గు కప్పగానే భయంతో గబుక్కుని లేచారు. మళ్లీ పడుకున్నారు. చాలా మందికి తమకు రగ్గులు ఎవరు కప్పారో కూడా తెలీదు. మేము శబ్దం లేకుండా వెళ్లిపోయాము మరి.. ఈ కార్యక్రమం కోసం సుమారు ఇరవై కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది. హిమాయత్ నగర్, నెక్లేస్ రోడ్, సోమాజీగుడా, బేగంపేట్, అమీర్ పేట్, పంజగుట్ట, ఎస్.ఆర్.నగర్, మాసబ్ ట్యాంక్, మెహదీ పట్నం, ఆసిఫ్ నగర్, లంగర్ హౌజ్, ఖైరతాబాద్, చింతల్ బస్తీ, బషీర్ బాగ్.. ఇలా తిరిగి తెల్లవారుతుండగా ఆరుగంటలకు ఇంటికి తిరిగి వచ్చేసాం. అదేంటో !! అంత పొద్దున్నే లేచి అన్ని గంటలు బయట తిరిగినా బాధించని చలి , ఇంటికి రాగనే నేనున్నానంటూ కమ్మేసింది. :)
నేను గమనించిన మరో ముఖ్యవిషయం ఏంటంటే???ఇన్ని గంటలు తిరిగాము, ఇంతమందికి (సుమారు ఎనబై ఐదు) రగ్గులు కప్పి వెళ్లిపోయాము. ఒక్క పోలీసు కనబడలేదు., అడ్డగించలేదు. ఇలా తసమదీయులు బాంబులు గట్రా సులభంగా పెట్టే చాన్స్ ఉందికదా?? లేక మా మొహాలకు అంత సీన్ లేదనుకున్నారా? అప్పటికి మావారు భయపెట్టారు. వాతావరణం బాలేదు. తీవ్రవాదులనుకుంటారేమో . జాగ్రత్త! అడ్రస్ అడిగితే నా కార్డు ఇవ్వు అని ఇచ్చారు. దాని అవసరం పడలేదులెండి..
వితరణ నాదైనా. సంకల్పం ప్రమదావనం సభ్యులదే .. జయహో ప్రమదావనం.