Thursday, 31 January 2008

పుణుకులు

1. స్నేహితుడు..

"ఏరా సంతోష్ ! అలా ఊరికే కూర్చునే బదులు నీ స్నేహితుడు శేఖర్‍తో బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చుగా" అని అమ్మ అంది.

"ఆడుకోవచ్చు కాని, ఎదుటివాడు పాయింట్లు సాధించినపుడు అతడు తొండి చేస్తున్నాడని ఊరికే గొడవ చేస్తుంటే ఎవరు మాత్రం ఆడతారు?"

"అవును . అదీ నిజమే. ఎవరాడతారు?"

"అందుకే శేఖర్ నాతో ఆడడం లేదు మరి." అన్నాడు సంతోష్.



2. లింగం మావ కంఫ్యూటర్ చిక్కులు

అందరూ కంఫ్యూటర్ కొంటున్నారని లింగం మావ కూడా కంప్యూటర్ కొన్నాడు. అది తెచ్చినవాళ్ళు అన్నీ అమర్చి వెళ్ళిపోయారు. ఒకరోజు ఏదో ప్రాబ్లం వచ్చిందని లింగం మావ ఆ కంపెనీ కాల్ సెంటర్ కి ఫోన్ చేసాడు.

"హలో ! చెప్పండి , మీకు ఎటువంటి సహాయం కావాలి?"

"నా కంప్యూటర్‍తో ప్రాబ్లం వచ్చింది. ఎంత టైప్ చేసినా ఒక్క అక్షరమూ కనపడడం లేదు."

"మీరిప్పుడు కంప్యూటర్ ముందే ఉన్నారా? మౌస్‍తో కర్సర్‍ని కదిలించండి."

"అలాంటిదేమి కన్పించడం లేదు"

"కంప్యూటర్ వెనుక వైర్లన్నీ ఒకసారి తీసి మళ్ళీ పెట్టండి "

"ఇక్కడంతా చీకటిగా ఉంది"

"లైటు వేసుకొని చూడండి"

"అయ్యో! ఇక్కడ గంట నుండి కరెంట్ లేదండి. కొవ్వొత్తి పెట్టుకున్నాను.ఇంకో విషయం ఇక్కడ సిడి డ్రైవ్ పని చేయటం లేదు. ఏం చేయను?

"ఆ సిడి డ్రైవ్ లో ఉండే చిన్న హోల్‍లో పిన్నుతో కదిలించండి. సిడి ట్రే బయటికి వస్తుంది.అందులో సిడి పెట్టాలి "

"ఏది నేను టీ కప్పు పెట్టిన ప్లేటా"

"???????? ... పెట్టేయ్ ఫోన్ !!"



3. ఒక రకమైన కర్రలతో నోరూరించే పులుసులు, కూరలు చేసుకోవచ్చు.

ఏంటా కర్రలు?

Saturday, 26 January 2008

పేపర్ కటింగ్స్ .. మళ్ళీ మళ్ళీ పలకరించే స్మృతులు...

DSC00048 ముప్పై ఐదేళ్ల క్రిందటి పేపర్ కటింగ్స్ తో బైండ్ చేసి పెట్టుకున్న పుస్తకం. నా అపురూపమైన ఖజానా

 

కొన్ని పదార్థాలు వేడివేడిగా వున్నప్పుడు తింటేనే మజాగా ఉంటుంది. వార్తలూ అంతే ! ఒక రకంగా చెప్పాలంటే న్యూస్ పేపర్ అనేది వేడి వేడి పకోడీలుంచిన ప్లేటు వంటిదన్నమాట. టీయో , కాఫీయో ఒక చేత్తో పట్టుకుని మరోచేత్తో పేపర్ చదువుతూ దినచర్య మొదలెట్టేవారు కోకొల్లలు. ముందుగా ముఖ్య వార్తలు, సంచలన వార్తలు, సినిమా, స్పోర్ట్స్ చదివేసి తర్వాత తీరిగ్గా మొదటి పేజీ నుండి చివర్లో ఇచ్చే సంతాప సందేశాలు కూడా చదవితే గాని పేపర్ చదివిన తృప్తి ఉండదు.

కాని పత్రికల్లో ఒక్క న్యూసే ఉండదు. వ్యాఖ్యలు, వార్తల వెనుక అసలు సిసలు కథలు, వివిధ అంశాలపై ఆయా రంగాల్లో నిపుణులైన వారి విశ్లేషణలు, అపురూపమైన ఫోటోలు, రాజకీయాలపై గిలిగింతలు పెట్టే కార్టూన్లు, ప్రభావితం చేసే సంపాదకీయాలు, ఇలా ఎన్నో విషయాలు నిండిన దినపత్రికలు పుష్పక విమానాలు. పూలు సాయంత్రానికి వాడిపోవచ్చు. కాని మన మనసుని దోచుకున్న వాటి పరిమళం అంత త్వరగా మనల్ని వీడిపోదు. అలాగే ఒక పత్రిక జీవితం ఒక్కరోజైనా, నలిగిపోయి జీవం కోల్పోయినా కూడ మనల్ని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుని , దాచుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. వార్తా పత్రికల్లో వచ్చే అనేక ఆసక్తికరమైన విషయాల్ని అలా చదివేసే వదిలేయకుండా, అవసరమైనపుడు మళ్ళీ రిఫర్ చేసుకోవాలనుకున్నపుడు వాటిని కత్తిరించి దాచుకోవాలి.

DSC00046
జూన్ 2001లో నేపాల్ యువరాజు  చేసిన మారణహోమం

పత్రికల్లో వచ్చే వివిధ విషయాలు, అవసరమనిపించినవి సంక్షిప్తంగా డైరీలో రాసుకోవడం కొందరి అలవాటు. కొన్ని అంశాలు మొత్తంగానే భవిష్యత్తులో ఉపయోగపడేవి కావచ్చు. అన్నీ రాసుకోవడం అయ్యే పని కాదు. ఇలాంటి సంధర్భాల్లో నచ్చిన అంశాన్ని కట్ చేసి దాచుకోవడం ఒక్కటే దారి. "అవుటాఫ్ సైట్ , అవుటాఫ్ మైండ్" అన్నారు కదా! ఒకసారి మనకి నచ్చిన సంగతుల్ని భద్రపరచుకోవడానికి బద్ధకిస్తే, ఆ విషయాలు మర్చిపోతాము. మళ్ళీ అదే విషయాలు పొందడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. ప్రతీ దానికి మార్కెట్ కెళ్ళి పుస్తకాలు వెతికి కొనలేము కదా!.

కొంతమంది మరీ ముఖ్యమనుకున్న విషయాల్ని ఫోటోకాపీ చేసి పెట్టుకుంటారు. కొంతమంది కటింగ్స్ ని పుస్తకాలుగా కుట్టి దాస్తారు. కొందరు ఫైల్ చేస్తారు. కొందరు తెల్లకాగితాలపై ఈ కటింగ్స్ ని అతికించి బుక్స్ గా చేసుకుంటారు. పేపర్ కటింగ్స్ సేకరించే హాబీ, మానసికానందాన్నే కాక మానసిక వికాసానికి దోహదం చేస్త్తుంది. పిల్లలకు ఈ అలవాటు చేయడం వల్ల వారికి ప్రోజెక్ట్ వర్క్స్ కోసం, పోటీ పరీక్షలకు పనికొచ్చే ఎన్నో విషయాలు తెలుస్తాయి. దీని వల్ల పిల్లల్లో విషయసేకరణ, వ్యక్తీకరణ, అలవడుతుంది. ఏళ్ళ తరబడి ఈ కటింగ్స్ ని సేకరించగలిగితే , ఒక మినీ లైబ్రరీ మన చెంత ఉన్నట్టే. ఏ విషయం మీదైనా సమగ్రంగా మాట్లాడాలన్నా, రాయాలన్నా, ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

 

DSC00043 2001సెప్టెంబరు 11 న అమెరికాపై జరిగిన దాడి...

ఒకప్పుడు ఆంగ్లపత్రికల్లో ముఖ్యంగా ఆగిపోయిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి పత్రికల్లో ఎన్నో అపురూపమైన వ్యాసాలు, ఫోటొలు వచ్చేవి. అయితే పత్రికా ప్రచురణలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న సాంకేతికాభివృద్ధి కారణంగా తెలుగు పత్రికల్లో సైతం ఎన్నో ఉపయుక్తమైన వ్యాసాలు, ఫోటోలు వస్తున్నాయి. వీటిని భద్రపరుచుకుని, అప్పుడప్పుడు చూసుకుంటుంటే చాలా థ్రిల్లింగ్‍గా ఉంటుంది. కోన్నేళ్ల తర్వాత ఈ పేపర్ కటింగ్స్ ని తిరగేస్తుంటే పాతమిత్రుల్ని అనుకోకుండా కలిసినంత ఆనందంగా ఉంటుంది. నాకూ ఈ అలవాటు చిన్నప్పటినుండి ఉంది. మంచి వ్యాసాలు, వంటలు, కుట్లు అల్లికలు, సీరియల్ కథలు, మొదలైనవి తర్వాత చదూకోవచ్చు అనే ప్రతి పేపర్ కటింగ్ ని జాగ్రత్త పరిచి పుస్తకాలు బైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ అలవాటు మా నాన్నగారి నుండి వచ్చింది. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాను.

ఎన్నో వందల గ్రంధాలు ఒక్క ఇ బుక్‍లో ఇమిడిపోయే ఈ రోజుల్లో ఇంకా ఈ పేపర్ కటింగ్స్ ఎందుకంటారా? ఎన్ని స్టార్ హోటల్స్ ఉన్నా, ఇంటి వంట రుచి తగ్గిపోతుందా? సాటివస్తుందా??

తరాల అంతరాలు

నిన్నటి తరానికి, నేటి తరానికి ఆలోచనా విధానంలో గానీ, వ్యవహార శైలిలో గానీ, జీవితం పట్ల ఉన్న దృక్ఫధంలో గానీ, ఎంత వృత్యాసం! ముందు తరం లక్ష్యాలు పరిమితంగా ఉండేవి. అవకాశాలూ ఆ స్థాయిలోనే ఉండేవి. పెళ్ళి చేసుకుని , నాలుగురాళ్ళు సంపాదించుకోవడం …… హాయిగా కాలం గడపడం వరకే దాదాపు వారి ఆలోచనలు లిమిట్ అవుతాయి. నేడో.. జీవితంలో సాధించవలసిన లక్ష్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అప్పటితరం ’ఫీల్ గుడ్’ గా ఏ ఆర్ధిక ఉన్నతిని భావించేదో అంతకన్నా పదిరెట్లు సంపాదించినా కోరికలను తీర్చుకోలేనంత కన్ష్యూమబుల్స్ ప్రస్తుతం మార్కెట్లో వెల్లువెత్తుతున్నాయి. ఏ కోరికనీ అణచుకోలేని ప్రస్తుత తరం వాటన్నింటినీ చేజిక్కించుకోవడానికి కాలంతో పాటు పరుగులు పెడుతుంది. అప్పటి తరం, ఇప్పటి తరం తాము ఆనందం అనుకునే దానిలో ఆనందాన్ని పొందుతూనే ఉన్నారు. అయితే అభిరుచులు, ముందున్న అవకాశాల్లోనే వృత్యాసం ఉంది. ఫ్రెండ్స్ తో జాలీగా వీకెండ్స్ గడిపే కుర్రాళ్ళని మునుపటి తరం మందలిస్తుంటుంది.. అలా తిరిగితే చెడిపోతారు. … అనేది అప్పటి అనుభవాలు వారికి నేర్పిన పాఠం. అందుకే వారు తమకు అపసవ్యంగా అనిపించిన పిల్లల ధోరణుల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే యువతలో తాము వేలెత్తి చూపించే అంశాలుగా భావించిన వాటిని వేలెత్తి చూపుతున్నారు కాని… తమ రోజులతో పోలిస్తే తమ పిల్లలు ప్రస్తుతం చూపిస్తున్న ప్రతిభాపాటవాల్ని చాలా తక్కువమందే గుర్తిస్తున్నారు. మునుపటి తరం చదువుకునేటప్పుడు కెరీర్ గురించి తమ పెద్దల వద్ద ప్రస్తావించాలన్నా భయపడేవారు. మరి ఇప్పటి పిల్లలు తమ లక్ష్యాలను నిర్భయంగా పెద్దలతో పంచుకోవడంతోపాటు వాటిని నెరవేర్చుకోవడానికి కావలసిన వనరులను, సమాచారాన్ని సైతం ఎవరి సాయం లేకుండా సమకూర్చుకుంటున్నారు కాబట్టి… అప్పట్లో తమలో నాటుకుపోయిన ముద్రని ఇప్పటి తరంపై రుద్దడం పెద్దలకు ఏ మాత్రం భావ్యం కాదు !!!!

నల్లమోతు శ్రీధర్

Sunday, 20 January 2008

ఆహా (ర) పద్యాలు....

కాదేదీ కవితకనర్హం అన్నట్టు మన కవులు కూరగాయలు, వంటకాలమీద కూడా అవలీలగా పద్యాలల్లేసారు. కొన్ని తమాషా పాటలు, పద్యాలు చూద్దాం....



"వెల్లుల్లి బెట్టి పొగిచిన

పుల్లని గోంగూర రుచిని పొగడగ వశమా?


మొల్లముగ నూనె వేసుకు

కొల్లగ గువ్వలచెన్నా !!"




తానేమీ తక్కువ అంటూ సుబ్బారావు కవిగారు ఉల్లిపాయ దండకమే రాశారు.



"ఓ యుల్లిపాయా! నమో యుల్లిపాయా!


నినుం బూజగావింతు నీ వాసనల్లేక


నే కూరయుం గూడ నేదో మరో మట్టి


దిన్నట్టుగా దోచు.. మా కాంక్షలందీర్చవే


పూర్వకాలంబులో రీతిగా కూరలన్నింటికిన్


కొత్త టేస్టుల్ ప్రసాదించి మా జిహ్వకుం దృప్తి చేయంగదమ్మా!


నమస్తే నమస్తే నమస్తే నమః"



ఓ కొంటె కవి



"కాచీ కాచీ ములక్కాయా, కాయనే పొట్టి కాకరీ


కాయనాం, వంగపింజనాం కూరానాం గుజ్జు పచ్చడి !!"


అంటు దొరికిన కూరగాయల్ని పచ్చడి చేసేశాడు.



ఇక తిరుపతి కవులు మాత్రం తక్కువ తిన్నారా


పచ్చిమిరపకాయ మీదా పద్యం రాసి దణ్ణం పెట్టేసారు.



"ఎద్దాని సంబంధ మెలిమి గల్గిన మాత్ర


కూరలెల్లను మంచి గుణము గనునా


కొత్తిమిరిని నూరుకొని తిన్న నెయ్యది


కంచె డన్నము తినగలగ జేయు


ఎద్దాని శిశుజాల మెరుగక చేబట్టి


కనులు నల్పిగ మంట గలుగ జేయు


ఎద్ది తా క్రమముగా నెదిగి పంపిన మీద


జోటి కెమ్మోవితో సాటి యగునా


నూరి దేనిని పుల్లనై మీరు మెంతి


పెరుగుతో గూర్ప స్వర్గము నెరుగజేయు


నరులకెల్లను నా పచ్చి మిరపకాయ


మహిత భక్తిను నేను నమస్కరింతు !!"

Thursday, 17 January 2008

మాటే మంత్రమో...

"మాట" ఎంతో శక్తివంతమైనది. ఒకే మాట వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు అర్ధాలను
ధ్వనిస్తుంటుంది. మనం మాట్లాడే మాటని ఎదుటివారికి ఇష్టమైన అర్ధంతో ధ్వనింప
చేయలేకపోతే ఆ మాట నిస్సారమైనట్లే లెక్క. స్నేహాలు, శత్రుత్వాలు, నమ్మకాలు,
సందేహాలు, ఇష్టాలు, నిష్టూరాలు, ప్రేమలు, ఏహ్యాలు వంటి భావోధ్వేగాలన్నీ మన
మాటల ద్వారానే సృష్టింపబడుతూ ఊంటాయి. ఏ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలన్నది మన
మనసులో ముందే ప్రోగ్రామ్  చేసుకుని ఉంటాము. అయితే అలా
ప్రవర్తించేటప్పుడు మాటల్లొ హెచ్చుతగ్గులు ఒక్కోసారి విపరీత పరిణామాలకు దారి
తీస్తుంటాయి. వాక్కుపై నియంత్రణ కలిగిన వ్యక్తి ప్రపంచాన్ని జయించినట్లే అంటుంటారు.
అందుకే పరిణతి కలిగినవారెప్పుడు గంభీరంగా, గుంభనంగా ఎంతవరకు అవసరమో
అంతవరకు మాత్రమే  ఆచీ తూచి మాట్లాడుతూంటారు.తాము మాట్లాడిన
మాటలు ఎలాంటి ఫలితాలు అందిస్తాయో అంచనా వేయగలుగుతారు.తాము ప్లాన్డ్ గా
మాట్లాడడమే  కాకుండా ఎదుటివ్యక్తుల మాటల ఆధారంగా  వారి
మనసుల్ని అవలీలగా చదివేయగలుగుతారు. మనం మాట్లాడే మాటకు మొహంలో
కన్పించే భావం జీవాన్ని పోస్తుంది. మాట సున్నితమైనా భావం కఠినంగా గోచరిస్తే
మాత్రం ఫలితం తారుమారవడం ఖాయం. మాటనీ, భావాన్నీ సమన్వయపరచుకుని
ఒకేలా ధ్వనింప చేయగలిగితే అవి ఎదుటి వ్యక్తుల మనసుల్ని హత్తుకు పోతాయి.
మాటలపై నియంత్రణ కోల్పోతే ఎన్నో అనుబంధాలను కోల్పోవలసి వస్తూంది.
అందుకే  వీలైనంతవరకూ మన నోటి నుండి వెలువడే ధ్వనిపై 
ఓ కన్నేసి ఉంచి నిబద్ధతతో మాట్లాడడం అన్ని విధాలా శ్రేయస్కరం !!...

 

నల్లమోతు శ్రీధర్.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008