Sunday 16 March 2008

తెల్ల కాగితం

" అమ్మా! ఒకసారి నా మాటినవే!"


"ఏంట్రా?"


"మరే ! మరే ! నువ్వు ఎప్పుడు నాకు వాళ్లని వీళ్ళని అడిగి తెచ్చిన పాత పుస్తకాలనుండి తీసిన కాగితాలతో మళ్ళీ క్లాసు బుక్కుల్లా కుట్టి ఇస్తావు కదా ! ఒక్కసారి కొత్త పుస్తకం కొనివ్వవా? నాకు అందరి కంటే ఎక్కువ మార్కులొచ్చినా కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు. చిత్తు కాగితాలోడా అని."


" నేనేం చేసేదిరా? మీ అయ్య సంపాదించినదంతా తాగుడుకే తగలేస్తాడూ. నిన్ను కూడా పనిలో పెడతానంటే నేనే నీ ఏడుపు చూడలేక స్కూల్లో వేసా కదా! రెండిళ్ళు ఎక్కువ ఒప్పుకుని అతి కష్టం మీదా నీ ఫీజులు, బట్టలు చేయగలుగుతున్నా కదా. ఇప్పుడూ కొత్త పుస్తకాలంటే ఎలారా ? కాస్త నువ్వే సర్దుకో. నా బంగారం కదూ ! "


"సరే మరి ! కాని ఒక్కసారైనా కొత్త పుస్తకం కొనిస్తావా? ఆ తెల్లని కాగితం ఎంత ముద్దుగా ఉంటుందో ? దాని మీద అట్ట వేసి నా పేరు రాసుకుంటే !"


" అమ్మా! నేను పెద్దవాడినయ్యాక నువ్వు అస్సలు ఎవరింట్లో కూడా పని చేయడానికి వీలులేదు తెలిసిందా. నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి నీ పనులన్నీ చేయడానికి పనిమనిషిని పెడతాను"


వంటిల్లు వెనకల పెరడులో అంట్లు తోముతున్న కనకమ్మ, ఆమె కొడుకు మాటలు వింటుంది వంట చేస్తున్న సుజాత. పదేళ్ళ ఆ పిల్లాడికి చదువు మీద ఉన్న ఆశ, తల్లిని సుఖపెట్టాలన్న తపన, పుస్తకాల గురించి అనుభవిస్తున్న బాధ అర్ధం చేసుకుంది. తన భర్త వ్యాపారం చేసి పిల్లలకు అడగకముందే అన్నీ కొనిపెట్టి , ఎటువంటి కష్టం రాకుండా, అన్ని అమర్చినా కూడా పాసు మార్కులు తెచ్చుకుంటున్నారు. ఈ కుర్రాడికి మాత్రం క్లాసులో అందరికంటే ఎక్కువ మార్కులు. ఇలాటి వాడికి ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు అనుకుంది.


ఆ రోజు రాత్రి భర్తతో " ఏమండి ! మన కనకమ్మ కొడుకు చదువులో చాలా చురుకుగా ఉన్నాడు. కొత్త పుస్తకాలు లేకున్నా కూడా క్లాసులో ఫస్టు మార్కులు తెచ్చుకుంటున్నాడు. అతని చదువుకోసం మీరు సాయం చేయకూడదూ" అని అడిగింది సుజాత.


దానితో అతను కాస్త చిరాగ్గా " చూడు సుజాత ! నేను కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం కాని ఎవరో పనిమనిషి కొడుకు కోసం కాదు. ఈ విషయం గురించి మళ్ళి అడగకు నన్ను" అని వెళ్ళిపోయాడు.


మరునాడు సుజాత బాగా ఆలోచించింది. " ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది. నా భర్త సహాయం చేయడానికి ఒప్పుకోలేదు. నాకంటు సంపాదన లేదు. ఎలా ఆ అబ్బాయికి సాయం చేసేది" . చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది తన స్వంత ఖర్చులు, ఆడంబరాలు కొన్ని తగ్గించుకుని ఆ అబ్బాయికి సాయం చేయాలని. పండగలకు , పుట్టినరోజుకు తను కొనుక్కునే చీరలు, పార్టీలు ఖర్చు తగ్గించుకుని ఆ డబ్బు కనకమ్మ కొడుకు చదువుకు ఇవ్వాలని .. కనకమ్మను కొడుకును తీసుకుని రమ్మని కబురు చేసింది.


"ఓరేయ్ ! మురళి ! నీకు బాగా చదువుకోవాలని ఉందా ?"


"అవునమ్మగారు! నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేసి అమ్మను పని చెయ్యకుండా ఇంట్లోనే ఉంచుతాను."


" అయితే నీ చదువుకు అయ్యే డబ్బులు నేను ఇస్తాను. కాని నువ్వు ఎప్పుడు క్లాసులో ఫస్టు మార్కులు తెచ్చుకోవాలి. ఎప్పుడు గాని మార్కులు తగ్గినా నేను డబ్బులివ్వడం మానేస్తాను. తర్వాత నీ ఇష్టం. బాగా కష్టపడి చదువుకుంటావా?"


"సరేనమ్మగారు ! బాగా చదువుకుంటా. "


" ఐతే ! ఈ తెల్లకాగితం తీసుకో. ఇలాగే ఉంచుకో. నీ మార్కులు చూసాకా నేను నీకు కొత్త పుస్తకాలు కొనిస్తాను. ఇకనుండి నువ్వు ఎప్పుడు కూడా కొత్త పుస్తకాలలోనే రాద్దువుగాని. సరేనా. పాత పుస్తకాలనుండి తీసిన కాగితాలతో కుట్టిన వాటిలో రాసే అవసరం లేదు. " అని ఒక కొత్త తెల్ల కాగితం ఇచ్చింది సుజాత వాడికి.


పదిహేనేళ్ళ తర్వాత ఒకరోజు సుజాత అలా సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటుండగా సూటుబూటులో ఒక అందమైన యువకుడు వచ్చి "అమ్మగారు ! నమస్కారం! ఇదిగోనండి" అంటూ ఒక అందమైన ఫోల్డర్ లో ఉంచిన తెల్లకాగితాన్ని ఇచ్చాడు. సుజాతకు అర్ధం కాలేదు.


"ఎవరు బాబు నువ్వు! ఈ తెల్లకాగితం నాకెందుకు ఇస్తున్నావు?"


" మీకు గుర్తులేదా అమ్మా! నేను ఒకప్పుడు మీదగ్గర పని చేసిన కనకమ్మ కొడుకు మురళిని. మీరు నా చదువుకు సాయం చేసారు. ఇప్పుడు నేను ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది. ఇవాళే ఉద్యోగంలో చేరడానికి వెళ్తు నన్నింతవాడిని చేసిన మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను" అని ఆమెకు పాదాభివందనం చేసాడు ఆ యువకుడు.


ఇదంతా చూస్తున్న సుజాత భర్త ఆశ్చర్యపోయాడు, తనకు తెలీకుండా తనకు డబ్బులడగకుండా ఒక పదేళ్ళ అబ్బాయికి చదువులో సాయం చేసి అతను ఇంతటి ఉన్నత శిఖరాలు చేరుకునేలా చేసినందుకు ఆమెను మనసులొనే అభినందించాడు.


" అమ్మా! మీరు పదిహేనేళ్ళ క్రింద ఇచ్చిన ఆ తెల్ల కాగితం జీవితాంతం నాతోనే ఉంటుంది. నాలో అహం పెరగకుండా, నేను కూడ మీలాగే మరొకరికి సాయం చేసేలా అది నన్ను ఎప్పుడు గుర్తుచేస్తుంటూంది." అని మరోసారి నమస్కారం చేసి సుజాతకు ఆమె భర్తకు వాళ్ళు వద్దంటున్నా పట్టుబట్టలు, కానుకలు ఇచ్చి వెళ్ళిపోయాడూ మురళి.


అతను వెళ్ళినవైపే చూస్తూ సుజాత " నేను ఈ అబ్బాయికి సాయం చేసి తప్పు చేయలేదు. నేనిచ్చిన డబ్బు నిజంగా సద్వినియోగమైంది. అంతా ఆ భగవంతుడి దయ " అని సంతోషంగా కళ్ళు తుడుచుకుంది..



అస్సలు ఈ పోటీలో పాల్గొనాలని లేదు . అసలు కథలు ఎలా రాయాలో కూడా తెలీదు. కాని మనసులో మాట రమగారు, నివేదన రమ్యగారు నన్ను కాస్త ఎగదోసారు. అయినా ఒక్క ఆలోచన తట్టలేదు. కాని నిన్నటినుండి కష్టపడి ఎలాగైతేనేమి ధైర్యం చేసి ఈ కథ రాసేసాను. ఇక చదివేవారి ఖర్మ. నేనేమి చేయలేను.. ఇకపోతే కొత్తపాళీ మాస్తారుగారికి ఒక తాయిలం ఇస్తున్నా. కాసిన్ని మార్కులు యెక్కువేస్తారని. అది ఎంతో తెలుసుకోవాలంటే మీ ఎలుక ముక్కుతో 1 దగ్గర నొక్కి 2 వరకు లాక్కు రండి.



1 మేస్టారండి. మీకు కిలో పూతరేకులు, కిలో కాజాలు, ఇంకా కావాలంటే కిలో పుల్లారెడ్డి స్వీట్లు ఇచ్చుకుంటాను. కాసిన్ని మార్కులేసేయండి. ప్లీజ్ ... 2

12 వ్యాఖ్యలు:

Anonymous

""మాస్టారు" వెయ్యవలిసినవారికి వేస్తారు, ఇవ్వవలసిన వారికి ఇస్తారు లేమ్మా".

Naga Pochiraju

కొత్తపాళి గారికి చాలు పూతరేకులు,బ్లాగర్లకు చాలు బహుమతులు :)
మాష్టరు గారండీ .....మీకు నేను కొత్త ఆవకాయ ఇచ్చుకుంటాను
కాసిన్ని మార్కులు నాకూ వెయ్యండి :)

జ్యోతిగారు.....మీరు ఇంత చక్కగా కథరాయగలు కదా...ఇంకాస్త విదిదిగా రాసి ఉంటే ఈ కథ ఇంకా అందం గా ఉండేదేమో...

Unknown

జ్యోతి గారు:
ఏమీ అనుకోనంటే నాకు కథ అంతగా నచ్చలేదు.

౧. మీరు తెల్ల కాగితాన్ని కథలోకి తీసుకురావడం కొంత బలవంతంగా అనిపించింది. కథా పరంగా అవసరం అనిపించలేదు

౨. కథ కూడా కొంత రొటీనుగా అనిపించింది. కొత్తదనం లోపించింది.

కానీ మీరు కథనం స్మూథ్ గా నడిపించగలుగుతున్నారు కనుక ప్రయత్నం చేస్తే ఇంకా మంచి కథలు రాయగలరు.

ఆల్ ద బెస్ట్...

జ్యోతి

నెటిజన్ గారు

నాకు బహుమతి వద్దండి. పాస్ మార్కులు వస్తే చాలు.

లలిత గారు,

నా మొహం నేను కథ రాయడం ఇదే మొదటిసారి. అది ఎంతో ధైర్యం కూడగట్టుకుని ప్రయత్నించా.

ప్రవీణ్.

నిజం చెప్పినందుకు ధాంక్స్.. మొదటి ప్రయత్నం కదా. కథ ఎలా రాయాలో తెలీదు. నాకు తెలిసిన సబ్జెక్ట్ అందులో పెట్టడం. చూద్దాం. ఇది నా బుర్రలో కెక్కే విషయమో కాదో..

రాధిక

జ్యోతి గారూ మార్చి 15 ఆఖరు అనుకుంటాను కధలు పంపడానికి:) బాగుందండి కధ.

ramya

మొత్తం మీద మొదలెట్టారు,అలాగే కంటిన్యూ చేస్తుండండి.

కొత్త పాళీ

మీరు కూడా బరిలోకి దిగడం చాలా సంతోషం.

ఏంటో ఈ కాలం శిష్యులు .. ఎంత ఇంటర్నెట్టు యుగమైనా అన్నీ కంప్యూటర్ తెరమీదే చూపించి తృప్తి పడమంటే ఎలా?

pruthviraj

మీ తెల్ల కాగితం కథ ఓపిక పట్టుకొని బలవంతంగా మొత్తం చదివేసాను. మార్కుల విషయం పక్కకు పెట్టి వాడుక పదజాలం విరివిగా వాడి ఇంకా చిన్నది చేసి రాసి ప్రయత్నిస్తే సూపర్ గా వుండేది. అయినా కథాంశం బావుంది. inspiration నచ్చింది.

KK

"Winning is not, but participation.." అని అంటారే, అలాగ మీకు పార్టిసిపేషన్ కి బోలెడు మార్కులేయచ్చు. కొత్తపాళీ గారికి లంచమిచ్చిన స్టైల్ కి మాత్రం 100/100.

Unknown

జ్యోతి గారు,
మీరు ప్రయత్నం చేసారు. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నం ముఖ్యం. నేను అది కూడా చేయలేదు..మా వారు ఈ కధల పోటీ గురించి నాతో చెప్పారు. ఈ సారి నేనూ ప్రయత్నిస్తాను. కానీ నేను కూడా ఎప్పుడూ కధలు రాయలేదు. సొంత అనుభవాలు రాయటమంటే రాయగలనేమో..

వింజమూరి విజయకుమార్

మీరు పంక్చుయేషన్స్ బాగా నేర్చుకున్నారు. వాటిలో చెప్పాల్సిందేమీ లేదు. కథ కూడా బాగా వుంది. తెల్లకాగితం సుజాత యివ్వడం, దాన్ని ఆ అబ్బాయి దాచుకోడం బాగున్నాయి. తర్వాత, చిన్న సూచన. సుజాత మనసులో ఆలోచించుకుంటున్నప్పుడు " ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది. నా భర్త సహాయం చేయడానికి ఒప్పుకోలేదు. నాకంటు సంపాదన లేదు. ఎలా ఆ అబ్బాయికి సాయం చేసేది" . అనడం కన్నా "ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు వున్నట్టుంది. తన భర్త చూస్తే సాయం చేయడానికి ఒప్పుకోలేదు. తన కంటూ వేరే సంపాదన లేదు. ఎలా ఈ అబ్బాయికి సాయం చేయడం" అంటే బావుంటుంది. అంటే ఆలోచన direct speach లో కాకుండా indirect speach లో అన్నమాట. ఏమంటారు. మొత్తానికి Fine. జడ్జీలకి స్వీట్స్ ఆశ చూపడం, అదీ బహిరంగంగా నిబంధనలకు వ్యతిరేకం. కనుక, జడ్జీలు genuine అయితే ఈ కథని పోటీలోకి తీసుకోరాదు.

జ్యోతి

విజయ్ గారు,

మీ సూచనలకు థాంక్స్.. హమ్మయ్య పర్లేదన్నమాట. ఇక కొత్తపాళిగారే వారి బ్లాగులో ఆయనే అడిగారు, ఎవరన్నా కిలో పూతరేకులు ఇస్తే ఏమన్నా ఫలితం ఉండొచ్చు. పైగా ఇదే టపాలో ఊరికే కంప్యూటర్ తెరమీద చూపిస్తున్నారని బాధపడ్డారు కూడా. మరి నేనేం చేయను? సో నాది అంతలా పట్టించుకునే తప్పు కాదనుకుంటా?

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008