Wednesday 12 March 2008

డ్రైవింగ్ నేర్చిన విధంబెట్టిదనిన ...

చాలా చాలా ఏళ్ళ క్రితం మాట. నేను నాలుగో క్లాసులో ఉన్నప్పటి సంగతులు. మొదటిసారిగా సైకిల్ నేర్చుకున్నాను. వేసవి సెలవుల్లో ఏమి తోచక ఇంట్లో సతాయిస్తుంటే అమ్మ చెప్పిండి సైకిల్ నేర్చుకో అని. అప్పట్లో అద్దెకు సైకిల్ ఇచ్చే షాపులు చాలా ఉండేవి. ఇప్పుడు అస్సలు కనపడటం లేదు. ఆ రోజుల్లో ఆటోలు కూడా తక్కువే. ఎక్కువ బస్సులు, రిక్షాలు. మేముండేది పాత బస్తీలో. అమ్మ వచ్చి సైకిల్ షాపు వాడికి చెప్పి , ఇంటి అడ్రసు అది ఇస్తే వాడు చిన్ని సైకిల్ ఇచ్చాడు. నేను మా తమ్ముల్లిద్దరు కలిసి సాయంత్రాలు నేర్చుకునేవాళ్ళం. ముందు ఇంటి ఆవరణలోనే. అద్దె ఎంతో తెలుసా అచ్చంగా పది పైసలే గంటకి. ఆ సెలవులు అలా గడిచిపోయాయి. అప్పుడప్పుడు క్రింద పడడం, దెబ్బలు తగిలించుకోవడం మామూలే.. ఐదో తరగతికొచ్చాక సెలవుల్లో పెద్ద సైకిల్ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. మా ఇంటికి కొద్ది దూరంలో ఉండే ఇంకో అమ్మాయితో మాట్లాడి, ఇద్దరం కలిసి పెద్ద సైకిల్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాము. ఆ అమ్మాయి నాకంటె రెండు క్లాసులు పెద్దది. పొడుగు కూడా. పెద్ద సైకిల్ కి అద్దె పదిహేను పైసలు గంటకు. కాని ఇద్దరు అమ్మాయిలం వెళ్ళి కాస్త మర్యాదగా అడిగేసరికి , ఆ షాపు ఓనర్ కాస్త వయసులో పెద్దవాడే పది పైసలకే ఇచ్చేవాడు. అబ్బాయిలకు అస్సలు ధర తగ్గించేవాడు కాదు. ఇంకా అంత త్వరగా సైకిల్ అద్దెకు ఇచ్చేవాడు కాదు. మేమిద్దరం రోజు ఐదేసి పైసలు వేసుకుని సాయంత్రం గంట సేపు అద్దెకుతీసుకుని సైకిల్ నేర్చుకునేవాళ్ళం. సైకిల్ తెచ్చుకున్నాం సరే. మరి దాని పైకి ఎలా ఎక్కాలి. సో చుట్టు పక్కల వెతికి ఒక పెద్ద బండరాయి తెచ్చి ఖాళీస్థలంలో గోడ పక్కన పెట్టాం. సైకిల్ దాని దగ్గర పెట్టి రాయి మీద కాలుపెట్టి గోడను ఆసరాగా తీసుకుని సైకిల్ ఎక్కి మెల్లిగా నడిపించేవాళ్ళం ఇద్దరం. మళ్ళీ సైకిల్ ఆపాలన్నా, దిగాలన్నా ఆ రాయి దగ్గరకు రావాల్సిందే. మధ్యలో దిగడానికి కాలు అందదు కదా. క్రిందపడి దెబ్బలు తగిలితే దులిపేసి , మళ్ళీ సైకిల్ తీసుకుని ఆ రాయి దగ్గరకు వచ్చి మళ్ళీ మొదలెట్టేదాన్ని. సరిగ్గా అరగంట ఒక్కొక్కరికి. అలా ఓ ఇరవై రోజులు నేర్చుకున్నామేమో. ఒకరోజు సైకిల్ నడిపిస్తూ గోడకు గుద్దుకుని క్రింద పడ్డా. రెండు మూడు సైకిల్ పుల్లలు విరిగిపోయాయి. దెబ్బలు మామూలే. ఇంట్లో చెప్తే తిట్లు, షాపు వాడు ఏమంటాడో అని భయం ఇద్దరికి. మెల్లిగా వెళ్ళి ఆ షాపు ఓనర్ ఉన్నాడా లేదా అని తొంగి చూశాం. లేడు.. హమ్మయ్యా అని సైకిల్ తీసికెళ్ళి మిగతా సైకిళ్ళతో పాటు పెట్టేసి అక్కడున్న అబ్బాయికి చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి ఒకటే పరుగు.. మళ్ళీ సైకిల్ నేర్చుకుంటామనే మాట లేదు. ఆ షాపు ఉన్న సందులోకి మరిచి కూడా వెళ్ళలేదు నేను. కనపడితే తిడతాడేమో అని ఒకటే భయంతో చచ్చిపోయేదాన్ని.



మళ్ళీ పదో క్లాసులో అనుకుంటా. మా తమ్ముడిని అడిగి స్కూటర్ నేర్పించమన్నా. ముందు అమ్మ పర్మిషన్ తీసుకున్నా. స్కూటర్‍కి ఏమన్నా ఐతే నాన్నను హ్యాండిల్ చేస్తుందని. మా తమ్ముడు ముందు బేసిక్స్ చెప్పి మొదలెట్టాడు. వెనకాల తను కూర్చుని నేర్పించేవాడు. ప్రొద్దున్నే అయిదున్నరకు లేచి అరగంట నేర్చుకునేదాన్ని. అప్పుడు రోడ్ల మీద ఎవరూ ఉండరుగా. ఖాళీగా ఉంటుందని. కాని ఇక్కడ స్కూటర్ కిక్ కొట్టడం బానే వచ్చింది. కాని అలాగే స్కూటర్ ఎక్కి వెళ్ళడం అంటే భయం. సీట్ మీద కూర్చుంటే కాలు క్రింద పెట్టడం రాదు. అందదు అన్నమాట. ఇంకా అది చాలా బరువు . మళ్ళీ ఏదో ఎత్తు చూసుకుని స్కూటర్ కిక్ కొట్టి , స్టార్ట్ చేసి ఎక్కి ముందుకెళ్ళిపోవడమే. అలా కాస్త అలవాటయ్యాక మా తమ్ముడిని బస్ స్టాప్ లో దింపేసి వచ్చేదాన్ని. ఖర్మ కాలి ఆగిపోయిందంటే మళ్ళీ ఎదో అరుగు వెతుక్కోవడం. లాక్కు వెళ్ళాలన్నా బరువు. రోడ్డు మీద ఎవరన్నా వెక్కిరిస్తారని భయం. ఇలాగే ఒకసారి సెలవుల్లో మా కాలనీ సందుల్లో స్కూటర్ నడిపిస్తున్నా. సడన్‍గా ఒక సైకిల్ వాడు అడ్డం వచ్చాడు. అంతే సంగతి. ఇద్దరం గుద్దుకుని క్రింద పడిపోయాం. స్కూటర్‍కి ఏమీ కాలేదు. నాకు మోచేయికి , కాలికి దెబ్బలు తగిలాయి. సైకిల్ వాడి పుల్లలు తెగిపోయాయి. హ్యాండిల్ వంకరపోయింది. ఏమి మాట్లాడకుండా ఇంటికొచ్చేసి స్కూటర్ లోపల పెట్టి ఎవరికీ చెప్పకుండా ఊరకున్నాను. పాపం ఆ సైకిల్ అబ్బాయి కూడా ఏమీ అనలేదు. కాని చాలా రోజుల వరకు భయంగానే ఉండింది. మళ్ళీ స్కూటర్ జోలికి పోలేదు.



ఇంటర్ కాగానే సెలవుల్లో కారు నేర్చుకోమంది మా అమ్మ. సరే ఇంట్లో ఉంటే కూడా బోర్ గా ఉంటుందని , డ్రైవింగ్ క్లాసులలో చేరాను. ఓ పది రోజులు నేర్చుకున్నాక , మా పెద్దమ్మ కూతురి ఎంగేజ్‍మెంట్ ఉందని అందరం మిర్యాలగూడ నాలుగు కార్లలో బయలుదేరాము. నాకు కారు డ్రైవింగ్ ఇస్తానంటేనే వస్తా అని కండిషన్ పెడితే సరే అని మా కజిన్ కూర్చుని సిటీ దాటాక డ్రైవింగ్ ఇచ్చారు.నేను ధైర్యంగానే ఉన్నాను. వెనకాల కూర్చున్న మా బావగారు, ఇంకో పిన్ని కూతుళ్ళు, భయంతో ఉన్నారు. ఎదురుగ్గా( అదీ అవతలి రోడ్డుపై) ఏ వాహనమొచ్చినా "జ్యోతి మెల్లిగా అమ్మా" అనేవాళ్ళు. అరగంట నడిపి ఇచ్చేసా. కాని అప్పట్లో నేను మగరాయుడని అనేవారు ఇలాటి పనులు చూసి . ఐనా నేను లెక్క చేసేదాన్ని కాదు. పెళ్ళయ్యాక కూడా అప్పుడప్పుడు కారు డ్రైవింగ్ చేసేదాన్ని. ఇక మావారైతే ఇచ్చేవారు కాదు. ఆయన లేనప్పుడు కారు తీసేదాన్ని చెప్పకుండా. ఇక ఇప్పుడూ మొత్తానికే అలవాటు తప్పింది. .. వరూధిని గారి స్కూటి కథ చదివి నా అనుభవాలు రాయకుండ ఉండలేకపోయా.

1 వ్యాఖ్యలు:

శ్రీ

మీ సైకిల్ కబుర్లు చదువుతూ ఉంటే నా అనుభవాలు గుర్తుకువస్తున్నాయి. చిన్నపుడు సైకిల్ మీద వెల్తూ ఉంటే ఎదఓ అకాశంలో తేలుతూ ఉన్నట్లుండేది! నేను ఇంటర్ చదివేవరకు దెబ్బలు తగులుతూ ఉండేవి.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008