వెలుగు వైపు పయనం
కాలమెప్పుడు మన పక్షానే ఉండదు. ప్రతీ జీవితంలోనూ కొన్ని గడ్డురోజులంటూ
రావడం ఖాయం ! ఎంత శ్రమించినా ఎదురుదెబ్బలు తగలడం, మన పరిధిలో
లేని, మనం నియంత్రించలేని అనేక అంశాలు మనల్ని శాసించడం సహజం.
ఓ అపజయమో, అనారోగ్యమో, నష్టమో, కష్టమో వచ్చిందంటే చాలు...
అప్పటివరకూ మనకి ఎంతో గౌరవం ఇచ్చిన సమాజం కూడా ప్రతీ చిన్న
విషయాన్నీ వేలెత్తి చూపడానికి ఉత్సుకత చూపిస్తుంది. అసలే నిండా
ఇబ్బందుల్లో ఉన్న మన ఆత్మస్థైర్యాన్ని సమాజంలోని వ్యక్తుల ప్రవర్తన
మరింత దెబ్బ తీస్తుంది. అంతటి క్లిష్టతర పరిస్థితుల్ని ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి
వల్లా కాదు. కష్టాలన్నీ తాత్కాలికమేనని మన మనసుకి మనం సర్ది చెప్పుకుంటూ,
మరో ప్రక్క సమాజం చూపించే చులకన భావాన్ని తట్టుకుంటూ సమాజం
చులకనగా చూసినంత మాత్రాన మనం వైఫల్యం చెందలేదని మనో నిబ్బరంగా
నిరంతరం బేలన్స్ చేసుకోవడం ఎంతో కష్టమైన వ్యవహారం. ఏదీ శాశ్వతం కాదు.
కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పుడు సమాజం చూపించిన గౌరవం, మనం సంపాదించిన
డబ్బు, అనుభవించిన భోగం.. కష్టాలతో వచ్చే నిష్టూరాలు, నష్టాలు, అశాంతి
అన్నీ జీవిత గమనంలో మజిలీలే ! భౌతికపరమైన అంశాలకు ఎప్పుడైతే
ప్రాధాన్యత తగ్గించి ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తామో, ఆత్మశక్తి
అంటూ ప్రతీ శరీరంలోనూ ఒకటుంటుందని.. దానికి కలిగే ఆనందమే
సర్వోత్కృష్టమైనదని గ్రహించగలుగుతాం. అప్పుడు ప్రతీ కష్టాన్నీ, ఆనందాన్నీ
ఒకే రకమైన చిరుమందహాసంతో స్వీకరించగలుగుతాము.
నల్లమోతు శ్రీధర్
0 వ్యాఖ్యలు:
Post a Comment