మాయా ప్రపంచం
మనస్సెంతో సున్నితమైనది. అనందమేసినపుడు ఉప్పొంగిపోతుంది. చీకటి
మబ్బులు కమ్ముకున్నప్పుడు కృంగిపోతుంది ! ఆశల రెక్కల్ని పురి విప్పి
గిలిగింతలు పెడుతుంటుంది.. నిరాశ ఎదురైనపుడు చిన్నబుచ్చుకుంటుంది.
ఆత్మీయుల పలకరింపులకు పులకరించి పోతుంది.. నిరాదరణ ఎదురైనపుడు
నియంత్రణ కోల్పోతుంది. ఆశయాల సాధనకై మార్గాన్వేషణ చేస్తుంది… మార్గ
మధ్యంలో ముళ్ళెదురైతే మౌనంగా వెనుదిరుగుతుంది. . ప్రేమకై పరితపిస్తుంది. ..
ప్రేమానురాగాలను పదిలపరచుకోలేక ఆ ప్రేమబంధాలనే పరిత్యజిస్తుంది.
అందలాలు ఎక్కాలనుకుంటుంది. అందిందే దక్కుదలగా సరిపుచ్చుకుంటుంది.
స్నేహానికి ప్రాణమిస్తానని పరితపిస్తుంది. స్వార్ధపు పొరలు కమ్ముకున్నపుడు
అదే స్నేహన్ని కాలదన్నుకుంటుంది. మనిషి జీవితం క్షణభంగురమంటే
ఒప్పుకుంటుంది. మృత్యువు ముంగిట్లో ఉన్నప్పుడు ఒడిలోకి చేరడానికి
వెనుకాడుతుంది. కష్టాలొచ్చినప్పుడు కన్నీరు కారుస్తుంది. . ఇతరుల కష్టాలకు
మొసలి కన్నీరునే మిగుల్చుతుంది. ప్రపంచ శాంతిని కాంక్షిస్తుంది. . నిరంతరం
అశాంతితో అల్లాడుతుంది. మనసు చేసే గారడీలకి కట్టడిలొ ఉండలేక మనం
మాత్రం ఆ మాయాలోకపు మత్తులొ నిరంతరం మునిగిపోయే ఉంటాం…
మాయ వీడి వాస్తవం కళ్ళెదుటే నిలిచేసరికి మరో మాయ కమ్మేస్తుంటుంది.
నల్లమోతు శ్రీధర్
2 వ్యాఖ్యలు:
బొమ్మ భలే ఉంది!
ఙ్ఞానం మాయ నుండి మనలను దూరం చేయును.
Post a Comment