Monday 10 March 2008

కోతల రాణి

" టింగు టింగ్ టింగు టింగ్.."


తలుపు తీసి చూస్తే ఆశ్చర్యం!.. నేను చూస్తున్నది నిజమేనా ! కలా !! అని కళ్ళద్దాలు తుడుచుకుని మళ్ళీ చూసా.


ఎదురుగా TRS నేత చంద్రశేఖర రావు గారు. "నమస్తే జ్యోతక్క! బాగున్నవా? కాస్త మమ్మల్ని ఇంట్లకి రానిస్తవా. కొంచం మాటాడాలె" అన్నారు.


" రండి . రండి. కాని మీరు తప్ప మిగతావారు బయటే ఉండాలి" .


సరే ! నీ ఇష్టం " అంటు లోపలికొచ్చి కూర్చున్నారు.


చెప్పండి సర్ ! నేను జ్యోతక్క అని ఎవరు చెప్పారు. అసలు నాతో మీకేం పని?" అని అడిగా.


" అన్ని చెప్త గాని . నా గురించి తెలుసుకదా. గిప్పుడో గప్పుడో ఎలక్షన్లు ఒచ్చేటట్టున్నయి. నీ గురించి నా పార్టీవోళ్ళు చెప్పిన్రు. ఇంటర్నెట్ ల మస్తు రాస్తవంట కద. ఎవడన్నా తిక్క తిక్కల్గా మాట్లాడితే మన బాషల దులిపేస్తవంత గదా. నీ అసుంటోల్లే మాకు కావాలె. జర సాయం చేయరాదె. నాకంటే చిన్నదానివైనా నేను కూడ జ్యోతక్క అనే అంట. ఇగ పని ఏందంటే మా పార్టీ తరఫున నువ్వు ఇంటర్నెట్ల ప్రచారం చేయాలె. నీ ఇష్టమునట్టు కాంగ్రేసోల్లను, తెలుగుదేసమోల్లను తిట్టు, మ్యాటర్ నేనిస్త. నీకు ఎటువంటి ప్రమాదం లేకుండ చూసే బాధ్యత నాది. బయట మీటింగులల్ల, ప్రెస్సోల్లతోని చేయనీకి చాలామంది ఉన్నరు, కాని ఇలా ఇంటర్నెట్ల కూడ ప్రచారం చేస్తే మస్తుగుంటది. అది నువ్వే మొదలెట్టాల. ఏమంటావ్ మరి. నీకు ఇంటర్నెట్ల తెల్సినోల్లు చాలా మంది ఉన్నరు గదా. పేపర్లల్ల నీ పేరు ఒస్తుందని కూడా తెలుసు. ఫ్రీగ కాదు పైసలిస్తము నువ్వు అడిగినంత. సరే అని చెప్పాలే మరి?" అని అన్నారు కె.సి.ఆర్ గారు.


నేనేమంటాను. టీ ఇచ్చి పంపేసా. తర్వాత చెప్తా అని.


చీ ! చీ ! పొద్దున్నే నా మూడ్ అంతా పాడయింది. ఇంకా వంట పని మొదలెట్టలా? అనుకుంటు నా పని పూర్తి చేసుకుని పేపర్ చూస్తుంటే


"ట్రింగ్.. ట్రింగ్.. ట్రింగ్.."


"హలో! ఎవరూ?"


" జ్యోతిగారు ఉన్నారా? పిలుస్తారా? "


"నేనే మాట్లాడుతున్నా! ఎవరు?"


"నమస్తే జ్యోతిగారు ! మేము కె ఎ . పాల్ గారి ఆఫీసునుండి మాట్లాడుతున్నాము. మీతో పాల్ గారు మాట్లాడతారంట.


అర్జెంట్ అని చెప్పమన్నారు."


"ఓకె . ఇవ్వండి" (మనసులో భయం, చిరాకు. వీడికి నాతో పనేంటి అని?)


"నమస్కారం జ్యోతిగారు. మీకు ఆ ప్రభువు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండుగాక. మేము ఒక ముఖ్యమైన పని కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. మమ్ములను క్షమించండి. మీరు ఇంటర్నెట్లో చాలా బాగా రాస్తారని మాకు తెలిసింది. మేము త్వరలో ఎలక్షన్లలో మా పార్టీ సభ్యులను పోటీలో పెట్టి కాంగ్రేస్, తెలుగుదేశం, టిఆర్ ఎస్ పార్టీలన్ని డిపాజిట్ కూడ దక్కకుండా చేస్తాము. వారి రహస్యాలన్నీ మాదగ్గ్గరున్నవి. అవి మీరు ఇంటర్నెట్లో మీదైన శైలిలో రాసి ప్రచారం చేయగలరా? మీకు కావలసిన రుసుములు కూడా చెల్లించగలము. ఆలోచించుకుని మాకు సరే అను సమాధానం చెప్పండి. ఈ కుటిల రాజకీయ నాయకులనుండి మన రాష్ట్రమును కాపాడుకొనుటలో మాకు సాయపడండి. ఆ దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని సదా తన నీడలో కాపాడతాడు."


"సరే ! చూద్దాం. మళ్ళీ ఫోన్ చేయొద్దు." అని పెట్టేసాను.


ఇదేంట్రా దేవుడా? ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో.. ఈ చెత్తనాయాల్లందరు తగులుకున్నారేంటీ?" అనుకుంటూ వేడి వేడి మసాలా టీ చేసుకుని అప్పుడే మొదలయిన తలనొప్పికి ముందే మాత్ర వేసుకుని పడుకున్నా.


మళ్ళీ " టింగు.. టింగ్ టింగు .. టింగ్..


మళ్ళీ ఎవడొచ్చాడో అని తిట్టుకుంటూ తలుపు తీస్తే కొరియర్ అబ్బాయి. ఉత్తరం తీసుకుని తలుపేసి వచ్చి పడుకుని గంట తర్వాత లేచి ఆ ఉత్తరం చదివితే కళ్ళు తిరిగిపోయాయి. అది ఎవరినుండంటే ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ నుండి.


"అమ్మా ! జ్యోతిగారూ! నమస్కారం. మీరు జ్యోతక్కగా చాలా ఫేమస్ అని మాకు ఇటీవలే తెలిసింది. మీరు రాసే రచనలు, అనామకులను నిర్ధాక్షిణ్యంగా దులిపేసే పద్ధతి మాకు నచ్చింది. మీలాటి మహిళలే మన రాష్ట్రానికి, దేశానికి కావల్సింది. మీరు మా పార్టీ తరఫున ఇంటర్నెట్లో ప్రచారం చేయగలరా? మీకునచ్చినట్టుగా. వివరాలు మా సూరీడుతో పంపిస్తాను. మీకు ఎటువంటి ప్రమాదం ఉండబోదని నేను హామీ ఇవ్వగలను. అవసరమనుకుంటే మా సూరీడును రోజుకు గంట సేపు పంపిస్తాను. అతను ఎటువంటి పనైనా చేసిపెట్టగలడు. . మా మాట తిరస్కరించకుండా ఒక్కసారి ఆలోచించండి. అన్నీ లాభాలే కలుగుతాయి. " అని ఉంది.


ఇవాలేంటి నా ఖర్మ ఇలా కాలింది. అని తలకు పావు సేరు నూనె మర్ధనా చేసుకుని తలారా స్నానం చేసి , ఏదైనా బ్లాగు రాద్దామనుకుని నా మెయిల్ ఓపెన్ చేసా ముందు. మా గ్రూఫు మెయిల్స్, బ్లాగు గుంపు మెయిల్స్ చూస్తుంటే మధ్యలో ఒక కొత్త మెయిల్ కనిపించింది. ఎవరా అని ఆలోచిస్తూ యధాలాపంగా మెయిల్ ఓపెన్ చేసా. పంపింది చంద్రబాబునాయుడు అని చూడగానే టక్కున అది డిలీట్ చేసా చదవకుండానే..


ఇక లాభం లేదు . ఇవాలేదో అయింది. అని నన్ను నేనే తిట్టుకుంటుండగా


"వాతాపి గణ పతింభజే " అంటూ వినిపించింది. టక్కున మెలకువ వచ్చింది. అలారమ్ ఆపేసి అయోమయంగా లేచి కూర్చున్నా. పది నిమిషాల వరకు ఏమీ అర్దం కాలేదు. నేను ఎక్కడున్నాను అని కూడా తెలీలేదు. టైమ్ చూస్తే ఉదయం ఐదైంది.

"అమ్మో ఇదంతా కలా? ఇంకా నయం.. బ్రతికున్నాను. " అంటూ పనిలో పడిపోయా.


ఇదంతా ఓవర్ గా ఉంది కదా. ఉండదు మరి..అన్నీ కోతలైతే.

ఊరికే కోతలు కోస్తే ఎలా ఉంటుందో అని రాసానన్నమాట . అస్సలు ఈ రాజకీయాలంటేనే నాకు పడదు.

10 వ్యాఖ్యలు:

Puvvaladoruvu

హ.హా..హో...కోతలైనా ఈ రాజకీయకోతులు ఎప్పుడు ఎవర్ని ఆశ్రయిస్తాయో తెలీదు...ట్రింగ్..ట్రింగ్..ఉండండి ఎవరో బెల్ కొడుతున్నట్లున్నారు:)

(మాకీ తిప్పలేంటి జ్యోతి గారు, గూగులోళ్ళకే మీ ఓటా?)

-నువ్వుశెట్టి బ్రదర్స్

Anonymous

జ్యోతక్క డౌన్‌ డౌన్‌

-- విహారి

Anonymous

We hereby propose Smt. Jyotakka ...

Anonymous

జ్యోతక్క అప్ అప్..

కొత్త పాళీ

This is your best!

రానారె

కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆరెసులను కాలదన్నారంటే - మీకు సీపీఐ, సీపీఔ, సీపీఅంఅః మొదలైన ఎర్రజండా పార్టీలపై సానుభూతి వుందన్న మాట స్పష్టమవుతోంది - ఎంతైనా 'జ్యోతక్క' కదా మీరు!! :))

టింగు టింగ్ టింగు టింగ్ ...

మంజుల

:) good one!

జ్యోతి

విహారి

నాకు ఎందుకు డౌన్ డౌన్??? వాళ్ళందరికి నీ ఫోన్ నంబర్ ఇవ్వనా. డీల్ చేసుకుంటావా. నాకు తలనొప్పి తగ్గుతుంది.

నెటిజన్ గారు,కొత్తపాళిగారు,
థాంక్స్, అసలు ఈ టపాలో చెప్పినవి నాకు అస్సలే పడవు. ఊరికే ఎలాగుంటుందో చూద్దామని అప్పటికప్పుడూ అనుకుని రాసుకుంటూ పోయా.కోతలు, రాజకీయాలు అంటేనే చిరాకు, అసహ్యం.

రాము,
ఏదో కాస్త పెద్ద పార్టీలు, అస్తమాను పోట్లాడుకుంటారు కదా .అలా తెలుసు. సిపియెమ్ లాంటివన్నీ ఎర్ర చొక్కాలేసుకుంటారని తప్ప వేరే తెలీదు, తెలుసుకునే ఉద్దేశ్యం లేదు...

Ramani Rao

బాగుంది జ్యోతిగారు సరదా సరదాగ. అసలైనా ఒకసారి ట్రై చెయ్యొచ్చుకదా రాజకీయాల్లోకి, మా జ్యోతక్క, మాకు బాగా తెలుసు అని మేము చెప్పుకోవచ్చు.

One Stop resource for Bahki

టింగ్ టింగ్ ... ఎ వరా అని తలుపు తెరిస్తే ఎదురు గా
జోతక్క ,
కశ్యపా నీ మీద కూడా ఒక బ్లాగు రాస్తా కానీ నీ వోటు వెయ్యి మీ ఆవిడ వోటు నాకు వేసే టట్లు చెయ్యి .
"ఓటు కో బ్లాగు ఇది బాగు బాగు "

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008