Tuesday, March 11, 2008

అద్భుతమైన ప్రేమ కావ్యం .. ఆడదాని మనసుఆడవాళ్ల మోములో కదలాడే కొన్ని ఎక్స్ ప్రెషన్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి.. ఓరచూపు, కొంటె నవ్వు, కనీకన్పించక మోముపై విరబూసే చిరు దరహాసం, అదిమిపెట్టుకున్నా బయటపడే సిగ్గు, పెదాల బిగింపులో బంధీ అయ్యే గడుసుదనం, క్షణకాలంలో ప్రత్యక్షమై మరుక్షణమే మాయమయ్యే నిర్లక్ష్యం, చెలికాడి హృదయాన్ని తడిమి చూడడానికి ఎక్కుపెట్టే లోతైన భావాతీతమైన కనుచూపు, కదలికలో మార్పులేకుండానే ఉన్న చోట నుండి నలుదిక్కులూ చుట్టివచ్చే సిక్త్ సెన్స్.. నిజంగా సృష్టికర్త అద్భుత సృష్టి ఆడవాళ్లు నిజమైన ఆనవాళ్లే. మగువ పలికించినన్ని భావాలు మగవాడు వ్యక్తపరచడానికి మాటలు కూడా చాలవు. విభిన్నమైన అంశాల పట్ల మగువలకు చాలా నిగూఢమైన అభిప్రాయాలు, ముద్రలు మనోఫలకంపై ముద్రించబడి ఉంటాయి. సందర్భానుసారం అవి కొద్దోగొప్పో వారి హావభావాల ద్వారా వ్యక్తమవుతుంటాయి.. బయటకు వ్యక్తపడని మరెన్నో భావాలు.. అలా అంతర్లీనంగా ఎవరూ స్పృశించడానికి అంతుచిక్కని అద్భుతమైన పార్శ్యాలుగా ఆవిష్కృతం కాకుండా మిగిలిపోతూనే ఉంటాయి. పాపం మగవాడు బయటకు వ్యక్తమయ్యే ఆ కొద్దిపాటి భావాలతోనే మగువ మనసు లోతుని అంచనా వెయ్యాలని ఆపసోపాలు పడతాడు. కొందరైతే సముద్రం లాంటి మగువ మనసు నుండి బయటకు తొంగిచూసే ఆ కొద్దిపాటి భావాలను సైతం ఒడిసిపట్టే నైపుణ్యత లేక.. అద్భుతమైన మగువ మనసు యొక్క మొదటి పుటనే చదవలేక మొండిగా జీవిస్తుంటారు. తనని గెలుచుకున్న మగవాడికి బంధీ అయి అతని రక్షణలో సేదదీరాలని మగువ మనసు ఉవ్విళ్లూరుతుంటుంది.. కానీ మగవాడు తాను గెలుచుకున్న వనితని కట్టు బానిసని చెయ్యాలని చూస్తుంటాడు. నిలువెల్లా ప్రేమతో తనను తాను అర్పించుకున్న మగువ మనసు లోతులను తడిమిచూసే నైపుణ్యత లేక.. మగువ తనని తాను మరిచిపోయి మగవాడి సాన్నిహిత్యంలో సేదదీరే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఆమె మనసులో ప్రేమను పాదుకొల్పవలసింది పోయి భౌతికంగా ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తాడు మగవాడు. రెండు మనసుల మధ్య పెనవేసుకుపోవలసిన అలౌకికమైన అనుబంధం బిగిసీ బిగియకముందే సన్నగిల్లడం మొదలవుతుంది. తమ భాగస్వామి మనసు పుటలను చదివి ఒకరికొకరు తన్మయత్వంతో మునిగితేలే అదృష్టం ప్రపంచంలో ఏ కొద్ది జంటలకో ఉంటుంది. మిగిలిన వారంతా ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ అది మనసు పై పొరల్లో సున్నితమైన కుటుంబ సంబంధాల కోసం, దాంపత్య సౌఖ్యం కోసం, సామాజిక అవసరాల కోసం ఒక నిర్థిష్టమైన ప్రమాణం వద్ద తమ భావాలను స్థిరీకరించుకుని ఇరువురు భాగస్వాములూ సమన్వయంతో సాగించే ప్రయాణమే. మగువల మనసుల్లో అంతర్లీనంగా ప్రవహించే భావాల ప్రవాహంలో తానూ మునిగితేలుతూ అంతటి అపూర్వమైన ప్రేమని మనసారా ఆస్వాదిస్తూ ఆ మగువ మనసులో మగవాడూ మమేకం అయినప్పుడే జీవితం అద్భుతమైన ప్రణయకావ్యం అవుతుంది.

నేను సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు చూస్తాను. అలా కొద్దిరోజుల క్రితం జోధా అక్బర్ సినిమా చూసేటప్పుడు నటీనటుల హావభావాలు నా మనసులో రేకెత్తించిన అలజడులు ఇది రాయడానికి ప్రేరణగా నిలిచాయి.

- నల్లమోతు శ్రీధర్

7 వ్యాఖ్యలు:

జ్యోతి

నిత్యం వైరస్‍లు, సాఫ్ట్ వేర్లు, బగ్‍ల మధ్య కాలం గడిపే సాంకేతిక నిపుణుడికి ఆడవారి మనసు, హావభావాల గురించి కూడా తెలుసన్నమాట. గుడ్. శ్రీధర్ కంఫ్యూటర్ స్క్రీన్ నుండి అప్పుడప్పుడు మీ ఆవిడను కూడా చూస్తున్నావా లేదా. ఇంకా ఎన్నెన్నో నీకు తెలియని రహస్యాలు తెలుసుకోవచ్చు.. సరేనా?

Gujarat Postal Trekkers

నిన్ననే కదా ఈ సినిమా చూశారు. అయినా.. స్త్రీ మనసు మీద ఇంత లోతుగా విశ్లేషిస్తారనుకోలేదు. శ్రీధర్ గారు మీరింకా ఎన్నో ఇలాంటి సినిమాలు చూడాలని కోరుకుంటున్నాం...సరేనా? (జ్యోతి గారు ఎందుకైనా మంచిది శ్రీధర్ గారికి ఓ సారి హెల్త్ చెక్ అప్ చేయిద్దాం)
:)

రాధిక

ఇది కంప్యూటర్ ఎరా సంపాదకీయం లో ప్రచురించండి.మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

కొత్త పాళీ

రెండు ప్రతిపాదనలు.
శ్రీధరు గారు ఇకనించీ కనీసం నెలకో సినిమా అయినా చూడాలని ప్రతిపాదిస్తున్నాను.
రెండు .. పనిలో పని. ఎలాఊ ఇంత దూరం వచ్చారు కాబట్టి బాబ్బాబు మీ పుణ్యవుంటుంది, కాస్తా ఆ ఆడదాని మనసుకి ఒక మంచి డిక్షనరీ .. అందరు మగవాళ్ళకీ అర్ధమయ్యే తెలుగులో .. :)

జ్యోతి

కొత్తపాళిగారు,

శ్రీధర్ కొత్త సినిమా మంగతాయారు టిఫిన్ సెంటర్ కూడా చూసాడు. మరి మగాళ్ళందరికి అర్ధమయ్యే సింపుల్ విధానంలో ముమైత్ ఖాన్ గురించి , ఆ సినిమా గురించి రివ్యూ రాయమంటారేంటి??/ :)

nuvvusetty

శ్రీధర్ గారూ! కంప్యుటర్ ఎరా లోపల సాంకేతిక విషయాలకి,ముందు పేజీ లో మీ సంపాదకీయానికీ ఎప్పుడూ ఓ చక్కని గీత గీసే ఉంటుంది.
మొదటిది పూర్తిగా సాంకేతికం ఐతే రెండోది మానవత్వం,సామాజికం.అందుకే ముందుగా మీ సంపాదకీయాలు చదువుతాము ఏమి రాశారా ?అని.వాటిలో అంతర్లీనంగా మీ మానసిక అంతర్మధనం,అలజడి కనిపించి మెప్పిస్తాయి.సినిమాని సినిమాగా వదిలేయక నాయిక లక్షణాలను ,అందరినీ మెప్పించే ఓ మంచి లక్షణాలున్న స్ర్తీ కి అన్వయించి కళాత్మకమైన దృష్టి తో మీరు వ్రాసిన ఈ టపా మీలోని మూడో కోణాన్నిబయటపెట్టింది.అంత అందమైన భావావేశంలోనూ అందమైన స్ర్తీ తత్వం పై కొద్దిమంది మానసిక కురూపులు ప్రదర్శిస్తున్న అభిజ్యాత్యపు పోకడలకు సున్నితంగా చురకలేసి మీ లోని సమాజ నిబద్దతను సైతం తృప్తిపరిచారు.కొత్తపాళీ గారు చెప్పినట్లు మీరు మరిన్ని మంచి సినిమాలు చూడాలని కోరుకుంటూ.....

నిషిగంధ

చాలా మంచి వ్యాసం శ్రీధర్ గారూ!! ఇప్పటికే 3 సార్లు చదివాను.. అర్ధం కాక కాదు, బాగా నచ్చేసి! చాలా మంది భార్యాభర్తలు అన్యోన్యంగా కనబడటానికి కష్టపడతారు.. అదే శ్రమ అన్యోన్యంగా ఉండటంలో చూపిస్తే బావుంటుంది కదా!

:))) జ్యోతి గారూ @'మంగ తాయారు టిఫిన్ సెంటర్ '

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008