Saturday 5 April 2008

వాలు జడ _ మల్లెపూల జడ


" ఓ వాలు జడ!! మల్లె పూల జడ !! సరసాల జడ !! సత్యభామ జడ



అందమైన భామను అందునా బాపు బొమ్మను వాలు జడ లేకుండా ఊహించుకోగలమా?? ఐనా ఈ రోజుల్లో అమ్మాయిలకు చదువుతో పాటు బద్ధకం కూడా ఎక్కువైంది. ఫ్యాషన్ వెర్రి ఎక్కువైంది. పొడుగు జడల అమ్మాయిలు కనపడడమే అరుదైపోయింది. గుర్రం తోకలా ఒక రబ్బర్ బ్యాండ్ కట్టి వదిలేస్తారు తమ బెత్తెడు జుట్టును. ఈ జడలోని అందాలు, అది చేసే ఆగడాలు ఈనాటి అమ్మాయిలు తెలుసుకోలేకుండా ఉన్నారు. వాలు జడతో వయ్యారంగా కొట్టినా అది తన మీద ప్రేమే అనుకుని వెంట పడతారు కుర్రాళ్ళు. ఇక కొత్త కాపురంలో వాలు జడ అప్పుడప్పుడు సరసానికి, చిలిపి యుద్ధానికి కూడా సై అంటుంది. నాగుబాములాంటి జడలు ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి. అంత ఓపిక ఎవరికుంది. ఆ వాలు జడని ఇక పూలతో అలంకరిస్తే. దాని సౌందర్యం ఆస్వాదించేవారికే తెలుస్తుంది . పెళ్ళిలోకూడా పూలజడ వేసుకోవడం బరువైపోతుంది ఈ నాటి అమ్మాయిలకు. ప్చ్…..




ఈ సోదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా?? చిన్నప్పుడు వేసవి వచ్చిందంటే చాలు మల్లెపూలు, పూల జడ అలవాటు. పూలజడ వేసుకోవడం పెళ్ళితోనే అంతమైనా ఆ మధుర జ్ఞాపకాలు ప్రతి వేసవిలో వెంటాడుతూనే ఉంటాయి. అలా అని ఇప్పుడూ వేసుకోమని అనకండి. ఒక్కతే కూతురుగా పుట్టడంలో ఉన్న మజానే వేరు. అన్ని రాజభోగాలే. అమ్మ చేసే అలంకారాలు అన్నీ మనకే. చెప్పొద్దు కాని మా అమ్మ నాకు చిన్నప్పటినుండి గురువులా అన్నీ నేర్పేది. ముఖ్యంగా తెలుగులో చదవడం, ఏదైనా నేర్చుకోవడం. వంట దగ్గర అంటే కాస్త కాస్త సాయం చేయడం వరకే. మార్కెట్లో కనబడిన కొత్త డిజైన్ ఫ్రాకులు, డ్రెస్ లు కుట్టేది . మల్లె పూలు మొదలయ్యాయంటే చాలు కనీసం మూడు నాలుగు సార్లైనా పూల జడ వేసుకోవాల్సిందే. కొన్నది కాదు. విస్తరాకు మీద కుట్టి జడకు అతికించింది కాదు. అచ్చంగా నా జడకు డైరెక్టుగా కుట్టాల్సిందే.పూలజడ వేసుకునే రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండేది. త్వరగా వంట పని, ఇంటీ పని పూర్తి చేసుకుని అమ్మ హోల్‍సేల్ మార్కెట్టుకు వెళ్ళి గట్టివి, పెద్దవి అయిన మల్లె మొగ్గలు ఓ అరకిలో, కనకాంబరాలు, దవనం, కొనుక్కుని వచ్చేది. ఇక మా అమ్మ స్నేహితులు వచ్చి , ముచ్చట్లాడుకుంటూ చీపురు పుల్లలకు మొగ్గలు గుచ్చి ఇస్తే సవరం పెట్టి గట్టిగా అల్లిన నా జడకు కుట్టడం. ( నా జడ కూడా బారుగా నడుము వరకు ఉండేది లెండి.) నేను అసహనంతో కదిలితే ఓ మొట్టికాయ వేయడం. అటు ఇటూ తిరిగే మా తమ్ముళ్ళు నన్ను ఏదో ఒకటి అంటూ గేళి చేయడం. కనీసం మూడు గంటలు కూర్చుంటే కాని జడ పూర్తయ్యేది కాదు. ఇక సాయంత్రం , పట్టులంగా వేసుకుని, అమ్మ నగలు పెట్టుకుని ఫోటో స్టూడియోకెళ్ళి వెనకాల అద్దం పెట్టి మరీ ఫోటో దిగడం. (అద్దం ఉన్న స్టూడియో కోసం తిరిగేవాళ్ళం ) అదో ముచ్చట. నా పుట్టినరోజునాడు కూడా పూల జడ వేసుకోవాలి. లేదా స్కూలుకు బోలెడు మల్లెపూలు పెట్టుకుని వెళ్ళాలి అనీ చాలా కోరికగా ఉండేది. కాని డిసెంబర్ లో చామంతి పూలు వచ్చెవి. దానితో పూలజడ అంటే చచ్చిపోను బరువుతో. అందుకే నా పుట్టినరోజును హాయిగా ఎండాకాలంలో ఎందుకు రాదో అని తిట్టుకునేదాన్ని చిన్నప్పుడు. ఆ పూలవాసన మూడు నాలుగు రోజుల వరకు వెంట్రుకలను వదిలేది కాదు



.



పెద్దయ్యాక అంటే ఇక పెళ్ళిలోనే పూలజడ వేసుకోవడం. ఎంగేగ్‍మెంట్ కి మా నాన్న రెడీమేడ్ పూలజడ తెప్పిస్తా అంటే కూడా , మా అమ్మ తనే పూలజడ కుట్టింది. అంత బిజీలోనూ, ఇంటినిండా చుట్టాలున్నా కూడా. ఇక పెళ్ళిలో ఐతే పొద్దున్న ఒక డిజైను , రాత్రికి ఒక డిజైను పూలజడ . ఓహ్. ఆ ఆనందమే వేరు. అప్పుడప్పుడు పెళ్ళి ఫోటోలు చూస్తుంటే అప్పటి ఆ మల్లె పూల పరిమళం అలా లీలగా తేలి వస్తుంది. ఇక చివరిగా నేను పూలజడ వేసుకున్నది శ్రీమంతానికే. ఇక మళ్ళీ నేను పూలజడ కుడతానో లేదో అని అమ్మ తన ఇష్టంతో పూలు తెచ్చి మరీ వేసింది. అలా నాకు అలవాటై మా అమ్మాయికి , మాకు తెలిసినవాళ్లకి కూడా పూల జడ వేసేదాన్ని. కాని ఈ కాలంలో అది కరువైపోయింది, బరువైపోయింది.. Old is Gold అని ఆ పూలజడ , పట్టు పరికిణీ, బుట్ట చేతుల జాకెట్టు వేసుకున్న అమ్మాయిలను చూసే రోజు వస్తుందంటారా??

7 వ్యాఖ్యలు:

krishna

కోరికున్నా తీరికలేదు.దానికి తోడు దేశాలు పట్టి తిరుగుతున్నాం కదా పాపం జుట్టుకు కూడా కష్టంగా వుంటోంది మాటిమాటికి అలవాటుపడ్డానికి గాలికి,నీటికి.
అందుకే బారెడు జుట్టు జానెడాయె.

శాంతి

దురదృష్టవశాత్తూ వెంటనే చూడడం అవదు. ఐతే ఒకటి.. మీరు ఈ మధ్య హైదరాబాద్ లో వాళ్ళని చూసి, చూసి అలా అనుకుంటూ వున్నారేమో.. మా వూరిలో (అమలాపురం దగ్గర లెండి) మల్లె పూల సీజన్ లో ఎప్పుడూ తారస పడుతూనే వుంటారు..
మీకు ఎవరూ కనిపించకపోతే ముచ్చటగా ఆ ఫోటో లో వున్నా అమ్మాయినే చూసేసుకోండి :).

Anonymous

"ఆ పూలజడ , పట్టు పరికిణీ, బుట్ట చేతుల జాకెట్టు వేసుకున్న అమ్మాయిలను చూసే రోజు వస్తుందంటారా??
తప్పకుండా!
మీ కోడలికో, మనవరాలికో మీరు కుట్టరా?! అవకాశం ఉంటే:)

జ్యోతి

నెటిజన్ గారు,

నా కోడలికి ఏమో గాని చెప్పలేనండి. మనవరాలికి ఓకె.
ఈ పోస్టులో ఉన్నది చిన్న పాప మా అమ్మాయే.. ఒకసారి దసరా పండగకు పూలజడ వేసానని అద్దం ముందు నిలబెట్టి ఫోటొ తీసా. ఇప్పుడు మల్లెపూలు పెట్టుకోమంటే తాడేపల్లిగారన్నట్టు పేలు వస్తాయి అంటుంది. ఇంకా పోనీటెయిల్ . hmmmm...

Unknown

భలే! వాలుజడ నాకూ ఇష్టమే...
కానీ నాకు క్యూటుగా ఉండే బాబ్డ్ కట్ కూడా ఇష్టమే :)

విహారి(KBL)

ఉగాది శుభాకాంక్షలు

Unknown

సంతోషమండీ. నాకెప్పుడొ చిన్నప్పుదు పూలజడ వేశారు. నన్నలా కూర్చోబెట్టి గంటలు గంటలు కుట్టారు. ఆ దెబ్బకి మళ్ళీ పూలజడ జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వేసుకోవాలని బాగా ఇష్టంగా ఉన్నా, ఎలా వేసుకోవాలో నాకు తెలీదు. పూలజడలో రకాలుంటాయంట. మీకు తెలిస్తే చక్కగా ఎలా వేసుకోవచ్చో వీడియో చేయండి, కుదరకపోతే కనీసం ఫోటోస్ తో ఆర్టికల్ అయినా రాయండి. మీకు ఋణపడి ఉంటాం కానీ.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008