Thursday 10 April 2008

జో అచ్యుతానంద .....



జో అచ్యుతానంద జో జో ముకుందా

రావె పరమానంద రామగోవిందా..



నందునింటను జేరి నయము మీరంగ

చంద్రవదనలు నీకు సేవ చేయంగ.
నందముగ వారిండ్ల నాడుచుండంగ

మందలకు దొంగ మాముద్దురంగ.




పాలవారాశిలొ పవళించినావు

బాలుగా మునుల కభయమిచ్చినావు

మేలుగా వసుదేవు కుదయించినావు

బాలుడై యుండి గోపాలుడైనావు.




అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే

పట్టికోడలు మూతిపై రాసినాడే

అట్టె తినెనని యత్త యడుగవిన్నాడే

గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే.



గొల్లవారిండ్లకును గొట్బునకు బోయి

కొల్లలుగా త్రావి కుండలను నేయి

చెల్లునామగనాండ్ర జెలగి శాయి యీ

చిల్లతనములు జెల్లునట వోయి.



రేపల్లె సతులెల్ల గోపంబుతోను

గోపమ్మ మీ కొడుకు మా యిండ్లలోను

మాపుగానే వచ్చి మా మానములను

నీ పాపడే చెఱచె నేమందుమమ్మ.



ఒకనియాలిని దెచ్చి నొకని కడబెట్టి

జగడముల కలిపించి సతిపతుల బట్టి

పగలు నలుజాములును బాలుడైనట్టి

మగనాండ్ర జేపట్టి మదనుడై నట్టి.




అంగజుని గన్నమా యన్న యిటు రారా

బంగారు గిన్నెలో బాలు పోసెరా

దొంగనీవని సతులు పొంగుచున్నారా

ముంగిటనాడరా మోహనకారా.




గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి

కావరమున నున్న కంసుబడగొట్టి

నీవు మధురాపురము నేలజేపట్టి

ఠీవితో నేలిన దేవకీ పట్టి.



అంగుగా దాళ్ళపా కన్నయ్య చాల

శృంగార రచనగా జెప్పె నీ జోల

సంగతిగ సకల సంపదల నీవేళ

మంగళము తిరుపట్ల మదనగోపాల.

1 వ్యాఖ్యలు:

దైవానిక

అక్కా, పాట వినాటానికి లంకెలు వేస్తె ఇంకా బాగుంటది కదా.. కొన్ని లంకెలు ఇవిగో,
బొంబాయి సిస్టర్స్ - http://www.musicindiaonline.com/p/x/
l4I2C.tQu9.As1NMvHdW/

బాలమురళికృష్ణ - http://www.musicindiaonline.com/p/x/
q4v2KKtdFt.As1NMvHdW/

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008