Thursday 17 April 2008

క్రేజీ కాంబినేషన్స్

సాధారంగా అన్నం, పప్పు, వేపుడు, రసం, ఖుర్మా, ఇడ్లీ , దోస, బర్గర్, పిజ్జా లాంటివి అందరూ తింటుంటారు. ప్రతి ప్రాంతానికి భోజన పద్ధతులు, రుచులు వేరు వేరుగా ఉంటాయి. ముందు అన్నం లో పప్పు కలుపుకోవాలి, వేపుడు ఎక్కువ తినకూడదు, చివర్లో పెరుగన్నం తప్పకుండా తినాలి అని అమ్మలు చెప్తుంటారు. కాని అప్పుడప్పుడు కాస్త వెరైటీగా, క్రేజీగా తింటే . లేదా అప్పుడప్పుడు మనకు నచ్చిన కాంబినేషన్లు మనమే చేసుకుంటే మనను ఎవడూ తన్నడానికి రాదు . రైట్. సో నాకు నచ్చిన కొన్ని క్రేజీ కాంబినేషన్స్ చెప్తున్నాను. ఎవరు ఏమన్నా, చీ అన్నా, చా అన్న నేను మాత్రం అప్పుడప్పుడు ఇలా తినడానికే ఇష్టపడతాను. కంటి ముందు ఎన్నో రకాల కూరలు గట్రా ఉన్నా కూడా.




పూరీలు కాస్త ఎర్రగా కాల్చుకుని వేడి టీలో ముంచుకుని తింటే,, ఏ స్టార్ హోటల్ బిస్కిట్లు, బ్రేక్ ఫాస్ట్లు పనికిరావు.


ఇక ఎండాకాలం వచ్చిదంటే మన పంట పండినట్ట్లే. మామిడి పండ్ల పానకం తయారు చేసి చల్ల పెట్టెలో పెట్టి . మండే ఎండాకాలంలో ,జిల్లుమనే పానకంలో వేడి పూరీలు కాని, చపాతీలు కాని ముంచుకుని తింటే నా సామిరంగా ఆ మజాయే వేరు!!!

ఇక మామూలు కూరగాయలు అవి బోర్ కొట్టి , తినాలనిపించకపోతే,, పెరుగన్నంలో అప్పడాలు చిదిమి కలుపుకుని అవి మెత్తబడకముందే తినేయడం. లేదా పెరుగన్నంలో ఆవకాయ నంజుకుని తినడం. ఇంకా వేడి అన్నం, పచ్చిపులుసు పెరుగు కలిపి తింటే !.. అబ్బా!!!!!!

ఇక వేసవిలో ముఖ్యమైనది ఆవకాయ. కొత్తావకాయ పెట్టగానే అన్నీ జాడీలోకి పెట్టేసాక , కొంచం తీసి పక్కన పెట్టుకుని రాత్రికి వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ , నూనె వేసుకుని (నెయ్యి వేస్తే చప్పబడిపోతుంది) తినడం. చివర్లో కొద్దిగా పెరుగు తింటే కారం గీరం జాన్తా నై.

నాలాంటి పిచ్చోళ్ళు ఉన్నారా ???

36 వ్యాఖ్యలు:

శ్రీనివాస

అవును వేసవిలో మా ఊరెళ్ళినప్పుడు మావాళ్ళు ఆవకాయ పట్టేటప్పుడు నేను అక్కడే తిరిగేవాడిని;
ఒక్కసారే లటుక్కున కొన్ని తీసుకుని పరిగెత్తేవాడిని.

నిషిగంధ

జ్యోతి గారూ, పెరుగన్నంలో అప్పడాలు చిదుముకుని తినడం నాకూ చాలా ఇష్టం :)

SD

పప్పు ముందు తినాలి అనేవాళ్ళకి సమాధానం: అలాగని ఏ వేదం చెప్తోంది? నేనెప్పుడూ ఆవకాయ/కందిపొడి తో స్టార్ట్ చేస్తాను. పనిలో పనిగా ఇదిగూడా చెప్పనివ్వండి. పెరుగులో అప్పడాలు కాదుగానీ చారులో ట్రై చేయండి.
kathalukakarakayalu.blogspot.com

యడవల్లి శర్మ

నాకు నచ్చే కొన్ని కాంబినేషన్లు..

1.కమ్మపొడి అన్నంలో కలిపి గుండ్రటి ముద్ద చేసి..కంచంలో పక్కన ఆవకాయనూనె వేసుకొని..దానిలో ముంచుకొని తింటే..ఆహా...
2.చల్లపులుసులో కొత్తిమీర.. పచ్చిమిరపకాయ... ఆహా...
3.కందిపచ్చడిలో ఆవకాయ కలిపి తింటే..చెప్పలేం..

4.పెసరపచ్చడిలో మాగాయ..అదుర్స్..

5.ఉత్తపప్పులో గోంగూర పచ్చడి..

6.గోంగూర పచ్చడిలో..ఉత్తపప్పు

7.ఉత్తపప్పులో ఆవకాయ...

8.వీటన్నిటికి మించిన జత.. చల్లటి పెరుగన్నం కలిపి వేడి వేడి సాంబారు గరిటలో తీసుకొని కొంచెం వేసుకొని వెంటనే తిని మళ్ళీ ప్రతి ముద్దకి అలాగే చేస్తే...దాని ముందు అమృతం..ఏ మాత్రం సరిపోదు..

-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

రాధిక

పెసరట్టు,దోసల లో పెరుగు
బోలెడు వేరుశనగ చట్నీలో చిన్న ఇడ్లి
ఉప్మాలో వేడి సాంబారు,చల్లని పెరుగు
పప్పు+నెయ్యి+అవకాయ+చారు
ఏ పప్పుకాంబినేషన్ అయినా అప్పడాలు,వడియాలు
మజ్జిగ చారులో చల్ల మీపకాయ

Rajendra Devarapalli

పెరుగన్నం లో చికెన్ కూర
సాంబారులో చికెన్/మటన్/చేప ముక్కల నంజుడు
పప్పుచారు-ఉప్పు చేప కాంబినేషన్ జగద్విఖ్యాతం
బీరకాయ-రొయ్యలు
పాలకూర-రొయ్యలు
ఎండు చేపలు-వంకాయ/గోంగూర/దోసకాయ
పచ్చిమిరపకాయల పచ్చడి/ఉల్లిపాయ/ఉడకబెట్టిన కోడిగుడ్డు
ఇడ్లి-చేపలపులుసు-తమిళనాడు ఇష్త్టైల్లో
చపాతి/పరాఠా/దోశ--పాయా తో
సాంబారు-కందిపొడి-అప్పడం
పప్పుచారు-ఎరగారపు పచ్చడి-ఆమ్లెట్టు

అబ్బో బోలెడున్నాయి

Raj

రాధికగారి ఒక కాంబినేషన్ నా ఫేవరేట్, బోలెడంత వేరుశెనగ చట్నీలో ఇడ్లీ. ఒక చిన్న ఇడ్లీ ముక్క తుంచి దాన్ని చట్నీలో ముంచి ముంచి తినటం నా హాబీ. ఇప్పుడు ఇడ్లీ తిని సంవత్సరంన్నర అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు అలా తింటానో? మ్చ్.

రామ

హ హ్హ హ్హ.. "బోలెడంత వేరుసెనగ చట్నీ లో ఒక 'చిన్న' ఇడ్లి.." నేను, శాంతి ఇంకా నవ్వుతున్నాము :).
నా ఫేవరెట్లు:
చారు (మిరియాలతో నోరు అంటుకునేలా) - దొండకాయ వేపుడు
చారు (పై లాగే) - అరటి కాయ వేపుడు
ఆవకాయ అన్నం - వంకాయ పచ్చడి
(నన్ను ఆపకండి :) )
పెరుగు అన్నం - చేమ వేపుడు (కారం గా)
పెరుగు అన్నం - బంగాళ దుంప వేపుడు
ఆవకాయ అన్నం - పెసర పిండి (అది తింటున్నప్పుడు పెసర పిండి వల్ల ఘోట్రు వచ్చి దగ్గు వచ్చిన సరే).

యామజాల సుధాకర్

నాకైతె
చారు లొ టొమాటొ పప్పు
పెరుగు లొ మాగాయి
పెరుగు లొ టొమాటొ పప్పు
వేడి వేడి ఆవకాయ లొ గట్టి వెన్న
గోంగుర పచ్చడి లొ పచ్చి ఉల్లిపాయ
కందిపొడి లొ పూసల నెయ్యి
టొమాటొ పప్పు లొ పచ్చిమెరపకాయ కొరుక్కుని తినడం
మొ|| నాకు చాలా యిష్టం

జ్యోతి

వాహ్వా ! వాహ్వా! నా బ్లాగు ఘుమఘుమలాడిపోతుంది. నిజంగా మొదటిసారి నా టపా వల్ల ఎన్ని లాభాలో !! ఇవన్నీ కాంబినేషన్స్ ఎప్పుడెప్పుడూ మొదలెడదామా అని ఉంది. ..ఇంకా చూసి అన్నీ ప్రింట్ చేసి పెట్టుకుంటా.

కొత్త పాళీ

మీకందరికీ ఆశ కురుపుల్లేస్తాయి.
మండుతున్న జఠరాగ్నికి ఈ టపా, దాని కామెంట్లూ ఆజ్యం వాయువూ లాగ తోడయ్యాయి.
లంచి టైము ఇంకో ముప్పావు గంటకి కానీ రాదు!!!ప్చ్

krishna rao jallipalli

ఇక వేసవిలో ముఖ్యమైనది ఆవకాయ. కొత్తావకాయ పెట్టగానే అన్నీ జాడీలోకి పెట్టేసాక , కొంచం తీసి పక్కన పెట్టుకుని రాత్రికి వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ , నూనె వేసుకుని (నెయ్యి వేస్తే చప్పబడిపోతుంది) తినడం....
అవును.. ఘాటుకి కళ్ళలో నీరు కారుతున్నా.... ఎంత రుచి.

సత్యసాయి కొవ్వలి Satyasai

ఆహా నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారన్న మాట. నా కాంబినేషన్లు కొన్ని అవసరార్ధం, కొన్ని క్రేజీ తనం వల్ల... మా కేంటిన్లో కూరల్లో కారాలెక్కువవడంవల్ల వాడిచ్చిన కస్టార్డులో చపాతీలు నంజుకోవడం, తీపెక్కువ తినలేక బొబ్బటులో ఆవకాయనంజుకోవడం (పట్టుబడి నవ్వులపాలవడం), పల్లెటూరులో 5 నెలల ఆవాససమయంలో కాకా హోటల్లో ఏటిఫినైనా అక్కడ దొరికే ఏకైక సెనగ పిండి చెట్నీలో ముంచుకు తినడం, ఇడ్లీలు చెట్నీ లేకుండా తినలేక ఆవకాయ, పెరుగు, క్రీము, కారప్పూస ల్లాంటివి ఏది దొరికితే అవి కలిపి తినేయడం(దాని పేరు - ఇడ్లీ కషామిష), చేతిలో ఉన్న తినుబండారాలని టీ లో ముంచుకు తినడం - కొన్ని క్రేజీ కాంబినేషన్లు. కారప్పూస నీళ్లలో పోసుకుని తాగడం ఒక చిన్న పిల్ల చేస్తోంటే చూసా. :)))

Nagaraju Pappu

ముందుగా కొ.పాగారి ఆశకురుపులు మరికాస్త పెద్దవి చేయటానికి - బిట్టూర్ బ్రేక్-ఫాస్ట్ గుర్తుందా మాస్టారూ? కమ్మటి గడ్డ పెరుగులో వేడి వేడి జిలేబీలు? భలే ఉంటుంది. నాకైతే్ జిలేబీలు టీలో ముంచుకు తినడం అలవాటు. ఆపైన హొటల్లో ఇడ్లీలోకి ఇచ్చే సాంబారులో వాడిచ్చే కొబ్బరిపచ్చడి కలిపితే భలే రంజుగా ఉంటుంది. గారెల్లోకి పరమాన్నం, పప్పులోకి పెరుగూ, బొబ్బట్లలోకి మజ్జిగ పులుసూ..
అన్నిటికంటే, బఫేలకి పోయినప్పుడూ - రెండు స్కూపుల అన్నం, నాలుగు గరిటెల ఐసుక్రీమూ…

జ్యోతి

బాబోయ్ !! జిలేబీలు టీలో ముంచుకుని తినడం, అన్నంలోకి ఐస్‌క్రీం :( .. సత్యసాయిగారు, నాగరాజుగారివి అసలైన క్రేజీ కాంబినెషన్స్ . మరి పాకశాస్త్ర నిపుణులైన కొత్తపాళిగారేంటి అలా వెళ్ళిపోయారు.... మాస్టారు !మీరు ఎలాంటి ప్రయోగాలు చేయలేదా? అమెరికన్ , ఇండియన్ కలిపి..

Ramani Rao

ఎంటో ! ఇంతకాలం చూడకుండా నేనెలా మిస్ అయ్యానబ్బా ఈ టపా! అనిపించింది నాకు, నాకయితే.. వేసవికాలం లో పెరుగులో మామిడిపండు (పిల్లలికి కూడ పెట్టని గొప్ప తల్లిని నేను ఈ మామిడిపండు విషయంలో) లేకపోతే ముద్ద గొంతు దిగదంటే నమ్మండి. మిగతా కాలాల్లో అయితే అరిటిపండు. కాని, చాలమందికి నచ్చదీ కాంబినేషన్. ఇంకా... పప్పు లో నెయ్యి వేసుకొని ఆవకాయతో, అందులోకి నానిన మెంతిగింజలు పంటికంటగానే హ! చివరంచుల జన్మకే జీవం పుట్టదా అనిపించేంత బాహుంటుది.ఇహ పనసపొట్టు కూర వుంది చూసారు.. అది కనక వేడి వేడి అన్నంలో కలుపుకొని కాస్త నెయ్యి వేసామా.. అబ్బో జ్యోతిగారు! ఈ కాంబినేషన్ కధ చెప్పి భలే నోరూరించేస్తున్నారు.

Anonymous

ధనికొండ హానుమంత రావుగారు అవకాయలో పప్పు కలుపుకుని భోంచేసేవారంట!
పెరుగన్నంలోను, చారులోను కూడ నెయ్యి కలుపుకుని తినేవారున్నారు!
మరి అది మరీ సింపుల్ కాంబినేషన్ ఎమో మరి!లేదా ఆరోగ్య రీత్యా మంచిదో!

కొత్త పాళీ

నేను వంటలో తినడంలో చేసే అంతర్జాతీయ క్రేజీ కాంబినేషన్లు.
చైనీసు స్టర్ ఫ్రై చేస్తూ అందులో ఒక చెంచాడు గోంగూర పచ్చడో లేక ఆవకాయ పిండో కలిపెయ్యడం.
ఇదే పద్ధతి ఇటాలియను పాస్టాకీ కూడా. కాకపోతే దానిలో కలిపి వండలేము కాబట్టి పక్కన నంచుకోవడం.
పిజ్జా మీద కందిపొడి, కారప్పొడి, కరివేపాకు పొడి ఇత్యాదులు.
ఫ్రెంచి ఫ్రై లని మెయొనైజ్ లో అద్దుకుని తినడం - దీని జోక్ Pulp Fiction చూసిన వారికే అర్ధమవుతుంది.
పెరుగన్నంలోకి ఆమ్లెట్ నంచుకోడం.
వెజిటబుల్ సాలడ్ లో నారింజ తొనలు, సీజన్లో ఐతే రకరకాల బెర్రీ పళ్ళు.
ఏ రకమైన ఐస్ క్రీం అయినా దానిమీద కనీసం నాలుగు రకాల నట్లు .. walnut, pecan, almond, cashew ..
వి.వి. విద్యార్ధులుగా ఉన్నప్పుడు డబ్బుల్లేక పోతే అన్ని భోజనాలూ అన్ని పదార్ధాలూ బ్రెడ్డే .. సర్వం బ్రెడ్డు మయం! బ్రెడ్ ఉప్మా, పాలల్లో బ్రెడ్, బ్రెడ్ మీద ఆవకాయ, బ్రెడ్డూ టొమేటో పచ్చడి, బ్రెడ్డు కెచప్ .. ఇలా
నాగరాజు గారూ, ఆ జిలేబీ బ్రేక్ఫాస్ట్లూ, ఆ చిన్న బత్తాయి కాయల సైజు గులాబ్ జాములూ గుర్తు చేసి పూర్తిగా మూడ్ పాడు చేసేశారు సార్! :-)

Bolloju Baba

వామ్మో వామ్మో ఇన్ని కాంబినేషన్లా, ఈ పేజీ ప్రింటు తీసి మా ఆవిడకు ఇచ్చేస్తున్నా. లేక పోతే నా చిన్ని చిన్ని కాంబినేషన్లకే పేర్లు పెడుతుందా? హన్నా!

బొల్లోజు బాబా

సుజాత వేల్పూరి

బరువు తగ్గాలని నా పాట్లు నేను పడుతుంటే, జ్యోతి గారూ కందిరీగల తుట్టని కదిపారు. మిమ్మల్ని ఏమి చెయ్యాలి?

ఇవిగో నాకిష్టమైన కాంబినేషన్లు

గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ చక్రాలు
గుంటూరు స్పెషల్ పండుమిరప కాయల పచ్చడిలో కాచిన నెయ్యి
ధనికొండ వారిలాగానే (ఆయన మా బంధువేలెండి) పప్పులో కొత్తావకాయ!
పనసపొట్టు ఆవపెట్టిన కూర
కమ్మ పొడిలో కాచిన నెయ్యి
వేడి వేడి బొబ్బట్ట్లలో పూసల నెయ్యి.
మామిడి కాయ పెసరపప్పు పచ్చడి- అప్పడాలు
నిషిగంధ గారిలాగానే పెరుగన్నంలో అప్పడాలు
అప్పడాల పిండి -అన్నంలో కలుపుకుని తినడం
మిరపకాయ బజ్జీలు+మిర్చి/చింతపండు చట్నీ ఉంటే కిలో బంగారం నా ముందు పెట్టినా చూడను(సరుకు ఖాళీ అయ్యేదాక)

@రమణి గారు,
" పిల్లలకు కూడా పెట్టని తల్లిని..." బాగుంది!

Rajendra Devarapalli

గమ్మత్తేమిటంటే,ఈటపా చదివిన వారిలోకానీ,అసలు బ్లాగర్లలొకానీ,కామెంట్లురాసేవాళ్ళలోకానీ నేను ఒక్కడినే మాంసాహారిని కనిపిస్తున్నాను.ఇదొక గుర్తింపు అనుకోవాలి నేను:)

కొత్త పాళీ

@రాజేంద్ర .. సామెత ఉండనే ఉంది, మాంసం తిన్నామని ఎముకలు మెడఓ వేసుకుని తిరగము కదా! :)

Rajendra Devarapalli

@కొత్తపాళీ.అలాగంటారా గురూజి?:) తింటున్నారు కానీ చెప్పటానికి ఇబ్బందో,మొహమాటమో పడుతున్నారంటారు.పోన్లెండి

జ్యోతి

రాజేంద్రగారు, చెప్పడానికి ఇబ్బంది ఎందుకు. అందరు చాలా ఇష్టమైనవి చెప్పారు. అంటే అందులో శాకాహారమే ఎక్కువగా ఉంది అంటే . మాంసాహారం తిన్నాకూడా శాకాహారమే ఎక్కువ నచ్చుతుంది జనాలకు అని అర్ధం అన్నమాట. ఉన్నమాట.

Rajendra Devarapalli

అలాగే జ్యోతి గారు

కొత్త పాళీ

@రాజేంద్ర .. ఇంకో తమాషా గమనించండి. పాత తెలుగు సినిమాల్లో, నేను చూసినంతలో కులం బహిరంగంగా చెప్పిన చోట్ల కూడా మాంసాహార ప్రస్తావన, చిత్రీకరణ నేనెక్కడా చూడలేదు. మాయాబజారులో క్షత్రియుల వివాహభోజనానికి చేసిన విందులో ఒక్క మాంసం వంతకం లేదు. గుండమ్మ కథలో తాము కాపులం అని చెప్పుకూంటారు, కానీ ఎక్కడా మాంసాహారం ప్రస్తావన రాదు. భోజనాల సీన్లలో మాంసం కనబడదు, మిస్సమ్మలోనూ .. వాళ్ళు నాయుళ్ళం అంటారు .. ఇలాగే చాలా సినిమాల్లో. అఫ్కోర్సు దొంగరాముడులో రారోయి మా యింటికి పాట దీనికి మినహాయింపు.

Rajendra Devarapalli

నిజమే,గురువు గారు,నాకూ ఆ అనుమానమే ఉంది.బాపూరమణల పెళ్ళిపుస్తకం సినిమాలో.వనభోజనం పాటలో రాజేంద్రప్రసాద్.కక్కలు,ముక్కలు,ఫిష్ కబాబులు అంటుండగా గుమ్మడి,రావికొండలరావూ ష్ అని వారిస్తారు.మీరు గమనించారా?ఇంతకీ అసలు ప్రశ్నకు సమాధానం దొరక లేదు.

మాలా కుమార్

చివరి రెండు ఆవకాయవి అయితే మేమూ చేస్తాం.
ఇంకా కొత్త అవకాయ కలిపిన బేసన్ లోనే వేడన్నం కలుపుకొనితింటే ఇంకా అదుర్స్.
ఇంకా పెరుగన్నం లో చెరుకురసం మామిడి పండు జుర్రుకుంటూ తినటం (పక్క వాళ్ళ మీద పడితే అది వారి కర్మ)

Surya Mahavrata

చుక్కా రొట్టి, లస్కోరా / కోవా కాంబినేషను ఎవరూ ట్రై చెయ్యలేదన్నమాట. అలాగే చల్ల బూరీ బెల్లపుటావకాయీ కూడా.

భావన

ఇన్ని కాంబినేషన్లా? చుక్కా రొట్టి, లస్కోరా / కోవా కాంబినేషను..!!!!!
నేను ఎప్పుడు వినను కూడా వినలేదు.. సూపర్ జ్యోతి మీరు. మాంచి ఎండాకాలం మధ్యాన్నం,.. డిప్ప లో కొత్త ఆవకాయ కలిపేక గుజ్జు తో అన్నం కలిపి మా అమ్మ ముద్దలు పెడూతుంటె అది ఎండ వేడో, లేక ఆవ పిండి ఘాటో, ఆనంద భాష్పాలో, అయోమయపు కన్నీళ్ళో తెలియని రోజు లన్ని గుర్తు వచ్చాయి..

kanthisena

జ్యోతి గారూ,
నేను మీ బ్లాగులో ప్రత్యేకించి ఇలాంటి వంటల కథనాలను చదవడం పూర్తిగా బంద్ పెట్టాలనుకుంటున్నానండీ, చూస్తూంటేనే నా సామిరంగా అని నోరూరేలా రాశారే.. వీటిలో కనీసం ఒకటన్నా నాకు ఉపయోగపడేది ఉందా?

"ఎర్రగా కాల్చిన పూరీలు వేడి టీలో ముంచుకునీ..."
"జిల్లుమనే మామిడిపళ్ల పానకంలో వేడి పూరీలు కాని, చపాతీలు కాని ముంచుకుని.."
ఆ ఆవకాయ ముద్ద ప్లేట్లో చూస్తుంటేనే నా సామిరంగా అనిపిస్తోంది.
వీటిలో పెరుగన్నం తప్ప ఒక్కటన్నా నేను తినగల పదార్ధం చేసి పోస్ట్ చేశారా మీరు?

ఇప్పుడు చెప్పండి.. మీ బ్లాగ్ నేనెందుకు చూడాలి.

చూసి టెంప్ట్ అయిపోయి బీపీ, షుగర్ రోగులు తినకూడని పదార్ధాలను చూసి నోరు ఊరించుకోవడమే కాక ఎక్కడైనా దొరికితే తినేస్తే తర్వాత మా లాంటి వారి పరిస్థితి ఏమిటి?
పాత్రల్లో ఆ వంటకాలు చూస్తుంటే ఇక్కడ జిహ్వ ఎక్కడికో లాగేస్త్తోంది.
అద్భుతంగా వంటకాలు రాసి, చూపించారు. మరి నా విషయం ఏమిటి? నాలాంటి బీపీ, షుగర్ రోగుల విషయం ఏమటి? మీకు న్యాయంగా ఉందా?

జ్యోతి

రాజుగారు,

ఈ టపా రెంఢేళ్ల క్రింద అనుకోకుండా ఒక మిత్రుడితో జరిగిన వాదసంవాదం మూలంగా రాయక తప్పలేదు. ఇక మీ సంగతి అంటారా?? ఒక్క హామీ మాత్రం ఇవ్వగలను. షడ్రుచులులో త్వరలో ఆరోగ్యానికి సంబంధించిన వంటకాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు మీరు ఎటువంటి ఆరోపణ చేయరనుకుంటా.. :)

శోభ

కొత్తావకాయ పెట్టగానే అన్నీ జాడీలోకి పెట్టేసాక , కొంచం తీసి పక్కన పెట్టుకుని రాత్రికి వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ , నూనె వేసుకుని (నెయ్యి వేస్తే చప్పబడిపోతుంది) తినడం. చివర్లో కొద్దిగా పెరుగు తింటే కారం గీరం జాన్తా నై.

నాలాంటి పిచ్చోళ్ళు ఉన్నారా ???

ఉన్నారండీ.. వాళ్ళలో నేనూ కూడా ఉన్నా.. చూస్తుంటేనే నోరూరిపోతోంది...

Unknown

మనవాళ్ళు భోజనప్రియులు అనడానికి ఈ టపా నే నిదర్శనం అనుకుంటా. అంతే లేండి కోటివిద్యలు కూటి కొరకే అని కదా, మరి నా కాంబినేషన్స్ కూడా తిలకించండి ...
పెరుగు అన్నం లోకి ముద్దపప్పు
ఇడ్లి లోకి చారు
దోసెలు బెల్లం పులుసు
పెరుగు అన్నం బెల్లం ముక్క లేకపోతె ఏదయినా స్వీట్
పులిహోర బంగాళదుంప కుర్మా
పులిహోర కొబ్బరి పచ్చడి ( అదే ఇడ్లీలు దోసేల్లోకి వేసుకున్టామే అది)
అమ్మో ఇంకా చాలానే వున్నాయి ......

Uma Jiji

బి పి లు డైయబెటిస్ వాళ్ళు గోధుమ రవ్వ అన్న౦ లో గాని, కీన్వా అన్న౦ లో గాని పైన చెప్పిన అధరువులన్నీ కలుపుకుని ఎ౦చక్కా చెయ్య౦తా రుచి చూస్తూ అన్న౦ లాటి ఆహార౦ తీసుకోవచ్చు. పైగా పుళిహోర, ఉప్మా కూడా చేయవచ్చు ఆ పదార్థాలతో, జమా జ౦..

ప్రియ

నాకైతే ఆవకాయ ముద్ద చుస్తేనే నోరు ఊరుతోంది ...మా మేనత్తా ఐతే బిర్యాని లో ఆవకాయ నంచుకుని తింటుంది ...మా తాతయ్య పెరుగులో బూంది వేసుకుంతి తెనేవారు నేనైతే గోంగూర పచ్చడిలో పచ్చిమిర్చి నంచి తింటా...మా అత్తగారు ఆవకాయ్ కలిపిన తర్వాత ఆ పళ్లెం లోనే వేడి అన్నం కలిపి పెడతారు ..ఫస్ట్ ముద్ద నాకే ..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008