Monday, April 28, 2008

ఇంట్లోనే గ్రంధాలయం

నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేసింది మా అమ్మే. క్లాసు పుస్తకాలే కాకుండా తప్పనిసరిగా చందమామ కొనేది పేపర్‌తో పాటు. ముందు సింగిల్ పేజీ కథలు చదువుతూ మెల్లిగా సీరియల్స్ చదివేదాన్ని. పాత పేపర్లవాడు వచ్చినప్పుడు చందమామల్లోని సీరియల్ కథలన్ని కట్ చేసి ఇస్తే అమ్మ ఒక పుస్తకంలా కుట్టి పెట్టేది. అలాగే పుస్తక ప్రదర్శనలు జరిగినప్పుడు కథల పుస్తకాలు, రష్యన్ పుస్తకాలు కూడా. స్కూల్లో ఎలాగూ ఇంగ్లీషు పుస్తకాలే ఉంటాయని ఎక్కువగా తెలుగు పుస్తకాలే కొనేది అమ్మ. కాస్త పెద్దయ్యక illustrated weekly of india, Readers Digest. ఇలస్ట్రేటెడ్ వీక్లీ లో చాలా మంచి మంచి వ్యాసాలు వచ్చేవి. అవి కత్తిరించి, నా పేరు, క్లాస్ పేరు రాసి స్కూల్ నోటీస్ బోర్డులో పెట్టడం పెద్ద ఘనకార్యం (అది నా సొంతమైనట్టు , లేదా నేను అంత మంచి వ్యాసాలు చదువుతున్నట్టు బిల్డప్ అప్పుడు). ఇక ఇంటిదగ్గర ఒక ప్రభుత్వ లైబ్రరీ ఉండేది. సెలవులు వచ్చాయంటే చాలు పొద్దున్నే పదిగంటలకే తలుపులు తీసేవరకు ఎదురుచూసి అందులో దూరడం. అక్కడ ఇచ్చేది రోజుకు రెండే పుస్తకాలు. అక్కడ తెచ్చుకున్న పుస్తకాలు గంటలో చదివెయ్యడం. తెల్లారితే కాని వేరే పుస్తకాలు ఇవ్వరు. ఏం చేయాలి అని అద్దెకిచ్చే షాపులు వెతకడం. నేను మా తమ్ముడు సాయంత్రం వెళ్ళి ఎక్కువగా జానపద పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళం. అప్పుడప్పుడు ఆర్చీస్, ఫాంటమ్,రిచీ రిచ్ కామిక్స్. కాని అప్పట్లో జానపద కథలంటే భలే పిచ్చి ఉండేది. పుస్తకం ఒక్క రూపాయే కాని చదవడానికి చాలా సమయం పట్టేది. తొందరగా ఐపోదు. బుల్లి నవల లాంటివి. ఇప్పుడొస్తున్నాయో లేదో. ఇక ఊర్లకెళ్ళినా , పుస్తకాల దుకాణం కనిపిస్తే చాలు, ఎదో ఒక పుస్తకం కొనడం.ఆఖరుకు మేమున్న హోటల్లో ఐనా సరే.అలా పెద్దవుతున్న కొద్దీ పెద్ద పెద్ద పుస్తకాలు. వార పత్రికలు.ఇంట్లో స్వాతి, మంత్లీ, యువ, చందమామ, సెలవుల్లో బాలమిత్ర, బాలజ్యోతి,ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పుస్తకాలు కొనేది అమ్మ. అవి చదవడం మొదలుపెట్టాను. అలాగే నవళ్ళు. కాని డిగ్రీ కొచ్చేవరకు కూడా కామిక్స్ తెగ చదివేదాన్ని. ముఖ్యంగా అమర్ చిత్ర కథ పుస్తకాలు.నా దగ్గర ఎప్పుడు రెండు రూపాయలున్నా ఒక పుస్తకం కొనేయడం. అలా పది, ఇరవై పుస్తకాలు కలిపి బైండింగ్ చేయించుకుని ఎప్పుడంటే అప్పుడు చదువుకోవడం. ఎవరికన్నా ఇస్తే ,మర్చిపోకుండా వెనక్కి తీసుకునేదాన్ని. నవళ్ళు అంటే తెగ పిచ్చిగా ఉండేది. చిన్న చిన్నకథలకంటే నవళ్ళు ఎక్కువగా చదివేదాన్ని. లైబ్రరీకెళితే సన్నగా ఉన్న నవళ్లు కాకుండా లావుగా ఉన్నవి చూసి తీసుకునేదాన్ని. ఎక్కువ సేపు చదవొచ్చని. కాని అది ఇంటికి తెచ్చుకున్నాక , పూర్తి అయ్యేవరకు దాన్ని వదలక పోవడం. తినేటప్పుడు కూడా చేతిలో పుస్తకం ఉండేది. మా ఇంటి దగ్గర ఉన్న అద్దె లైబ్రరీ సరిపోదన్నట్టు , నా స్నేహితురాలి ఇంటి ప్రక్కన ఉన్న లైబ్రరీనుండి కూడా నవళ్ళు తెచ్చుకోవడం. ఒకేసారి పది పుస్తకాలు తెచ్చుకుని వారం లోపే ఇచ్చేయడం. అప్పట్లో యద్ధనపూడి, మాదిరెడ్డి, ఆర్. సంధ్యాదేవి నవళ్ళు ఎక్కువగా చదివేదాన్ని.ముఖ్యంగా సంధ్యాదేవి నవల్స్. ఎందుకంటే అందులో హీరో గురించి చాలా బాగా రాసేవారు . ప్రతి నవల్లొ అతని పేరు కృష్ణతో ఉండేది. ఇక అవి చదివి కలల్లోకి వెళ్ళిపోవడం. పెళ్ళయ్యాక కూడా ఈ అలవాటు మానలేదు. కలలు కాదు పుస్తకాలు చదవడం. మావారు కూడా అభ్యంతరం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు కొనడం మొదలుపెట్టా. ఎప్పుడు పుస్తక ప్రదర్శనలకు వెళ్ళినా ఒక నవలో , వంటల పుస్తకమో తప్పకుండా కొనడం. ఊరికే పుస్తకాలు కొని, చదివాక ఏం చేస్తావ్ అని మావారంటే.. దాచుకుంటా ఐనా నేను చీరలడిగానా, సొమ్ములడిగానా అని దబాయించేదాన్ని. పుట్టింట్లో ఉన్న పుస్తకాలన్ని తెచ్చేసుకుని ఒక అల్మైరాలో పెట్టుకున్నా.అప్పుడే విజయవాడ లోని ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ వారి ఇంటింట గ్రంధాలయం పథకంలో చేరి నెలకో పుస్తకం కొనడం మొదలుపెట్టా . మావారు తిట్టినా సరే . నా దగ్గర ఉన్న డబ్బులిచ్చేదాన్ని. పాతిక రూపాయలకు ఒక నవల ఇంటికే వస్తుంటే ఇంకా కావల్సిందేముంది. ఇది చాలదన్నట్టు ఇంటి దగ్గరున్న అద్దె లైబ్రరీలో మావారికి తెలీకుండా నవళ్ళు తెచ్చుకోవడం( ఆయన ఆఫీసుకు వెళ్ళాక తెచ్చుకోవడం). ఆ లైబ్రరీలో తెలుగు పుస్తకాలు తీసుకునేది నేనే ఎక్కువ. కొన్ని నెలలకు ఆ షాపు యజమాని కొత్త నవళ్ళు తీసుకునేటప్పుడు ఏవి కొనాలో తెలీక (అతను ముస్లీమ్, తెలుగురాదు )నాకు ఇచ్చి అందులొ మంచివి సెలెక్ట్ చేసిమ్మనేవాడు. ఇంతమంచి అవకాశం ఎవరొదులుకుంటారు. ఒకేసారి పది పదిహేను కొత్త నవళ్ళు. సరే అని తెచ్చుకుని అన్నీ చదివి , అందులో మంచివి అంటే అందరూ ఆసక్తిగా చదువుతారు అనేవి సెలెక్ట్ చేసిచ్చేదాన్ని. ఇలా ఓ సంవత్సరం గడిచింది. నా పుస్తకాలను నా పట్టుచీరలకంటే జాగ్రత్తగా చూసుకునేదాన్ని. పిల్లలు , మావారు మొత్తుకున్నా సరే.. అప్పుడప్పుడు దుమ్ము దులపడం. కలరా ఉండలు వేయడం, అందులోనుండి కొన్నిపుస్తకాలు తీసి మళ్ళీ చదువుకునేదాన్ని. కాని నా లైబ్రరీని మాత్రం చుట్టాలెవరికీ చూపించేదాన్ని కాదు . నా పుస్తకాలు తీసికెళ్ళి తిరిగి ఇవ్వలేదు మరి. ఇలా పుస్తకలు కొంటూ కొంటూ , వందల కొద్ది ఉండేవి. పుస్తకాలు పాడైపోతున్నాయని పంచిపెట్టేసాను. మళ్ళీ మొదలెట్టాలి. కాని ఇప్పుడు చందమామలు, నవళ్ళ మీద అంత ఆసక్తి లేదు. వయసును బట్టి అభిరుచి మారుతుందేమో?? అలాగని స్తోత్రాలు, భజన పుస్తకాలు చదవాలని కాదు.

5 వ్యాఖ్యలు:

cbrao

పుస్తకాలంటే ఎంత అభిరుచంటే, ఇష్టమైన పుస్తకాలన్నీ కొనేయటమూ,సమయం కుదరక వాటిని చదవలేకపోవటమూ ఎక్కువయ్యింది.అవన్నీ reference గా పెట్టుకుని, అవసరమైనవి మాత్రమే చదువుతున్నా.

జాన్‌హైడ్ కనుమూరి

మీరచనా బాగుంది
మి అభిరుచి బాగుంది

sudhakara babu

మీ రేంజిలో కాదుకాని నేను కూడా చాలానే చదివాను. ఎక్కువ భాగం దొంగచాటుగా. ఎందుకంటే క్లాసు పుస్తకాలు తప్పితే మిగిలినవేవి చదివినా అది వెధవ అలవాటు అని పెద్దవాళ్ళు అనేవారు. కాని నేను ఏమీ పోగుచేయలేదు. చందమామలో "25 యేళ్ళ క్రిందటి కధ"లుగా నేను ఇదివరకు చదివిన కధలు రావడం మొదలయ్యినపుడు నేను పెద్దవాడినయ్యానని నిశ్చయించేసుకొన్నాను.

ప్రస్తుతం కనుమరుగవుతున్న పుస్తకపఠనాభిలాష, ముఖ్యంగా తెలుగు పుస్తకాలు చదవడం తగ్గిపోవడం మనలాంటివారికి చాలా బాధ కలిగిస్తుంది. తెలుగు బ్లాగులు, తెలుగు వికీ చూస్తే కొంత ఉపశమనం కలుగుతుందనుకోండి.


ఈ సందర్భంలో గ్రంధాలయోద్యమాన్ని నడిపిన అయ్యంకి వేంకటరమణయ్య వంటి మహానుభావులను మనం సంస్మరించుకోవడం బాగుంటుంది. మీకు వీలుంటే ఒకసారి
http://www.archive.org/details/sarswatisamrajya022943mbp "సరస్వతీ సామ్రాజ్యం సంస్మరణ సంచిక" చూడండి (ఇది 80 మెగాబైట్ల పుస్తకం!)

- సుధాకరబాబు
http://te.wikipedia.org/wiki/సభ్యులు:కాసుబాబు

rakee

Hi mee blog ni andhrajothi book lo choosi open chesa chala bagundi.memu meelanti Bloggers ki free ga websites create chesi isthunnamu.meeru kooda mee blog ni .com ga marchuko vacchu.poorti vivaralaku maa wesite choodandi
http://www.hyperwebenable.com/

padma

hi,yah,your home library is so good and it is inspirable.I have got address through pathuri kanthi garu,after so many years i have found good friends who got good thoughts.you are great.............

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008